మాది గుంటూరు జిల్లాలో తాటపూడి అనే చిన్న పల్లెటూరు. అమ్మ తిరుపతమ్మ, నాన్న రాఘవయ్య, అన్నయ్య వెంకట్రావు. ఇదీ మా కుటుంబం.
మాది మధ్యతరగతి రైతు కుటుంబం. తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులేం లేవు. అమ్మ,నాన్నలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు. సాధారణంగా అందరూ కష్టపడి చదువుకుంటారు. కానీ, మేము చదువుకోవటానికి కష్టపడాల్సి వచ్చింది.!! ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్ వరకూ మా ఊళ్ళోనే ఉన్నా, హైస్కూల్ చదువు కోసం పక్కనే ఉన్న మురికిపూడి వెళ్ళాల్సి వచ్చింది. కొంతకాలం కాలినడక, మరికొంతకాలం సైకిల్ ప్రయాణం.!!
ఉదయం క్యారేజీ తీసుకెళ్తే, మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేది మరుసటి రోజు ఉదయమే. సాయంత్రం వరకూ స్కూలు, రాత్రి ట్యూషన్ – మధ్యలో ఖాళీ దొరికితే లైబ్రరీ. హైస్కూల్ వరకూ చదువు బాగానే సాగింది.
టీనేజ్ లో మనల్ని ప్రభావితం చేసే అంశాలే మన జీవితగమనాన్ని నిర్దేశిస్తాయంటారు. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ జీవరత్నం గారబ్బాయి బుల్లిబాబు నా క్లాస్ మేట్. తెలిసీతెలియని వయసులో సినిమా అనే బీజాక్షరాలు నాలో నాటుకోవడానికి మొదటి కారకుడిగా అతన్నే చెప్పుకోవాలి. వాళ్ళ మేనమామ రాజారెడ్డి హైదరాబాద్‍లో సినీపరిశ్రమ వేళ్ళూనకముందునుంచే ప్రయత్నాలు చేస్తుండేవాడని చెవిలో ఇల్లు కట్టుకొని చెబుతుండేవాడు. అలా ప్రారంభమైన ఇంటరెస్టు తప్పటడుగులేసుకుంటూ కథల్లోకి, కవితల్లోకి, నవలల్లోకి ఎంటరై నాటకాల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చదువు తడబడి అత్తెసరు మార్కులతో స్కూల్ ఫైనల్ అయిందనిచాను. అసలు ప్రస్థానం ఇప్పుడే ఆరంభం అయింది.
అప్పుడే రెక్కలొచ్చిన పక్షులు ఎగరడంలో ఉన్న ఆనందాన్ని, స్వేచ్చలో ఉన్న అనుభూతిని ఫీలయినట్టే అనిపించింది కాలేజ్ కి వెళ్ళిన కొత్తలో. మా సినిమా వాళ్ళ మీద కొన్ని జోకులున్నాయిలెండి. వాటిలో ఒకటి డాక్టరవ్వబోయి యాక్టరయ్యాననేది. జోకనుకోకపోతే నేను నిజంగానే డాక్టర్‍ని అవుదామనుకుని డైరెక్టర్‍ని అయ్యాను – ఒట్టండీ.. దానికి నిదర్శనం నేను ఇంటర్ లో బైపీసీ తీసుకోవడమే. ఇంక అసలు విషయానికొస్తే ఇక్కడినుంచీ చదువేమో బ్యాక్ బెంచీకి, సినిమా ఫ్రంట్ సీటుకీ షిఫ్టయ్యాయి. మా ఇంట్లో వాళ్ళకి నా పరిస్థితి అర్థమయింది. చాలా తర్జన భర్జనల తర్వాత నా మకాం మద్రాసుకి నా ప్రస్థానం సినిమాల్లోకి. దీనివెనుక సోదరతుల్యులు శ్రేయోభిలాషి కందిమల్ల నారాయణమూర్తి గారి ప్రోత్సాహం, అన్నయ్య వెంకట్రావు సహకారం, ఇంకా పెదనాన్న కొడుకు స్వాములు అన్నయ్య సహకారం ఎంతో ఉంది.
ఆరోజు మార్చి 25, 1984 – ఎర్రబస్సు కాదుగానీ ఆర్టీసీ లోనే మద్రాసు ప్రయాణం. అదేమో మహానగరం, మనదేమో మిడిమిడి జ్ఞానం. అందుకే ముందు జాగ్రత్తగా మాఊరి వాస్తవ్యుడు, మాకు సీనియర్ ఇంటూరి రామారావు రూమ్‍లో ఆరంగేట్రం. ఊర్లోని డ్రీములకీ ఇక్కడి ప్రాక్టికాలిటీకీ పొంతన కుదరలా. అభిమాన దర్శకుడు రాఘవేంద్రరావు గారు స్వాగతం పలుకుతారనుకుంటే అక్కడ నోవేకెన్సీ. ఓ ఫైనాన్షియర్ దగ్గర పనిచేసే సూర్యనారాయణ గారేమో నాకు రిఫరెన్సు, రికమండేషనూ. ఐనా పనికాలేదు. అప్పుడు కలల్లోంచి వాస్తవంలోకొచ్చి మనం కావాలనుకున్నది మనకు దొరకనప్పుడు దొరికినదాన్ని మనకనుకూలంగా మార్చుకోవాలనుకున్నా.
టి.కృష్ణ గారు నేటిభారతం తో వెలుగులోకొచ్చిన కొత్త. కే నారాయణమూర్తి గారితో ఆయన పరిచయం పరిషత్తుల కాలం నాటిది. ‘దేశంలో దొంగలు పడ్డారు’ టైమ్‍లో కలిస్తే నెక్స్ట్ పిక్చర్ కి పెట్టుకుంటానని ప్రామిస్ చేశారు. అలా ‘వందేమాతరం’ అసిస్టెంట్ డైరెక్టర్ గా నా మొదటి సినిమా. సైమల్టేనియస్ గా ‘దేవాలయం’ కి కూడా పనిచేశాను. అప్పుడక్కడ ముత్యాల సుబ్బయ్యగారు కోడైరెక్టర్. పని నేర్చుకోవడానికి ఆయన సహకారం నాకు బాగా హెల్ప్ అయింది. ‘రేపటి పౌరులు’ నా మూడో చిత్రం. అప్రెంటిస్ నుంచి అసోసియేట్‍గా ప్రమోషనూ.
అంతా సవ్యంగా ఉందనుకునేలోపు అపశృతి టి.కృష్ణ గారి మరణం. నాకే కాదు – తెలుగు సినిమా ఇండస్ట్రీకే అది తీరని లోటు. డిప్రెషను, ఏమి చేయాలో పాలుపోని స్థితి. అదే పరిస్థితి ఆయన మిత్రుడు, పార్టనర్ అయిన పోకూరి బాబూరావు గారిది కూడా. కష్టాల్లో ఉన్న ఇద్దరం ఒకరికొకరు తోడు. అప్పుడే ఈతరం ఫిలింస్ లో పరచూరి బ్రదర్స్ డైరెక్షన్‍లో ‘ప్రజాస్వామ్యం’ ఆరంభం. అక్కడినుంచి ఈతరం ఫిలింస్‍లో కోడైరెక్టర్ నేనే. కొన్ని చిత్రాలకి ముప్పలనేని శివ, నేను ఇద్దరం కలసి పనిచేశాం. గ్యాపొచ్చినప్పుడల్లా బయటి దర్శకుల దగ్గర కొన్ని చిత్రాలకు పనిచేశాను.
బి. గోపాల్ గారి దగ్గర ‘అశ్వత్థామ’, ‘స్టేట్ రౌడీ’, ‘చినరాయుడు’ ఇంకా ఐవీ శశి దగ్గర ‘మా ఆయన బంగారం’, ఏ మోహనగాంధీ గారి దగ్గర ‘కర్తవ్యం’ అలా చేసినవే. అప్పట్లోనే బాబూరావు గారు తన మేనకోడలు సునీతతో పెళ్ళి గురించిన ప్రపోజల్ చెప్పడం, చూడ్డం, నచ్చటం వెంటనే పెళ్ళి జరిగిపోయాయి. ముత్యాల సుబ్బయ్య గారితో కలిసి ‘మామగారు’ అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడే ఎడిటర్ మోహన్ గారితో పరిచయం. ఆ సినిమాలో ఒక నైట్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన నన్ను పిలిచి “ఫుల్ మూన్ చాలా బాగుంది. మాష్టారుతో చెప్పి మూన్ కూడా ఫ్రేమ్ లో వచ్చేలా కంపోజ్ చెయ్య” మని నాతో చెప్పారు. నేను “అదేంటి సార్, ఇది అమావాస్య రోజు వచ్చే దీపావళి సాంగ్ కదా. దీనిలో మూన్ ఎలా కంపోజ్ చేస్తాం” అన్నాను. ఆయన నవ్వేసి “నీకో చిన్న టెస్ట్ పెట్టానయ్యా” అన్నారు. అలా ఆ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు నాప్రవర్తన, పనితీరు గమనించి “నిన్ను నా బ్యానరులో డైరెక్టర్ చేస్తానయ్యా” అని ప్రామిస్ చేశారు.
మళ్ళీ బి.గోపాల్ గారి దగ్గర పని చేయడానికెళ్ళాను. అప్పుడే వెంకటేష్ బాబు గారితో పరిచయం. ఆయన నా వర్క్ చూసి ఇంప్రెస్ అయి రామానాయుడు గారితో చెప్పడంతో ఆయన నాకు కబురు చేశారు. “నీ గురించి చాలా విన్నానయ్యా, మనిద్దరికీ అండర్‍స్టాండింగ్ రావడానికి నా బ్యానర్ లో ఓ పిక్చర్ కి కోడైరెక్టర్ గా పనిచెయ్యి. నెక్స్ట్ పిక్చర్ కి నిన్ను డైరెక్టర్ ని చేస్తాను” అని చెప్పారు. అలా ‘పరువు ప్రతిష్ట’ సినిమాకి పనిచేశాను. గుహనాధన్ గారు దానికి డైరెక్టర్. అలాగే ఆ సినిమా హిట్టవడం, నా వర్క్ నాయుడుగారికి నచ్చడం, ఆయన “సబ్జెక్ట్ చూసుకోవయ్యా” అని చెప్పడం జరిగిపోయాయి.
నేను ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఎడిటర్ మోహన్ గారి దగ్గర్నుండి కబురు. ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో ‘పల్నాటి పౌరుషం’ అనే సినిమాకి పనిచెయ్యమని. ఆయన నెక్స్ట్ పిక్చర్ ప్రామిస్ చేశారు. కానీ ఆ సినిమా దెబ్బతినడంతో ఆయన అప్‍సెట్ అయ్యారు. దాంతో నేను కొంతకాలం ఆయన్ని ఫేస్ చెయ్యలేకపోయాను. అసలే ఇప్పుడు సినిమా దెబ్బతింది – దానికి తగ్గట్టు కొత్త డైరెక్టర్ తో సినిమా అంటే కష్టం గదాని. కాని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి నాకు కబురు చేసి సబ్జెక్ట్ చూడమన్నారు. ఈ విషయంలో వాళ్ళ పెద్దబ్బాయి రాజా నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఆయన కూడా ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడనుకోండి. అలా వెతికి పట్టుకున్నదే ‘శుభమస్తు’ సబ్జెక్ట్.
రెండు పెద్ద బ్యానర్లు – ఇద్దరు మంచి నిర్మాతల మధ్య నా మొదటి సినిమా అలా దోబూచులాడింది. మోహన్ గారి సబ్జెక్ట్ ఓకే అవ్వడంతో విషయం నాయుడుగారికి చెప్పాను. ఆయన “ఏంటయ్యా నాబ్యానర్ లో డైరెక్టర్ ని చేస్తానంటే ఇంతవరకూ ఎదురు చెప్పినవాళ్ళు లేరు. నువ్వేమో వేరే ప్రపోజల్ గురించి చెబుతున్నావు. నీ ఇష్టం, ఆలోచించుకో” అన్నారు. సబ్జెక్ట్ వేరేది నచ్చడంతో ఆయనకి సారీ చెప్పి ‘శుభమస్తు’ మొదలుపెట్టాను. జగపతిబాబుగారు హీరో. ఆమని, ఇంద్రజ హీరోయిన్స్. దాసరిగారు, సత్యనారాయణ గారు కీ రోల్స్. అలా ప్రారంభమైన నా మొదటి సినిమా ప్రస్థానం ఆ సినిమా హిట్‍తో సక్సెస్‍ఫుల్‍గా ‘శుభాకాంక్షలు’ , ‘సుస్వాగతం’ , ‘సూర్యవంశం’ లాంటి చిత్రాలతో కొనసాగింది. ఆ తర్వాత కెరీర్‍లో ఒడిదుడుకులు. ‘సుప్రభాతం’ , ‘స్వప్నలోకం’ అనుకున్న ఫలితాలనివ్వలేదు. పడిన కెరటం మళ్ళీ లేస్తుంది. అలా పుంజుకుని సొంత బ్యానర్ స్థాపించి ‘నీ తోడు కావాలి’ అనే చిత్రం చేశాను. అది బాక్సాఫీస్ సక్సెస్ సాధించలేకపోయినా నాలో కొంత ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఆ తర్వాత రవితేజ హీరోగా సొంత బ్యానర్ గుడ్‍విల్ సినిమాలో ‘దొంగోడు’ సక్సెస్. ఇప్పుడు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో పవన్ కల్యాణ్ హీరోగా ‘అన్నవరం’ సక్సెస్. చేసింది మొత్తం 9 సినిమాలు – వాటిలో 6 సూపర్ హిట్స్. నెక్స్ట్ పిక్చర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నాకు పెద్ద టార్గెట్స్ ఏమీలేవు. దర్శకుడిగా కావాలనుకున్నాను – అయ్యాను. ఇలా మీరు ఆదరిస్తున్నంత కాలం నాకు ఓపికున్నంత కాలం ఫీల్డ్ లో కొనసాగుతూ మంచి చిత్రాలు చేయాలన్నదే నా తపన – ఎందుకంటే నాకు తిండితిప్పలు, నీళ్ళు, నిద్ర, విశ్రాంతి – సర్వం సినిమాలే. ఇలా పత్రిక ద్వారా నా గతాన్ని మీతో కలసి పంచుకునే అవకాశాన్ని కల్పించిన ఎడిటర్ గారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
కౌముది సౌజన్యంతో–కిరణ్ ప్రభ
ఇంటర్వ్యూ చేసిన తేది: ఏప్రిల్ 2007
ఈ వ్యాసాలను యూనికోడ్ లోకి మార్చడంలో సహాయం చేస్తున్న నవతరంగం సభ్యుడు స్నేహిత్ కి ధన్యవాదాలు.
ఫేస్ బుక్ కామెంట్స్