Menu

ఐ లైక్ దిస్ లవ్ స్టోరీ – ఐ హేట్ లవ్ స్టోరీస్

నిజ జీవితంలోని ప్రేమలు సినిమా కథలకు స్ఫూర్తి అని ఒకప్పుడు అనుకున్నా, రానురానూ సినిమా ప్రేమల శైలిని అనుకరించే తరాలు తయారవ్వడం మనకు తెలిసిందే. ముఖ్యంగా 90 వ దశకంలో సూరజ్ భరజాత్యా, ఆదిత్య చోప్రా, కరణ్ జొహర్ వంటి దర్శకుల నియోరిచ్ – NRI ఆధునిక ప్రేమకథలు హిందీ చిత్రరంగంలోనే కాకుండా మొత్తం సమాజంలోనే ప్రేమపోకడల్ని redesign చేసిన వైనం మనం కళ్ళారా చూసిందే. మొదట్లో కొంచెం అతిగా అనిపించినా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ , కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎమోషన్లూ, పూలూ, గిఫ్టులూ, వ్యాలెంటైన్స్ డేలు, డిజైనర్ బెడ్రూములూ, టెడ్డీబేర్లూ అన్నీ ఇప్పుడు ఎంతో సహజంగా యువత జీవితాల్లోకి ఒదిగిపోయాయి.

అలాంటి ప్రేమకథలకు యాంటీథీసీస్ లాంటి హీరో, ఆ ప్రేమ కథల్ని మనస్పూర్తిగా నమ్మి ఆ కాల్పనిక perfect ప్రేమ కావాలనుకునే హీరోయిన్ కలిస్తే…కలిసి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆలోచనకు రూపం ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’.

జే/జయ్ (ఇమ్రాన్ ఖాన్) కరణ్ జొహర్ లాంటి ఒక ప్రేమకథల దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంటాడు. నిజానికి తెరపైన చూపించే ప్రేమకథలన్నీ ఉత్తుత్తివే అనే అభిప్రాయం జయ్ ది. ప్రేమ అనే పదార్థమే ప్రాక్టికాలిటీకి విరుద్ధమని భావిస్తూంటాడు. సిమ్రన్ (సోనమ్ కపూర్) ఒక ఆర్ట్ డైరెక్టర్. ప్రేమంటే పిచ్చినమ్మకం తనకి. ప్రేమకథలున్న సినిమాలంటే పడిచస్తుంది. సిమ్రన్- రాజ్ (సమీర్ దత్తానీ)తో రొమాంటిక్ సినిమాల్లాంటి ప్రేమలో ఉంటుంది. భిన్నధృవాలైన జయ్ – సిమ్రన్ లు ఒక సినిమాకు కలిసి పనిచెయ్యాల్సి వస్తుంది. సహజంగానే “ప్రేమ మ్యాజిక్” జరిగిపోతుంది. సిమ్రన్ కు మొదట…ఆ తరువాత జయ్ కి. ఇద్దరూ వారివారి ప్రెజుడిసిస్నీ, భావల్నీ, నమ్మకాల్నీ ప్రేమతీవ్రత ముందు గాలికొదిలి ఎలా చివరకు ఒకటయ్యారు అనేది మిగతా కథ.

మొదట్లో ప్రేమకథల మీద స్పూఫ్ లాగా మొదలైనా ద్వితీయార్థాని కొచ్చేసరికీ రొటీన్ ప్రేమకథలా తయారయ్యే ఈ సినిమాకున్న పెద్ద బలం, నటీనటులు ఇమ్రాన్ ఖాన్, సోనమ్ కపూర్. జానే తూ యా జానే నా సినిమాలో పాత్రకి కొంత కొనసాగిపుగా జయ్ పాత్ర సాగినా, ఈ పాత్రలో చాలా సహజత్వాన్ని తీసుకొచ్చాడు ఇమ్రాన్ ఖాన్. సోనమ్ కపూర్ అందంతోపాటూ అభినయాన్నీ అదే సమయంలో సిమ్రన్ పాత్రలోని believability తెరపై చాలా చక్కగా ఆవిష్కరించింది. ఇద్దరూ తెరపై కనిపించినప్పుడు “ఎంత అందమైన జోడి” అనిపించక మానదు. బహుశా ఇదే ఈ చిత్రం విజయానికి చాలా కీలకమయ్యిందేమో.

పాత్రల పరంగా ముఖ్యపాత్రల్ని బాగా తీర్చిదిద్దిన దర్శకుడు సిమ్రన్ ప్రేమికుడు రాజ్ పాత్రని, సిమ్రన్ తల్లిదండ్రుల్ని, జయ్ తల్లిని, మరీ కార్డ్ బోర్డ్ క్యామియోలుగా తీర్చిదిద్దడం చిత్రంగా అనిపిస్తుంది. ప్రధమార్థంలో చాలా తాజాగా అనిపించిన చిత్రకథాక్రమం ద్వితీయార్థానికొచ్చే సరికీ contrived గా తయారై బోర్ కలిగిస్తుంది. జయ్ స్నేహితుడిగా నటించిన ‘కెవిన్ దేవ్’ (స్ప్రైట్ వాణిజ్య చిత్రాల ఫేమ్) పాత్ర ద్వితీయార్థంలో లేకుంటే కష్టమయ్యేదే. ముఖ్యంగా కెవిన్ దేవ్ టీషర్టుల మీదుండే “50% single”, “Why superman…try me” లాంటి ఎన్నో కొటేషన్లు గనించదగ్గవి. అలాగే ఇతడి కామిక్ టైమింగ్ ప్రశంసనీయం.

Film with in film తరహాలో సాగే ఈ చిత్రంలో కొన్ని హత్తుకునే సందర్భాలున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. పాప్కార్న్ లాంట్ సినిమాలలో కూడా కొంత పౌష్టికతను నింపొచ్చని నిరూపించే సీన్లూ కొన్ని లేకపోలేవు. ప్రేమకథలు చూడ్డానికి మెదడు ఇంట్లో విడిచి, హృదయాన్ని కళ్ళలోపెట్టుకుని మాత్రమే రావాలనే నమ్మకాల్ని కొంచెం మార్చడానికి ప్రయత్నించిన చిత్రంగా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు.

ఇలాంటి సినిమా కరణ్ జొహర్ నిర్మించడం మొదట్లో చిత్రంగా అనిపించినా, చివరికొచ్చేసరికీ paying tribute himself అనిపిస్తుంది. దర్శకుడిగా పునీత్ మల్హోత్రా సఫలమయ్యాడు. విశాల్ – శేఖర్ సంగీతం వినసొంపుగా ఉంది. పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. అయనాంకా బోస్ సినెమాటోగ్రఫీ ఈ సినిమాకు పెద్ద అసెట్.

ఐ లైక్డ్ థిస్ లవ్ స్టోరీ, మీరూ చూసి మీ నిర్ణయానికి రండి.

9 Comments
  1. chakri July 8, 2010 /
  2. rahul July 8, 2010 /
  3. Venkat Gopu July 9, 2010 /
  4. priya July 10, 2010 /
  5. priya July 10, 2010 /