Menu

అమ్మ కూడా ఒకప్పుడు హీరోయినే !!

తల్లిప్రేమ, తండ్రిప్రేమ, సోదరప్రేమ…. ఇలా ఒక prefix లేకుండా ఉత్తగా “ప్రేమ ” ఆడా మగా మధ్య మానసిక శారీరిక సంబంధాలే గుర్తుకువస్తాయి. ఆడామగా మధ్య ఆ ప్రేమే లేకపోతే మనిషికీ జంతువుకీ తేడా లేదు, సృష్టి ముందుకెళ్ళదు. కాబట్టేనేమో ప్రేమ కథలూ , సినిమాలు మెచ్చనివారు చాలా తక్కువమంది ఉంటారు. అయినా ఒక ఆడది , ఒక మగవాడు. ఎలాగోలా తంటాలు పడి ప్రేమించుకుంటారు , ఇందులో conflict ఏముంది అనుకునేవాళ్ళందరూ తప్పక చూడాల్సిన చిత్రం  THE BRIDGES OF MADISON COUNTY

ప్రేమకథ మొదలవ్వలాంటే ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయి కావాలి. అశ్లీలత లేని , దైవత్వం లాంటి , అద్భుతమైన అందం.  ఏ మనిషికయినా తన జీవితంలోని మొట్టమొదటి అందగత్తె , అతని/ఆమె తల్లి. అలాంటి అందమైన అమ్మే ఈ ప్రేమకథలో కథానాయిక. వినేందుకు హృద్యంగా ఉంది కదూ ? కానీ, ఈ కథలో హీరో “నాన్న” కాడు. భరించడం ఎంత కష్టం? అమ్మ అందగత్తే , కథానాయికే , కానీ తండ్రిని కాక మరొకరిని ప్రేమించడమా ? ఎంత మోసం , ద్రోహం ! నాన్నకెంత అన్యాయం జరిగింది , పిల్లలకెంత అవమానం ? అమ్మను ఆడదానిగా , ఒక మృదువైన మనసున్నదానిగా , స్పందనలు ఉన్న మనిషిగా చూడలేనంత అమ్మతనం ఆపాదించిన పిల్ల తరహా possessiveness ఈ ప్రపంచానిది . అలాంటి ప్రపంచంలో ఇరుక్కుపోయిన ఒక స్త్రీ నాలుగు రోజుల పాటు అనుభవించిన అనిర్వచనీయమైన ప్రేమకథ ఈ సినిమా.

గ్రామీణ వాతావరణం లోని ఒక రైతు భార్య MERYL STREEP . వజ్రాల్లాంటి ఇద్దరు పిల్లలు. ప్రేమగా చూసుకునే భర్త, స్వంత ఇల్లూ, ఆస్తీ అన్నీ ఉన్నాయి. ఒకసారి , పక్కనున్న సిటీలో సైన్సు ఎగ్జిబిషన్‍లో పిల్లలు పాల్గొంటుంటే వారిని తీసుకుని వెళ్తాడు భర్త. నాలుగురోజులపాటు ఈవిడకు ఒంటరితనమే. అలాంటి సమయంలో , పక్క ఊరిలో చారిత్రాత్మక విశేషం ఉన్న ఒక బ్రిడ్జిని ఫోటో తీసేందుకు వచ్చి దారితప్పిపోయిన CLINT EASTWOOD  పరిచయం అవుతాడు. అతనిలోని హుందాతనం ఆమెకు నచ్చుతుంది. ఆమె ఆతిధ్యంలోని ఒద్దిక అతనికి ఇష్టమౌతుంది.  ఆమె ఒక అందమైన వేణువు అయితే , అతను దూకుడైన గాలి వంటివాడు. ఆమె అలలు లేని నది అయితే , అతనొక జలపాతం. రెండూ పరస్పరం కలుసుకోకుండా ఉండలేవు.

కానీ ఆ కలయికకు ఎన్నో అడ్డంకులు. సమాజం. ఆమె ఉన్న ఊరు ఎంత చిన్నదో అక్కడి మనుష్యులు ఇంకా సంకుచిత స్వభావం కలవారు. ఒక గృహిణి పరపురుషుడితో కనిపిస్తే ప్రపంచం మునిగిపోయినట్లు హాహాకారాలు చేసేవారు. ఈ బాహ్య ప్రపంచం మాటలనుండి తప్పించుకోవచ్చేమో కానీ, మనస్సులోపల తిష్ట వేసుకున్న “కట్టుబాట్లు ” అనే ఆలోచనలు మరీ క్రూరమైనవి. ఆమె జీవితం , ప్రేమ ఆమె స్వంతమా ? లేక ఆమె భర్త , పిల్లలు , పక్కింటివారి చెప్పుచేతల్లో ఉందా? ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటూ, సమాధానాలు వెతుక్కుంటూ , తమలో తాము కలిసిపోయేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలే ఈ సినిమా.  ఈ కథ అంతా చనిపోయిన తమ తల్లి వీలునామా చూసి , ఆమెకు “అక్రమ సంబంధం”ఉందని తలపోచి ఆవిడ వ్రాసుకున్న డైరీనూ ఎంతో కోపంతో , అసహ్యంతో చదివే అక్కాతమ్ముళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది.

చివరకు ఏమౌతుందో నేను చెప్పడం అంటే చూడబోయేవారి భావోద్వేగాలను నాశనం చేసినవాడినౌతాను కాబట్టి చెప్పట్లేదు.

తల్లిగా , భార్యగా ,ఆడదానిగా మెరిల్ స్టీప్‍ను ప్రేమించకుండా ఉండటం మగ ప్రేక్షకులకు దాదాపు ఆసాధ్యం. ఆమె నవ్వులు , కంటి చూపులు , కన్నీళ్ళు , గొంతు వణుకుళ్ళు సినిమా చూసాకా చాలాసేపు వెంటాడుతాయి. మధ్యలో రీవైండ్ చేసుకుని చూడాలనిపించేంత hauntingగా ఉన్నాయి.
క్లింట్ ఈస్ట్‌వుడ్.  నోట్లో చుట్ట పెట్టుకుని రైఫిళ్ళతో కాల్చిన కౌబోయ్ , డర్టీ హ్యారీగా పోలీసులనూ , దొంగలనూ తూలనాడి తూడ్లుపొడిచిన యాంగ్రీమ్యాన్… ఇతనేనా అనిపిస్తుంది. అరవైపైబడిన వయసులో , వడలిపోతున్న శరీరంలో… ఒక రొమాంటిక్ క్యారెక్టర్ వేసి మెప్పించడం..వాహ్!  ఇక ఈ సినిమాకు దర్శకుడూ అతనే . హాలీవుడ్‍లో నటన, స్క్రిప్టు, దర్శకత్వం, ప్రొడక్షన్ , మ్యూజిక్ కంపోజింగ్…. అన్నిటిలో ఏ పనిచేసినా అద్భుతంగా చేసిన అతి కొత్తి బహుముఖ ప్రతిభాశాలురిలో ఇతను అతి ముఖ్యుడు.  ఇలాంటి దర్శకుడూ , నటుడూ ఇక్కడెవరైనా ఉంటే రోజూ పాదనమస్కారం చేసి మరీ అతని విద్యల్లో కాస్త నేర్చుకోవాలి అనిపించేంతటి గురువులా ఎదిగాడు ఈ సినిమాతో ( నా వ్యక్తిగత అభిప్రాయం ,)

ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన మాటలు ఉన్నాయి, కొన్నిటిని నాకు అనిపించినట్లు free translation చేసి చెబుతున్నాను:
” నాకు అద్భుతమైన కలలు , కోరికలు ఉండేవి. ఏవీ నెరవేరలేదు. ఈవేళ వెనక్కు చూసుకుంటూ ఆ రోజు ఆ కలలు కనగలిగినందుకే తృప్తిగా ఉంది ”
” ప్రేమ మనం కోరుకున్నట్లు ప్రవర్తించదు.అదే దాని అందమూ , స్వచ్ఛతా ”
” నేను సాధారణమైన ఆడదాన్ని ” అని ఆమె అంటే, అతడి జవాబు : ” నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు , “సాధారణం ” అనే మాటే నీకు తగదు ”

ఇక సన్నివేశాల్లో నాకు బాగా నచ్చింది, క్లైమాక్స్ ఘట్టం. వానను ఎన్నో సినిమాల్లో ఎఫెక్టు కోసం వాడుకున్నారు కానీ , కన్నీళ్ళలో కరిగిపోయి విడిపోయే జీవితాలనూ కారు అద్దంమీద జారిపోయే వాన నీటిని foreground , background లో ఉంచి అద్భుతంగా తీసారు. వాననీటి తెరల్లో మసగ్గా మనిషి దూరమవ్వడం చాలాకాలం నిలిచిపోయే దృశ్యం.

ముగింపుగా ఒక మాట, ఈ సినిమా ఒక నవల ఆధారంగా రూపొందినా , నవల రచయిత, స్క్రీన్ అడాప్టేషన్ చేసినది , దర్శకుడు , చివరకు ఈ సమీక్ష చేస్తున్న నేను అందరూ మగవారిమే కాబట్టి ఆ మగ దృష్టితో సినిమా నిండిందేమో అని అనిపిస్తోంది. స్త్రీలకు ఈ చిత్రం నచ్చుతుందో లేదో నేను చెప్పలేను .. ఎక్కడైనా పురుషాధిక్య/అహంకార భావజాలపు పాత్రల చిత్రీకరణ ఉందని ఏ స్త్రీ ప్రేక్షకులకైనా అనిపిస్తే వివరించగలరు .

– విప్లవ్

http://viplove.blogspot.com/

17 Comments
 1. శర్మ June 29, 2010 /
  • purnima September 21, 2010 /
 2. Satya June 29, 2010 /
  • viplove June 29, 2010 /
 3. Nagarjuna June 29, 2010 /
 4. కొత్తపాళీ June 30, 2010 /
 5. j.surya prakash June 30, 2010 /
 6. సుజాత June 30, 2010 /
 7. Murthy June 30, 2010 /
  • viplove July 1, 2010 /
 8. zulu July 1, 2010 /
 9. viplove July 1, 2010 /
 10. chakri July 6, 2010 /
  • viplove July 13, 2010 /