Menu

వేదం ఎందుకు చూడాలంటే….

’వేదం’ లాంటి సినిమా అవసరం ఇప్పుడు మనకి ఎంతైనా ఉంది. అదెందుకంటే….

కొత్త కథలు సృష్టించడం అతి కష్టమైన ఈ రోజుల్లో ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తీయాలంటే కథలు చెప్పే విధానంలో మార్పు రావడమే సరైన పద్ధతి. ఇది ప్రపంచ వ్యాప్తంగా మనం గమనిస్తున్న విషయమే. “కట్టె, కొట్టె, తెచ్చే” లాంటి కథలు బోలెడు చూసేసారు ప్రేక్షకులు.

పరిస్థితులు మారిపోయాయి. రామాయణం లో చెప్పినట్టు రాముడంత మంచి వాళ్ళు, రావణుడంత చెడ్డవాళ్ళు ఇప్పుడు లేరు. ప్రస్తుతం విలన్ అనే వాడు మనకి కనిపించడు. The concept of villain is diffused. ఆ రోజుల్లో అయితే హీరో వెళ్ళి ఫలానా వాడిని క్లైమాక్స్ లో చంపేస్తే They lived happily ever after అని ’శుభం’ కార్డు వేసేవాళ్ళు. మనకెప్పుడూ సినిమాల్లో హీరోలు కావాలి. హీరోలుండాలంటే విలన్లుండాలి. రావణుడే లేకపోతే రామాయణముంటుందా? కానీ ఇప్పటి రోజుల్లో వీడు విలన్; వీడిని అంతమొందిస్తే మన జీవితాలు బాగుపడతాయి అనే కథ ఎవరైనా చెబితే దానంత foolish కథ వుండదు (కానీ అలాంటి కథలతోనే మనమింకా తంటాలు పడుతున్నామనుకోండి. అది వేరే సంగతి). ఈ రోజుల్లో పరిస్థుతులే విలన్స్. ఆ పరిస్థుతులను బట్టి కాసేపు విలన్స్ అవుతాం, కాసేపు హీరోస్ అవుతాం. అలా పరిస్థుతుల ప్రభావం కారణంగానే ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న అమాయకుల ప్రాణాల మీదకి తెస్తాడు వేదం సినిమాలోని వివేక్ చక్రవర్తి అనే క్యారెక్టర్. నిరుపేదలైన గ్రామస్థుల వద్ద కనికరమైనా లేకుండా డబ్బు దోచుకోబోతాడు రాజు అనే మరో పాత్ర. వీరిద్దరే పరిస్థుతుల ప్రభావం చేత తమ ప్రాణాలు సైతం లెక్క చేయక అత్యవసర సమయంలో హీరోలుగా ఎదుగుతారు. మన జీవితాలకి మనమే విలన్స్ మనమే హీరోస్.

పరిస్థుతులు ఇలా మారిపోయిన రోజుల్లో కూడా పాత చింతకాయపచ్చడి కథ, కథనాలనే నమ్ముకుంటే మన సినిమాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అవుతుంది. సినిమా అనే ప్రక్రియ మొదలైనప్పటినుంచీ ఇప్పటివరకూ మన సినిమాలన్నింటిలో ఒకే రకమైన కథనం.  అప్పుడెప్పుడో వచ్చిన ’భాషా’ సినిమాలోని ఒక పాయింట్ పట్టుకుని ఇప్పటికీ అదే పాయింట్ మీద రుబ్బుతున్నాం. అందుకే మన సినిమాలు మన రాష్ట్రం దాటి వెళ్ళటం లేదు. మన సినిమాలు మరింత మందికి చేరాలంటే మనకి కొత్త ఆలోచనలు కావాలి. ప్రపంచ సినిమాలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాల సినిమాల్లో కథాగమనాలు మారిపోయాయి. ఎక్కువగా మల్టిపుల్/ప్యారలల్ నేరేటివ్స్ తో సినిమాలు వస్తున్నాయి.

తెలుగులో ఇది వరకే మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన ’యువ’ సినిమా ద్వారా మల్టిపుల్ నెరేటివ్ స్ట్రక్చర్ పరిచయమైనప్పటికీ ఈ సంవత్సరమే వచ్చిన ’ఓం శాంతి’ తెలుగులో వచ్చిన మొట్టమొదటి ’మల్టిపుల్’ లేదా ’ప్యారలల్’ నెరేటివ్ అని చెప్పుకోవచ్చు. యాదృచ్చికంగానూ అకస్మాతుగానూ జరిగే సంఘటనలతో మేళవించిన దృశ్యాలు, ఈ సంఘటనల పర్యవసానంగా కొందరి జీవితాల్లో జరిగిన మార్పులు, అనుభవాలను కథారూపంలో తెరకెక్కించడం ఈ సినిమాల యొక్క ప్రత్యేకత.

ఒక విధంగా మన జీవితాలను సినిమా రూపంలో ప్రతిబింబింపజేయాలంటే ఈ రకమైన సినిమాలే అనువైనవి.

అయితే కొత్త ఐడియాస్ తో సినిమాలు తియ్యాలనుకోవడం వేరు, వాటిని విజయవంతంగా execute చెయ్యడం వేరు. ఈ సినిమా ఒక మంచి attempt మాత్రమే కాదు. చాలా బాగా execute చేయబడింది కూడా.

అదెలా జరిగిందంటే…

’ఓం శాంతి’ సినిమాని ’వేదం’ తో పోలిస్తే…నిజానికి ’ఓం శాంతి’ సినిమాలోని కథలు, పాత్రలు ఎంతో believable గానూ, నిజజీవితానికి దగ్గరగానూ ఉంటాయి. అయితే ’వేదం’ సినిమాలో కొన్ని విషయాలపై దర్శకుడు చూపించిన శ్రద్ధ ఈ సినిమా విజయానికి కారణమైందని చెప్పొచ్చు. మల్టిపుల్ నెరేటివ్ స్ట్రక్చర్ కలిగిన సినిమాలకు స్క్రీన్ ప్లే వ్రాయడం అంత సులభం కాదు. ఇలాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే రచయితకు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వివిధ పాత్రలు వివిధ ప్రదేశాల్లో ఉండడం వల్ల ఒక కథ నుంచి మరో కథకు inter-cut చేయడమనేది చాలా tricky job. అయితే వేదం సినిమాలో ఆ ఛాలెంజ్ ని చాలా బాగా handle చేశాడు దర్శకుడు. The stories in Vedam span across different spaces (Hyderabad, Sirisilla, Amalapuram, Bangalore etc) but the uniting factor is the time. ఈ సినిమాలో అందరి కథలూ దాదాపుగా ఒకే సమయంలో మొదలయ్యి ఒకే సమయానికి అంతమవుతాయి. వేరే వేరే ప్రదేశాల్లో కథలు జరుగుతున్నప్పటికీ కథా సమయంలో మాత్రం consistency చూపించగలిగాడు దర్శకుడు. అదే ’ఓం శాంతి’ సినిమాలో కథా వస్తువు బావున్నప్పటికీ ఒక్కో కథ ఎప్పుడు మొదలయిందో, ఎప్పుడు ముగిసిందో అనే clarity ఇవ్వకపోవడం ఆ సినిమాలో ఒక పెద్ద లోపం.

అలాగే ఇలాంటి సినిమాకి స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు పేపర్ మీద సీన్స్ బాగానే అనిపిస్తాయి. తీరా షూట్ చేసాక ఎడిటింగ్ అప్పుడు అన్ని కథలు సరిగ్గా merge అవ్వకపోవచ్చు. నాకు తెలిసి ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద చాలా మార్పులు చోటుచేసుకుని ఉండొచ్చు. ఒక వేళ అదే జరిగుంటే ఆ లోపాలేవీ తెలియకుండా అన్ని కథలనూ చాలా బాగా అమర్చిన తీరు ఈ సినిమాని one of the best edited films in Telugu గా వర్ణించవచ్చు.

….అయితే ఇలాంటి సినిమాలకు మన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందా?

వేదం సినిమా చూసి బయటకొస్తుంటే ఒక ప్రేక్షకుడన్నాడు-“తొక్కలో తెలుగు సినిమాలు. ఒకడు కొడితే పది మంది కిందపడతారంట.ఆర్థం పర్థం లేని ఏం సినిమాలు రా బాబూ. వస్తే ఇలాంటి సినిమాలు రావాలి. అప్పుడు కానీ జనాలు బాగుపడరు.”

బయటకొచ్చి ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి రిపోర్ట్ ఎలా ఉందనడిగితే “కామన్ ఆడియన్(?) కి నచ్చడం లేదు. A centers లో ఆడుద్దేమో” అన్నాడు.

అవతల ఒక సో కాల్డ్ కామన్ ఆడియన్ ’వేదం’ లాంటి సినిమా కోరుకుంటున్నాడు. ఇక్కడ పరిశ్రమ లో ప్రతిరోజూ శ్రమించే ఒక ఔత్సాహిక దర్శకుడు మాత్రం సాధారణ ప్రేక్షకుడుని ’వేదం’ నచ్చలేదు అని ఫిక్స్ అయిపోయి మనకి మాస్ మసాలా సినిమాలే కరెక్ట్ అనే భ్రమలో ఉన్నాడు.

ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని సినిమాలు తీస్తున్నామనుకునే మన పరిశ్రమ దుస్థితి ఏంటంటే ఒక హిట్ ఫ్యాక్షన్ సినిమా తర్వాత అలాంటివే ఒక వందకి పైగా సినిమాలు వచ్చుంటాయి కానీ గమ్యం వచ్చాక అలాంటి సినిమాలు తీద్దామన ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతమంది? మరి గమ్యం కూడా హిట్ సినిమానే కదా. కాపీ కొట్టో, inspire అయ్యో అలాంటి కథల కోసం ప్రయత్నించిన వాళ్ళు ఎంతమంది?

సినిమా అంతా తప్పులతడకైనా ఫర్వాలేదని హిట్ చేసిన సినిమాలెన్ని లేవు? Character inconsistencies, continuity mistakes కాదు అసలు continuity లేని సినిమాలు హిట్ అయిపోయాయి. అలాంటి వాటిని ప్రశ్నించే వారెవరూ లేరు. కానీ కాస్త వైవిధ్యమైన సినిమా దగ్గరకొచ్చేసరికి తప్పులెతకడానికి క్యూలు కట్టారు జనాలు. మంచి సినిమా అని గొంతు చించుకున్నా ఆ సినిమాను మన ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారో అందరికీ తెలుసు.

అందుకే తెలుగు సినిమా ప్రేక్షకులకు చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.

ముతక కథకు కొత్త రంగులద్ది జనాల మీదకొదిలితే హిట్ చెయ్యడానికి రెడీగా ఉన్న ప్రేక్షకులారా. అదే కథ. అదే కథనం. అలాంటి డైలాగులే. మళ్ళీ పదేళ్ళ తర్వాత థియేటర్లకొదిలితే విరగబడి చూస్తారు కదా! అప్పుడప్పుడూ కాస్త వైవిధ్యమున్న సినిమాలకూ అవకాశం కల్పించండి. మీకు నచ్చే మసాలా సినిమాలు హిట్ చెయ్యండి. తప్పనటం లేదు. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలు కదా, పాపం సానుభూతి చూపిద్దాం. పోతే పొయ్యాయి మన యాభైలు, వందలు. కానీ అప్పుడప్పుడూ కొత్త ప్రయత్నాలు చేద్దామని ముందుకొచ్చే వాళ్లనీ ప్రోత్సాహించండి. అయినా మీరు కాకపోతే వారిని ఇంకెవరు ప్రోత్సాహిస్తారు?

ఇది A సెంటర్ సినిమా, మల్టిప్లెక్స్ సినిమా అంటూన్న వాళ్ళ మాటలు నమ్మకండి. ఇది క్లాస్ సినిమా మనలాంటి మాస్ ప్రేక్షకులకు నచ్చదని మిమ్మల్ని కలిపేసుకునే వాళ్ళని అస్సలు నమ్మకండి. ఏదో ట్రై చేశాడు కానీ మన వాళ్ళకు ఇలాంటివి ఎక్కవు. కామన్ ఆడియన్(?) కి సినిమా నచ్చటం లేదు అనే మాటలు వినిపించుకోకండి.

ఈ సినిమా ఒక మంచి attempt మాత్రమే కాదు. చాలా బాగా execute చేయబడింది కూడా. మీరు ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరి కొంతమంది ఇంకొన్ని కొత్త ఐడియాస్ ని తమ సినిమాల ద్వారా ప్రవేశపెట్టే ప్రయత్నం చెయ్యవచ్చు.

15 Comments
 1. తెలుగు ప్రేక్షకుడు June 6, 2010 /
 2. Surya June 6, 2010 /
 3. రవి June 6, 2010 /
 4. crash June 6, 2010 /
 5. సుజాత June 6, 2010 /
 6. WellWisher June 6, 2010 /
 7. రాజశేఖర్ June 7, 2010 /
 8. vardhan June 7, 2010 /
 9. కిరణ్ తేజ June 7, 2010 /
 10. sammayya June 8, 2010 /
 11. Annavaram June 8, 2010 /
 12. srikanth June 14, 2010 /