Menu

డాక్యుమెంటరీ సినిమా-8

వెండితెరపై రెండో ప్రపంచ యుద్ధం

చరిత్రలో 1930 దశాబ్ధానికున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈ కాలంలో కధారహిత చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేకమైన దృష్టితో, ప్రత్యేక శైలి కోసం అన్వేషణ సాగించారు. సరికొత్త వ్యక్తీకరణ రూపాలను సృష్టించారు. ఈ కొత్తదనం కారణంగా వారి కృషి అత్యధిక భాగం ప్రయోగాత్మకంగానే కొనసాగింది. కొన్నిమార్లు వారి శైలిపై వారికే స్పష్టత కుదరలేదు. అయినా చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. నిర్మాతలకు ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్ ఫిక్షన్ సినిమా అనేది అప్పటికింకా వర్ధమాన కళారూపమే. అభివృద్ధి దశలోనే అప్పటి కథ ఉంది. అందువల్ల భారీ స్టూడియోలు నిర్మించే భారీకథాత్మక చిత్రాల నీడలోనే అది రూపుదిద్దుకొసాగింది. ప్రచారాత్మకాలనుకుని వాటిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేసారు. చాలా సార్లు వాటిని ప్రచార పనులకోసం దుర్వినియోగం చేసారు. చాలా దేశాలలో డాక్యుమెంటరీ, నాన్ ఫిక్షన్ చిత్రాలు సాంఘిక పునర్నిర్మాణానికి ప్రేరణ ఇచ్చాయి. ఈ లోగా వినాశకరమైన రెండో ప్రపంచ యుద్ధం గురించి భయాందోళనలు పెరిగాయి. అందువల్ల ప్రజల దృష్టి జాతీయ సమస్యల నుంచి అంతర్జాతీయ సమస్యల వైపు మళ్లింది. విద్య, గృహ నిర్మాణం, కాలుష్యం వంటి సమస్యలను ద్వితీయ స్థానానికి నెట్టేసి, సంధి ఒప్పందాలు, ఆయుధాలు, యుద్ధ పథకాలు వంటివి ముందుకొచ్చాయి. యుద్ధం విస్తృతి రీత్యా స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం పోరాడే దేశాలు తమ సహజ వనరులన్నింటినీ దాని కోసమే సమీకరించాయి. ప్రజలు మరో ప్రపంచ యుద్ధమంటే ఇష్టపడేలా లేరు. అందువల్ల ప్రజాప్రభుత్వాలు వారికి సమచారం అందించి, పోరాడక తప్పదని ఒప్పించాల్సి వచ్చింది. వేలాది కొత్త విషయాలు నేర్చుకోవలసి వచ్చింది. కొత్త పరికరాలను పరిచయం చేసుకోవలసి వచ్చింది. మొదటిసారిగా డజన్ల కొద్దీ కొత్త ప్రదేశాలతో, జాతులతో వ్యవహారాలు నడపవలసి వచ్చింది.(హిట్లర్) యుద్ధ ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవల్సిన మహా కర్తవ్యమది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని సిద్ధం చేయడం చిన్న విషయం కాదు.

సంఘర్షణలో ఇరు పక్కలనున్న సైనిక – పౌర వ్యూహ రచయితలు మొదటినుంచీ ఓ విషయం గ్రహించారు. వారు ఆధునిక యుద్ధ తంత్రంలొ సినిమా నిర్వహించగల గొప్ప పాత్రను మొదటి నుంచీ అర్ధం చేసుకున్నారు.

చలన చిత్రాలు సైనికులకు, పారిశ్రామిక కార్మికులకు శిక్షణ ఇస్తాయి. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుస్తాయి. పెంపొందిస్తాయి. ఉద్రేకాలను రెచ్చగొడతాయి. మొదట సమాచార సేకరణలో, ఆ తరువాత అసలు యుద్ధంలో అమూల్యమైన పాత్ర నిర్వహిస్తాయి. ఎక్కడికంటే అక్కడికి పట్టుకెళ్ళడానికి పనికి వచ్చే పోర్టబుల్ ప్రొజెక్షన్ సామగ్రి అప్పటికే అందుబాటులో ఉంది. దీని సాయంతో ఎక్కడంటే అక్కడ … యుద్ధరంగంలో, సైనిక ఆసుపత్రులలో, అడవి స్థావరాలలో, కర్మాగారాలలో, మామూలు ధియేటర్లలో సినిమాలు చూపించడానికి అవకాశం ఏర్పడింది. యుద్ధరంగంలోనికి క్షురకులనూ, న్యాయవాదులనూ, భీమా ఏజంట్లనూ తీసుకొన్నట్లే, సాయుధ బలగాల సినిమా యూనిట్లలోనికి ఫోటోగ్రాఫర్లను, ఎడిటర్లను, రచయితలను చేర్చుకున్నారు. వీరెవరూ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షణ పొందిన వారు కాదు. కానీ యుద్ధం వచ్చేసరికి, దానికి అనుగుణంగా పని చెయ్యడానికి సిద్ధమయ్యారు.

సాంకేతికంగా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా చిత్ర నిర్మాణం శరవేగంతో పెరగడానికి రెండో ప్రపంచ యుద్ధం ఇచ్చినంత ప్రేరణ మరేది ఇవ్వలేదు.

ఒక్క అమెరికాలోనే యుద్ధకాలంలో డాక్యుమెంటరీ, ఫాక్చువల్ చిత్రాల నిర్మాణం, పంపిణీల బడ్జెట్ ఏడాదికి 50,000,000 డాలర్లకు మించిపోయింది. మిగిలిన మిత్ర రాజ్యాలు దాదాపు అదే మోతాదులో ఖర్చుపెట్టాయి. అట్లాంటిక్ సముద్రానికి అటూ ఇటూ ఉన్న దేశాల్లొ, ఫ్రాంక్ కాప్రా, జాన్ హస్టన్, రెకోల్ రీడ్, విలియం టైలర్ వంటి ప్రసిద్ధ దర్శకులు, అప్పటికే యుద్ధ చిత్రాల నిర్మాణంతో తలమునకలవుతున్న ఫరే లారెంజ్, రాబర్ట్ ప్లాహెర్టీ, విలియర్డ్ వాన్ డైక్‌లతో చేతులు కలిపారు. భారీ స్టూడియోలు, ఫిల్మ్ ఆర్కైవ్స్, మోషన్ పిక్చర్ సామగ్రి వంటి అన్ని వనరులు వీరి అందుబాటులోకి వచ్చాయి. డబ్బుకు, మనుష్యులకు, సామగ్రికి కొదువ లేదు. ఫలితంగా వీరూ ఇతర దర్శకులూ అన్ని సందర్భాలకు పనికొచ్చే రకరకాల సినిమాలను అసంఖ్యాకంగా నిర్మించారు. ఈ సినిమాలు వారి నిబద్ధతకూ, సామర్ధ్యానికీ సాక్ష్యం చెబుతాయి. అలాగే యుద్ధంలో పాల్గొంటున్న స్వతంత్ర దేశాలలో పరిస్థితులకు, ఘోరమైన ఆత్యాచారాలకు, నమ్మశక్యంగాని నష్టాలకు, మృత్యుహేలకు అద్దం పడతాయి.

వాస్తవంగా యుద్ధం జరుగుతున్న కాలంలో… ఆ యుద్ధంలోనే, ఆ యుద్ధం కోసమే తయారైన ఈ చిత్రాల్ని చూడటం పౌరులకైనా, సైనిక బలగాలకైనా కష్టమైన విషయమే. ఈ సినిమాల్ని చూసి జేమ్స్ ఆగే ఈ విధంగా రాసారు.

“భయంకర యుద్ధ దృశ్యాల్ని రికార్డు చేసిన ఈ సినిమాలను చూడటం గురించి ఓ మాట చెప్పుకోవాలి. అచ్చంగా ఆ ఘటనల్లో పాల్గొనకుండా, వాటిని చూడటంలో అర్ధం లేదనిపిస్తుంది ఇది మనలో దేశభక్తి, చైతన్యాన్ని ఆవగాహన, సానుభూతిని పెంపొందిస్తాయని నిజాయితీగానే నచ్చజెప్పుకుంటున్నాం. కాని వాస్తవ ఘటనలకు సుదూరంగా ఉండి, ఘటనలకు తగినట్లు స్పందించలేని పరిస్థితిలో ఒకరినొకరు చంపుకొంటున్న మనుషులను చూస్తూ మనల్ని మనం హీనపరుచుకుంటున్నామేమో” అని యుద్ధ చిత్రాల ప్రభావాన్ని కీర్తించాడు.

అమెరికన్ సినిమాలు గాని, బ్రిటన్ చిత్రాలు గానీ యుద్ధాన్ని ఆహ్వానించలేదు.కానీ యుద్ధం తప్పనిసరి అయిందని ఒప్పించడానికి ప్రయత్నించాయి. చీకటి గదుల్లో కూర్చుని సినిమాలు చూస్తూ విదేశీ నగరాలపై బాంబులు వేసే పనిలో శిక్షణ పొందటం సైనికులకైనా ఇష్టం ఉండదు. అయినా వాటిని చూశారు. తల్లులు, తండ్రులు థియేటర్‌కు వెళ్లి విదేశీ భూముల్లో సొంత బిడ్డలు చావుకు తెగిస్తున్న దృశ్యాలు చూడాలని కోరుకోరు. అయినా చూశారు. దురాక్రమణని నియంతృత్వాలను ఎదిరించి స్వేచ్చను కాపాడుకోవాలనే ఉమ్మడి ఆశయం వల్ల .. మామూలు హేతువాదాన్ని, నీతి సూత్రాలను, విలువలను తోసివేయగలిగారు. శతృవుపై విజయం సాధించాలనే అభిప్రాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగలిగారు.

కొన్ని యుద్ధాలు అవసరమేననీ, ఆ యుద్ధాల్లో పోరాడటం న్యాయమేనన్నది అందరి అభిప్రాయం. హిట్లర్ నుంచి ప్రపంచాన్ని రక్షించదలచిన యుద్ధం అలాంటిదే. ఆ దిశగా జరిగిన కృషినీ, జరిగిన యుద్ధాలను చూట్టం ద్వారా, సాధారణ చారిత్రక అవగాహనతోపాటు, ఆనాడు పరీక్షకు నిలిచిన విలువలు కూడా మానసికంగా అనుభవానికి వస్తాయి.

రెండో ప్రపంచ యుద్ధం తదనంతర కాలమంతా అమెరికన్లు “ప్రచ్చన్న యుద్ధం”లో నిమగ్నులయ్యారు. అణ్వాయుధ వినాశం, కొరియా, వియత్నాం సంఘర్షణలు, యుద్ధావశ్యకత గురించి అభిప్రాయాలను మార్చివేశాయి. కొరియా, వియత్నాం యుద్ధాలపై తీసిన చిత్రాలు మిలిటరీ, టెలివిజన్ అవసరాల కోసం తీసిన అధికారిక చిత్రాలే. ప్రభుత్వ చిత్ర నిర్మాణ యూనిట్ల యంత్రాంగం పనితీరు గురించి పూర్తి సమాచారం అంతా తెలుసుకోవాల్సి ఉంది. మొదట్లో యుద్ధం గురించి ప్రభుత్వం తీయించిన చిత్రాలు, న్యూస్ రీల్స్ మాత్రమే ఉండేవి. క్రమంగా టెలివిజన్ డాక్యుమెంటరీలు, వార్తా కార్యక్రమాలు, “ప్రత్యేక కార్యక్రమాలు” ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ప్రజలకు వాస్తవాలు చేరువయ్యాయి.

వియత్నాం యుద్ధం సాగే కొద్దీ దానికి ప్రజల మద్దతు తగ్గు ముఖం పట్టింది. అది మెజారిటీ ప్రజలు సమర్ధించే యుద్ధం కాదనీ, రాజకీయ నాయకుల దౌత్యవేత్తల యుద్ధమేనని స్పష్టమైంది. ప్రాపగాండా శక్తులకు సంబంధించినంత వరకూ అదొక రహస్య (అండర్ గ్రౌండ్) యుద్ధమే అయింది. యుద్ధానికి మద్ధతుగా కొని స్పాన్సర్డ్ చిత్రాలు తయారయ్యాయి. అది సినిమాలుగా గానీ, ప్రచారంగా కానీ గణించదగినవి కావు. ఈ పరిణామం వల్ల యుద్ధ చిత్రాల గురించి ఓ విషయం స్పష్టంగా రుజువయ్యింది. ఒకానొక యుద్ధం స్వేచ్చ, న్యాయాల కోసం జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రజలు దాన్ని సమర్ధిస్తారు. అందులో పాల్గొంటారు.

ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్చాకాముక ప్రజానీకంలో అత్యధికులు సారంలేని దేశభక్తిని సమ్మతించరు. అర్ధంలేని ఆక్రమణలను బలపరచరు. తమదేశంలో, ప్రపంచంలో స్వేచ్చా స్వాతత్ర్యాలను నిలబెడుతుందన్నప్పుడే ఆ యుద్ధంతో మమేకమవుతారు.

అలాంటి చిత్రాలే లాటిన్ అమెరికా చిత్రాలు. మూడో ప్రపంచ దేశాల పోరాటాల గుండెల్లోంచి చీల్చుకొచ్చిన ఈ చిత్రాల చరిత్ర మహత్తరమైనదనీ, మహోజ్వలమైందీను.

2 Comments
  1. sri June 15, 2010 /