Menu

డాక్యుమెంటరీ సినిమా-6

రెండో ప్రపంచ యుద్ధ సినిమా

మొదటి ప్రపంచయుద్ధం తరువాత జర్మనీలో ఆర్ధిక సాంఘిక రంగాలలో అనేక మార్పులు వచ్చాయి. ‘వర్సెల్స్ సంధి ‘ నియమాలు జర్మన్ జాతికి అవమానకరంగా కనబడ్డాయి. అంటే మొదటి ప్రపంచయుద్ధానికి ముందున్న ఉత్సాహ ఉద్వేగాలు మౌనరూపం దార్చాయి. అందులో విషాదరేఖ ప్రస్ఫుటంగా ఉంది. దీనికి రాజకీయ ఆర్ధిక కారణాలు గమనించి, గమనించకా కొందరు మధ్యతరగతి మేధావులు సంయమనం కోల్పోయారు. నిరాశ, నిస్పృహ రాజ్యమేలింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన నాలుగైదు సంవత్సరాల కాలాన్ని ‘ అంతరంగిక స్వగతం” అని వర్ణించారు సాంఘిక శాస్త్రవేత్తలు. ఆ కాలంలో వచ్చిన జర్మన్ సినిమాల్లో నిరాశ ప్రస్ఫుటంగా కనిపించింది. అంతే కాక అస్తవ్యస్ధంగా ఉన్న వ్యవస్ధపై తిరుగుబాటు ఎక్కడా కనబడదు. సమాజానికి పట్టిన ఆ పక్షవాతం కొన్నేళ్లపాటు కొనసాగింది. ఆ తరువాత ఉన్నా అపసవ్యతమౌతూ వచ్చింది. నీషేలాంటి తత్వవేత్తలు మహానాయుడి అవతారాన్ని ఊహించారు. అలాంటివాడే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించబోతాడని గాఢంగా నమ్మారు. ఆ పరిస్ధితుల్లో అంటే 1920 – 25 వరకూ వచ్చిన జర్మన్ సినిమాల్లో నిలకడ, విశ్రాంతిలేని జర్మన్ ప్రజల ఆత్మక్షోభ ధారాప్రవాహంగా కనబడుతూ మితవాద దృష్టిలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆత్మన్యూనతా భావం ఉంది. అలాగే ఆశారేఖలు ఉన్నాయి. భవిష్యత్తుపై దృష్టి ఉంది. కానీ నిర్మాతలు ముఖ్యంగా మధ్యతరగతికి, ఆపై తరగతికి చెందినివారవడం వలన మొదటి ప్రపంచయుద్ధం అనంతరం జరిగిన అవమానానికి ప్రముఖ్యతనిచ్చారు. ఈ అవమానానికి సమాధానం బహుశా హిట్లర్ అని వారి విశ్వాసం.

1917 నుండి జర్మన్ సినిమాలో ముఖ్యమైన, బలీయమైన భాగం ‘ యూనివర్సల్ ఫిలిం కంపెనీ ‘. దానిలో మూడవవంతు వాటాలు ప్రభుత్వానికి చెందినవే. తరువాత కాలంలో మరికొన్ని వాటాలు జర్మనీ సైనికశాఖ కొనుక్కుంది. సెన్సారు నిబంధనల ప్రకారం జర్మనీ ప్రతిష్టని కించపరిచే చిత్రాలన్నీ నిషేధార్హాలే. అదే రకంగా సామాన్య జీవన విధానాన్ని కల్లోలపరచే ఏ చిత్రాన్నైనా సెన్సారు నిషేధించవచ్చును. 1920 నాటికి ద్రప్యోల్బణం పట్టువదలిపోయింది. సామాన్య ప్రజలు ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్న వాతావరణం కనిపిస్తోంది. కానీ 1930 నాటికి జర్మనీ ఆర్ధిక మాంద్యానికి గురైంది. హిట్లర్ ఇంద్రజాలకుడిలా రాజకీయ రంగంలో ప్రవేశించాడు. కొందరికైనా అతడు అవతారపురుషునిలా కనిపించాడు. 1925లో ద్రవ్యోల్బణం, 1930లో ఆర్ధికమాంద్యం ఏర్పడింది. ఇవి రెండూ ముఖ్యమైన దశలు. ఈ రెండు దశల మధ్య నడిచిపోయిన కాలమిది. సామాజిక జీవితంలో అంతకు ముందున్న సాంప్రదాయాలు, మర్యాదలు,సిగ్గు ఎగ్గులు నిష్క్రమించడం ప్రారంభమైంది. నూతన జీవిత విధానం ధైర్యంగా రంగప్రవేశం చేసింది. పాత సిద్ధాంతాలు, నిబంధనలు రద్దయిపోయాయి.

ఆ సందర్భంలో కొంతమంది కళాకారులకు అశాంతి అత్యవసరమైన కధావస్తువుగా మారిపోయింది. ఆ అశాంతి బ్రెక్ట్ రచనల్లో ప్రతిఫలించింది. అలాగే చిత్రరంగంలో ఫాబస్ట్ ఈ అశాంతిని ‘ జాయిలె ఈ స్ట్రీట్’(1925), ‘ త్రీపెన్నీ ఒపేరా ‘ చిత్రాల్లో చూపించాడు. ఆ చిత్రాలు కేవలం అశాంతికి దర్పణాలు. ఆ అశాంతికి, ఆసంతృప్తికి మూలకారణమైన నేరస్ధులను గుర్తుపట్టలేదని బ్రెక్ట్ అన్నాడు. అందుకే ‘త్రీపెన్నీ ఒపేరా’కూ, తనకూ ఏమీ సంబంధం లేదని ప్రకటించాడు.

1920 నాటికి ‘యూనీవర్సల్ ఫిలిం కంపెనీ’లో అమెరికా సంస్ధలైన పారమౌంటు, మెట్రోగోల్ట్ మేయర్ సంస్ధలు పదిహేడు మిలియన్ల మార్కుల్ని పెట్టుబడిగా పెట్టాయి. తద్వారా ఆ అమెరికా సంస్ధలకి ఎంతో అధికారం ఏర్పడింది జర్మన్ మార్కెట్లో. వాటికి పెద్ద ప్రాఫు లభించింది. జంకుగొంకు లేకుండా జర్మన్ తారల్ని, టెక్నిషియన్లని కొనేయడం ప్రారంభించింది. అందుకు తోడు ‘యూనీవర్సల్ ఫిలిం కంపెనీ’కి సంబంధించిన ధియేటర్లలో సగకాలం అమెరికన్ సినిమాలు ఆడాలి అనేది ఆ ఒప్పందంలోని ఒక భాగం. అంటే జర్మన్ సినీవ్యవస్ధపై అమెరికా హస్తం బలంగా పడిందన్న మాట. అందుచేత హాలీవుడ్ సూత్రాలకు అనుకూలమైన మార్పులు జరిగాయి.

పాతకాలపు పెత్తందారీ పద్ధతి కూడా ముక్కలు ముక్కలైపోయింది. అందుచే హఠాత్తుగా సినీ ప్రపంచానికి మరో ఆశావహమైన అవకాశం ఏర్పడింది. ప్రజలపైనా, సమాజంపైనా సినిమా కళాకారులు తమ దృష్టిని సారించారు. అదే సందర్భంలో 1927లో ‘యూనీవర్సల్ ఫిలిం కంపెనీ’లో కొన్ని వాటాలను ఆల్ఫ్రెడ్ హ్యూగెన్ బర్గ్ అనే అభివృద్ధి నిరోధక పత్రికాధిపతి కొన్నాడు. అతను కేవలం తన రాజకీయ ప్రయోజనాల సంరక్షణకే సినీవ్యాపారంలో దిగాడు. ఆరేళ్ల తరువాత నాజీలతో కలిసి హ్యూగెన్ బర్గ్ హిట్లర్ కి ఆర్ధిక సహాయం చేయడమేకాక, పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్ధలనుండి చందాలుకూడా ఇప్పించాడు. రాజకీయంగా పరిస్ధితి చాలా అధ్వాన్నంగా ఉంది. రెండు సంవత్సరాల వ్యవధిలో 327 రాజకీయ హత్యలు జరిగితే అందులో 314 సంఘటనలు తీవ్రమతవాదుల ప్రమేయంతో జరిగాయి. పోతే ఆ ముద్దాయిలందరికీ కలిపి లభించిన శిక్ష మొత్తం 31 సంవత్సరాలు మాత్రమే మిగతా 13 హత్యలకూ బాధ్యత తీవ్ర అతివాదులదే. అందుగ్గాను 8 మందికి మరణశిక్ష, మొత్తంగా మిగతావారికి 175 సంవత్సరాల జైలుశిక్ష లభించింది.

ఈ నేపధ్యంలో 1926 ‘బేటిల్ షిప్ పోటమ్కిన్’ చిత్రం బెర్లిన్ లో ప్రదర్శించారు. అంతకుముందే యుద్ధశాఖ ఉన్నతాధికారులు ఆ సినిమా చూసి నిషేధించాలని కోరారు. సెన్సారువారు అంగీకరించారు. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక కధావస్తువు ఉన్న ఏ చిత్రాన్ని నిషేధించకూడదనే సూత్రాన్ని పక్కకు నెట్టేయడం జరిగింది. పోతే పత్రికారంగం ఉవ్వెత్తుగా విజృంభించడం వల్ల ఆ నిషేధాన్ని తొలగించారు. కాని జర్మన్ సైనికులకు మాత్రం ఆ చిత్రం నిషేధ పదార్ధమే. తరువాత కొద్దిరోజులు పోయాక దాన్ని మళ్లీ నిషేధించారు. ఈసారి నిషేధం తొలగించినప్పుడు ఆయువుపట్టులాంటి దృశ్యాలను తొలగించారు. ఐతే ఆ తరువాత కాలంలో మిగతా సోవియట్ చిత్రాలు విడుదల అయ్యాయి. సినీకళాకారుల్లో రాడికల్ అభిప్రాయాలు కలవాళ్లకి చురుకెక్కింది. హేన్రిచ్ మాన్, పికట్టర్స్, ఫాబస్ట్ ఇంకా మరికొందరు కలిసి ‘సినిమా కళా సంస్ధ’ ఏర్పాటు చేశారు. అభ్యుదయ చిత్రాలను ప్రోత్సహించడానికి వాస్తవాన్ని వక్రీకరించే ధోరణులను ప్రతిఘటించడానికి ఏర్పడిందా సంస్ధ. ఆ తరువాత చిత్రాలు కొన్నైనా సామాజికమైనవి. మామూలు జనం మధ్య వాస్తవ నేపధ్యంలోనే కొన్ని చిత్రాలు తీసారు. ‘మేన్ షీన్’, ‘యాన్ సాంటాట’ లాంటి చిత్రాల్లో ఈ దృక్పధం కనిపిస్తుంది. 1932లో తయారైన ‘కుకెవాంపె’ చిత్రంలో సూటిగా రాజకీయ ధోరణి ద్యోతకమవుతుంది. ఐతే 1934లో సోవియట్ యూనియన్ లో తీసిన ‘పికెటర్’ చిత్రం, ‘రివోల్ట్ ఆఫ్ ఫిషర్ మెన్’ స్పష్టంగా విప్లవాత్మక చిత్రం. రిచర్డ్ ఆస్వాల్డ్ లాంటివారు జాగ్రత్తగా ఏ ధోరణివైపు మొగ్గకుండా వీలైతే యాధాతధ స్ధితిని అంగీకరిస్తూ చిత్రాలు తీసారు. ఈ రెండోరకం చిత్రాలను బూర్జువా అతివాద చిత్రాలు అంటారు. పి.ఎల్.జుట్జీ తీసిన ‘మట్టర్ క్రాసెన్స్’ ఈ కాలంలో వచ్చిన గొప్ప చిత్రం. నిరుద్యోగం, గృహవసతి ఈ చిత్రంలో ముఖ్యాంశాలు. ఈ చిత్రాన్ని మూడుభాగాలుగా తీసారు బ్రెక్ట్ పద్ధతిలో. దీనికి మాహాకావ్య లక్షణాలు వచ్చాయి. ఐతే మిగతా అతివాద చిత్రాల్లా ఇందులో నిజమైన నేరస్ధుల్ని, వాళ్లు చేసిన నేరాన్ని సూటిగా చెప్పడు. చిన్న చిన్న సంకేతాల ద్వారా ధ్వని ప్రధానమైన దృశ్యాల ద్వారా తన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేసాడు. జీవితంలోని విషాదమంతా ఇందులో చిక్కగా కనపడుతుంది. మనిషనేవాడు బతకడానికి సాధ్యంకాని పరిస్ధితుల్లో చావలేక బతుక్కుంటూపోయే బక్కజీవులను వర్ణిస్తాడు దర్శకుడు. ఈ నేరం ప్రభుత్వాధిపతులదేనని నిర్ద్వందంగా వ్యాఖ్యానించిందీ చిత్రం. అయితే ఈ నేరారోపణ ధ్వనిపూర్వకంగా, ప్రశాంతంగా చూపబడుతుంది. చిత్రం ఆశాపూరితంగా ముగుస్తుంది. అదొక మూగ ఆశ. బడ బడమని శబ్ధం చేసే ముగింపుకాదు.

జుట్జి మరో చిత్రం బెర్లిన్ ‘అలెగ్జాండర్ ప్రాట్జ్’ కూడా బలమైన వాస్తవికతపై ఆధారపడ్డ చిత్రం . కానీ అది ఒక సమూహానికి సంబంధించిన చిత్రం కాదు. ఒక వ్యక్తి చుట్టూ అల్లిన కధ. ఈ చిత్రం కూడా ఒక మోతాదులో ఆశాపూరితంగా ముగుస్తుంది.

‘కుహ్లెవాంప్’ ఈ కాలంలో వచ్చిన ముఖ్యమైన చిత్రం. ‘మట్టర్ క్రాసెస్’ చిత్రానికి దీనికి వస్తువిషయంలో పోలికలున్నాయి కానీ, ‘కుహ్లెవాంప్’ నిర్దుష్టమైన నమ్మకాలతో తీయబడింది. దానికి బ్రెక్ట్ సంభాషణలు,పాటలు సమకూర్చాడు. అది కమ్యూనిస్టు పార్టీ చేత నిర్మించబడింది. దాన్ని ధ్వంసం చేయడానికి అనేక ముఠాలు శాయశక్తులా ప్రయత్నించాయి. అసలు పూర్తి చిత్రం ఎక్కడా దొరకడంలేదు. ఇందుకు సెన్సారువారి జోక్యం చాలావరకు కారణం.

1929 నుంచీ 32 లోపు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. 42.8 శాతం పారిశ్రామిక కార్మికులు నిరుద్యోగులు. దానికి తోడు పాక్షికంగా ఉద్యోగాలు చేసేవారి సంఖ్య మరికొంత చేరుతుంది. భయంకరమైన పరిస్ధితి. మూతపడిన ఫ్యాక్టరి, పొగరాని గొట్టాలు, ఎలుగెత్తి అరిచే పత్రికా శీర్షికలు… వగైరా హ్రస్వ దృశ్యాలతో ‘కుహ్లెవాంప్’ చిత్రం ప్రారంభమవుతుంది. తర్వాత నిరుద్యోగుల స్ధితి… పరిస్ధితి…..ఇందులో కూడా కధాక్రమం.. ఒక కుటుంబం చుట్టూ నడుస్తుంది. నిరుద్యోగి యువకుని ఆత్మహత్యతో మొదటిభాగం ముగుస్తుంది. రెండోభాగం అతని సోదరి విషాద ప్రణయగాధ. ఇందులో రాజకీయభావాల ప్రాధాన్యతకూడా ఉంది. కమ్యూనిస్టుల అధీకృత, సోషల్ డెమొక్రాట్ల బలహీనతలను చూపడానికి దర్శకుడూ..రచయితా ప్రయత్నం చేశారని ఒక పరిశీలకుడు భావించాడు. అయితే చిత్రమంతా యువతా ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. నిజానికి యువతను ఒక ‘మతం’ స్ధాయిలో నిలబెట్టారీ చిత్రంలో. ఈ చిత్రం 1932 మే 30న విడుదలైంది. ఆ తర్వాత 8 మాసాలకు హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. దాంతో జర్మన్ సంస్కృతిలో వీరోచితమైన ఘట్టం ముగిసింది. ఆత్మవిమర్శ సాహసవంతమైన ప్రధమ ప్రయత్మాలు.. ఉన్న సంస్కృతికి తీవ్ర అవరోధం వచ్చిపడింది. జర్మనీలో ఇక నాజీల చిత్రాలు రాజ్యమేలాయి. గోబెల్స్ ప్రచార శాఖ ‘ప్రజాసినిమా’ అవశేషాల్ని తుడిచిపెట్టి సినిమాతో ప్రచారరాజ్యం ఏలాడు.