Menu

ఆడియో రివ్యూ – హ్యాపీ హ్యాపీ గా

వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న ప్రేమకథా చిత్రం “హేపీ హేపీగా” ఆడియో ఈ మధ్యే విడుదలైంది. “ప్రియ శరణ్” డైరక్టర్గా డెబ్యూ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం “మణిశర్మ”. మంచి మెలొడీ నిండిన పాటలు ఇచ్చారాయన. మొత్తం పాటలన్నీ “సిరివెన్నెల సీతారామశాస్త్రి” రాయడం ఆయన అభిమానులకి ఆనందం కలిగించే విషయం. కథతో పాటూ తనూ నడిచి చక్కని సాహిత్యం ఆయన అందించారు. సంగీత సాహిత్య మేలుకలయికగా ఉన్న ఈ సినిమా పాటల గురించి క్లుప్తంగా….

1. ఎదురయే ఎవ్విరి లైలా
“రాహుల్ నంబియార్” గాత్రంలో మథురంగా వినిపించే ఈ పాట అమ్మాయిలని చూస్తూ ఆకర్షణకి లోనౌతున్న ఓ యువకుడి అంతరంగ ఆవిష్కరణ. ఫిమేల్ కోరస్ని చాలా ట్రెండీగా వాడుకుంటూ మంచి క్యాచీగా పల్లవి ట్యూన్ ఉంది. చరణాల్లో టెంపో తగ్గి పాట స్లో అయ్యింది. రెండవ చరణం ముందు వినిపించే మెలొడీ (ఎలెక్ట్రిక్ గిటార్) ఆకట్టుకుంటుంది. రాహుల్ మంచి ఫీల్తో పాడాడు. “ఆశ”, “నిత్య” వంటి పదాల ఉచ్చారణలో మరింత జాగ్రత్త అవసరం.

సాధారణంగా ఇలాటి పాటని – “నేను అమ్మాయిని చూసాను, మైకంలో పడ్డాను” ఇలా ఫస్ట్ పర్సన్లో రాస్తారు. తెలివిగా సెకెండ్ పర్సన్ ఎంచుకుని –
“ బహుబాగుందిరా బాలా కాసేపాటు చూసాం కదరా, ఇహ చాలనుకోవాలా మతి చెడితే మజునూలవరా
…ప్రేమిస్తునాననే తలపు నీకు ఇవ్వాలి నిత్య సంతోషం
ఇచ్చేదే గాని దోచేది కాదురా స్వచ్చమైన సావాసం”
వంటి వాక్యాలతో మంచి సందేశాన్ని ఇవ్వడం ఒక్క సిరివెన్నెలకే చెల్లింది.

2. నవ్వాలంటే
హరిచరణ్, రిటా ఆలపించిన ఈ background song కొంత తెలిసిన పాటలా ఉన్నా ఇట్టే ఆకర్షిస్తుంది. మణిశర్మ ఈ సినిమా అన్నిటికీ కోరస్‌ని చాలా బాగా వాడుకున్నారనిపిస్తుంది. ఈ పాట ప్రిల్యూడ్లో వచ్చే కోరస్ చాలా బాగుంది. అలాగే మొదటి చరణం ముందు వినిపించే saxophone లాంటి వాయిద్యం. మంచి feel కలిగిన ట్యూన్ ఇవ్వడంలో మణిశర్మ సఫలీకృతులయ్యారు. గాయకులు కూడా చాలా బాగా పాడారు.

జీవించడానికి ఉండాల్సిన positive attitude గురించి ఎన్ని సార్లు రాసినా, ప్రతి సారి ఏదో కొత్త ఎక్స్ప్రెషన్ ఇవ్వడం సిరివెన్నెలకే సాధ్యం.
నవ్వాలంటే సందేహం మాని నవ్వేయ్ అంతే
నమ్మావంటే సంతోషాలన్నీ నీవయినట్టే
అని మొదలెట్టి,
నీకై నువ్వు ఇరుకై పోవా ఏకాంతానా వుంటే
అంటూ
వీచే గాలి సొంతిల్లంది అందరి గుండెల్లోనా
ఒంటరి వాళ్ళు ఎవరుంటారు ఇంత ప్రపంచంలోనా
అని భరోసా ఇస్తారు సిరివెన్నెల.

కోరస్ లో వినిపించే “తొడగవా, తొలగవా,  పలకవా, తెలపవా” పదాలు ట్యూన్‌కంత కుదరక వినడానికి కొంత ఎబ్బెట్టుగా ఉండడం ఒకటే ఈ పాటలో లోపం.

3. మథురానుభవమా ప్రేమా

హేమచంద్ర గాత్రంలో వినిపించే ఈ శోక గీతాన్ని సాధారణ శోకగీతంలా కాకుండా కొంత ప్రత్యేకత ఉండేలా మణిశర్మ స్వరపరిచాడనిపిస్తుంది. ట్యూన్లో కానీ, సింగింగ్ లో కానీ అంత ఎమోషన్ ఎక్స్ప్రెస్ చెయ్యకుండానే కరుణరస స్పందనని మనలో కలిగించే పాట ఇది. పల్లవి చివర్లో ట్యూన్‌కి, భావానికి తగ్గట్టు ఇచ్చిన digital effect బాగుంది. ఇంటర్లూడ్స్లో వినిపించే సరోద్ అద్భుతంగా ఉంది. వయలిన్ వాడుకలో ఇళయరాజాని తలపించాడు. మొత్తానికి గొప్ప సంగీత రచన ఈ పాట.

గతంలో వాడిన “అరణ్యాల మార్గం-అసత్యాల గమ్యం” లాటివి సిరివెన్నెల మళ్ళీ ఉపయోగించినా ఈ పాట బోర్ కొట్టకుండా బాగుందనిపిస్తుంది. కారణం పదపుష్పాలని భావమనే దారంతో ముచ్చటగా చేసిన అల్లిక. పల్లవిలోనే – “మథరానుభవమా-మతిలేనితనమా, బతికించు చలువా-చితిపేర్చు శిలువా”
లాంటి చక్కని ప్రాసలతో మొదలైన వర్ణన చివరి దాకా కొనసాగి మురిపిస్తుంది.

4. యావ యావ

ఐటం సాంగ్ అంటే అదో విశృంఖల శృంగార విన్యాసంలా కాక, సినిమా కథలో భాగమై, సినిమా సందర్భాన్ని ఇనుమడించే సాధనంలా వాడచ్చు అన్న సదాలోచనకి ముందు ఈ సినిమా దర్శకనిర్మాతలని అభినందించాలి. సాహిత్యం అంతా జానపదశైలిలో నడిపించి, క్యాచీగా రాస్తూనే భావధారని పొంగించిన సిరివెన్నెల సామర్ధ్యం మురిపిస్తుంది.
“అడంగు (అంటే ఇల్లని అర్థం),మీసకట్టు-ఆశకట్టు-ప్రేమగుట్టు-తేనెపట్టు-పూలసెట్టు, బెంగటిల్లు “
వంటి చక్కని పదాలు ఈ పాటలో కనిపిస్తాయ్.  గాయని రోజా ముద్దుగా పాడింది (ముఖ్యంగా చరణాల చివర్లో). ఒక ఐటం సాంగ్‌కి  కావలసిన హంగులన్నీ కూర్చడంలో మణిశర్మ సఫలుడయ్యాడు.

5. గుండెల్లో

కార్తీక్ ఎంత మంచి సింగరో మరో సారి నిరూపించే మెలొడీ ప్రేమ గీతం ఇది. ప్రేయసిని సంబోధిస్తూ రాసిన ఈ పాటలో సిరివెన్నెల సాహిత్యం కొంత రొటీన్ గానే ఉందనే చెప్పాలి –
“ప్రపంచం పలుకరించని చోట .. వియోగం అడుగు మోపని చోట…
మరో లోకం కనుక్కుందాం అది ఎక్కడో ఇంకెవరికీ ఆచూకి చూపక
లాటి ఎక్స్ప్రెషన్స్ చాలా సార్లు విన్నాం. మణిశర్మ ఇచ్చిన ట్యూన్ వినగానే ఆకట్టుకోలేదు కాని వినగా వినగా బాగుందనిపించింది. ఇంటర్లూడ్లో కోరస్ westernized & energetic గా ఉండి ఆకర్షిస్తుంది.

6. పుట్టుక్కు జరజర డుబుక్కుమే

ఈ పాటలో ముందు ఆకర్షించేది సిరివెన్నెల రాసిన మహా చిలిపి పల్లవి –
అతడు : పుటుక్కు జరజర డుబుక్కు మే… అడక్కు అది ఒక రహస్యమే….
ఆమె : అవస్థ పెరిగితే అనర్ధమే… చికిత్స జరుగుట అవశ్యమే
చరణాల్లో కూడా ఈ జోరు తగ్గలేదు –
అతడు : అరువిచ్చావనుకో నాకు అరవిచ్చిన్నీ కళ్ళు…
అవి చూపిస్తాయి నీకు నే మెచ్చిన అందాలు..
లాటి సరికొత్త ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. హేమచంద్ర, దీప్తిచారి పాటని ట్రెండీగా పాడినా రసపోషణకి భంగం కలగకుండా పాడారు. మణిశర్మ simple & catchy ట్యూన్ ఇచ్చారు. పాట మొదట్లో బీట్, ఇంటర్లూడ్స్ బాగున్నాయి. మొదటి చరణంలో సాహిత్యాన్ని “ వెచ్చబడితే నీ…రెచ్చిపోవ నా” అంటూ అసంపూర్తిగా వదిలెయ్యడం వల్ల “వెచ్చబడితే నీ చెక్కిళ్ళు … రెచ్చిపోవ నా ఎక్కిళ్ళు “ అన్న భావం కొంత వల్గర్ గా వినబడే అవకాశం ఉంది. అది ఆరోగ్యకరంగా వెళ్తున్న ఈ సినిమా పాటలకి అవసరం లేదు.

మొత్తానికి మణిశర్మ నుంచి ఈ మధ్య వచ్చిన మంచి మెలొడీ ఆల్బం ఇది. సిరివెన్నెల అభిమానులని కూడ అలరిస్తుంది.

ఫణీంద్ర KSM

6 Comments
  1. Nagarjuna August 1, 2010 /
    • సుమిత్ర August 3, 2010 /
  2. సుమిత్ర August 3, 2010 /
  3. Moorthi August 3, 2010 /
  4. Nagarjuna August 3, 2010 /