Menu

‘వేదం’ రాములు

రిలీజు రోజు సినీమ్యాక్స్ లో సినిమా దాదాపు మొత్తం ‘వేదం’ టీంతో చూడ్డం జరిగింది.
షోకి ఇంకా టైం ఉందనగా ఫుడ్ కోర్ట్ లో కూర్చున్నా.
పక్కన ఒక పెద్దాయన కూర్చొనున్నాడు. నేను ఒకసారి అతన్ని చూశా.
దయగల ముఖం.
సినీమ్యాక్స్ లోని ఆర్టిఫిషియాలిటీ మధ్య మూర్తీభవించిన సహజత్వంలాగా నవ్వాడు.
ఎక్కడో చూశానే అనిపించింది. అప్పటికే నాకు వేదం సినిమా గురించి తెలిసుండటం వల్ల, ఎవరో గుర్తొచ్చింది.
“మీరు…రాములు కదూ” అన్నా…
“నాపేరు నాగయ్య” అన్నారు.
నాకూ ఏం మాట్లాడాలో తెలీలేదు.
“మీరు…సినిమాలోకి….ఎలా” అంటూ చిన్నగా అడిగీఅడగనట్లు అడిగా.
“మాది నర్సారావు పేట దగ్గర. మా అబ్బాయి లైట్ బాయ్ గా చేస్తాడు సినిమాల్లో. వాడ్ని చూడనేకొచ్చినప్పుడు, క్రిష్ బాబు నన్నడిగినాడు ‘నా సినిమాలో చేస్తావా’ అని. చేద్దామనిపిచ్చింది. సరే అన్నే.”
“మీరూ ఇప్పుడేనా సినిమా మొత్తం చూడటం”
“డబ్బింగ్ అప్పుడు కొంచెం చూసినా. మొత్తం సినిమా ఇప్పుడే.”
“యాక్టింగ్ చెయ్యడం ఎట్లా అనిపించింది?”
“చెప్పినట్లు చేసినా. నాకు బాగా అనిపించింది.”
“మీ అబ్బాయి ఏమీ చెప్పలేదా”
” కష్టంగా ఉంటుంది, ఎందుకులే అన్నాడు. నేనైతే చేస్తానంటి. మళ్ళంతా మామూలే”

ఇంకేం అడగాలో తెలీక,”ఒక ఫోటో తీసుకోవచ్చా” అని రిక్వెస్ట్ చేశాను.
“లేచి నిలబడేదా?” అంటూ లేవబోతుంటే నేనే వారించి, కూర్చున్న తన ఫోటో మొబైల్ కెమెరాలో బంధించా.
సినిమా యూనిట్ వచ్చి నాగయ్య గారిని తీసుకొళ్ళారు. నేనూ థియేటర్లోకి వెళ్ళా, సినిమా చూశా.

వేదం సినిమా చూసినవాళ్ళకి గుర్తుండిపోయే నటన రాములు పాత్రధారి నాగయ్యది.
పెద్దాయన. బహుశా వయసు డెబ్బైలలో ఉంటుంది. మొదటి సినిమా. నటనానుభవం అస్సలు లేదు.
అయినా, పాత్రలో జీవించాడు. జీవితంలో ఎలా ఉంటాడో అలాగే నటించాడు.

నిజానికి జీవితంలో ఉన్నట్లు తెరపై నటించడం…
ముఖ్యంగా సెట్లో అందరి ముందూ, లైట్లు ముఖంపై పడుతుంటే, అందరి కళ్ళూ మన మీదుంటే,
దర్శకుడు “యాక్షన్” అనగానే ఉత్పన్నమయ్యే నిశ్శబ్ధాన్ని చేధించుకుంటూ మొదలయ్యే కెమెరా సౌండుని పట్టించుకోకుండా,
ఎదురుగా ఉన్న పాత్రతో అంతవరకూ లేని సంబంధాన్ని కలుపుకుకి కెమరా కోసం నటించడం చాలా కష్టం.
అదీ ఈ వయసులో, సహజంగా, నిజీవితంలో లాగా… బహుకష్టం.
దాన్ని సునాయసంగా అత్యంత “నిజం”గా చేసిన నటుడు నాగయ్య.

పటేలు ముందు నిస్సహాయత.
కోడల్నికూడా సముదాయించలేని బలహీనత.
మనవడ్ని కాపాడుకోలేకపోతున్నాననే వేదన.
అంత నైరాశ్యంలోనూ వచ్చే జీవన వేదాంతం.
చేతికొచ్చిన డబ్బులు దొంగెత్తుకొళ్ళిపోతుండే ప్రాణాలు పోయినట్లు చేసే పెనుగులాట.
పోయిన డబ్బులు తిరిగొస్తే ఆశ్చర్యం, ఆనందం, ఆశ కలలిపిన అభినయం.
చివరిగా…”ఏయ్ పటేలా” అని వేలెత్తి బెదిరించగల తెగువ….
ఇలా అన్ని భావాల్నీ సునాయాసంగా, సహజంగా, నిజంగా తెరమీద పలికించిన నాగయ్యకు అభినందనలు.
పాత్రోచితమైన నటుల్ని ఎంపిక చేసుకోవడంలో క్రిష్ చూపిన ప్రతిభకు అభినందనలు.

12 Comments
 1. అరిపిరాల June 7, 2010 /
 2. రాజశేఖర్ June 7, 2010 /
 3. Anitha June 7, 2010 /
 4. రవి June 7, 2010 /
 5. కిరణ్ తేజ June 7, 2010 /
 6. sen June 19, 2010 /
 7. sri June 20, 2010 /
 8. sri June 20, 2010 /
 9. రామనరసింహ June 22, 2010 /
 10. sr June 24, 2010 /
 11. GopiCM June 26, 2010 /