Menu

మొదటి సినిమా – లయ

అందం, అభినయం సమపాళ్ళలో కలబోసుకున్న అచ్చమైన తెలుగింటి ఆడపడుచు, కుటుంబ చిత్రాల కథానాయకిగా పేరుతెచ్చుకున్న లయ తన చిన్ననాటి తీపి గుర్తుల్నీ, మొదటి సినిమా జ్ఞాపకాల్నీ మనతో పంచుకుంటున్నారు.

నా చిన్నతనంలో నాన్నగారి వృత్తిరీత్యా ( ప్రస్తుతం నెఫ్రాలజిస్ట్ ) మద్రాసులో ఉన్నప్పుడు నేను ప్రి-నర్సరీ, నర్సరీ చదువుకున్నాను. తరువాత విజయవాడకి మారి ఎల్.కె.జి నుంచీ నేను సినిమా రంగానికి వచ్చేవరకూ ( ఇంటర్మీడియట్ ) విజయవాడలోని నిర్మలా కాన్వెంట్లో, హైస్కూల్లో చదువుకున్నాను. అమ్మా నాన్నలకి నేను ఒక్కర్తెనే సంతానం. నాన్నగారు హాస్పిటల్‍ డ్యూటీ ఐపోగానే ఎప్పుడూ ఇంటికి వచ్చేసి మాతోటే గడిపేవారు. అమ్మా, నాన్నా, నేనూ స్నేహితుల్లా ఉండేవాళ్ళం, చిన్నప్పటినుంచీ.

నేను రెండో తరగతిలో ఉన్నప్పుడే చెస్‍ నేర్చుకోవడం మొదలుపెట్టాను.. చాలా సీరియస్‍గా ప్రాక్టీస్‍ చేసి చెస్‍లో మంచి ప్రావీణ్యం సంపాదించాను. స్టేట్ లెవెల్లో ఏడుసార్లూ, నేషనల్‍ లెవెల్లో ఒకసారీ ఛాంపియన్‍షిప్స్ కూడా గెలుచుకున్నాను. చెస్ పోటీలకి బయటి స్కూళ్ళకి వెళ్ళేప్పుడు నాన్నగారు వెంటబెట్టుకుని వెళ్ళేవారు. ఎప్పుడైనా నాన్నగారికి వీలు కాకపోతే అమ్మ నాతో వచ్చేది. రెండో తరగతి నుంచీ ఏడో తరగతి వరకూ చాలా సీరియస్‍గా చెస్ పోటీల్లో పాల్గొనేదాన్ని. ఐతే ఇంక తరువాత చెస్ ప్రాక్టీసు చేసే సమయం పెరగడం, దాదాపు రెగ్యులర్ క్లాసులకి వెచ్చించేటంత సమయం అవసరం కావడంతో వీలుకాక ఆ ప్రాక్టీస్‍ మానేశాను. ఐనా పదో గ్రేడ్ వరకూ అడపాదడపా చెస్ పోటీల్లో పాల్గొనే దాన్ని.

5వ తరగతి నుంచే సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకోవడం కూడా మొదలుపెట్టాను. అంత చిన్న వయసులోనే నా దినచర్య ఎలా ఉండేదంటే పొద్దున్నే సంగీతం క్లాసు, తరువాత స్కూలు, సాయంకాలం డాన్స్ ప్రాక్టీసు ముగించుకుని ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే చెస్ ప్రాక్టీసుకి వెళ్ళడం తిరిగి రాగానే మళ్ళీ హోమ్‍ వర్కూ.. 5వ తరగతి నుంచే ఇలా బిజీగా ఉండేదాన్ని. వీకెండ్స్ లోనూ, శెలవు రోజుల్లోనూ మాత్రమే చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకునేదాన్ని.

8వ తరగతి నుంచీ కూచిపూడి మానేసి భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. విజయవాడలో జోస్యుల రామచంద్రమూర్తిగారి వద్దా, ఐదేళ్ళ క్రిందట హైదరాబాదు వచ్చాక పసుమర్తి రామలింగ శాస్త్రి గారి వద్దా భరతనాట్యం నేర్చుకున్నాను.

మరొక చిన్నప్పటి జ్ఞాపకం ఏమిటంటే నేను నాలుగో తరగతిలో ఉండగా, హైదరాబాదు ఎక్స్‍కర్షన్‍కి వెళ్ళినప్పుడు అక్కినేని కుటుంబరావు అంకుల్‍ ఆయన తీయబోయే బాలల చిత్రం ‘భద్రం కొడకో’ లో నటించడం కోసం పిల్లల్ని వెదుకుతూ మా బృందాన్ని చూడటం; అందులో చలాకీగా ఉన్న నన్ను చూసి “సినిమాల్లో వేషం చేస్తావా” అని అడగడం జరిగింది. నాలుగో తరగతిలో ఉన్న నాకు సినిమా అంటేనూ, నటించడం అంటేనూ అప్పట్లో ఏమీ తెలీదు. అమ్మా, నాన్నగార్లే ఆలోచించి ఎలాగూ శెలవలే కదా సరదాగా ఉంటుంది చెయ్యమన్నారు. అందులో ఒక ముఖ్యపాత్ర వేసే అబ్బాయి వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారూ మిత్రులవడం కూడ ఒక కారణం.. కుటుంబరావు అంకులే ఒక 20 మంది పిల్లలకి వర్క్‍షాప్ లాగా నిర్వహించి ; మాకు నటించడం, స్క్రిప్టు చదవడం .. అన్నీ నేర్పించి అందులోంచి కొంతమందిని ఫైనల్‍గా సినిమాకోసం సెలక్ట్ చేసుకున్నారు. అందులో నన్ను బాలికల్లో మెయిన్ పాత్రకి సెలక్ట్ చేశారు. ఆ సినిమాకి చాలా అవార్డులొచ్చాయి కూడా. అందులో నాతోబాటు నటించిన ఒక అబ్బాయికి నేషనల్ అవార్డు వచ్చింది కూడా. కాకపోతే మామూలు సినిమాగా రిలీజ్ అవకపోవడం వల్ల ఎక్కువమందిని చేరలేకపోయింది.

ఇది అయ్యాక నేను విజయవాడ వచ్చేసి మామూలుగా చదువులో పడిపోయి, ఇంతకు ముందే చెప్పినట్లు చెస్, సంగీతం, డాన్సు, రెగ్యులర్ స్కూలుతో బిజీగా ఐపోయాను.

అప్పట్లో ఆంధ్రజ్యోతికి అనుబంధంగా నవీన అనే పత్రిక వచ్చేది. దానిలో పబ్లిష్ చేయడానికని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ సీతారామ్‍గారు ( ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు ) – నన్నూ, మా సీనియర్ ఒకమ్మాయినీ ఫోటోలు తీసి నవీనకి పంపించేవారు. ఆ విధంగా మా ఫోటోలు ప్రతి శనివారం నవీనలో వివిధ శీర్షికల కింద వచ్చేవి.

అలా ఉండగా నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు (1996) , హాఫ్ యియర్లీ శెలవల్లో అనుకుంటాను – నేనూ, నా సీనియర్ ఫ్రెండు కలిసి ఒకరోజు మా ఇంట్లో టి.వి. చూస్తున్నాము. జెమిని టి.వి. లో రాఘవేంద్రరావు గారి కొత్త సినిమాకి నటీనటుల కోసం స్టార్ 2000 పోటీల గురించి ప్రకటన చూశాం. ఆంధ్రజ్యోతి కోసం అంతకుముందే తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి కదా; అవీ ప్రొఫెషనల్‍ ఫోటోగ్రాఫర్ తీసినవే కదా; ఇంక బయోడాటా వ్రాసి పంపించి చూద్దామని మేమిద్దరం అనుకున్నాం. మళ్ళీ అంతలో అనుమానం వచ్చింది – ‘మేమిలా పంపిస్తే ఎవరు చూస్తారు.. ఎన్నో వందల ఫోటోలు వస్తాయి కదా వాళ్ళకి, ఎక్కడో పారేస్తారులే’ – అని మాలో మేమే అనుకుని ఆ ఆలోచన విరమించుకున్నాం.

ఐతే ఈ విషయాన్ని విన్న మా అమ్మ “నీకు నిజంగా ఆసక్తి ఉంటే ప్రయత్నించి చూద్దాం” అంది. “ఐనా కానీ వద్దులే అమ్మా, అన్ని వేల ఫోటోల్లో ఎవరు చూస్తారు” అన్నాం. ఐతే ఒకరోజు నేను స్కూల్లో ఉండగా అమ్మ ఫోన్ చేసి “జెమిని స్టార్ 2000 పోటీల కోసం నువ్వు సెలెక్ట్ అయ్యావు, రాత్రే బయలుదేరి హైదరాబాదు వెళ్ళాలి, వెంటనే వచ్చెయ్యి” అన్నారు. అప్పుడే తెలిసింది, నాకు తెలీకుండానే అమ్మ పోటీలకి నా ఫోటో పంపించారని. అందులో వివిధ దశలు దాటి రెండో స్థానాన్ని చేరుకోవడం జరిగింది. ఐతే కేవలం మొదటి స్థానం వచ్చిన వాళ్ళకే సినిమాలో వేషం ఇస్తామన్నారు కాబట్టి నాకు ‘పరదేశీ’ సినిమాలో వేషం వేసే అవకాశం రాలేదు. సినిమాలో వేషం లేకపోయినా టి.వి. లో యాంకర్‍గా అవకాశం ఇస్తామన్నారు కానీ ఎందుకనో అదీ జరగలేదు. ఐతే రాఘవేంద్రరావు గారు నాలో ఉత్సాహాన్ని గమనించి “హీరోయిన్ వేషం వెయ్యాలంటే నువ్వు ఇంకొన్ని రోజులు ఆగాలి. సీరియస్‍గా సినిమా కెరీర్‍ని ఎంచుకోదలిస్తే నువ్వు కొన్ని రోజులు ఆగు. చాలా సన్నగా ఉన్నావు. ఇంకా కొంచెం లావు అవ్వాలి. అలానే ఈ వయసులో నీకు చెల్లెలు వేషాలు ఇస్తామనీ, చిన్న చిన్న పాత్రలు ఇస్తామనీ వస్తారు. వాటికి అంగీకరించకు. ఈ ఫీల్డ్‍లో ఒక తరహా పాత్రలకి ఒప్పుకుంటే ఆ మూసలోంచి బయటకు రావడం చాలా కష్టం.. ఎప్పుడే సలహా కావాలన్నా నన్ను అడగండి” అని చెప్పారు. మళ్ళీ విజయవాడ వచ్చేశాము. టీవీలో నేను పాల్గొన్న ఎపిసోడ్స్ చూసి చాలా ఆనందించాము.. ‘లక్షమంది కంటెస్టెంట్స్‍లో రెండో స్థానం రావడమే గొప్ప కదా’ – అనుకుని ఇంక ఆ విషయం అప్పుడే మరిచిపోయి ఇంటర్మీడియట్‍లో చేరిపోయాను. రాఘవేంద్రరావు గారు చెప్పినట్లే చాలా మంది చిన్న చిన్న పాత్రలు చెయ్యమని అడిగారు కానీ మేమే ఒప్పుకోలేదు.

ఇంటర్మీడియట్‍ మొదటి సంవత్సరం చివరలో ఉండగా విజయవాడలో మాకు తెలిసిన అంకుల్ వాళ్ళింటికి ఓరోజు వెళ్ళినప్పుడు అక్కడికి ఎస్.పి.ఎంటర్‍టెయిన్‍మెంట్స్ కి సంబంధించిన వాళ్ళొచ్చారు. వాళ్ళు కొత్తగా మొదలుపెట్టబోయే స్వయంవరం సినిమాలో హీరోయిన్ కోసం చూస్తున్నారట. నన్ను చూడగానే “మా సినిమాలో హీరోయిన్ వేషం వేస్తావా?” అని అడిగారు. ఔననీ, కాదనీ నేనేమీ చెప్పలేదు. మా అమ్మా నాన్నలని అడగమని చెప్పాను. వాళ్ళు వెంటనే మా ఇంటికి వచ్చారు. అమ్మ కూడా ముందు ఒప్పుకోలేదు. నాన్నగారు అప్పుడు తిరుపతిలో ఉంటే వాళ్ళు ఆయన్ని సంప్రదించారు. నాన్నగారు కూడా “మా అమ్మాయికి టాలెంట్ ఉందని ఒప్పుకుంటాను కానీ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని నేననుకోను..” అంటూ ముందుగా ఒప్పుకోలేదు. వాళ్ళు చాలా సేపు కన్విన్స్ చేసాక ఒక షరతు మీద ఒప్పుకున్నారు. అదేమిటంటే సినిమాని రెండు నెలల్లో నా జూనియర్ ఇంటర్ శెలవుల్లో పూర్తి చేయాలి అని. దానికి వాళ్ళు అంగీకరించారు.

ఆ విధంగా ‘స్వయంవరం’ లో నేను హీరోయిన్ గా ఎంపిక కావడం జరిగింది. నాకింకా గుర్తుంది – హైదరాబాదులో ముహూర్తం షాట్ కాగానే, ప్రెస్ మీట్ కూడా ముగించుకుని ఆ రాత్రే శాతవాహనా ఎక్స్‍ప్రెస్ లో బయలుదేరి విజయవాడ వచ్చి జూనియర్ ఇంటర్ మాథ్స్-2 పరీక్ష వ్రాశాను. సినిమా అన్నాక అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా.. ఆ సినిమా పూర్తి కావడానికి దాదాపు సంవత్సరం పట్టింది. 1999 ఏప్రిల్లో రిలీజైంది. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త రచయితా – ఇలాంటి కాంబినేషన్‍లో రూపుదిద్దుకున్న ఆ సినిమా ఎంత విజయవంతమైందో మీకందరికీ గుర్తుంది కదా..! ఇవీ నా మొదటి సినిమా జ్ఞాపకాలు.

తెలుగు సినిమా రంగంలో నాకు మంచి మంచి పాత్రలిచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నేను చిత్రరంగంలో ఉండగానే ఎం.సి.ఎ వరకూ చదువుకోగలిగాను. ఏ నిర్మాతలైనా నా చదువు గురించి అర్ధం చేసుకుని పరీక్షల సమయంలో షెడ్యూల్స్ లేకుండా అడ్జస్ట్ చేసుకునేవారు. ఈ విషయంలో కూడా నాతో సహకరించిన సీనియర్ నటీనటులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శీర్షిక ద్వారా మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది.

— మీ లయ

కౌముది సౌజన్యంతో–కిరణ్ ప్రభ

ఈ వ్యాసాలను యూనికోడ్ లోకి మార్చడంలో సహాయం చేస్తున్న నవతరంగం సభ్యుడు స్నేహిత్ కి ధన్యవాదాలు.

One Response