Menu

డాక్యుమెంటరీ సినిమా-7

గోబెల్స్ నాజీ ప్రచార చిత్రాలు

నాజీ ప్రచారధోరణి హిట్లర్ తాత్విక భావాలకు అనుగుణంగా రూపొందించబడింది. నాజీ తత్వంలో స్త్రీకి చాలా హీనమైన స్థానం ఉంది. ఇంచుమించు స్త్రీకి ఆలోచన చేతగాదనీ, ఆలోచన అవసరమని హిట్లర్ గాఢంగా విశ్వసించాడు. జన సమూహం అతని దృష్టిలో ఒక మూక. మూకను తన అభిప్రాయాలవైపు మళ్లించడం చాలా సులువని సూత్రీకరించాడు.

జన సమూహాన్ని హిట్లర్ ఆడదానిగా భావించాడు. ఆడది కూడా ఒకరి సహాయంతోనే ఆలోచిస్తుంది. ఆమె మనస్తత్వం బలహీనమైంది. చెప్పినట్టు నడుచుకుంటుంది. పురుషుడి అధికారం, బలం ముందు లొంగిపోతుంది. అలాగే జన సమూహం కూడా. ‘మేన్ కెంఫ్’ లో హిట్లర్ “ప్రచారానికి’ ఇచ్చిన నిర్వచనం ఇది.

మితవాద స్వేచ్చ Open Market లా లభించే సరుకులాంటిది. వ్యక్తులు తమ ఇష్టం వచ్చిన సరుకులు కొనుక్కుంటాం అనుకొంటారు. కాని ‘పెట్టుబడి’ వ్యక్తుల ఇష్టాలను కొనసాగనియ్యదు. ప్రచారం కూడా అట్లాంటిదే అని హిట్లర్ అభిప్రాయం.

హిట్లర్ రాజకీయాధికారాన్ని పొందాక (1933 ముందూ వెనకా) ప్రచార నిర్వచనంలో చాలా మార్పు వచ్చింది.

“ప్రజా సమూహంలో తాత్విక ఉగ్రవాదానికి సులభంగా ఉసికొల్పబడే లక్షణం ఉంటుంది. ఈ బలహీనత మానవ స్వేచ్చని లెక్కచేయదు. మానవాగతమైన మౌడ్యం ముందు మానవ విలువకి లెక్కలేదు. పాశవికత, అడ్డులేని శక్తికి ప్రజాసమూహం తలవంచుతుంది.”

మానవత్వంపట్ల హిట్లర్ కున్నది ద్వేషం, వెనుకబాటుతత్వం, తిరోగమన భావాలు మాత్రమే. ప్రజలు మూర్ఖులు, విచక్షణాజ్ఞాన రహితులు, చరిత్రని విస్మరిస్తారు. అందుకే ప్రచారం కూడా దీనికి అనుగుణంగానే ఉండాలంటాడు. పై విషయాల పరిధిని చిన్న నినాదాలుగా కుదించి ప్రజల మెదళ్లలోకి దూర్చగలగాలి. ఈ అభిప్రాయాన్ని హిట్లర్ నమ్మాడు. ముడి సరుకులాంటి ఈ తాత్విక భావాలే గోబెల్స్ ప్రచార విధానానికి పునాదిలా పనిచేసింది. నాజీ ప్రచార యంత్రాంగం స్వభావానికి ప్రాణం పోసింది.

నాజీ ప్రచారంలో కొత్తదనమేమీలేదు. కాని , ప్రచార యంత్రాంగం కొత్త పద్ధతుల్లో ఆకర్షణీయంగా, విస్మయ విభ్రాంతుల్ని చేసే విధంగా తయారు చేసాడు గోబెల్స్. నాజీ ప్రచారం యాంత్రిక స్వభావం కలిగి ఉంది. వివిధ దశల్లో, వివిధ వ్యక్తులకి మధ్య పొంతన కుదర్చలేకపోయింది. యుద్ధకాలంనాటి జర్మనీ ప్రచార పద్ధతుల్లో ఈ బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతికక్షులను గురించి వారి భవిష్యత్ కార్యక్రమాల గురించి నాజీ ప్రచార యంత్రాంగం ఏ మాత్రం అంచనా వేయలేకపోయింది. నిజం చెప్పాలంటే శత్రువుల శక్తి సామర్ధ్యాలను అసలు పరిగణలోకి తీసుకోలేదు. అందుకనే గోబెల్స్ ఆధ్వర్యంలో నిర్మితమైన ప్రచార చిత్రాలన్నీ మొరటుగా ఉండేవి. దేశంలో ప్రదర్శించే చిత్రాలకీ, విదేశాల్లో ప్రదర్శించే చిత్రాలకీ ఏ మాత్రం తేడా ఉండేది కాదు. వ్యతిరేకుల వాదనను విమర్శీంచడానికో, ఖండించడానికో అవసరమైన భావ సంపదగాని, కార్యనిర్వాహకుల బలగం కాని, నాజీ ప్రచార యంత్రాంగానికి లేదు. అందుకనే ఆ చిత్రాలకు పెట్టిన పెట్టుబడికి, ఫలితాలకూ పొంతన కుదరలేదు.

1918 నుండి బోల్షివిక్ వ్యతిరేక ప్రచారానికి అవసరమైన పూర్వరంగాన్ని బూర్జువా పత్రికారంగం సిద్ధపరిచింది. ఇది నాజీలకు అనుకూలమైన పరిస్థితి. కాని యూదు వ్యతిరేక ప్రచారం కూడా నాజీ చలన చిత్రాల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడం మూలాన నాజీల ప్రచారం వారూహించిన మేరకు ఫలితాలను ఇవ్వలెకపోయింది. పైపెచ్చు నాజీల పట్ల ఏహ్యతను వ్యతిరేక భావాన్ని కలిగించింది. ఒక దశలో గోబెల్స్ ముఠా యూదు వ్యతిరేక ప్రచారాన్ని సున్నితం చేయాల్సి వచ్చింది. అలాగే ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన చిత్రాలను పంపడం జరుగుతుంది. ఎన్ని సర్దుబాట్లు చేసినప్పటికీ జర్మన్ ప్రచారం మొరటుగానే ఉండేది. ప్రజలను మోహపరచడానికి బదులు ‘బలాత్కారం’ చేయడానికే ఆ ప్రచార ధోరణి ప్రయత్నించింది. హిట్లర్ దృష్టిలో కూడా ప్రచారం అనేది ‘శతఘ్ని ప్రయోగం’ లాగా దూకుడుగా సాగాలనే వాంచించాడు.

1931 ప్రాంతంలో మొత్తం చలన చిత్ర విభాగ యంత్రాంగంలో ఇద్దరే ముఖ్యులు సరిపోయేవారు. అధికారం చేజిక్కిన తరువాత నాజీ ప్రచార యంత్రాంగం అంటే చలనచిత్ర విభాగం 14,000 మందిని కార్యకర్తలుగా తీసుకుంది. 1936 నాటికి ఆ యంత్రాంగాన్ని మరెన్నో రెట్లు పెంచారు. తొలి రోజుల్లో ప్రచార చిత్రాలు ఎంతో ప్రాధమిక స్థాయిలో ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న ఉద్వేగ ఉద్రేకాలవల్ల నాజీ ప్రచారం సఫలమైంది. సంగీతం, పెద్ద పెద్ద ఊరేగింపు, అంతకంటే పెద్ద మహాసభలు, ఆ సభల్లో వ్యక్తమయ్యే హింసా ప్రవృత్తి, ఈ చిత్రాల్లోని ముఖ్యమైన ఆకర్షణలు. ఆ చిత్రాలన్నీ నాజీపార్టీ కార్యకర్తల, సభ్యుల, సనుభూతిపరుల ధైర్యాన్ని, మొండితనాన్ని నిలబెట్టడానికి పనికివచ్చాయి. ఊరేగింపులు, సభలు కూడా జాగ్రత్తగా సైనిక పద్ధతుల్లో, క్రమశిక్షణతో ప్రణాలికా బద్ధంగా రూపొందించినవే. చిత్రీకరణ విషయంలో కూడా సంకీర్ణతా, విస్తారతా ప్రముఖంగా దృశ్యమానమయ్యేట్లు చూసే లక్ష్యంతో వ్యూహరచన కొనసాగేది. ఉదాహరణకు 1934 నాటి నాజీ విన్యాసం ర్యాలీ ఒక భారీ మతసమూహంలాగా చిత్రీకరించబడింది. ఒకవైపున సభ, ఆ సభలో హిట్లర్ ఉపన్యాసం. ఆ ఉపన్యాసం ముగియాగనే చీకటి.

మరోవైపు ఉవ్వెత్తున లేచే భోగిమంటలు, ఆకాశం వైపు గురిపెట్టిన సెర్చిలైట్ల వెలుగులు. అంతా మధ్య యుగాలనాటి ఉత్సవ వాతావరణం కనబడుతుంది.

1933 నుండి 1938 వరకు న్యూరెంబర్గ్ లో ఒక ఏడాదిని మించి మరో ఏడాది ఈ విన్యాస కార్యక్రమాలు భారీ ఎత్తున జరిపేవారు. ఈ విన్యాసాల్ని చిత్రాలుగా తీసేవారు. హిట్లర్ పట్లా, నాజీలపట్లా జర్మన్ ప్రజలలో పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీకలుగా ఒక ప్రణాలిక ప్రకారం ఈ విన్యాసాలు చిత్రీకరించేవారు. ఈ ప్రచార యంత్రాంగానికి అధిపతి జోసెఫ్ గోబెల్స్. ఐతే శిల్పి ఆల్బర్ట్ స్పిర్.

రాజకీయంగా నాజీపార్టీ పలుకుబడి పెరుగుతున్నకొద్దీ పార్టీ కార్యక్రమంలోని ‘సోషలిస్ట్ తత్వం’ చిత్రాల్లోనూ తరుగుతూ వచ్చింది. పారిశ్రామికవేత్తలు నాజీపార్టీని పోషించడానికి సిద్ధపడిపోయారు. 1932 ఎన్నికల ప్రచారంలో నాజీ నాయకుడు విమానంలో ప్రచారం ప్రారంభించాడు. 200 పైగా సభల్లో ప్రసంగించాడు. 30,000 మైళ్లు ప్రయాణించాడు. అదే సమయంలో పార్టీ స్వయంగా ప్రచారం కోసం చిత్రాలను నిర్మించడం మొదలుపెట్టింది. అందులో మొదటిది ‘జర్మనీ మీదుగా హిట్లర్ యాత్ర’. దానిలో ఒకచోట గోబెల్స్ ఉపన్యాసం కూడా చిత్రితమైంది. అధికారం చేతికిరాగానే ప్రచారశాఖకు గోబెల్స్ అధిపతి అయ్యాడు. అతని దృష్టిలో సినిమానిమించిన ఆధునిక ప్రచార సాధనం మరొకటి లేదు. మొదటినుంచి డాక్యుమెంటరీ చిత్రనిర్మాణానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. 1933 ఎన్నికలనాటికి ‘మేల్కొన్న జర్మనీ’ అనే చిత్రం తయారైంది. నాజీ పార్టీ పుట్టుక, అభివృద్ధి, అధికార సాధనా దానిలో చిత్రీకరించారు. అలాగే హిట్లర్ సర్వాధికారాలను దత్తం చేసుకున్న 1934 ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ‘మన ఫ్యూచర్’ అనే మరో చిత్రం విడుదల చేశారు. ఆ తరువాత చలన చిత్రాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 1934 లో 129 కథాచిత్రాలు నిర్మించారు. నాజీపార్టీ విన్యాస చిత్రాన్ని “విశ్వాస విజయం’ (Victory of Faith) రెండుకోట్ల మంది చూశారు. “నెత్తురునేల” (Blood Soil) అనే చిత్రం జర్మన్ వ్యవసాయదారుల పాత్ర నరకప్రాయ జీవితాన్ని ప్రస్తుత స్వర్గతుల్య జీవితంగా కీర్తించే ప్రచార చిత్రం ఇది. అది కూడా ఆ ఏడే విడుదలయింది.

అంతకుముందు జర్మన్ చిత్రాలన్నీ జర్మన్ జాతీయతకు భిన్నమైన భావజాలాన్ని ప్రచారం చేస్తూ జాతిని నిర్వీర్యం చేశాయని గోబెల్స్ ప్రచారం చేశాడు. దానికి కారణం యూదులతో ఈ చిత్రాలు తీయడమే కారణం అని వారు ఊహించారు. అంతకుముందు తయారైన చిత్రాలకు కథకులు, రచయితలు నూటికి యెనభైమంది యూదులేనని వారి అంచనా. అప్పటికి తయారులో ఉన్న చిత్రాలకు దర్శకులు కూడా ఎక్కువమంది యూదులేనని, వారే జర్మన్ చలనచిత్ర పతనానికి కారకులని నాజీపార్టీ అధికారికంగా ప్రకటించింది. విజాతీయ చిత్రాలపై పార్టీ సాగించిన తొలి విజయం 1930లో జరిగింది. ‘పశ్చిమ రంగంలో అంతా ప్రశాంతి’ (All quite on Western Front) అనే చిత్రం జర్మనీలో విడుదల కాకుండా నిరోధించారు. దాని ప్రారంభోత్సవానికి ఉద్ధేశింపబడిన సినిమా హాలు ముందు నలబై వేలమంది నాజీలు ప్రదర్శన జరిపారు. దాని రచయితను యూదు అనీ, మార్క్సిస్టు అనీ, శాంతివాది అనీ పేర్లు పెట్టి తిట్టారు. జర్మన్ల ప్రతిష్టకు భంగం అనే నెపం మీద ఆ చిత్రాన్ని సెన్సారుబోర్డు నిషేధించింది. జర్మన్ ఉదార చిత్రాలన్నీ దేశభక్తిభావాన్ని ఉద్దీపింపజేయడానికి ఉద్ధేశించబడింది.

1941 లో తయారైన ‘తిరిగిరాక’ (Return) చిత్రంలో జర్మనీపేరు రుద్ధకంఠంతో ముప్పైఆరుసార్లు ఉచ్చరించబడింది. తొలి నాజీ చిత్రాలు దేశంకంటే పార్టీనే ఎక్కువ కీర్తించాయి.

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రెండు మూడు సంవత్సరాలు హిట్లర్ శాంతికాముకునిగా నటించాడు. ఆ నటనకు అనుకూలంగా జర్మన్ చిత్రాల్లో ఒక రకమైన ఉదారభావం రూపుకట్టబడింది. ఆ కాలంలోనే ఒక చిత్రంలో కమ్యూనిస్టులు కూడా మానవులే అని చూపించే యత్నం చేశారు. ఆ చిత్రం పేరు ‘ప్రమాణానికి సెలవు’ (Leave onward of Honour). ఇలాంటీ చిత్రం 1933-35 ప్రాంతాల్లొ ఊహించలేం. రష్యా – జర్మనీ మితృత్వ సంధి జరిగిన కాలంలో రష్యా వ్యతిరేక చిత్రాలు వెనక్కి తీసుకున్నారు. కాని 1941 లో రష్యాతో యుద్ధం ప్రారంభమయ్యాక వాటిని విడుదల చెశారు.

1940 లో వచ్చిన ‘జడ్ జుస్’ (Jud Juss) , 1941 లో విడుదలైన ‘ఆరోపిస్తున్నారు’ (I accuse) అనే రెండు చిత్రాలు చాలా జాగ్రత్తగా నిర్మించారని చెబుతారు. మొదటి చిత్రం యూదు వ్యతిరేక చిత్రం.దాన్ని తూర్పు యూరపు దేశాల్లో ప్రదర్శించడానికి ఉద్ధేశించారు. మొత్తం నాజీ సైన్యం, పోలీసు బలగం ఆ చిత్రాన్ని చూడవలసిందిగా ప్రత్యేక ప్రకటన వెలువడింది. అలాగే పైన చెప్పిన రెండో చిత్రం ఒక ప్రత్యేక చారిత్రక పరిస్థితిలో తయారైంది. ఆర్ధిక కారణాలవల్ల నాజీలు విచ్చలవిడిగా హత్యలు చేసే కాలంలో విడుదలైంది ఆ చిత్రం. ఆ చిత్రంలోని కథానాయిక ఒక దుర్భరమైన వ్యాధికి లోనవుతుంది. అది నయమయ్యే సూచన లేదు. మార్గాంతరం మరణం. ఈ కథావస్తువు ఎంత ఉన్నత భావాలతోనో, ఆదర్శాలతోనో చిత్రీకరించినప్పటికీ వ్యక్తుల ప్రాణాలు తీసే హక్కు ప్రభుత్వానికి ఉన్నాయి అనే సూచన నిభిడీకృతమై ఉంది. ఇలాంటి చిత్రాల్లో హిట్లర్ ప్రచార స్వభావం ప్రతిబింబించింది గోబెల్స్ ఆశీర్వాదాలతో ఈ చిత్రాలు తయారయ్యాయి.

ఐతే విచిత్రంగా యుద్ధకాలంలో తయారైన చిత్రాల్లో రెండు ధోరణులు సమాంతరంగా సాగనివ్వబడ్డాయి. ఒకవైపు ప్రచార చిత్రాలు , మరొకవైపు పలాయనవాద చిత్రాలు. తరువాతి కాలంలోని అంచనాల ప్రకారం ప్రచార చిత్రాలకంటే పలాయనవాద చిత్రాలే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ప్రభుత్వం కూడా వాటిని నిరుత్సాహపరచలేదు.

గోబెల్స్ వ్యక్తిగతంగా ‘బాటిల్ షిప్ పోటెంకిన్’ చిత్రాన్ని కళారూపంగా ఉత్తమమైందిగా భావించాడు. దానికి దీటైన జర్మన్ చిత్రాన్ని నిర్మించాలని అతడు ఎన్నో కళలు కన్నాడు. ఏ సిద్ధాంత జలమూ లేని ఒక మామూలు వ్యక్తి ‘బాటిల్ షిప్ పోటెంకిన్’ చూసి బోల్షివిక్ కావడానికి అవకాశం ఉందని గోబెల్స్ అంచనా. ‘ఓయిసా క్రెగె’ అనే చిత్రాన్ని 1941 లో నిర్మించారు. దాని దర్శకుడు హాన్స్ స్టెనాఫ్. దానికి 54 లక్షల మార్కులు ఖర్చయింది. దాని రచనలో గోబెల్స్ కి ప్రముఖ పాత్ర ఉంది. అలాగే గోబెల్స్ కి ఇష్టమైన మరో చిత్రం ‘కోల్ బెర్గ్’. దానికి 90 లక్షల మార్కులు ఖర్చయింది. నాజీ పెట్టుబడిదారులు ఈ చిత్రానికి వనరులు చేకూర్చారు. ఈ చిత్రాన్ని ఆనాడే భారీ ఎత్తున రంగుల్లో తీశారు. లక్షా ఎనభై ఏడు వేల మంది సైనికులు, ఆరువేల గుర్రాలు ఈ చిత్రంలో పాల్గొన్నారు.

గోబెల్స్ ప్రచార చిత్రాలన్నింటిలోనూ నాయక ఆరాధన ప్రధానమైన భావం. గోబెల్స్ బ్రతికి ఉంటే సినిమా నిర్మాణం, సాంకేతిక శాస్త్ర విషయాలపై ఒక మంచి గ్రంధం రాయగలిగేవాడని అతని అభిమానులు అంటుంటారు. ఏది ఏమైనా సినిమాకున్న ప్రచారశక్తిని గుర్తించడంలో గోబెల్స్ ఉన్నత శ్రేణి మేధావుల కోవలోకి చెందుతాడు. ఎటూ వచ్చి అతడు ఒక నికృష్ట భావ జాలానికి, ఒక ఉన్మాద నాయకుడికి అనుచరుడు కావడం ఒక చారిత్రక దుర్ఘటన..

హిట్లర్ రాకకు పోపెనార్ తత్వశాస్త్రం ప్రాతిపదిక అయింది. ఆ భావజాలాన్ని హిట్లర్ పాలనకు ముడిపెట్టి ప్రచారం చేయడంలో గోబెల్స్ నిర్వహించిన పాత్ర అమోఘం…