Menu

మొదటి సినిమా-ఆర్. నారాయణ మూర్తి

ఆవేశం అతని మారుపేరు.. విప్లవపంధా అతని జీవన మార్గం.. ప్రజా సమస్యలే అతని సినిమాకి కథా వస్తువులు.. మామూలు ప్రజలే అతని సినిమాలో పాత్రధారులు.. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడుగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి.. ఆర్. నారాయణ మూర్తి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని వ్రాసుకోగలిగిన నిబద్ధత గల కళాకారుడు.. ఆయన మొదటి సినిమా అనుభవాలు.. ఆయన మాటల్లోనే..

మాది తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేట. అమ్మ పేరు రెడ్డి చిట్టెమ్మ నాన్న పేరు రెడ్డి చిన్నయ్య నాయుడు. మాది అతి సాధారణ రైతు కుటుంబం. మా అమ్మానాన్నలు నాకిచ్చిన పెద్ద వరం నన్ను బి.ఎ. చదివించడం. మా ఊరునుంచి బి.ఎ. చదివింది నేను ఒక్కడినే ఆ రోజుల్లో..

చిన్నప్పటినుంచీ సినిమాలంటే మహా పిచ్చి. అలానే విద్యార్థి దశలోనే వామపక్ష సిద్దాంతాలవైపు ఆకర్షించబడ్డాను. ఇప్పటికీ నా భావాల్లో ఏ మాత్రం మార్పులేకుండా అవే నమ్మిన సిద్దాంతాలకి కట్టుబడి జీవిస్తున్నాను. నా కాలేజీ చదువు పెద్దాపురం ఎమ్.ఆర్. కాలేజీలో సాగింది.

హైస్కూలు నుంచీ కూడా క్లాసులీడర్ గానూ, కల్చరల్ కమిటీ సెక్రటరీ గానూ ఏదో ఒక పదవిలో ఉంటూ తోటి విద్యార్థులని ముందుకు నడిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉండేవాడిని.

సినిమా పిచ్చి తోటి 1972 లోనే ఇంటర్మీడియట్ పరీక్షలవ్వగానే ఎలాగైనా పరీక్షలో తప్పేది ఖాయం అనుకుని మద్రాసు వెళ్ళిపోయాను. 17-18 ఏళ్ళ వయసు. మహానగరంలో ఎవరూ తెలీదు. మనసులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వెయ్యాలని అంతే.. పక్కా సినిమా కష్టాలు మొదలయ్యాయి.. తిండి లేదు. వసతి లేదు. ఐనా ఏదో ఆశ.. అక్కడక్కడ తింటూ, లేని రోజు పస్తుంటూ, రోడ్డు పక్కనే ఏ చెట్టుకిందనో పడుకుంటూ.. రోజులు గడుస్తుండగా, ఒకరోజు హఠాత్తుగా పేపర్ లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీడియట్ పాసయ్యానని తెలుసుకున్నాను. సరే ఇక్కడా ఏమీ అవకాశాలు రావడంలేదు కదా.. పాసయ్యాను కాబట్టి వెనక్కి వెళ్ళి బి.ఎ. చదువుదామని నిర్ణయించుకుని తిరిగి పెద్దాపురం వెళ్ళిపోయాను. సినిమా పోస్టర్లలో ఎన్.టి.రామారావు బి.ఎ. అని చూసినప్పుడల్లా ఎలాగైనా బి.ఎ. డిగ్రీ చదివి ఆ తరువాత సినిమాల్లోకి వెళ్ళాలని అనుకునేవాడిని.

ఆ విధంగా పెద్దాపురం కాలేజీలోనే బి.ఎ. చదవడం మొదలుపెట్టాను. ఎక్స్‍ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లో మహా చురుకుగా పాల్గొనేవాడిని. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా మా బృందం కార్యక్రమం ఒకటి ఉండాలంతే.. మరో పక్క కమ్యూనిస్ట్ పుస్తకాలు కూడా బాగా చదువుతుండే వాడిని.. సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుస్తూనే ఉండేది. ఒకసారి కాలేజీలో అప్పటి హీరోయిన్ మంజుల గారి నృత్య కార్యక్రమం ఏర్పాటు చెయ్యడంలో నేను ముఖ్యపాత్ర వహించాను. ఏదో ఒక రోజు నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి, సినిమా తారలకున్న క్రేజ్ కొంచెమైనా తెచ్చుకోవాలనుకునే ఆలోచన మాత్రం నాలో నుంచి చెరిగిపోలేదు. అలాగే రాజకీయ కార్యక్రమాలు కూడా. ఎమర్జెన్సీ రోజుల్లో ఎమ్మెల్లే డా.సి.వి.కె రావు గారూ, నేనూ – ఒకే వేదిక మీదనుంచి మాట్లాడిన సందర్భం కూడా ఉంది.

ఇక బి.ఎ. పూర్తి కావడమే తరువాయి.. మద్రాసు ప్రయాణం కట్టాను..

ఎప్పుడో మూడునాలుగేళ్ళ క్రిందట వచ్చిన అనుభవమే మద్రాసుకి. ఐతే ఈసారి బి.ఎ. డిగ్రీ ఉంది కాబట్టి నాకు వేషాలు చాలా ఈజీగా దొరుకుతాయి.. ఏముందీ ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషం ఇస్తారు అనుకుంటూ మద్రాసులో అడుగుపెట్టాను.. పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. ఎవ్వరూ నన్ను పలకరించిన పాపాన పోలేదు. ఎందుకు పలకరించాలీ.. నేనేమంత గొప్ప పర్సనాలిటీనీ..? ఐనా వయసు, సినిమా మత్తు అలాంటిది.. పంపు నీళ్ళే కడుపు నింపేవి.. పాండీ బజారు చెట్లే రాత్రిపూట ఆశ్రయమిచ్చేవి.. అలా కష్టాలు పడుతూనే రోజూ స్టూడియోల చుట్టూ తిరిగితే ఒకటి అరా జూనియర్ ఆర్టిస్ట్‍గా అవకాశాలు దొరికాయి.. పొలాల్లో పనిచేసేవాళ్ళల్లో ఒకడిగా, కాలేజీ స్టూడెంట్స్ లో ఒకడిగా, ఊరేగింపులో వెనకాలా.. ఇలా అన్నీ గుంపులో గోవిందా వేషాలే.. అవి కూడా షూటింగు రోజు మాత్రమే తిండి పెట్టగలిగేవి. ఆ రోజుల్లోనే దాసరి నారాయణరావు గారి పరిచయం నా బ్రతుకుని ఒక మలుపు తిప్పింది.

ఆ మహానుభావుడు నాలోని కళాతృష్ణని ఎలా కనిపెట్టగలిగారో కానీ పరిచయం కాగానే రమేష్‍ బాబు హీరోగా ఆయన తీస్తున్న ‘నీడ’ చిత్రంలో నాకు ప్రాధాన్యత ఉన్న వేషాన్నిచ్చారు. రామినేని సాంబశివరావు, డాక్టర్ రామకోటేశ్వరరావు గార్లు నిర్మాతలు నన్ను చాలా ఆత్మీయంగా చూసుకునేవారు. ఆ సినిమాలో పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత రామానాయుడుగారు , జయకృష్ణ గారు .. లాంటి వారు ఆదరించి వారి సినిమాల్లో చిన్న, చిన్న పాత్రలనిచ్చి ప్రోత్సహించారు. అదే రోజుల్లో మళ్ళీ దాసరిగారే తను తీసిన ‘సంగీత’ సినిమాలో హీరోకి సరితూగే వేషాన్నిచ్చారు. ఆ సినిమా బాగానే ఆడింది కానీ ఎందుకో నాకు ఎక్కువగా గుర్తింపు ఉన్న వేషాలు రాలేదు. సినిమాల్లో వేషాలు వేసినన్ని రోజులూ ఫరవాలేదు కానీ లేని రోజుల్లో పస్తులు మామూలే అయ్యాయి. మళ్ళీ చిన్న, చిన్న వేషాలు వెయ్యబుద్ది కాలేదు.. అలాగని పెద్ద వేషాలు రావడం లేదు.. ఇంటికి తిరిగి వెళ్దామా అంటే మొహం చెల్లలేదు. పూట గడవడమూ కష్టంగా ఉంది.. ఏమి చెయ్యాలా అని ఆలోచించాను..

ఎలాగైనా హీరోగా నిలబడాలంటే.. నేనే డైరెక్టర్‍నైతే బావుంటుందని ఆలోచన వచ్చింది. జేబులో చిల్లి గవ్వ లేదు. డైరెక్షన్ డిపార్ట్‍మెంట్‍లో కూడా ఎక్కడా
పనిచెయ్యలేదు.. ఏం చెయ్యాలీ.. ఎలా సాధించాలీ!? నిర్మాతగా ఎవరు ముందుకొస్తారు.. సరే నేనే నిర్మాతని అవుదామని 1984 లో స్నేహచిత్ర బానర్‍ని మొదలుపెట్టి మిత్రుల సహాయంతో, ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల సహకారంతో కొంత పెట్టుబడిని సమకూర్చుకుని నేనే నిర్మాత, దర్శకుడు, హీరోగా మొదటి సినిమా మొదలుపెట్టాను.. అప్పట్లో నా సాహసానికి చాలామంది నివ్వెరపోయారు.. నేను సినిమా పూర్తిచేస్తానన్న నమ్మకం ఎవరికీ లేదు. నేను నమ్ముకున్న మిత్రులు మాత్రం నాకు పూర్తి అండగా నిలబడ్డారు. గురువు దాసరి నారాయణరావుగారి పనితనాన్ని గమనించిన జ్ఞానం, ఆదుర్తి సుబ్బారావు, కె.వి.రెడ్డి గార్ల సినిమాలు విపరీతంగా చూసిన అనుభవంతో దర్శకత్వానికి పూనుకున్నాను. కథాంశం విషయానికొస్తే ముందే చెప్పినట్లు ప్రజా ఉద్యమాలన్నా, వామపక్ష సిద్దాంతాలన్నా ఆసక్తి, అనుభవం ఉన్నవాడిని కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉండే కథనే సినిమాగా తియ్యాలని నిర్ణయించుకుని, నక్సల్‍బరీ ఉద్యమం నేపథ్యంలో ‘అర్థరాత్రి స్వతంత్రం’ మొదలుపెట్టడం జరిగింది. ప్రారంభం అయితే జరిగింది కానీ, ఒక్కో దశని దాటుకుంటూ సినిమా పూర్తి చెయ్యడానికి ఒక సంవత్సరంన్నర పాటు పట్టింది.

అప్పుడు మొదలైంది అసలు కథ సెన్సారు సమస్య. దాదాపు ఆరునెలలు పట్టింది సెన్సారు కత్తెర నుంచి బయటపడడానికి.. ఇందుకోసం ఎంతోమంది నాకు సహాయం చేశారు. సినిమా 1986 నవంబర్ లో విడుదలయింది. ఈ సినిమాకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఇండస్ట్రీలోని పెద్దలు కూడ నన్ను అభినందించారు. ఐతే రిలీజ్ అయిన కొత్తలో కొన్ని రోజులు సినిమా కథ నక్సలైట్ ఉద్యమాన్ని బలపరిచేలా ఉందని చాలా విమర్శలు వచ్చాయి. కొన్ని రాజకీయ పార్టీలైతే రీ-సెన్సారు చెయ్యాలని కూడ ఒత్తిడి తెచ్చారు. ఐతే నిర్ణయం ప్రేక్షకులదేనని వాళ్ళు వదిలేశారు.. సినిమా దాదాపు సంవత్సరం పాటు ఆడింది.. కొంతమంది ‘ఆంధ్రా సత్యజిత్ రాయ్’ అని పిలిచేవాళ్ళు.. అదీ నా మొదటి సినిమా అనుభవం. నా మీద నమ్మకంతో నాకు ఆర్ధిక సహకారం అందించిన మిత్రులూ, పరిశ్రమలోని పెద్దలని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను.. గత 20 సంవత్సరాలుగా మధ్య మధ్యలో కొన్ని సినిమాలు దెబ్బతిన్నా, ఏ మాత్రం నా ఆశయాలని వదులుకోకుండా, అవే భావాలతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాను.. ప్రేక్షకులు ఆదరించినంత కాలం నా సినీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది.

కౌముది సౌజన్యంతో–కిరణ్ ప్రభ
May 2007

One Response
  1. ramesh June 22, 2010 /