Menu

డాక్యుమెంటరీ సినిమా-11

సినిమా విముక్తి ఉద్యమంలో అగ్నిజ్వాలల్లో ( The House of Furnaces)

“అగ్నిజ్వాలల్లో అర్జెంటైనా” ఒక సినిమా ఇతిహాసం. మేధావులకీ, సౌందర్య(కళా) ఆరాధకులకీ సంతృప్తి కలిగించే టెక్నిక్‌లు, పద్ధతులు యిందులో లేవు. సంప్రదాయానుసారంగా తీసిన చిత్రాలు చూసే వారికిది ఒక షాక్ లాంటిది. అయితే ప్రేక్షకుల్ని తనలో యిముడ్చుకుని, వారిచే తలలూపించే షాక్ యిది. ఒక ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ. ఒక రాజకీయ చర్య, ఒక విప్లవ ఆయుధం, ఒక విముక్తి నినాదం – వీటన్నిటి మేలి కలయిక “ది హవర్ ఆఫ్ ఫర్నేసెస్”.

1930లో “బాటిల్షిప్ పోటెంకిన్” ఎలా సినిమా గ్రామర్ని మార్చి రికార్డు సృష్టించిందో అలాగే 1968లో తీసిన ఈ చిత్రం ఆధునిక సినిమాకు సరికొత్త వ్యాకరణాన్ని సృష్టించింది.

దీన్ని అర్జెంటైనాలో, అండర్ గ్రౌండు సినిమా అనే పదానికి నిజమైన అర్ధంలో నిర్మించారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక చిత్ర ప్రదర్శనను అక్కడ నిషేధించారు. అయినా రహస్యంగా ప్రజలకు ప్రదర్శిస్తూనే వుండేవారీ చిత్రాన్ని. ప్రజలెంతగా లీనం అయిపోయేవారంటే మధ్యలో సినిమా ఆపి చర్చలు జోరుగా జరిపి సవరణలు కూడా చేయించేవారు.

ఈ చిత్రనిర్మాతలు ఫెర్నాండో సోలానాస్, దర్శకుడు ఒక్టావో గెటినో, సౌండ్ మాన్, స్క్రిప్టురైటరు – వీరంతా కలిసి మొదట అర్జెంటైనా ఆంతరంగిక సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబించే ఒక డాక్యుమెంటరీ చిత్రం తీయాలనుకున్నారు. కాని వారి సృజనాత్మక శక్తివల్ల, ఇతివృత్త వైశాల్యం వల్ల యిది “లాటిన్ అమెరికా పొటెంకిన్” అయింది. దీన్ని మొత్తం రెండు సంవత్సరాల కాలంపాటు అర్జెంటైనాలో రహస్యంగా నిర్మించారు.

పెరాన్ రాజకీయాధికారం చేపట్టడం తరువాత పదవీచ్యుతుడు కావడం కూడా వివరంగా చూపించారు. అర్జెంటైనాను ప్రధానంగా తీసుకుని లాటిన్ అమెరికాలో సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారీ దౌర్జన్యాలను బట్టబయలు చేశారు. ఇందుకుగాను మేధావులు, కార్మికులు, విద్యార్థులు, నాయకులు, విప్లవ వీరులతో మొత్తం 180 గంటలపాటు ఇంటర్వ్యూలు తీసుకుని 80 గంటల బ్రహ్మాండమైన సినిమాగా తీసి, తుదకు 4 గంటల 20 నిమిషాల చిత్రంగా కుదించారు.

19వ శతాబ్దపు క్యూబా కవి జోస్ మార్టే వాక్యం ఆధారంగా ఈ చిత్రానికి “లా హోరా డి లాస్ హార్న్” అనే లాటిన్ పేరు పెట్టారు. ఈ వాక్యాన్ని చెగువేరా కూడా వాడుకుని వుండటం గమనార్హం.

ఇది పేరుకు డాక్యుమెంటరీగాని ఎన్నో విలువైన, సరికొత్త టెక్నిక్ లు ఉన్నాయి. స్టిల్స్ ఉపయోగం సవేగ ప్రేరణలు (సామూహిక కదలికలు) కటింగ్ ఎఫెక్టులు, భయంతో జిల్లుమనిపించే దృశ్యాలు. రసానుగుణమైన సీక్వెన్సులు, ఇతర చిత్రాలు , న్యూస్ రీళ్ళనుండి కటింగులు – ఒక్కోచోట ఒకదాని తర్వాత మరొకటి విరుద్ధ సన్నివేశాలు ఉపయోగించుకున్నప్పటికీ అనల్పమైన శైలిలో, మొదటినుండి ఒక బేలెన్సుతో నిర్మించారు.

దోపిడీదారులకు వ్యతిరేకంగా విప్లవ ప్రబోధం చేస్తూ ప్రజలు నిజం తరిచి బాధ్యత గుర్తెరిగేలా చేస్తుందీ సినిమా. ఈ రాజకీయ ఆలోచనా విధానాన్ని కళ సంఘపరమైనప్పటికీ ఎంతో కళాత్మకంగా కళాస్వరూపాల్ని సృష్టించవచ్చని రుజువు చేసిందీ చిత్రం. ఆత్మానుగత సృజనాశక్తి సరియైన కళారూప ఆవిర్భావానికి దోహదపడే ఒక శక్తే గాని పరమావధి కారాదు.

అర్జెంటైనా గురించి ఏమీ తెలియనివారికి సైతం అక్కడి దోపిడీవర్గం పద్ధతులు, అధికారం కోసం జరిగే కుట్రలు, సంస్థాగత క్రూర నిర్బంధ పాలనలో ప్రజలపై జరిగే రాక్షసాలను బట్టబయలు చేసే ఈ చిత్రంలో మూడు భాగాలు.. అవి 1. వలస దేశాలు – హింసాకాండ 2. విముక్తిపోరాటం 3. విముక్తి హింస

మొదటి భాగం

95 నిమిషాలు సాగే మొదటి భాగంలో 13 ప్రత్యేక అంశాలు చూపించారు. ఒక్కో అంశం ఒక్కో “పిలిం ఎస్సే ” అనవచ్చు. ఉపోద్ఘాతంగా అర్జెంటైనా చరిత్రను, సామ్రాజ్యవాదుల ఆధీనంలోనున్న వాస్తవ రాజకీయ స్థితిని చిత్రించారు. స్వాతంత్ర్యానికీ, పోరాటానికీ సంకేతంగా అర్జెంటైనా జాతిపిత కార్లోస్ వి. ఆల్వియర్ గుర్రంపై స్వారీచేస్తున్నట్లుండే విగ్రహం ప్రారంభంలోనే కనిపిస్తుంది.

అర్జెంటైనా రాజధాని”బ్యూనస్ ఎయిర్స్”లో సామ్రాజ్యవాద దేశాల నాగరికత – సరసనే అక్కడి వెనుకబడ్డ జనజీవనం – రెండు విరుద్ధ సంస్కృతులూ ఒకే చోట ప్రతిబింబించడం చూపించారు.

ఇక “పశు ప్రదర్శన” ఘట్టంలో పోటీలో గెలిచి బహుమతులు పొందిన పశువులు తమ బలుపుని ప్రదర్శిస్తుంటాయి. అక్కడికి కట్ చేసి – చక్కగా అలంకరించుకున్న బూర్జువాలు దీన్ని కొనాలని ఆలోచించడం, బహుమతి పొందిన పశువులను వేలం వేసే గొంతు నేపథ్యంలో వినిపిస్తుండగా ముక్కు తాడుతో కట్టిన పశువులను ప్రదర్శిస్తుండడం – ఇదంతా 5 శాతం మంది విదేశీయులు 22 మిలియనుల జనాభాను, 42% జాతీయ ఆదాయాన్ని ఎలా పీల్చుకు తింటున్నారనేదానికి చక్కని సంకేతంగా చూపారు. ఇక్కడ మరో రెండు ఘట్టాలున్నాయి. యూరపియన్ సంకర సంస్కృతిపై ఉన్నత వర్గాలవాళ్లకున్న మోజుకు ఉదాహరణంగా పాల్ మెరోలో జరిగే పాతకాలానికి చెందిన కారు రేసులను చూపారు. మరో దృశ్యం పశు సంహారం. అర్జెంటైనాకు విపరీతంగా విదేశీ మారకం తెచ్చేది ఈ పశుమాంసం ఎగుమతులే. బలుపెక్కిన పశువుల్ని కట్టి, తలక్రిందులుగా క్రేన్ తో వేలాడదీసి, వధ్యశాలలో పడేసి అవి మేతకోసమో, పక్కలకో, అటో ఇటో చూస్తున్నప్పుడు, సరిగ్గా వాటి కణతలపై ఓ పొడవాటి కర్ర చివరనున్న ఇనుపసుత్తితో “ఫట్” మని కొట్టి చంపడం ఒళ్ళు జలదరించేలా చూపించారు. ప్రాణభయంతో చూసేవాటి ఆఖరి చూపులు పీడిత ప్రజల ఆవేదనలా, కసాయివాళ్ల ఉల్లాసం అధికారుల ఆహ్లాదంగా అర్ధమయ్యేలా ఆ నేపథ్యంలో ఎంతో శక్తివంతమైన కామెంటరీ చెబుతారు.

బెల్లీ ఆపాక్యూలో పోలీసులు జరిపిన దారుణ హింసాకాండను ఒక “మాస్టర్ ఫుల్ సీక్వెన్సు” లొ చూపించారు. చేతులు పైకెత్తిన బందీలు ఒక్కొక్కళ్లే బయటకు వస్తుంటే, బయట బూటుకాళ్లతో తన్నుతూ, లాఠీలతో కుమ్ముతూ ట్రక్కులలో పడేసి తీసుకుపోతుంటారు. ప్రజలను ఎంత దారుణంగా అణగదొక్కుతున్నదీ స్పష్టంగా అన్ని కోణాలనుండి చూపించారు.

అర్జెంటైనా పరిస్థితిని ప్రతిబింభించే మరో దృశ్యంలో ఒక శిధిల గృహంలో ఆకలికి మాడే మనుషులు, ఏ పనీ దొరకక, చేయలేక నిస్సహాయంగా దిక్కులు చూచే యువకులు, చలికి బిర్రబిగిసిపోతున్న ముదుసలులు, లేవలేక లేస్తూ, నడవలేక పడిపోతున్న చిన్నపిల్లలు నీరసంగా ఓ వైపు, కెమెరా మెల్లగా చిరిగిన పరదాలున్న గదిలోకి నడుస్తుంది. అందులో ఒక మంచం, మంచంపై వక్షాలపై మాత్రమే గుడ్డలున్న ఓ స్త్రీ బాధపడుతూ లేచి, పక్కనే పడి ఉన్న ఎండిన రొట్టెముక్కల్ని తిని నీళ్లు తాగుతుంది. అక్కడ ప్రేక్షకుల కళ్లకు సెక్స్ సౌందర్యం కాదు. సమాజంలో శిధిలమైన ఓ యువతి జీవితం కనిపించుతుంది. ఆధునిక మానవుడు గుత్త పెట్టుబడిదారుల ఇనుపకాళ్ల క్రింద ఎలా నలిగిపోతున్నాడో చూసి సిగ్గుపడేలా చేస్తుంది. ప్రజలు ఏ దేశానికి చెందినా స్వతంత్రంగా హాయిగా బతకాలనే ఉపదేశం వినిపిస్తుంది.

మరో దృశ్యం – ధనికుల ఆనంద వైభోగాలకు చిహ్నమైన ఒక ఖరీదైన రైలు ఎత్తైన బ్రిడ్జిపైగా మెల్లగా పోతుంటుంది. ఒంటిపై గుడ్డ చింపురులు కూడా సరిగా లేని పిల్లలు అంటుకుపోయిన డొక్కలతో రైలు పక్క నిలబడి కిటికీలలోంచి విచిత్రంగా చూస్తున్న ప్రయాణీకులను తిండిపదార్థాలు అడుక్కుంటారు. రైలువెంటే అంతే వేగంగా పరిగెడుతూ తమ పొట్టలు చూపిస్తూ, ప్రాధేయపడుతుంటారు. మరో వైపున మరో పిల్లాడు తాగే నీరు లేక మురిగ్గుంటలోని నీళ్లే రేకుడబ్బాలో ముంచుకుని తీసుకుపోతాడు.

13 ప్రకరణాలుగా విభజితమైన ట్రయాలజీలోని మొదటిభాగం ఆఖరి దృశ్యం – రెండున్నర నిముషాల లాంగ్ షాట్. బొలివియాలో చిత్రహింసలకు గురై చనిపోయిన చేగువేరాకు విప్లవాభినందనలు తెలిపేందుకు ప్రజలు చూడ వస్తుంటారు. అతన్ని పూర్తిగా చూపిస్తూ అతని ముఖం వద్ద కెమెరా ఆగుతుంది. ఆగి క్లోజప్ లోకి మారుతుంది. నేపథ్యంలో డ్రమ్స్ ” ఢక్.. ఢక్…” ధ్వనుల మధ్య నిశ్చలంగా గువేరా రెండుకళ్ళూ సూటిగా ప్రేక్షకుల రెండు కళ్లలోకి, గుండెల్లోకి సూటిగా గుచ్చుకుంటాయి. “ప్రతీకారమో – ప్రాణత్యాగమో ” అన్న అతని నినాదం హాలంతా నిండి ప్రేక్షకుల గుండెలలోంచి వెలువడుతుంది. ఈ మొదటిభాగం అతనికే అంకితం.

రెండవ భాగం

విముక్తి పోరాటంలో హింస పాత్ర గురించి పోరాటానికి పిలుపు. ఇందులో ఎక్కువగా ఇంటర్వ్యూలు, రిపోర్టులూ ఉన్నాయి. ఈ భాగాన్ని “ఓపెన్ వర్క్” అని నిర్మాతలు అన్నారు. ఎందుకంటే ఇందులో మరేమైనా కొత్త మెటిరియల్ మరెప్పుడైనా కలిపే వీలుంది. కాల పరిస్థితుల్ని బట్టి కావలసిన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఆ విధంగా అదెప్పుడూ సరికొత్తగా వుండగలదని నిర్మాతల ఉద్ధేశ్యం.

అర్జెంటీనాలో వలసవాదుల, పెట్టుబడిదారుల ఘాతుక చర్యలతో మొదలవుతుంది ఈ భాగం. జావున్ డామంగో పెరాన్ 1946లో పదవి కెక్కిన తర్వాత, అతని పాలన కొనసాగినంత కాలం మాత్రం పెట్టుబడిదారుల, వలస వాదుల ఆటలు సాగలేదు. దశాబ్దం పైగా సాగిన ఆయన పాలనలో కొన్ని మౌలిక మార్పులు చేయబడ్డాయి. బ్యాంకులు, పబ్లిక్ సర్వీసుల జాతీయకరణ, విదేశీరుణాల రద్దు, విదేశీ పెట్టుబడిదారులపై కంట్రోళ్లు – ఆర్ధిక రంగంలో ప్రధాన మార్పులు. జాతీయ ఆర్ధిక వ్యవస్థ సంపూర్ణంగా ప్రభుత్వం కైవసం చేసుకున్నట్లే. పరిశ్రమలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇక రాజకీయంగానైతే స్త్రీలకు రాజ్యాంగపరంగా ఓటుహక్కు, బడుగువర్గాల వారికి అనేక హక్కులు ఇవ్వడమైంది. అయితే వ్యవస్థ పునర్నిర్మాణం సిద్ధాంతపరంగా గానీ, లోతుగా ఆలొచించిగానీ జరగలేదు.అందుకే పథకాలు దెబ్బతిన్నాయి. కేంద్రీకృత పాలన జరిపే షెరాన్ ప్రభుత్వం తన పథకాల వల్ల భూస్వాములైనవారి చేతుల్లోనే నలిగిపోక తప్పలేదు. స్వతహాగా శక్తిసంపన్నుడు కాకపోవడం వల్ల పెట్టుబడిదారులు, మతాధిపతులు, షెరాన్‌కు వ్యతిరేకంగా మిలిటరీని ఉపయోగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. షెరానిజం నిజస్వరూపాన్ని వక్రరూపంలో చూపిస్తూ, దాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వమని నిందించడంలో అమెరికా వార్తా సంస్థలది అందె వేసిన చేయి. చివరకు 1955లో మిలిటరీ తిరుగుబాటు సాయంతో షెరాన్‌ను పదవీచ్యుతుడ్ని చేయగలిగారు అభివృద్ధి నిరోధకులంతా కలిసి.

ఇదిలా వుండగా క్యూబాలొ విప్లవం ప్రారంభమై పోరాటం సాగుతున్నది. అది తీవ్రస్థాయికి చేరుకునే వరకు లాటిన్ అమెరికా మేధావులకు అసలు విషయం ఆవగాహన కాలేదు. ఆ కాలానికి కొందరు మేధావుల కళ్లు విప్పుకున్నాయి. ఉద్యమం తీవ్రస్థాయి దర్శకుడు సొలానాస్ కు ప్రభావితం చేసింది. ఉద్యమం అసలు స్వరూపం అంచనా కట్టి అందుకు తగిన చర్యలు తీసుకొనడానికి సన్నద్ధులయ్యారు.

ఈ రెండవ భాగాన్ని 1) క్రానికల్ ఆఫ్ షెరానిజం 2) క్రానికల్ ఆఫ్ రెజిస్టెన్స్ అనే రెండు పెద్ద విభాగాలుగా చేసారు. మొదటిది 1945 – 55 సంవత్సరముల మధ్యకాలంలో జరిగింది. రెండవది “హింసాత్మక దశాబ్దం ” గా పరిగణించబడే 1955 – 1965 కాలానికి సంబంధించినది. మొదటి విభాగంలో హెచ్చుగా గతంలో తీసిన న్యూస్ రీళ్లనుండి మెటీరియల్స్ తీసుకుని ఒక చారిత్రాత్మక విశ్లేషణ చేశారు. ఇక రెండవ విభాగాన్ని ఎంతోమంది ప్రముఖ కార్యకర్తలు, శ్రామిక నాయకులు, మేధావులు, విద్యార్థులతో జరిపిన ఇంటర్వ్యూలు, వారి వారి నివేదికల తోడ్పాటుతో తయారు చేసారు. గత పది సంవత్సరాలనుండి ప్రభుత్వ దమనకాండకు తట్టుకుంటూనే జనం ఎలా శక్తిని పుంజుకుంటున్నారో చక్కగా చూపించారు.

అధికారం హస్తగతం చేసుకోవడానికి ఉన్నదొక్కటే మార్గం. అదే ప్రత్యక్షకార్యచరణ పోరాటం. అన్ని రకాల కుట్రలను చేధించడానికి బలమైన సాయుధ దళాలు ఏర్పడాలి. ఈ నిర్ణయం వెనుక గత 10 సంవత్సరాల అనుభవం ఉంది. అనుభవం నేర్పిన ఈ పాఠానికి వత్తాసుగా ” ది సైలెంత్ ఎస్కాలాడెడ్స్ ” అంటే శత్రు స్థావరాలపై నిశ్శబ్ధంగా దాడి చేసి వశపరుచుకోవడమే ఏకైక మార్గం అన్న దృశ్యాన్ని సజీవంగా చూపిస్తారు.

మూడో భాగం

చిత్రం ఆఖరి భాగంలో ప్రారంభంలోనే ఒక పండ్లూడిన పండు ముసలి తన గుడిసె ముందుండి గొంతు సరిచేసుకుంటూ బొంగురు స్వరంతో తన అభిప్రాయాలు తెలుపుతుంటాడు. అవి జరిగిన రెండు భాగాలకూ వ్యాఖ్యాల వంటివి . ఈ ఆఖరు భాగంలో పూర్తి విప్లవ నిమగ్నతను ప్రదర్శించి, బ్రహ్మాండమైన విప్లవ భవిష్యత్తును బేరీజు వేస్తారు. అంతర్జాతీయ విముక్తిపోరాటాలు, ప్రజా ఉద్యమాల స్వరూప స్వభావాలను వివరిస్తూ, వాటి ఆవశ్యకతను గురించి నొక్కి చెబుతారు. అర్జెంటీనాను ప్రధానరంగంగా చూపిస్తారు. మూడవ ప్రపంచ దేశ పోరాటాల్లో ప్రజా ఉద్యమాలను పెట్టుబడిదారీ వర్గాలను కూలద్రోసేందుకు నడపాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తారు.

విముక్తి పోరాటంలో పాల్గొనేందుకు వచ్చిన యువకులు ట్రేనింగ్ క్యాంపులో శిక్షణ పొందుతూ, సాయుధులై బారులు తీరి వుండడం చూపిస్తారు. మరోవంక పోలీసులు మిలిటరీ పెరేడ్ చేయడం చూపిస్తారు. ఏదో కనపడని టైప్ రైటర్ టకటకమని ముద్ర కొట్టుతున్నట్లు “పోరాటమే ఏకైక మార్గం” అన్న పదాలు.. ఒక్కొక్కటిగా నల్లని తెరపై పడుతూంటే, మరోవైపున గుపాకులెక్కుబెట్టిన జనం కేంపుల్లో కనిపిస్తుంటారు.

మరో దృశ్యంలో షెరానిస్టు కామ్రేడ్ టాక్స్ లర్, ప్రయాణిస్తూ సంభాషిస్తాడు. కారును కొన్ని శిధిలాలవద్ద ఆపి క్రిందకు దిగి, తనను పోలీసులెలా పట్టుకున్నదీ, ఎలా చిత్ర హింసలు పెట్టిందీ, తుదకు తానెలా తప్పించుకున్నదీ, చెబుతుంటాడు. మృతవీరులకు జోహార్లర్పిస్తాడు. “విజయమో.. వీరస్వర్గమో” అనే సంకల్పం అతని గొంతులో ప్రతిధ్వనించుతుంది. అనుగుణంగా తుపాకి మోతలు – గెరెల్లా దళాల అడుగుల చప్పుళ్లు.. అతని గొంతుకతో బాటు వేల గొంతుకలు సంధించిన ధ్వనులు – పోరాటం, పోరాటం అనే నినాదాలు.. ఒక్కసారిగా చీకటి… చీకట్లో ఏదో గడబిడ.. అరుపులు.. “వయలెన్స్ ఆండ్ లిబరేషన్” అన్న నినాదాలు మిన్నుముట్టుతాయి. అనుగుణంగా బొంగురు పోయిన ఒక ఆడగొంతు ఆ నినాదాలనే పాడుతుంది. గొంతెత్తి విప్లవాన్ని, విముక్తిని ఆహ్వానిస్తుంది. అనుగుణంగా గుండెలు జలదరించేలా డ్రమ్స్ ద్వని .. డక్ , డక్ , డక్ మని సమ్మెట చప్పుళ్లలా .. ఉక్కు బూట్ల పరుగుల ధ్వనుల్లా.. దౌర్జన్యం ప్రేలుళ్లలా…

హింస.. హింస.. ఎటు చూసినా దోఫిడీ.. దౌర్జన్యాలు.. లూటీలు.. హత్యలు.. బాహాటంగా ప్రజలపై కాల్పులు…

పాట వినిపిస్తూనే ఉంటుంది. దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, విముక్తికి ఆహ్వానంగా పోరాటాలు.. బలిదానాలు.

కాల్ప్లులు .. కాల్పుల కెదురుగా పగిలిన గుండెలు, కాలే ఇళ్లు, ఊళ్లు, పట్టణాలు… ఐనా పట్టువదలక పోరే ప్రజలు…

పాట అతి తీవ్రస్థాయిలో గుండెలు బ్రద్దలు చేస్తూ.. హింసకు హింస.. రక్తానికి రక్తం..

సాయుధులైన జనం దోపిడి ఉక్కు కవచాల్లోంచి దూసుకువస్తూ… నేపథ్యంలో అదే పాట.. సాయుధులైన జనం అగ్నిజ్వాలల్లా, జనానికి సంకేతంగా కాగడాలు…. ఒక్కసారి నిశ్శబ్దం – టకీమని పాట ఆగిపోతుంది. మెల్ల మెల్లగా ప్రేక్షకుల గుండెలలో కూడా ఆవరించుతుంది నిశ్శబ్దం..

తెరంతా చీకటి – అంతలో మళ్లీ కాగడాలు – వెలుగు – విప్లవం దేదీప్యమానంగా వెలుగుతున్నట్లు కాగడాలు – చీకటిలో దివిటీలు ఒకటి, రెండూ, మూడూ, వందలూ , వేలూ —