Menu

Harishchandrachi Factory (2009)

రష్మీ బన్సాల్ రాసిన ’కనెక్ట్ ది డాట్స్’ పుస్తకంలో పరిచయం చేసిన ఇరవై మందిలో – పరేష్ మొకాషీ ఒకరు. ఆయన గురించి చదువుతూ ఉంటే – నాకు మరీ అంత బలమైన భావనలేమీ కలుగలేదు కానీ, ఆయన తన మొదటి సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టాక, కుతూహలం మొదలైంది. పైగా, అది దాదాసాహెబ్ ఫాల్కే జీవితంపై అనగానే అది రెట్టింపైంది. ఇక ఆ సినిమా పోయినేడు ఆస్కార్ లకి మన దేశం నుండి అధికారిక ఎంట్రీ అని తెలిసాక, తప్పక చూడాల్సిందే అని నిర్ణయించుకున్నాను. ఆ సినిమా: ’హరిశ్చంద్రచి ఫ్యాక్టరి’. భాష – మరాఠి. అనుభూతి – సార్వజనీనం.

సినిమా అన్నది – మన దేశంలో ఒక పరిశ్రమ కావాలని ఫాల్కే ఆశించాడు – ఆ ఆశల ఫలితంగా నేడు మన భారతీయ చిత్రపరిశ్రమ ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసే స్థాయికి ఎదిగింది : అన్న నిజంలో – మొదటి భాగం – నాకీ సినిమా చూశాకే తెలిసింది. ఫాల్కే మనదేశపు మొదటి సినిమా తీశాడని తప్పిస్తే, ఆయన గురించి నాకు ఏమీ తెలీదు. ఈ సినిమా – కొంత నేపథ్యం తెలియజేసింది. ఈసినిమా ఫాల్కే జీవిత చరిత్ర కాదు. అతను ఒక భాగస్వామితో తగాదా వచ్చి, తాము విజయవంతంగా నడుపుతున్న ప్రింటింగ్ ప్రెస్ వదిలి వచ్చేసి, మెజీషియన్ గా మారడంతో కథ మొదలౌతుంది. భారతదేశపు మొదటి చిత్రం – ’రాజా హరిశ్చంద్ర’ విజయవంతమై, ఆపై ఫాల్కే చలవతో భారతదేశంలో క్రమంగా చిత్రరంగం పరిశ్రమగా మారిందన్న వాక్యంతో సినిమా ముగుస్తుంది.

ఫాల్కే లోని eccentricities గురించి పక్కన పెడితే – ఆ మనిషికి సినిమా తీయాలన్న passion చూస్తే ఆశ్చర్యం కలిగింది. ఎవరూ తెలీకుండా, కేవలం బయోస్కోప్ పత్రిక ఆఫీసు చిరునామా ఒక్కటీ తీసుకుని సినిమాలు తీయడం నేర్చుకునేందుకు లండన్ వెళ్ళాడంటే – ఏమనుకోవాలి అతగాడి గురించి? కానీ, వెళ్ళి నేర్చుకోవడమే కాదు – తిరిగొచ్చి భారతదేశంలో సినిమా తీసి చూపించాడు. ఆపై, లండన్ లో సినిమాలు తీయమని ఆహ్వానించినా – అలా వచ్చేస్తే, భారతదేశంలో చలనచిత్ర నిర్మాణం అన్న పరిశ్రమే ఏర్పడదని వద్దన్న గొప్పమనిషి ఫాల్కే- అని ఈ సినిమా చూశాకే తెలిసింది.

ఫాల్కే – చెట్టు ఎదగడాన్ని చిత్రీకరించే దృశ్యం -నాకు అన్నింటికంటే బాగా నచ్చింది. అలాగే, కెమెరా/సినిమా గురించి తొలినాళ్ళలో జనాల్లో కలిగిన అపోహలు, భయాలు, ఆశ్చర్యాలు – అన్నీ ఎంతో సహజంగా చూపారనిపించింది.

ఇక, ఫాల్కే భార్య: అమాంతం ఆమెపై గౌరవం,భక్తీ పెరిగిపోయాయి నాకు. కనీసం సినిమాలో చూసినంత మటుకు- ఆవిడ అంత అండగా ఉండకపోతే, ఫాల్కే ప్రయాణం సజావుగా సాగేది కాదనిపించింది. అలాంటి భార్య దొరకడం ఆయన అదృష్టం అనాలేమో. నటీనటులు అందరూ – బాగా చేశారు. అవసరమున్న చోట్ల – నేపథ్య సంగీతం బాగా అమరింది. డైలాగులు – మంచి హాస్యం. కథనం – చాలా చాలా involving.

ఇంతకీ, ఇలాంటి ఒక బయో-పిక్ లో ఇంత హాస్యం ఉంటుందని నేను ఊహించలేదు. సీరియస్ గా – మనల్ని కూడా ఆ సీరియస్నెస్ లో భాగస్వాములని చేస్తూ – సాగిపోతుందనుకున్నాగానీ, ఇది ఆద్యంతమూ హాస్య చిత్రం. మంచి కథలని – స్పూర్తిదాయకమైన అనుభవాలని – చక్కటి హాస్యంతో మేళవించి తీస్తే – నాకలాంటి చిత్రాలు చాలా ఇష్టం. అందుకేననుకుంటాను ఈచిత్రం ఇంత నచ్చేసింది. (అలాగని, శరత్ మార్కు కథలని కూడా ఇహిహి అనుకునే లాగా తీయాలని కాదు – అర్థం చేస్కోగలరు!!). ఇది అందరూ తప్పక చూడవలసిన చిత్రం. చిత్రం డీవీడీ వచ్చేసిందనుకుంటాను. టీవీలో కూడా వేస్తున్నారని ఒక స్నేహితురాలు అన్నది.

సినిమాను చూసే అవకాశం కల్పించినందుకు – విజయవర్ధన్ గారికి ధన్యవాదాలు.

4 Comments
  1. M.Srinivas Gupta May 26, 2010 /
  2. j.surya prakash May 26, 2010 /