Menu

The Birds (1963)

అదొక ఆలోచన.
ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహే భయంకరంగా ఉంది.
ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహే కొందరికి ’అబ్సర్డ్’ అనిపించొచ్చు కూడా.
ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహకి దృశ్య రూపం ఇస్తేమాత్రం – ’ది బర్డ్స్’ సినిమా ఔతుంది.
సినిమా ముగిసే సరికి – నాకు బాల్కనీలోకి వెళ్ళాలంటే కూడా భయమేసింది – మా బాల్కనీకి పావురాళ్ళ తాకిడి ఎక్కువ మరి!!

కథ: సాన్ ఫ్రాన్సిస్కో నుండి మెలానీ డేనియల్స్ అన్న యువతి – అక్కడ తనకి పరిచయమైన మిచ్ బ్రెన్నర్ చెల్లెలికి – ’లవ్ బర్డ్స్’ కానుకివ్వాలని వాటిని తీసుకుని -అక్కడికి దగ్గర్లోని బొడెగా బే అన్న చిన్న, ప్రశాంతమైన ఊరుకి వస్తుంది. వచ్చిన కాసేపట్లోనే మిచ్ వాళ్ళింటి నుండి పడవలో పట్టణం అవతలి ఒడ్డుకు వస్తూంటే – ఒక పక్షి ఆమె తలపై పొడిచి వెళ్ళిపోతుంది. అది చూసిన మిచ్ ఆమె గాయం శుభ్రం చేశాక, ఆమె ఒక స్నేహితురాలింటికి వెళ్తుంది. అక్కడ కూడా కాసేపటి తరువాత తలుపు చప్పుడైతే – చూస్తే, ఒక చనిపోయిన పక్షి పడి ఉంటుంది. ఆతరువాత – మిచ్ చెల్లెలు కాథీ పుట్టినరోజు వేడుకలో పక్షుల గుంపొకటి స్కూలు పిల్లలపై దాడి చేస్తుంది. మరో పక్షుల దాడిలో – మిచ్ తల్లి స్నేహితుడు దారుణంగా మరణిస్తాడు. మరో దాడిలో పెద్ద అగ్ని ప్రమాదమే జరుగుతుంది – అదీ పెట్రోల్ టాంకర్ వద్ద. మరోసారి..మరోసారి… ఇలాంటి దాడులు రెండు మూడయ్యాక – అందరిలోనూ భయం…ఎటు చూసినా భీభత్సం. పక్షులెలా దాడులు చేస్తాయి మనుషులపై? ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తున్నాయి? ఎందుకింత పగబట్టాయి?- అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఎవరికీ జవాబులు తెలియవు. (పక్షులంటే – ఈసినిమాలో ప్రధానంగా కాకులు, పావురాలు)
-ఈ పక్షుల దాడుల పర్యవసానాలేమిటి? చివరికేమౌతుంది? ఇదీ ఈ చిత్రం!

వందల వేల సంఖ్యలో పక్షులు – పక్షుల ’నటన’ – వాటి మద్య ఉన్న క్రమశిక్షణ….అద్భుతం. పక్షుల కళ్ళల్లో విలనీ – వికటాట్టహాసం కూడా స్పష్టంగా కనపడ్డది. ఇన్ని వేల పక్షులతో పని చేయించడం ఎంత క్లిష్టమైన పనో! సత్యజిత్ రాయ్ తన ’our films, their films’ వ్యాసాల్లో ఈ దృశ్యాల చిత్రీకరణ నాటి అనుభవాల గురించే కథగా ప్రస్తావించాడు. సినిమా చూస్తూ ఉంటే ఆ సంగతి గుర్తొచ్చింది. ఏమైనా – పక్షుల చేత నటింపజేసిన ఆ టీం నైపుణ్యానికి హ్యాట్సాఫ్!! ఐనా – వీళ్ళది మరీ చోద్యంకాకుంటే – ఇందులో కూడా ముద్దు సీన్ ఒకటి పెట్టేయగలిగారు – మళ్ళీ మన సినిమాలలో పాటలూ-డ్యాన్సులూ గురించి అనుకుంటాం!! 🙂

ఇక, నటీనటుల సంగతికొద్దాం. పక్షుల కనుసన్నల్లో, వాటికెక్కడ కోపం తెప్పిస్తానో అన్నంత అతిజాగ్రత్తగా నడిచే దృశ్యాల్లో రాడ్ టేలర్ (మిచ్ బ్రెన్నర్ – పాత్రధారి) అద్భుతంగా చేశాడు.

ఇక – మెలనీ పాత్రధారి టిప్పీ హెడ్రెన్ – ఈ చిత్రంలో రకరకాల భావోద్వేగాలు నిండిన పాత్ర ఇదొక్కటే అనుకుంటా – సినిమా మొదటి కొద్ది నిముషాలు – డబ్బున్న అహంకారం గల యువతి – తరువాత మిచ్ ప్రేయసి – ఆపై ఈ పక్షుల దాడుల్లో ఇరుక్కున్నా కూడా మిచ్ తో కలిసి జనాన్ని కాపాడ్డంలో పెద్ద పాత్ర వహించిన ధైర్యవంతురాలు – మిచ్ తల్లికి, చెల్లికి వాళ్ళు ఈ సంఘటనలతో షాక్ లో ఉన్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు పరిణతి-చివరగా తానే పక్షుల దాడికి గురై తీవ్రంగా గాయపడ్డప్పటి దృశ్యాల్లో – ఆ బేలతనం, హిస్టీరికల్ చూపులు – చాలా బాగా చేసింది. ఇంతకీ ఇదావిడ తొలి చిత్రమట!!!! పేర్లు తెల్సుకోవడం కోసం వికీ ఆర్టికిల్ చూస్తే తెలిసింది.

ఆహా – హారర్ పరంగా – ఈసినిమా తరహాలో నేను ఇంకోటి చూసింది లేదు ఇప్పటిదాకా. హారర్ సినిమాలు అనగానే ఈమధ్య కామెడీ చిత్రాల్లా తోస్తున్నాయి నాకు: ఆ నేపథ్య సంగీతమూ – తెరపై చిందే రక్తమూ – జనాల కేకలూ – చూసీ చూసీ బోరు కొట్టేసింది! విచిత్రం ఏమిటంటే – ఈ చిత్రంలో ఆ మూడూ లేవు!! కేకలూ-రక్తమూ కొంతమేరకు ఉన్నాయి కానీ, ఆ చప్పుళ్ళవల్ల మనకి వెన్నులో చలి పుట్టదు. పక్షుల దాడి చూస్తే పుడుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ – ఇక వేరే విషయం మనసుకి తట్టడం కష్టం! పక్షులు – పక్షులు-పక్షులు – వాటి ఆలోచనలే! ఇక నాలాంటి వాళ్ళకైతే – బైట పిచ్చుక కిచకిచ వినబడ్డా ఉలికిపాటే!

సాధారణంగా -ఇటీవలి కాలంలో ’హారర్’ చిత్రాలు చూసినప్పుడు భయపడినా, సినిమా అయ్యేసరికి – అబ్బచా! అనుకుని నవ్వుకునే సందర్భాలు ఎక్కువ. కొన్నైతే – చూస్తున్నప్పుడే పగలబడి నవ్వేసాను కూడానూ! కానీ, ఈచిత్రం మాత్రం – ఉత్కంఠ నిండిన భయంతో – ఆద్యంతం ఆపకుండా చూశాను. డీవీడీల్లో చూసేటప్పుడు కనీసం రెండు బ్రేకులు తీసుకునే నేను -ఈసినిమా అసలు ఆపకుండా చూసేశాను!

You are missing some experience if you miss watching this movie!

అన్నట్లు, ఇందాకట్నుంచి చెప్పనేలేదు కదూ – ఇది Daphne Du Maurier కథ ఆధారంగా తీయబడ్డ హిచ్కాక్ చిత్రం!!

8 Comments
  1. Vamsi K Kumar May 14, 2010 /
  2. rajesh May 16, 2010 /
  3. mohanramprasad May 16, 2010 /
  4. msk May 18, 2010 /
  5. srikanth June 3, 2010 /
  6. srikanth June 6, 2010 /
  7. maggi December 29, 2010 /