Menu

డాక్యుమెంటరీ సినిమా-10

బ్రెజిల్ కొత్తసినిమా

సామాన్యంగా తిరుగుబాటు సినిమా లేక విప్లవ సినిమా విప్లవ విజయానంతరం మాత్రమే సాధ్యమవుతుందని భావిస్తారు. ఉదాహరణకి 1959 తరువాతే క్యూబాలో ఒక నిర్దుష్టమైన విప్లవ చలనచిత్ర రంగం ఆవిర్భవించింది. అట్లని అంతకుముందు సినిమా మీడియాని ఉపయోగించుకోలేదని అర్ధం కాదు..

కాని ఇందుకు భిన్నంగా బ్రెజిల్లాంటి కొన్ని చోట్ల విప్లవానికిముందే తిరుగుబాటు సినిమా సగర్వంగా తలెత్తి నిలిచింది.

1960 పూర్వం లాటిన్ అమెరికాలో సినిమాలన్నీ హీనస్థాయి వినోదాన్ని కుప్పతెప్పలుగా అందించేవి. నిజం చెప్పాలంటే అవన్నీ ఉత్తర అమెరికానుండి వస్తుండే పలాయనవాద చిత్రాలకు చౌకబారు అనుకరణలు. ఐతే ఇందుకు కొన్ని మినహాయింపులు కూడా వున్నాయి. లూయిబనెల్ తీసిన కొన్ని ఉత్తమ చిత్రాలు బూర్జువా విలువలపట్ల ఆ వ్యవస్థపట్ల అసందిగ్ధమైన అసహ్యాన్ని ప్రస్ఫుటీకరించాయి. అలాగే అర్జెంటీనాకు చెందిన లియోపాల్డోరేనిల్సన్ తన చిత్రాల ద్వారా గొప్ప సామాజిక విమర్శకునిగా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించాడు.

భావోద్రేక కథా సంవిధానం, ఆడంబరమైన చిత్రీకరణశైలి ఉన్నప్పటికీ అతని చిత్రాలలో అవినీతిమీద, అభివృద్ధి నిరోధక భావాల మీద, కేథలిక్కుల లైంగికనీతిపైన తీవ్రవిమర్శ ఉండేది. అందుకే 1950 ప్రాంతాల్లో అతని చిత్రాలకు మంచి ప్రచారం లభించింది. “ఒక దేవత వృత్తాంతం” (లాకే సాడెట్ ఏంజల్), 1957 లో “పండగ ముగింపు” (వాడే ఫియస్తా) చిత్రాలు ప్రసిద్ధం.

క్యూబా విప్లవానంతరం ఆ దేశావసరాల దృష్ట్యా అనేకమంది సినిమారంగంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. అవి ప్రజలకు విజ్ఞాన్ని , కర్తవ్యాన్ని బోధించడానికే వినియోగపడ్డాయి. అందుకు అవసరమైన చక్కతి చిత్రీకరణ శైలి కూడ క్రమంగా నిలదొక్కుకుంది.

ఇది ఇలా ఉండగా మిగతా లాటిన్ అమెరికా దేశాల్లో కూడా మంచి చిత్రాల నిర్మాణం జరిగింది. ఇక్కడే ఓ సంగతి గమనించాలి. ఆయా దేశాల్లో ఉన్నది క్యూబాలో లాగా సోషలిస్టు ప్రభుత్వం కాదు. అలాగే అప్పటికే వ్యాపార చిత్రాల వ్యవస్థ మరోరకం చిత్రాలకు ప్రవేశార్హత కూడా చేయగల స్థాయిలో, పైగా తిరుగుబాటు లేదా విప్లవ ప్రచారాన్ని నిరోధించడానికి అవసరమైన హంగు, ఆర్భాటం ఇక్కడి ప్రభుత్వాలకు సహజంగా ఉంటాయి. మిలతరీ ప్రభుత్వాలు సరే సరి. అందుకే రాజకీయార్ధంలో విప్లవాత్మకమైన సినిమాగా అద్భుతమైన కీర్తిప్రతిష్టతలు సాధించిన బ్రెజిల్ సినిమా ఒక విచిత్రమైన వాస్తవం.

“సినిమానోవా” (కొత్త సినిమా) అనే పేరుతో కొందరు యువదర్శకులు బ్రెజిల్ వ్యాపార సినిమాకు విరుద్ధంగా గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు. వారిలో ఎవరికీ సినిమాకి సంబంధించిన పరిజ్ఞానం లేదు. వారికి తమ చుట్టూ ఉన్న దారిద్ర్యం, విషాదం, కథావస్తువుగా, సామగ్రిగా ఉపయోగపడ్డాయి. తమ శక్తియుక్తులు, ఉన్న కాస్త ధనం అంతా పోగు చేసి సినిమా రంగానికి అంకితమయ్యారు. ఫ్రెంచి సినిమా విమర్శకులు వీరి సినిమాకళని ఆకలి సినిమా (సినిమా డి లా ఫామ్) అన్నారు. బూర్జువా విమర్శకులు ప్రజా సినిమాని ఏదో ఓ రకంగా కించపరచాలని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు.

1955 లో “రియో క్వొరెంటా గ్రాస్” అనే చిత్రం అతి కష్టంగా విడుదల కాగలిగింది. ఇది డాక్యుమెంటరీ శైలిలో తీసిన కథాచిత్రం. దీన్ని నిర్మించిన నెల్సన్ పెరీరాదాస్ సాంతోస్. అతనొక మాజీ లాయర్. నవ్యవాస్తవిక ధోరణిలో ఒక నగరానికి సంబంధించిన కథ ఇది. ఇతనే మరో చిత్రం తీశాడు. దానిపేరు “రియో డి జినేరో” ఇందులో ఒక వేసవిరోజు అనేకమంది బతుకు అనుభవాల సంపుటీకరణని కథగా మలిచాడు. ఈ కథని నవ్యవాస్తవిక శైలిలో చిత్రీకరించారు.

మురికివాడల్లోని దౌర్బల్యం, దైన్యం తద్విరుద్ధమైన నాగరిక విలాస జీవనం, హృదయరాహిత్యం పరస్పర విరుద్ధంగా మన కళ్లముందు కనిపిస్తాయి.

లోపాలు ఉన్నప్పటికీ ఇలాంటి చిత్రం తన ప్రభావాన్ని చూపక మానలేదు. అందుకనే ఆ చిత్రనిర్మాత యువదర్శకులందరికీ హఠాత్తుగా మార్గదర్శకుడయ్యాడు. కొన్ని తప్పటడుగుల తరువాత ఆ యువదర్శకులంతా ధైర్యంగా, స్పష్టంగా సినిమాలు తీయడం ప్రారంభించారు. అదే సినిమా నోవా ఉద్యమం..

క్షణం క్షణం వ్యధ చెందే పల్లెల బయళ్ల జీవనం, ఇరుగ్గా కంపుగొట్టే మురికివాడల జీవనం. ఈ కొత్త సినిమా ఉద్యమ నిర్మాతలకు కథా వస్తువులు కళారంగాలయ్యాయి.

ఈ సినిమానోవా సినిమాలో సమరూపత ముఖ్యలక్ష్ణం. పచ్చిక మైదాన ప్రాంతంలోని వేదన దాని వస్తువు. ఎండలో మాడిపోయిన రంగు, బాధగొలిపే వాతావరణం, విస్తృతంగా పరుచుకున్న ఎడారి భూముల దృశ్యాలు తిరిగితిరిగి కనబడుతూ అనుభూతిని, బాధను, మానసిక వంటరితనాన్ని మన మనస్సులో గాఢంగా నాటుకుంటాయి. ఒక్కోసారి విసుగెత్తేంత బాధ కలిగిస్తుంది. కాని ఈ విసుగంతా దాచుకున్నా దాగని శక్తిని కూడా రుజువు చేస్తుంది. అంతేకాదు. అది ప్రజలించక మానదని చెబుతుంది. అందుకనే సినిమానోవాలో హింస కూడా విస్తృతంగా కనిపిస్తుంది. కాని అది అమెరికా వెస్ట్రన్ చిత్రాలలో కనిపించే హింస కాదు. అహింస ఒక శిల్పంగా, సౌందర్యంగా చూపరు. అది ఒక వాస్తవ పరిస్థితి.

బ్రెజిల్ కొత్త సినిమా ఉధ్యమంలో డాక్యుమెంటరీలు ఉన్నాయి. అంతే కాదు డాక్యుమెంటరీ శైలిని కథాచిత్రాలకు విజయవంతంగా అన్వయించగలిగారు.

1964 వరకు సినిమానోవా ఉద్యమంగా సాపేక్షంగా, స్వేచ్చగా సాగిపోయింది. అధికార సంస్థలనుంచి ఆర్ధికంగా వెసులుబాటు కూడా లభిస్తుండేది. కాని ఆ ఏడు ఏప్రిల్ నెలలో మిలటరీ కుట్రవల్ల ఒకమాదిరి వామపక్షానికి చెందిన “గౌలాట్” ప్రభుతవం కూలిపోయింది. దాంతో సినిమానోవాకు అందుతున్న సహకారం నిలిచిపోయింది. సెన్సారు నిబంధనలు కఠినమయ్యాయి. సినిమా వ్యవహారాలు పోలీసులకు అప్పచెప్పారు. 1965 చివర్లో కొందరు సినిమా దర్శకులను నిర్బంధించారు.

ఐతే సినిమానోవా ఉద్యమం ఆగలేదు. ఆ ఉద్యమానికి సంబంధించిన కొందరు ఇబ్బందికరమైన, అభ్యంతరకరమైన పనులు చేస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్టు ఊరకుంది.

బ్రెజిల్ దర్శకులు తమ లక్ష్యాలకనుగుణంగా చిత్రాలు తీస్తూనే ఉన్నారు. మేధావుల గురించీ, బూర్జువా వ్యవస్థగురించీ చిత్రాలు తీశారు. మిలటరీ పాలనలో మేధావుల స్థితిగతులూ, వేదన “ఓడె సఫియా” అనే చిత్రంలో చిత్రించారు. సెన్సారువారు చాలా భాగం తొలగించినప్పటికీ ఆ చిత్రం ఎగుమతి విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ బ్రెజిల్ లో మాత్రం ఆ చిత్రం ఎంతో ఆసక్తిని, చర్చలనూ రేకెత్తించింది. గ్లోబర్ రోబా చిత్రం “టెర్రా యం” ట్రాన్స్ లో కూడా మేధావుల రాజకీయ, మానసిక స్థితిని వివరంగా చిత్రించాడు. ప్రభుత్వం ఆంక్షలు, సెన్సారు ఇబ్బందులు తప్పలేదు. ఐనా రోబా భయపడలేదు. తరువాత రోబా తీసిన “ఏంటోనినో దాస్ మార్టెస్” ఒక భయంకరమైన పిడివాద భావోద్రేక చిత్రం. దాని లక్ష్యం తక్షణ విప్లవం. ఆ చిత్రం తీయడమే ఎంతో ధైర్యం. 1969 లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఎన్నికయినందువల్ల మాత్రమే ఆ చిత్రాన్ని నిషేధించలేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. విప్లవం ప్రబోధించే సినిమానోవా చిత్రాలు బ్రెజిల్ నుండి రహస్యంగా సరిహద్దులు దాటేవి.

అధికారపక్ష వ్యతిరేకత, ఆర్ధిక అసమానతలు సామాన్య ప్రజల దైన్యం, అధికారుల దురాగతాలు చిత్రాల్లో స్పష్టంగా చూపారు. ఈ చిత్రాల్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించగలుగుతున్నారు. ఈ ఉద్యమంలో ముఖ్యుడైన రోబా తమ చిత్రాలు “పేలుడు పదార్థాల్లా విప్లవానికి దోహదం చేయడం కోసం” చిత్రాలు తీస్తున్నామని బాహాటంగా ప్రకటించాడు.

కొన్ని చిత్రాలు పాలకవర్గంపై చేసిన విఫల తిరుగుబాట్లని కూడా చూపాయి. ఐనా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఈ విషయాన్ని “సారా చెని” అనే విమర్శకుడు ఇలా వివరించారు. “సినిమానోవా చిత్రాలను నిరోధించి లేదా నిషేధించి అంతర్జాతీయంగా అపకీర్తి పాలుకావడం కన్నా సినిమాలని అనుమతించడమే తక్కువ నష్టం అని ప్రభుత్వం భావిస్తుంది. పైగా అధికారులు తాము గొప్ప ప్రజాస్వామ్యవాదులమని ఫోజు పెట్టవచ్చు. అంతేకాకుండా ఇందుకు అనుబంధంగా మరికొన్ని కారణాలున్నాయి. ప్రభుత్వ వర్గాల మధ్య వైరుధ్యాలు కూడా ఒక కారణమె”

సినిమా నొవా చిత్రాలు కళపట్ల, జీవితం పట్ల నిస్పష్టమైన నిజాయితీ చూపించింది. వారి సినిమాల్లో ప్రజలు సజీవంగా కనిపిస్తారు. తెలుగు సినిమా హీరోలుగా కాని, తిరుగులేని విలన్లుగా కాని చిత్రీకరించబడలేదు. మానవతావాద పూరితంగానూ, సమాజంలో చైతన్యం తీసుకువచ్చే విధంగానూ , కథావస్తువు ఉంటుంది. సినిమానోవా ప్రజల కోసం తీసిన సినిమాగా నిరూపితమైంది. ధైర్యసాహసాలతో పాలకవ్యవస్థకి వ్యతిరేకంగా సినిమా తీసి మార్గదర్శకులైన నిర్మాతలను , కళాకారులను బ్రెజిల్ ప్రజలు మరచిపోరు. అంతర్జాతీయంగా ఆ సినిమాకి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.

One Response
  1. ramnarsimha June 24, 2010 /