Menu

మొదటి సినిమా – ముత్యాల సుబ్బయ్య

తెలుగు సినిమా దర్శకుల్లో చక్కటి కుటుంబ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ముత్యాల సుబ్బయ్యగారు దాదాపు 50 సినిమాలకి దర్శకత్వం వహిస్తే 75 శాతం హిట్ సినిమాలే. ఒకే నిర్మాతకి ఐదారు సినిమాలు తీసి నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుబ్బయ్యగారు. చిరంజీవి తో ‘హిట్లర్’ , ‘అన్నయ్య’ సినిమాలూ ; వెంకటేశ్ తో ‘పవిత్రబంధం’ , ‘పెళ్ళి చేసుకుందాం’ ; బాలక్రిష్ణ తో ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’ , ‘పవిత్రప్రేమ’ , ‘కృష్ణబాబు’ ; ఏ హీరో ఇమేజీ లేకుండా కేవలం కథా బలంతో కలికాలం, అమ్మాయి కాపురం, సగటు మనిషి లాంటి సినిమాలు దర్శకుడిగా రూపొందించిన సుబ్బయ్యగారు – ‘అరుణ కిరణం’ , ‘ఎర్ర మందారం’ , ‘అమ్మాయి కాపురం’ , ‘పవిత్రబంధం’ చిత్రాలకు నంది అవార్డులనందుకున్నారు. ‘కలికాలం’ చిత్రానికి కళావాహినీ అవార్డు, 2004 లో కె.వి.రెడ్డిగారి అవార్డు, పి.పుల్లయ్యగారి అవార్డు కూడా అందుకున్నారు.

నా మొదటి సినిమా గురించి చెప్పాలంటే దాదాపు 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మా స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని కె.బిట్రగుంట. నాన్నగారి పేరు ముత్యాల శంకరయ్య , అమ్మ పేరు ముత్యాల శేషమ్మ. మాది దిగువ మధ్య తరగతి వ్యవసాయాధారిత కుటుంబం. నాకు 10 సంవత్సరాల వయసు వచ్చేవరకూ ఆ ఊళ్ళోనే ఉన్నాను. తరువాత నాన్నగారి వ్యవసాయం రీత్యా నెల్లూరు దగ్గరలోని పార్లపూడి అనే ఊరికి మారాము. ఇంట్లో నేనే పెద్ద వాడిని. నా తరువాత ఇద్దరు చెల్లెళ్ళూ, ఒక తమ్ముడు.. నా హైస్కూలు చదువూ, కాలేజీ అంతా ఈ ఊరునుంచే సాగింది. పి.యూ.సి అయ్యాక, బి.కామ్ లో చేరాను. మాఊరికి పక్కనే ఉన్న ఇడవలూరులో కాలేజీ. రోజూ సైకిల్ మీద వెళ్ళి వస్తుండేవాడిని. హైస్కూల్లో ఉండగానే అంటే 8 వ తరగతి నుంచే నాటకాలమీద ఆసక్తి ఉండేది.

కాలేజీకి వచ్చే సరికి అది పరాకాష్టకి చేరుకుంది. కాలేజీ పూర్తయే సరికి దాదాపు 100 నాటకాల్లో నటించడం, ఉత్తమనటుడుగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు తెచ్చుకోవడం జరిగింది. ఊళ్ళో ఉన్న కుర్రవాళ్ళతో కలిసి రవీంద్ర ఆర్ట్ థియేటర్స్ అని ఒక నాటక సమాజాన్ని స్థాపించి చుట్టుపక్కల జరిగే పరిషత్ నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉండేవాళ్ళం. వీటన్నింటితోనూ చదువులో వెనకబడేవాడిని. కాలేజీలో రెండేళ్ళు ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా పనిచేశాను కానీ డిగ్రీ పాసవడం మాత్రం జస్ట్ ఏవరేజ్ మార్కులతోనే..

డిగ్రీ అయ్యాక ఏం చెయ్యాలి? నాకొచ్చిన మార్కులకి ఉద్యోగం వచ్చే సూచనలేమీ కనిపించలేదు. ఏ ఉద్యోగానికీ, అప్లై కూడా చెయ్యలేదు. ఈ లోగా ఫ్రెండ్స్ అందరూ ‘నాటకాల్లో ఇంత అనుభవం ఉందిగదా.. సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదూ..’ అని ప్రోత్సహించారు.

అమ్మా, నాన్నలకి చదువులూ, ఉద్యోగాలూ ఎక్కువ తెలీదు కాబట్టి నా భవిష్యత్తు గురించిన నిర్ణయాన్ని నాకే వదిలేశారు.

మొత్తానికి స్నేహితుల సలహా నా మీద చాలా ప్రభావాన్ని చూపించింది. సినిమాల్లోకి ఎలా వెళ్ళాలి? మా ఊరిలో కొంతమందికి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళతో బంధుత్వం ఉండేది. రాజేంద్ర కుమార్ అనే కళాదర్శకుడికీ, సీనియర్ కమేడియన్ రమణారెడ్డి గారికీ, వారి బంధువూ అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ ఐన ఎం.ఎస్.కోటారెడ్డి గారికీ మా ఊళ్ళో బంధువులున్నారు. వీళ్ళే కాకుండా నా స్నేహితుల కుటుంబసభ్యులకి మద్రాసులో హోటల్ నవయుగ ( సవేరా ఎదురుగుండా ఉండేది ) , ద్వారకా లాడ్జి ఉండేవి. ఏలాగతేనేం ఈ లింకులన్నీ ఉపయోగించి మద్రాసులో అడుగుపెట్టా 1973 ప్రాంతాల్లో. అప్పటికి రాజేంద్ర కుమార్ గారు ఒక సినిమాకి పనిచేస్తున్నారు. మానాపురం అప్పారావు గారి దర్శకత్వంలో సావిత్రి, హరనాథ్ తారాగణంతో మొదలైన సినిమాకి అప్రెంటీస్ గా చేరాను. సినిమా మొదలన కొద్ది రోజులకే ఆగిపోయింది! ఈ విధంగా సినిమా వాతావరణాన్ని నాకు పరిచయం చేసిన మొదటి సినిమా పేరు పెట్టుకోకుండానే మధ్యలో ఆగిపోయింది..!

నేనూ రోడ్డున పడ్డాను. ఎలాగైనా సినీఫీల్డ్ లోనే స్థిరపడాలని నిర్నయించుకున్నాను కాబట్టి, మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించి ఎలాగైతేనేం అక్కినేని సంజీవిగారి దర్శకత్వంలో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మిస్తున్న సిసింద్రీ చిట్టిబాబు సినిమాకి అప్రెంటీస్‍గా కుదురుకోగలిగాను. తెర మీద నాపేరు ‘ఎమ్. సుబ్బయ్య’ గా చూసుకోగలిగిన మొదటి సినిమా ‘సిసింద్రీ చిట్టిబాబు’ అని చెప్పుకోవచ్చు.

తరువాత సుప్రియా హోటల్ రెడ్డిగారి సలహా, రికమెండేషన్ మేరకు అప్పటికే బడిపంతులు లాంటి సూపర్ హిట్స్ తో మంచి పేరులో ఉన్న పి.చంద్రశేఖరరెడ్డి గారి వద్ద తల్లీకొడుకులు సినిమాకి అప్రెంటీస్‍గా చేరడంతో నా సినీ జీవితానికి ఒక మార్గం దొరికింది. పి.సి.రెడ్డి గారి వద్దనే దాదాపు 10 సినిమాల వరకూ పనిచేశాను. ఆయన వద్దనే అప్రెంటీస్ నుంచీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచీ, కోడైరెక్టర్ దాకా ఎదిగాను. ఆ విధంగా 6-7 సంవత్సరాలు గడిచాయి. మధ్యలో కొంతకాలం గాప్ వస్తే మృణాల్‍సేన్ గారి “ఒక ఊరి కథ” కి ( దీన్ని సుప్రియా హోటెల్ పరంధామరెడ్డి గారు నిర్మించారు ) కో-డైరెక్టర్ గా పనిచేసి మళ్ళీ పి.సి.రెడ్డి గారి వద్దకి వచ్చేశాను.

Your browser may not support display of this image.

ఆయనప్పుడు కృష్ణంరాజు, శ్రీధర్‍లతో “రాముడు – రంగడు” చేస్తున్నారు. దానికీ నేనే కోడైరెక్టర్. ఆ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్‍గా పని చేస్తున్న పొన్నతోట రఘురాం గారు ఒకరోజు “సుబ్బయ్యా… నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైంది. ఏదైనా సొంతంగా సినిమా తియ్యాలని ఉంది” అన్నారు. ఎన్నాళ్ళుగానో నేననుకుంటున్న ఒక కథ థ్రెడ్ చెప్పాను. 18 ఏళ్ళ అమ్మాయి మెడలో 8 ఏళ్ళ అబ్బాయి అనుకోకుండా తాళి కట్టడం.. తద్వారా జరిగే పరిణామాలూ. కథ వినగానే రఘురాం గారు “ చేస్తే ఇలాంటి ఆఫ్ బీట్ సినిమానే చెయ్యాలి.. లెటజ్ గో ఎహెడ్ ” అన్నారు. ఐతే నేను చెప్పాను “ఈ సినిమా కనుక సూపర్ హిట్ చెయ్యాలంటే బాలకృష్ణ , వాణిశ్రీ కాంబినేషన్‍లోనే చెయ్యాలి ” అని. కానీ ఆయన అనుకున్న బడ్జెట్‍కి ఇద్దరూ అందుబాటులో లేరు. ఐనా కథ వదులుకోవాలని లేదు. ఏ ఇమేజీ లేని కొత్తవాళ్ళతో తీద్దామనుకుని అప్పలాచార్య గారిని మాటలు వ్రాయడానికీ, సత్యం గారిని మ్యూజిక్ డైరెక్షన్‍కీ ఎన్నుకుని ఏర్పాట్లలో తీవ్రంగా మునిగిపోయాం. ఈ లోగా రఘురాం గారు ఫైనాన్సింగ్ కోసమని ధర్మవరానికి చెందిన అచ్చప్ప గారిని కలవడం, కథ విన్నాక ఆయనా సినిమాలో భాగస్వామిగా చేరతాననడం జరిగింది. ఐతే ఈ కథతో సినిమా సేఫ్ ప్రోజెక్ట్ కావాలంటే ప్రధాన పాత్రలకైనా పేరున్న వాళ్ళని తీసుకోవాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. నాకేమో వాణిశ్రీ, బాలకృష్ణ కానప్పుడు కొత్తవారితోనే చెయ్యాలని అభిప్రాయం. అప్పటికే సినిమా ప్రయత్నాలు చాలా దూరం వచ్చాయి. ఆ పరిస్థితిలో నేను కొంత రాజీపడి, హీరోయిన్ పాత్రకి మాధవిని, హీరో పాత్రకి రాజేంద్ర ప్రసాద్‍నీ ( అప్పటికి తను స్నేహం లో మాత్రమే చేసి ఉన్నాడు ) తీసుకున్నాం.

షూటింగు అంతా రాజమండ్రి దగ్గరే మొత్తం 20 రోజులలోగా ముగిసింది. దర్శకుడిగా నా మొదటి సినిమా అది ‘మూడు ముళ్ళ బంధం’. హీరోయిన్ పెళ్ళి పీటల మీద ఉండగా, పెళ్ళి కొడుకు చనిపోతాడు. అందరూ హీరోయిన్ నష్టజాతకురాలు అంటూ నిందిస్తారు. సవతి తల్లి కూడా శాపనార్ధాలు పెడుతుంది.

ఇదంతా చూస్తున్న 8 సంవత్సరాల కుర్రాడికి ‘పాపం.. ఈ అమ్మాయిని అందరూ తిడుతున్నారు. నేనే వెళ్ళి తాళి కడితే బావుంటుంది కదా.. ఆటల్లో బొమ్మల పెళ్ళిళ్ళు ఎన్ని సార్లు చెయ్యలేదూ?’ అనుకుని తనకంటే 10 సంవత్సరాలు పెద్దదైన హీరోయిన్‍ మెడలో తాళి కడతాడు. ఆ తరువాత ఆ కుర్రాడు పెద్దవాడవడమూ, అతను మరో అమ్మాయిని ప్రేమించడమూ.. ఇలా నడుస్తుందా కథ.

సెన్సార్‍కి వెళ్ళినప్పుడు సినిమా ప్రివ్యూ ముగిసిన 3 గంటల వరకూ సెన్సార్ ఆఫీసర్లు ఎవరూ థియేటర్ లోంచి బయటికి రాలేదు. మాకేమీ అర్థం కాలేదు.. మూడు గంటల తర్వాత మమ్మల్ని లోనికి పిలిచి

“ నీకెంత ధైర్యమయ్యా ఈ కథని సినిమాగా తియ్యడానికి? ఎనిమిదేళ్ళ కుర్రాడేమిటీ.. పద్దెనిమిదేళ్ళ అమ్మాయికి తాళి కట్టడమేమిటీ.. ఈ సినిమాని బాన్ చెయ్యాలసలు ” అన్నారు.

“ఎందుకు సార్? ” అన్నాను.

“ శారదా యాక్ట్ ప్రకారం బాల్య వివాహాలు నేరం.. వాటిని సినిమాల్లో ఎంకరేజ్ చెయ్యకూడదు ”

“ ఇది బాల్య వివాహం ఎలా ఔతుందండీ.. కుర్రాడు చిన్నవాడే కానీ, అమ్మాయి పెద్దదే కదా..! ” అని నా వాదన.

చివరికెలాగైతేనేం సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ‘మూడు ముళ్ళ బంధం’ దర్శకుడిగా నా మొదటి సినిమా!! ప్రివ్యూ చూసిన సినీ ప్రముఖులంతా మా ధైర్యానికి షాక్ తిన్నారు. రిలీజ్‍కి ముందుకూడా డివైడెడ్ టాక్ వచ్చింది “ఇదేదో ఎక్స్పెరిమెంట్ సినిమా, యాంటీ సెంటిమెంట్ సినిమా.. ” అంటూ..! మొత్తానికి రెండు, మూడు నెలల తర్వాత 1980 అక్టోబర్ ప్రాంతాల్లో విడుదలైంది. మా అంచనాలకి విరుద్దంగా ప్రేక్షకులు సినిమాని తిరగ్గొట్టారు. మేము ఆఫ్‍బీట్ అనుకున్న కథని ఏమాత్రం రిసీవ్ చేసుకోలేదు. ఎంతో ఎడ్వాన్‍స్డ్ కథని మరీ ఎర్లీగా తీశామనిపించింది..! ‘తొందరపడి ముందే కూసిన కోయిల’ రాగాన్ని ఎవరూ వినలేదు..!

ఐతే ‘మూడు ముళ్ళ బంధం’ డైరెక్టర్‍గా నాకు మంచి పేరే తెచ్చిపెట్టింది. టేకింగ్‍ని కూడా అంతా మెచ్చుకున్నారు. ఎటొచ్చీ కథే ఎవరికీ నచ్చలేదు.. కిందామీదా పడి 3-4 వారాలు ఆడిందంతే.. నాకు చాలా బాధ వేసింది. “అరే.. మంచి సినిమా అన్న పేరు తెచ్చుకుంది కానీ ప్రేక్షకుల్ని చేరలేకపోయిందే. ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా తియ్యలేక పోయానే.. ” అని దిగులుగా ఉండేది. ఒకరిద్దరు నాతో సినిమా తీద్దామని వచ్చారు కానీ నేనే ఒప్పుకోలేకపోయాను..

ఐతే.. ఏం చెయ్యాలిప్పుడు? ఆర్థిక పరిస్థితులుకూడా బాగా లేవు. అప్పటికే ముగ్గురు పిల్లల తండ్రిని. వాళ్ళ క్షేమం చూడడం కూడా నాకు ముఖ్యమే.. ఒక సంవత్సరం తర్జన, భర్జనల అనంతరం మళ్ళీ కోడైరెక్టర్‍గానైనా సరే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలోనే టి.కృష్ణ గారు ‘నేటి భారతం’ సినిమాని తొలి ప్రయత్నంగా తీస్తూ కో-డైరెక్టర్‍ కోసం చూస్తున్నారని బి.గోపాల్, పి.సి.రెడ్డిగార్ల ద్వారా నాకు కబురొచ్చింది.. అప్పటినుంచీ మొదలుపెట్టి టి.కృష్ణ గారు తీసిన ఆరు సినిమాలకీ నేనే కో-డైరెక్టర్‍ గా పని చేశాను..

టి.కృష్ణ గారితో వందేమాతరం, దేవాలయం సినిమాలు తీసిన హరికృష్ణగారు మైనంపాటి భాస్కర్‍గారు వ్రాసిన వెన్నెలమెట్లు నవలని చదివి సినిమాగా తీద్దామని నిర్ణయించుకుని నన్ను పిలిచారు. అది చదివి దాన్ని చక్కటి సినిమాగా తియ్యొచ్చని చెప్పగానే ‘ మీరే డైరెక్ట్ చెయ్యండి..’ అన్నారు. అప్పటికే విజయశాంతి, రాజశేఖర్‍లతో ఎక్కువ సినిమాలకి పనిచేసి ఉండటంతో, నవలలో కేరెక్టర్స్ కి వాళ్ళే సరిపోతారని నిర్ణయించుకుని ‘అరుణకిరణం’ గా ఆ నవలని తీశాం. 1986 లో రిలీజ్ అయింది.. 150 రోజుల సినిమా అయింది అది..! ఈ విధంగా విజయవంతమైన ఈ ‘అరుణకిరణం’ నాకు పునర్జన్మనిచ్చిన మొదటి సినిమా..! ఇంక అప్పటినుంచీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.. !

కౌముది సౌజన్యంతో–కిరణ్ ప్రభ

ఈ వ్యాసాలను యూనికోడ్ లోకి మార్చడంలో సహాయం చేస్తున్న నవతరంగం సభ్యుడు స్నేహిత్ కి ధన్యవాదాలు.

 

3 Comments
  1. venkat May 20, 2010 /
  2. venkat May 20, 2010 /
  3. venkat May 20, 2010 /