Menu

సలాం సినిమా

సినిమాలు చెడిపోతున్నాయి , పతనమౌతున్నాయి , సమాజాన్ని చెడగొడుతున్నాయి అని చాలాకాలంగా మనం వింటున్న/చూస్తున్న/అంటున్న వాదనలే. కానీ చెడిపోతున్న/పతనమవుతున్న సమాజాన్ని సినిమా ఎలా ప్రతిఫలిస్తోందో అనే ఆలోచనలోని కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. విభేదించేవారు కూలంకషంగా చర్చిస్తారని ఆశిస్తూ ..

డెబ్భై, ఎనభయ్యో దశకాల్లో మన ( భారతీయ / ప్రాంతీయ) సినిమాల్లో హీరోలు మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలోంచో లేక రోడ్డుమీదబ్రతికే ఆవారాలాంటివాళ్ళో అవడం చాలా సాధారణంగా కనిపించేది. కమర్శియల్ సినిమాల్లో తప్పనిసరిగా హీరోయన్ మాత్రం గొప్పింటి పొగరుబోతులా ఉండేది. కథానాయకుడు లేబర్లను, మురికివాడల్లోని తనవారిని ఎదిరిస్తూ ధనవంతులైన పెట్టుబడిదారీవారిని ఎదిరించేవాడు.  డెమోక్రసీ అంటూ గొంతు చించుకునే మన దేశంలోని సినిమాల్లో ఇంత కమ్యూనిజ భావజాలం ఉన్నప్పటికీ ఆ భావజాలంలోనే అశ్లీల సాహిత్యపు పాటలూ , ముష్టియుద్ధాలూ , కామెడీ ట్రాకులూ జొప్పించి… ఈ కమ్యూనిజం అంతే సినిమాటిక్ రియాల్టీనే కానీ వాస్తవంలో జరగదు అన్నట్లు ఉండేది. అందుకే తాము చేయలేని తిరుగుబాటు కథానాయకుడు చేస్తుంటే ప్రేక్షకులు వాళ్ళను ఆరాధ్యదైవంగా పూజించేవారు.  ఏది ఏమైనా కథానాయకులు ప్రథానంగా పేదవాడు కావడమో లేక ధనవంతుడైనా ఇంట్లోంచి వెలుపలకు వచ్చి పేదల పక్షాన నిలబడడమో హీరోయిజం. ప్రేక్షకులూ ఎక్కువశాతం అప్పుడు పేదవారే కావడంతో (పేదరికం ఇక్కడ రిలేటివ్‍గా చూడగలరని మనవి ), సినిమా రిక్షాకార్మికుడికి సైతం అందే వినోదం కావడంతో ఆ ట్రెండు కొనసాగింది.

తొంభైల్లో వచ్చేసరికి , దేశకాల పరిస్థితుల దృష్ట్యా మధ్యతరగతి జీవితాలు మరికాస్త మెరుగుపడటంతో సమాజసేవ, దీనజనోద్ధరణ కంటే మధ్యతరగతివారికి జీవితంలో కొరవడుతున్న ప్రేమ, శృంగారం (రొమాన్స్ అని నా ఉద్దేశ్యం..పూర్తిస్థాయి సెక్సువల్ కాన్‍ఫ్లిక్ట్స్ ఇంకా మన సినిమాల్లో రాలేదు) తదితర అంశాలకు సంబంధించిన కష్టాలు, లేక అసలు ఏరకంగానూ ఐడెంటిఫై అవ్వనక్కర్లేని గ్రాఫిక్స్ /యాక్షన్ సినిమాలు ( ఇంగ్లీషు డబ్బింగులే అయినా) ముంచెత్తి , సినిమా ప్రధానంగా రెండుగంటలసేపు వినోదాన్ని అందించేదిగానే రూపాంతరం చెందింది.

ఇక 2000s తొలి సంవత్సరాల్లో మళ్ళీ చిన్నపాటి రెబెల్ హీరోయిజం తలెత్తింది. కాకపోతే ఇక్కడ హీరో ధిక్కారం అంతా , కేవలం తన జీవితం కోసమే. చుట్టుపక్కలవారికోసం కాదు. ఒకప్పటి హీరో , సమాజం కోసం గొడవ పెట్టుకుంటే ఇప్పటి హీరో కేవలం తన కోసమే గొడవపెట్టుకుంటాడు. అది తను ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసమవ్వచ్చు , లేక తన ఈగో సాటొస్ఫాక్షన్ కోసమే కావొచ్చు. విలన్ ఎంత పెద్దవాడయినా “నువ్వెవ్వడైతే నాకేంటి ? ” ” నేను ఇలాగే ఉంటా ” “ఏం చేస్కుంటావో చేస్కో” లాంటి పరుషజాలం కోసం కావొచ్చు ” మా కాళ్ళ మీద మమ్మల్ను నిలబడనివ్వండి ” అంటూ తండ్రినో , ఉపాధ్యాయులనో ప్రేమతో బ్రతిమిలాడుతూనో కావొచ్చు. ఏది ఏమైనా తన వ్యక్తిత్వమే మనిషికి ఇప్పుడు ముఖ్యమైనది , కాబట్టి దాన్ని నిలుపుకోవడానికొ ఒక మనిషి చేసే యుద్ధమో , ప్రయత్నమో కథలయ్యాయి.

కానీ , ఈ తరహా కథానాయకులు చాలా త్వరగానే అంతరించి అసలు తమ వ్యక్తిత్వం ఏమిటో తమకే తెలియని పాత్రలు ప్రధానం అవుతున్నాయి. ఇంగ్లీషులో ముప్ఫై,నలభై ఏళ్ళ క్రితం హిప్పీ జెనరేషన్‍లో మొదలైన ఈ “ఐడెండిటీ క్రైసిస్” ఇన్నేళ్ళకూ మన జీవితాల్లోకీ వచ్చేస్తోందని ఈ సినిమాలు చెబుతున్నాయి. మార్కుల కోసం సాగిస్తున్న చదువులో , లేక జీతాల కోసమే చేస్తున్న ఉద్యోగాలో ..కారణం ఏమైనా మనవారికి జీవితాలగురించి చెప్పేందుకు పుస్తకాలూ, గురువులూ కంటే సినిమాలే ఎక్కువ ముఖ్యమవుతున్నాయి. “నన్ను నేనే వెదుక్కున్నాను ” ” నా నువ్వేనా ” “నాలోని నువ్వు నేనేనా ” “నేనేం చేసానో తెలియడం లేదు “, “కన్ఫ్యూజన్ కన్‍ఫ్యూజన్ ” లాంటి పదాలు , భావాలూ మాటల్లో  , పాత్రల్లో , పాటల్లో , కథాంశాల్లో రాజ్యమేలుతున్నాయి. ఈ అంశాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మనిషి మనిషిగా జీవించడమే వేదం…. అనేంత మాట చెప్పేంతవరకూ సినిమాలు ఎదిగాయి అని గర్వపడొచ్చు. లేక సినిమాద్వారా జీవితం బేసిక్స్ తెలుసుకునేంతగా ప్రేక్షకుల జీవితాలు పతనమౌతున్నాయా అని విచారించొచ్చు. లేక రెండిటికీ మధ్యస్థంగా మరింత ప్రమాదకరమైన కోణం ఒకటి ఉంది.
పతనమవుతున్న మనిషికి తనను తాను మోసం చేసుకోవడానికి మరొక ఆయుధంగా కళలు (ఇక్కడ సినిమాలు ) రూపాంతరం చెందడం.
సినిమాలను తొలిదశనుండి , వినోదంగానే కాక రాజకీయంగా వాడుకున్న దేశాలూ , ప్రచారసాధనాలుగా వాడుకున్న పార్టీలు ప్రపంచమంతా ఉన్నాయి, ఉంటున్నాయి. వాటిని Propaganda Films అంటారు . పూర్తి వివరాలకు  http://en.wikipedia.org/wiki/Propaganda_film చూడగలరు.

డెఫినిషన్‍ ప్రకారం అయితే :
A propaganda film is a film, either a documentary-style production or a fictional screenplay, that is produced to convince the viewer of a certain political point or influence the opinions or behavior of people, often by providing deliberately misleading, propagandistic  content.

కానీ , ఇదంతా యుద్ధకాలాల్లో ప్రభుత్వాలు ప్రజలకు తమ గురించి గొప్పలు చెప్పుకోవడానికీ , తాము చేస్తున్నదంతా మంచి అని భ్రమ కలిగించడానికీ పుట్టినవి. కానీ ఈనాటి సినిమాలు చూస్తుంటే నాకు ఒక తీవ్రమైన అనుమానం పుడుతోంది. అది సినిమా సినిమాకూ బలపడుతోంది. ఈ వ్యాసం ఇప్పటివరకూ రాసిన ఉపోద్ఘాతం అంతా ఆ చిన్న అనుమానాన్ని పంచుకుని చర్చించడానికే.

ఒకప్పటి నియంతలూ , దగాకోరు ప్రభుత్వాలబదులు ఈవేళ మనం, సాధారణ ప్రేక్షకులమే అలా తయారు అవుతున్నామా ? సినిమా మన జీవితాలను ప్రతిఫలిస్తోంది అనే మాట ప్రకారం అయితే , ఈవేల్టి సినిమాలు రిలాల్టీ / రియలిజం అనే పేరిట దేన్ని ప్రతిఫలిస్తున్నాయి ?

ఒకప్పుడు ఎన్టీయార్ / ఎంజీయార్ / చిరంజీవి/ అమితాబ్ బచ్చన్… ఏ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోను తీసుకున్నా , తమ సినిమాల్లో ఒకపాటలో తప్పకుండా మురికివాడాల్లోని పిల్లలను హత్తుకుని వాళ్ళతో చిందులేసినట్లు నటించేవారు. కానీ ఈ వేళ మన ప్రతి సినిమాల్లో హీరో లేక హీరోయిన… తమ మధ్య జరిగే రొమాంటిక్ పాటలో కూడా అనవరసంగా అయినా సరే చొక్కాలేని వీధిబాలలతో నర్తిస్తున్నారు. ఒకప్పటి సూపర్‍స్టార్లలోని బూర్జువా సంస్కృతి ఇప్పుడు మన అందరిలోనూ ప్రవహిస్తోంది అనేట్లు. నేడు ప్రతి ప్రేక్షకుడూ బూర్జువా వ్యవస్థకు ప్రతినిధి ఏమో ? (http://en.wikipedia.org/wiki/Bourgeoisie ) నేను… వంద రూపాయలు పెట్టి టికెట్ కొని ఈ సినిమా చూసేంత డబ్బున్నవాడిని… ప్లాట్‍ఫారంపై బ్రతికేవాడిని అక్కున చేర్చుకునేంత విశాలహృదయుడను అని సాధారణ ప్రేక్షకుడు గొంతు చించుకుని తన డొల్లతనం చెప్పుకుంటున్నట్లు.

గత రెండుమూడేళ్ళలో సినిమా మరింత ఖరీదైనప్పటినుండి సినిమాప్రేక్షకుడి పేదవాడికంటే పైస్థాయివాడు అవడం ( థియేటర్లో పదోశాతం కంటే తక్కువున్న నేలటికెట్లను పక్కనపెట్టి చూస్తే )వలన తన కంటే కిందిస్థాయిలోని పేదవాడిని తను గుర్తించడమే అతనికి గొప్ప వరం అనట్లు ప్రవర్తిస్తున్నాడా ??
ఇప్పటివరకూ ఏ సినిమానూ ఉదహరించకపోయినా , ఇక్కడ ఉదహరించకతప్పదు. slumdog millionaireను ఆంగ్ల సినిమాగా, మన దేశపు పేదరికాన్ని చూపించినందుకు గొప్పదనం ఆపాదించబడ్డదానిగా వాదించుకుంటున్న మనం , మన భారతీయ సినిమాల్లోనే మనలను మనం ఎంత తక్కువ చేసుకుంటున్నామో చూద్దాం. ప్రతి భాషా సినిమాలోనూ ఈ అంశం ఉన్నా ప్రస్తుతానికి తెలుగు సినిమాలు మాత్రమే ఉదహరిస్తాను.(ఇక్కడ ఉదాహరణల్లో కాస్తం వైవిధ్యం ఉన్నదని , వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనీ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలనే ఉదహరిస్తున్నాను , ఫక్తు మసాలా సినిమాలను తప్పించి)

* హ్యాపీడేస్‍లో పేదప్రాంతంనుంచి వచ్చిన విద్యార్థికి హీరో అభయమిచ్చినట్లు కాపాడటం, అందుకు అతను నమ్మినబంటులా మారడం ( దాదాపు ఇదేలాంటి బంధాన్ని రామాయణంలో రాముడికీ హనుమంతుడికీ మధ్య చూపిస్తే దానికి ఆర్య ద్రవిడ గొడవలతో తరచి తరచి చూసి సినిమాలు తీస్తున్న మనం ఈవేల్టి సమాజాన్ని ఎలా ప్రతిబింబిస్తున్నాం ? )

* ఓం శాంతి : మనిషికి అసలైన “థ్రిల్” అంటే లేనివాళ్ళకు సాయపడటమే అని మాధవన్ చెబుతుండగా కాజల్ అర్థరాత్రి ప్లాట్‍ఫాంపై ఉన్నవారికి కంబళ్ళు కప్పి, టీ సమోసాలు ఇప్పిస్తుంది. ఇదే మాట కిక్ అనే సినిమాలోనూ ఉంది.

* బాణం : సులభంగా చెప్పలేను కానీ , ఏం చేసినా వ్యవస్థలో ఉండే చెయ్యాలి అని చెబుతూనే మళ్ళీ వ్యవస్థలో లొసుగులు పట్టుకు పోతాడు హీరో . అతను స్వతహాగా ధనవంతుడిలా చూపించకపోయినా వ్యవస్థలో కలవాలి అనుకునేవాడు

*ఆవకాయ్ బిర్యానీ : ఇదొక్కటే వెరైటీగా…కథానాయకులు పేద పల్లెటూరువారు . కాకపోతే భావజాలం మాత్రం , పల్లెల్లో వారైనా ఇంగ్లీషు చదువుకుంటేనే మేలు జరుగుతుంది అన్నట్లు ఉంటుంది (మరీ అలా డైరెక్టుగా డైలాగుల్లో చెప్పకున్నా పాత్రల దారులు అటే వెడుతుంటాయ్)

*గమ్యం . ప్రధానంగా ఒక ధనికుడు తన చుట్టూ ఉండే పేదవారు కూడా (ఎంత హేయమైన వృత్తిలో వారే అయినా ) మనుష్యులే అని గుర్తెరగడం. ప్రేక్షకుడు ఇక్కడ ధనికుడివేపే అయితే మనం పేదలను గుర్తించడమే గొప్ప విషయమా ?

* అందరి బంధువయా : ఉన్నంతలో తమకు ఉన్నదాన్ని లేనివాడికి ఇచ్చి “సాయపడాలి” అనేది ముఖ్యమైన సందేశం. ఈ చిత్రంలో పాత్రలు అంత ధనవంతులు కాకపోయినా తమకంటే తక్కువ స్థాయిల్లో ఉన్నవారికి సహాయపడటం ద్వారా ఉన్నంతలో తాము ధనికులే అనేట్లు చెప్పింది. బహుశా ఆ “ఉన్నంతలో ధనికులు” అనే మాట రుచించకనేమో ప్రేక్షకులు ఈ పాత్రలలో అంతగా identify  అయినట్లులేరు .

* వేదం : ఒకే దర్శకుడి చిత్రం మరోసారి చెప్పకూడదు అనుకున్నా ( ఆ కారణంతోనే “గోదావరి ” “లీడర్” చిత్రాలను ఉదహరించడంలేదు ..వాటిల్లో పెచ్చు సన్నివేశాలు ఉన్నప్పటికీ) లేటెస్ట్ సినిమా కాబట్టి తప్పలేదు.  నిజానికి సమాజంలో పెరుగుతున్న / పతనమౌతున్న విలువలను పూర్తిస్థాయిలో ప్రతిబింబించగలిగింది ఈ చిత్రం, ఐదు పాత్రలవల్ల ఐదు సినిమాల ఎఫెక్ట్.

రియలిజం పేరిట ఒక నటనరాని ముసలాయన. ఆయన ముఖంలోనే పేదరికం , బలహీనత, అసహాయత ఉండడంతో…అలాంటి పాత్రను గుర్తించడం , మెచ్చుకోవడంతో ప్రేక్షకులుగా మనం పేదలకు గొప్ప మేలు చేస్తున్నట్లే.  కానీ అదే రియలిజం , చిన్న ఊరినుండి వచ్చిన వేశ్యకు అవసరం లేకపోయింది . అక్కడా మాత్రం మనకు ఒక అందాల నటి , అతి మేకప్‍లో provocativeగా మాట్లాడుతున్నా, హొయలు వెదజల్లుతున్నా ఆ cinematic presentationను రియలిజం అని మనల్ను మనం మోసం చేసుకోవడం.

పేదరికాన్ని,  పల్లెల్లో పిల్లాడి వెట్టి చాకిరీనీ , కిడ్నీలు అమ్ముకోవడాన్ని ..చూస్తూ మధ్యలో పాప్‍కార్న్ , సాప్ట్‌డ్రింక్స్ సేవిస్తూ , “అయ్యో పాపం” అనుకోవడం.  (నేను రెండుసార్లు రెండు వేర్వేరు ఊర్లలోని థియేటర్ల్లో చూసినప్పుడు ఇంటర్వెల్ రాగానే వరదబాధితులు ఆహారపొట్లాలకోసం ఎగబడినట్లు జనాలు చేత నొట్లతో ఈ చిరుతిళ్ళకోసం ఎగబడ్డం కళ్ళారా చూసాను )

ధనికుడైన మనోజ్ పాత్రలో… మళ్ళీ పై చిత్రాల్లోని మెసేజ్.

పేదవాళ్ళు ఒళ్ళూ , అవయవాలూ అమ్ముకోవడం చట్టవిరుద్ధం , ఆపాలి అని మెసేజ్ కాదు, పాపం వాళ్ళు అలా ఉన్నారు మనం చూసి జాలి పడాలి అంతే అని మాత్రమే.

ఈ ఉదాహరణల్లో వేటిలోనూ నేను పై సినిమాలనో , వాటి దర్శకరచయితలనో తప్పుపట్టడం లేదు . వాళ్ళూ జనంలోని వారే . మనలో ఏముందే అదే వాళ్ళు చెబుతున్నారు. కాకపోతే ఆ చెప్పడంలో వాళ్ళు అవార్డులు , డబ్బులు పొందుతున్నారు . అవి వినడమే మన గొప్పగా మనం భావించుకుంటున్నాం.
ఇప్పటివరకూ ఈ పోకడలు అన్నీ ఖచ్చితంగా propaganda film తరహాలోనే ఉన్నాయి. రాబోయే కాలాల్లో ఈ ప్రాపగాండా ఇంకెంత దూరం వెళుతుందో ? సమాజంలోని అణిచివేతను  , దురాక్రమణను చూసి ప్రతిస్పందించకపోగా , వాటిని చూడటమే వినోదం అనుకునే స్థాయికి పతనమవుతున్న మన సుఖమయ జీవితాలను అద్దంలా చూపుతున్న సినిమాలకు వేలదండాలు.

విప్లవ్

http://viplove.blogspot.com/

30 Comments
 1. sowmya June 24, 2010 /
  • GopiCM June 24, 2010 /
  • viplove June 24, 2010 /
 2. రాంనరసింహ June 24, 2010 /
  • viplove June 24, 2010 /
  • Latha June 26, 2010 /
   • Latha June 26, 2010 /
   • viplove June 26, 2010 /
 3. Sowmya June 24, 2010 /
 4. ramnarsimha June 24, 2010 /
 5. shankar gongati June 24, 2010 /
  • viplove June 24, 2010 /
 6. ramnarsimha June 24, 2010 /
 7. Uttara June 24, 2010 /
  • viplove June 24, 2010 /
 8. ramnarsimha June 24, 2010 /
 9. ramnarsimha June 24, 2010 /
 10. ramnarsimha June 24, 2010 /
 11. ramnarsimha June 24, 2010 /
 12. ramnarsimha June 24, 2010 /
 13. ramnarsimha June 24, 2010 /
 14. శేఖర్ June 25, 2010 /
 15. ramnarsimha putluri June 25, 2010 /
 16. shankar gongati June 25, 2010 /
  • viplove June 26, 2010 /
 17. NaChaKi June 26, 2010 /
  • viplove June 26, 2010 /
 18. rahul June 28, 2010 /