Menu

డాక్యుమెంటరీ సినిమా-5

అమెరికాలో కార్మిక సినిమా (1930 – 1935)

అమెరికా బూర్జువా వ్యవస్థలోని దుర్గుణాలను, కర్కశత్వాన్ని బట్టబయలు చేయాలని, పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ఉన్న బానిస విధానాన్ని, అమెరికా రాజ్యాంగంలో దాగిన ప్రాధమిక లోపాల్నీ, బహిర్గతం చేసి శ్రామికవర్గంలో విప్లవ జెండా ఎగరెయాలనీ, విప్లవపధంలో వీరోచితంగా నడుస్తున్న శ్రామికవర్గం అండగా సినిమా మాధ్యం తన రంగూ రూపూ మార్చుకుంది.

పనివేళల కోసం, కనీస సౌకర్యాల కోసం, ఆహారం కోసం, చేసిన పనికి సరైన కూలీ డబ్బులకోసం, యుద్ధాన్ని వ్యతిరేకించడం కోసం అమెరికాలోని చాలా చోట్ల ఉద్యమాలు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పత్రికలు వెలువరించారు. పాటలు వచ్చాయి. ప్రజాగాయకులు అమెరికా చరిత్రలో మహోన్నత స్థాయిలో నిలిచిపోయారు. కళలు కొత్త అర్ధంలో, రీతిలో పనిచేశాయి. సినిమా కూడా తలవంచి పనిచేసింది. కార్మికుల చేతిలో అది కొత్త ఆయుధమైంది. 1930 ప్రాంతం నుండి వామపక్షం, ఇతర సానుభూతిపరులు చిన్ని చిత్రాల తయారీకి పూనుకున్నారు.

ఆ చిత్రాల లక్ష్యాలు…

1. పెట్టుబడిదారుల, ముఠాదారుల, రాజకీయల, ప్రభుత్వ అధికారిక హస్తాలనుండి

2. కుహనా సోషలిస్టుల బారినుండి, సంస్కర్తల నామధారుల బరినుండి, మహిళా సంఘాల బారినుండి, సెన్సారు విధానం బారినుండి.

3. హాలివుడ్ సంప్రదాయ కట్టుబాట్ల నుండీ, ఆ వినోద చట్రం నుండి, దాని ప్రభావాల నుండి బయటపడి చిత్రాలు నిర్మించాలనే లక్ష్యంతో కార్మిక సినిమాకి అంకురార్పణ జరిగింది.

సెంట్రాలియా, సాంకో వాంజెట్టి, మూనీ, బిల్లింగ్స్, ఇంపీరియల్ వాలీ ఖైదీల మీద, రక్తారుణ నల్లవీరుల మీద, విప్లవగాయని “ఎల్లామే” మీద చిత్రాలు వచ్చాయి. 322 మంది ఖైదీలను నిలువునా ఖైదీలో పశువుల్లా కాల్చి చంపిన ఘటనల్ని, ఆకలి హాహాకారాలతో జనసముద్రపు ఊరేగింపుల్ని చిత్రాలుగా తీసి ప్రదర్శించడం సినిమా ప్రక్రియకే ఒక కొత్త బలాన్ని సమకూర్చింది.

కార్మిక వర్గం కోసం ‘ఇంటర్నేషనల్ లేబర్ డిఫెన్స్&'(ILD) పని చేసేది. ఈనాటి ‘అమెరికా పౌర హక్కుల సంఘం’ యొక్క నాటి మిలిటెంట్ రూపం కలిగిన సంస్థ అది. దీని ఆధ్వర్యంలో నడిచే ‘లేబర్ డిఫెండర్’ విభాగానికి ఫోటోగ్రాఫర్లు ఫోటోలు, నెగెటివ్‌లు ఇచ్చేవారు. వీరికి అనుబంధంగా ఒక చిన్న ‘న్యూస్ రీల్’ గ్రూపు పని చేసేది. వేర్వేరు రంగాలలో పనిచేసినప్పటికీ ఇందులోని సభ్యులు ఒకే లక్ష్యంతో ఉండేవారు. ‘లెఫ్ట్ వింగ్ కినోగ్రూపూ ఒకటి ప్రారంభమైంది. తరవాత ‘వర్కర్స్ పిలిం ఆండ్ ఫోటోలీగ్ అమెరికా’ అనే సంస్ధ న్యూస్ రీళ్లు తీయడానికి అన్ని హంగులతో ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఐజెన్ స్పిన్ మొంటెజ్ ప్రయోగాలతొ ప్రభావితమై ఆ టెక్నిక్‌ని చిన్న చిత్రాలకు అన్వయించింది.

‘వర్కర్స్ ఇంటర్నేషనల్ రిలీఫ్’ (WIF) సంస్థకి మొదట రష్యా విప్లవ ప్రజానీకానికి తోడ్పడే లక్ష్యం ఉండేది. రానురానూ సమ్మె చేసే స్థానిక కార్మికులకు, ప్రకృతి బాధితులకు, కార్మికుల పిల్ల సంక్షేమానికి, మహిళా సేవకు, ఫాసిస్ట్ వ్యతిరేక ప్రచారం చెసేందుకు, సోవియట్ పారిశ్రామిక ఉత్పత్తుల్ని కళాసాహిత్యాల ప్రచారం కోసం ఉపయోగించారు. 1921లో అమెరికాలో ఏర్పడిన WIR సంస్ధ క్రమ క్రమంగా కార్యక్రమాలు వ్యాపింప చేసింది. దీని ప్రధాన కేంద్రం బెర్లిన్. ఇది రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ మొ.. దేశాలలో చలనచిత్ర నిర్మాణ విభాగాల్ని ఏర్పాటు చేసింది.

జపాన్‌లో ఏర్పడ్డ ‘వర్కర్స్ కెమెరా క్లబ్’ అభ్యుదయ భావాలతో అమెరికా వామపక్ష ఉద్యమ చిత్రాల నిర్మాణానికి సహకారాన్ని అందించింది. అప్పటికే బ్రిటన్‌లో ‘కార్మిక సినీ నిర్మాణ సంస్ధల సమాఖ్య చురుగ్గా పనిచేస్తుంది. షెరీ ఆలెన్ పోటంకిన్ అనీ సినీ విమర్శకుడు, తదితరులు అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు.

ఉద్యమాలు శ్రామికవర్గ కళాకారుల్ని, పాత్రికేయుల్ని తయారు చేసుకున్నట్లే, కెమెరామెన్‌లను దర్శకులను తయారు చేసుకోకతప్పదు. కేవలం కళలు సాంస్కృతిక రంగం వరకే పరిమితమవడం శుద్ధ దండగ. అమెరికా దక్షిణ ప్రాంతంలో సమ్మె చేసే టెక్స్ టైల్ కార్మికుల పోరాటాన్ని ఉత్తర ప్రాంతంలో చూపితే ఆ ప్రభావం కేవలం సాంస్కృతిక స్థాయికే పరిమితమైతే లాభం లేదు. కళకు సంబంధించిన పాత పరిమితుల్ని, పాత పరిస్థితుల్ని, పాత అర్ధాల్ని ఈ చిన్న చిత్రాల ప్రదర్శన ద్వారా చెరిపేశారు. ప్రతి కార్మికుడికి ఈ చిత్ర నిర్మాణంలో సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ చిత్రాలు కార్మికవర్గ స్వభావాన్ని సంతరించుతూనే ఉన్నాయి. అందులో సందేహం లేదు.

WIR, ILD ఈ రెండు సంస్థలూ చిత్ర నిర్మాణంలోనూ, ప్రదర్శనకూ చేయూత నిచ్చాయి. ప్రజాసినీ నిర్మాణ సాంకేతిక పద్ధతులు, కార్మికులని విధ్యావంతుల్ని చెయటంలోనూ, సైద్ధాంతికంగానూ, కళాత్మకంగానూ తీర్చిదిద్దడానికి ఉపయోగపడ్డాయి.

అక్టోబర్ 5, 1930 నాడు WIR ఆధ్వర్యంలో ఐజెన్ స్టిన్ తీసిన ‘బేటిల్ షిప్ పోటెమ్కిన్’, భోఖ్ తీసిన ‘షాంఘై డాక్యుమెంట్’, ‘జ్యూయార్క్ పోరాటవీరులూ, ‘మార్చ్ 6’ అనే WIR చిత్రాలు, జర్మనీ కార్మిక సంస్థ తీసిన ‘హార్బర్ డ్రిఫ్ట్’ చిత్రాలను ప్రదర్శించారు. మొదట ఈ చిత్రాలు కార్మికుల మీదా చిత్ర నిర్మాణంలో ఉన్న వ్యక్తుల మీదా ఎంతో ప్రభావాన్ని చూపాయి.

‘వర్కర్స్ థియేటర్ ‘ అనే పత్రికలో (1931) చిత్ర నిర్మాత, కార్యకర్త అయిన పొటమ్కిస్ చిత్రాల ద్వారా కార్మికులను, ఇతర సానుభూతిపరులను, చైతన్యవంతులను చేయడం కోసం, ప్రతిస్పందన కలిగించడం కోసం, “ఫోటోలు సినిమాలకు పిలుపు”నిచ్చారు. (Film and Photo Call to Action)

ఆర్ధికమాంధ్యం, నిరుధ్యోగం, ఆకలి, సామాజిక దోపిడి .. ఈ కారణాలు వారిని పోరాడటానికి సిద్ధం చేశాయి.. ఏదో ఒక రంగంలో పనిచేయటం ఆనాటి చారిత్రక కర్తవ్యమైంది. కొందరు వామపక్ష పార్టీకి చెందితే, మరి కొందరు సానుభూతి పరులుగా ఈ రంగంలోకి వచ్చారు. మరికొందరు ఆకర్షణ వలన కూడా రావడం జరిగింది.

రాజకీయ నిబద్ధత, దీక్షా ఉన్న ఒకరిద్దరు పార్టీ పూర్తికాలపు కార్యకర్తలుగా వెళ్లిపోయారు. మరికొందరు తమ కార్యకలాపాలనే వదిలిపెట్టారు. మరి కొందరు స్వతంత్రంగా పనిచేసుకుంటూ కుటుంభపోషణకు పరిమితమయ్యారు.

ఏదైమైనప్పటికీ ఆనాటి పేదరికాన్నీ, దోపిడీ రాక్షసత్వాన్నీ, అష్టకష్టాలనీ కెమెరా గుండెల్లో పదిలంగా దాచారు. ఏ సాహిత్యం, కళలూ చేయలేని పని సినిమా నిర్వహించింది. ఆకలితొ ప్రాణం అనంతంలో కలిసిపోయే క్షణాల్ని చిత్రీకరించారు. ఆహారంకోసం చేతిలో కంచంతో క్యూల్లో నిలబడి అలాగే చనిపోయినవారినీ, రైలుస్టేషన్ సాలెగూడులో చిక్కిపోయినవారినీ, వారి జీవిత సత్యాల్ని కెమెరా కన్నుల్లోంచి చిత్రీకరించారు. వాటిని రికార్డు చేశారు. ఇతర ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో చూపారు. అలా అవి నిత్యం తమ కర్తవ్యం నెరవేర్చాయి. ఆ చిత్రాలు నిర్మించిన ‘మేధస్సుల’ చేతులు ఆ రంగం నుంచి నిష్క్రమించవచ్చుగాక కాని ఆ ‘చిత్రాలు’ మాత్రం తమ విధ్యుక్తధర్మాన్ని ఈనాటికీ నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రాలు కేవలం చారిత్రక వాస్తవాలకే పరిమితంగా లేవు. ఆనాటి హాలీవుడ్ సినీ సంప్రదాయ చాదస్తాలని చీల్చి చెండాడాయి. వ్యాపారసూత్రాలను కాలరాచాయి. పెట్టుబడి పరిధిని దాటి సామూహిక ఆర్ధికశక్తిని నిరూపించాయి. కళారంగాలలో కార్మిక ఐకమత్యాన్ని సినిమా మాధ్యమం కొత్తగా ప్రతిఘటించింది. పోరాటం కొత్త ప్రక్రియల్ని సాంకేతిక విజ్ఞానాన్ని తమదిగా చేసుకుంటుందని నిరూపించింది. పాత వ్యాపార ఫార్ములాని ధిక్కరించింది. కొత్త ప్రయోజనాలకోసం, కొత్త సాంకేతిక పద్ధతుల్ని నిర్మించుకుంది. పాత ధనస్వామ్య వ్యవస్థని ప్రతిఘటించడమే కాదు, పాత సినీ విలువల్ని కూడా ప్రతిఘటించింది, కొత్త ప్రజాసినిమా విలువల్ని ప్రతిష్టాపించింది. దృశ్య కవిత్వంగా సినిమాని మార్చేసారు. పాత సినీవ్యవస్థ కార్మిక వ్యతిరేక ప్రచారసాధనంగా కలల్తో జోకొట్టే కళగా సినిమాని ఉపయోగించుకుంది. అందులో ప్రజా వ్యతిరేక ధోరణులు విస్తరించాయి. ఈ ధోరణి ఇతర సాహిత్య రంగాలకన్నా సినిమాలో ఎక్కువ ఉండడంవల్ల కూడా కళాకారులు సినిమా ప్రక్రియలోకి ఎక్కువగా చొరబడ్డారు.

ఆకలియాత్ర మీద తీసిన చిన్న చిత్రాలు, పెట్టుబడిదారీ సినిమాలు పెట్టుబడిదారి పత్రికారంగాన్ని కూకటివేళ్లతో కుదిపివేసింది. వాళ్ల ప్రయత్నాలను వమ్ము చేశాయి. పెట్టుబడిదారీ విషపూరిత ప్రచారం కుట్ర ఈ చిత్రంలోని ప్రతి ఒక్క ఫ్రేమ్ సవాలు చేసింది. సాధారణ ప్రేక్షకులకు ‘వాస్తవం’ తెలిసిపోయింది. కార్మికులకు అధికారవర్గం ‘కుతంత్రం’ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోయింది.

‘ఆకలియాత్ర’ ఊరేగింపు న్యూస్ రీలుగా తీసే పెట్టుబడిదారి వర్గానికి చెందిన కెమెరామెన్ కార్మికపోరాటాన్ని వక్రీకరించే దృశ్యాలతో ప్రేక్షకులకు జుగుప్స భావం కలిగించే ప్రయత్నం చేశాడు.

పారమౌంట్ సంస్థ కెమెరామెన్, అదే సమయంలో అధికారులు జరిపిన మురికివాడల పర్యటల్ని పోలీసు అధికారుల సమావేశాల్ని, వారు తీసుకునే ముందస్తు జాగ్రత్తల్ని చిత్రీకరించడానికి అంకితమయ్యాడు.

కాని కార్మికవర్గ కెమెరామెన్ పోలీసుల దౌష్ట్యాన్నీ, లాఠీచార్జీల్నీ, తమ చిన్న చిన్న కెమెరాల్లో చిత్రీకరించారు. భాష్పవాయు బాధితులు, లాఠీ దెబ్బలు తిన్నవాళ్లు తమ బాధల్ని కెమెరాకి అందిచ్చారు. ఇతర ప్రదర్శన పొడుగునా ఇతర కార్మికులూ సానుభూతిపరులయిన ప్రజలు, నీగ్రోలు ఇచ్చిన స్వాగతాన్ని చిత్రీకరించారు.

కార్మిక చిత్రాలు మేధస్సునుకాక హృదయాన్ని కదిలిస్తాయి. సినీసాంకేతిక మెళకువల వల్లకాక వాస్తవ సంఘటనలు చరిత్రవల్ల శక్తివంతంగా తయారవుతుంది. అవి వ్యవస్థను, దోపిడీని సులభంగా అర్ధం చేసుకోవడానికి సహాయపడతాయి. అంతేకాదు ప్రపంచంలో పోరాటాలు జరుగుతున్నాయి. మనమూ చెయాలి. రేపటి ప్రపంచం మనదే అన్న ఆశను, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. WIR సమాఖ్యలో హేరీఆలన్ పొటెమ్కిస్ బాధ్యుడుగా పనిచేశాడు. కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా కాకపోయినా సాంస్కృతిక రంగం అగ్రభాగాన నిలిచి ధైర్యంతో పనిచేశాడు. కాని ముప్పై మూడు ఏళ్లకే అతడు కడుపునొప్పితో మరణించడం వల్ల అమెరికా కార్మికవర్గ సినిమాకి తీరనిలోటు ఏర్పడింది.

కార్మిక సినిమా కెమెరామెన్లు, పౌరహక్కుల కార్యకర్తగా, రాజకీయ చైతన్యం కలిగించే కార్యకర్తగా, సామూహిక దుర్గుణాల్ని చిత్రించే కవిగానూ పనిచేశారు.

సెల్ డ్జర్, బ్రాండన్ మొ.. నిర్మాతలు ఎన్నో సాహసాలతో అతి తక్కువ సాంకేతిక పరికరాలతో అద్భుతమయిన చిత్రాలను చిత్రీకరించారు. చిత్ర నిర్మాతలే కాదు. ఆ చిత్రాలను ప్రొజెక్టరులో ప్రదర్శించేవారు కూడా ఎన్నో రకాల శ్రమను ఓర్చుకున్నారు. తమ తెలివితేటలతో స్క్రీనులు లేకున్నా పోలీసు అధికారుల గృహాల తెల్లగోడలపై సినిమాలు ప్రదర్శించారు.

ఫోటోలీగు తన సభ్యులకు తగినంత ఆర్ధివసతి కల్పించలేకపోవడం వల్ల చాలా చిత్రాలు సగంలోనే ఆగాయి. సభ్యులు జీవనోపాధికోసం ఇతర పనులు చేయాల్సి వచ్చింది. WIR మాత్రమే కొందరికి ముడిఫిలిం, ప్రొసెసింగ్ సౌకర్యాలు కల్పించేది. మిగతా ప్రయాణ భత్యం, కెమెరా పరికరాల అద్దె మొ..వి సభ్యులే భరించాల్సి వచ్చేది.

1934 లో ప్రఖ్యాత హాలివుడ్ సాంకేతిక నిపుణుడు స్లాయ్‌కో కోర్కావిచ్. ఆర్ధికంగా సహాయపడి ఈ ఉద్యమానికి పూర్తి మద్ధతు ఇచ్చాడు.

డైలీవర్కర్ అనే పత్రికలోని “Flashes and close up” శీర్షికలో బ్రాడీ ఇలా రాశాడు. “పలాయనవాద సినిమాలు, అభ్యుదయం ముసుగు సినిమాలు, నాజీ సినిమాల విడుదలకీ, పెట్టుబడిదారీ ప్రభుత్వ సెన్సారు నిబంధనలకి వ్యతిరేకంగా ఫోటోలీగుని ప్రోత్సహించాల”ని విజ్ఞప్తి చేశాడు.

మీరు సినిమా కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ, అమెరికన్ రాష్ట్రాలలో ఆకలికి, ఫాసిజంకి వ్యతిరేకంగా లక్షలాది కార్మికులు జరిపే పోరాటాన్ని తెరకెక్కించే ప్రయత్నం చెస్తున్నారని గుర్తుంచుకోవాలి. (ఉదాహరణకి I believe in you) N R A చిన్న నిడివి చిత్రాలలో ఇట్లాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఈ ప్రయత్నంలో లీనమయిన కెమెరాలు, ప్రొజెక్టర్లు స్థిరపడి ఉన్న బూర్జువా కళల్ని, పెనుభూతమయి పీడిస్తున్న ఏక చత్రాధిపత్యాన్ని, ప్రసారమాధ్యమ వ్యాప్తికై పన్నే కుట్రగా సవాలుచేశాయి.

దేశ విదేశ చిత్రాలను ప్రదర్శించి ప్రతి ప్రేక్షకుడి దగ్గిర్నుండి 25 సెంట్లు వసూలు చేసేవారు. ఈ డబ్బుతో “వర్కర్స్ ఇంటర్నేషనల్ రిలీఫ్” నిర్వహించే వేసవి శిబిరాల్లో పాల్గొనే పిల్లల సహాయం కొసం ఖర్చుపెట్టేవారు. సమ్మె చేసే గని కార్మికులకోసం మందులు, ఆహారం, దుస్తులు కొనేవారు.

అమెరికా బోనస్ చట్టం వల్ల దెబ్బతిన్న గని కార్మికులు 1932లో వాషింగ్టన్‌లో ప్రెసిడెంట్ కి తమ డిమాండ్లు ఇవ్వడానికిగాను ప్రదర్షనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున వీరిని అణచివేయడానికి పూనుకున్నారు. ఆ సమయంలో ఈ కార్మికులకు ఆర్ధిక సహాయం అందించారు.

ఈ కాలంలోనే (1932లో) లీగు ఫిలిం నిర్మాణ విభాగంవారు “హంగర్” “బోనస్ మార్చ్”, “న్యూయార్క్ లో కార్మికోద్యమం”, “ది ఫోర్ట్ మెసాకర్”, “మేడే సీన్స్ రెంట్ స్త్రైక్” మొ..న్యూస్ రీళ్లు తీశారు. ఈ సినిమాల్ని వివిధ రాష్ట్రాలలో ప్రదర్శించేవారు.

కాలిఫోర్నియాలో సాండియాగో పోలీసులు యుద్ధాన్ని వ్యతిరేకించే కార్మికుల మీద దాడి చేశారు. ఆ సంఘటనను “కాటన్ పిక్కర్స్ స్ట్రైక్” పేరుతో సినిమా తీశారు. తిరుగుబాటు చేసిన రైతుల మరణశిక్షను కూడా సినిమా తీశారు. ఈ చిత్రాలకు ముందు ఒక వ్యక్తి మాట్లాడతాడు. చివరలో వ్యక్తో, నాయకుడో ముగింపు మాటలు చెబుతాడు. ఈ విధంగా ఒక ప్రత్యేక ఉపన్యాస శైలిని సమకూర్చడం జరిగింది. ఈ సినిమాలన్నీ ‘వెండితెర’ మీద ఏనాడూ ప్రదర్శనార్హం కాలేదు. ఆ చాయలకే వెళ్లలేదు.

వార్తా పత్రికల్లో వచ్చిన రిపోర్టుల్లాగే ఈ చిత్రాలు ఉండేవి. ఇంకా చెప్పాలంటే డాక్యుమెంటేషన్ స్వభావం కలిగి ఉండేవి.

చాలా చిత్రాలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసేవారు. లైటింగ్ సరిగ్గా ఉండేది కాదు. దూరం ఎక్కువయ్యేది. వర్షం, మంచు, పోలీసులలాంటి అవరోధాల కారణంగా లభించిన అవకాశన్ని బట్టే వాస్తవ సంఘటనలను చిత్రీకరించేవారు. ఈ చిత్రాలు తీసేవాళ్లంతా ఔత్సాహికులే. అనుభవజ్ఞులెవరూ లేరు. దహించే తృష్ణ, న్యాయదీక్ష వారికి చలన చిత్రీకరణ శాస్త్రాన్ని బోధించాయి. నేర్పాయి. సంఘటన మాసిపోక ముందే చిత్రాన్ని కార్మికులకు ప్రదర్శించాలని హడావిడిగా ఎడిట్ చేసేవారు. రష్యన్ గతితార్కిక విధానంగాని, సాంకేతికపరమైన సౌకర్యాలతో గాని ఎడిటింగ్ జరిగేది కాదు. ఎందుకంటే అసలు ఎడిటింగ్ సామగ్రి(మూవియోలా మొ..)లేదు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎడిటింగ్‌ని ఇలా ఉంటే బాగుంటుననే భావనతోనే చేసేవారు. ఇంతా చేసి ఎలా ఉంది అని అడగడానికి సరైన వ్యక్తులు లేరు. ఒక టన్ను బరువు చేసే పోర్టబుల్ ప్రొజెక్టర్లు ఉండేవి.

“ఫోర్ట్ మెసాకర్” అనే 8 నిమిషాల చిత్రం ఎంతో శక్తివంతంగా తయారయింది. ఫోర్డు ఫౌండేషన్ మేనేజిమెంటు వారికి కార్మికులు, తమ డిమాండ్లు ఇవ్వడానికి పోయినప్పుడు పోలీసుకాల్పుల్లో నలుగురు మరణించారు. 50 మందికి గాయాలు తగిలాయి. ఈ చిత్రం మరణించిన నలుగురు కార్మికుల అంత్యక్రియలు జరుగుతున్న దృశ్యంతో మొదలవుతుంది. కాల్పుల ఊరేగింపు దృశ్యాలు లేవు. ప్రత్యామ్నాయంగా ఊరేగింపు దృశ్యాల తాలూకు ఫోటోలు మాత్రమే ఉపయోగించారు. కెమెరా పనితనం వల్ల కాకుండా, సంఘటనల బలం వల్లనే అది శక్తివంతంగా రూపొందింది. ఈ విధంగా లీగు చిత్రాలు, వార్తలుగా, వ్యాఖ్యలుగా సూటి ప్రచార సాధనాలుగా ఉండేవి. ఇందులో కొంత విశ్లేషణ, కొంత నాటకీయత చోటుచేసుకొనేది కూడా. మొత్తానికి ఈ చిత్రాలు ఆనాడు కార్మిక లోకానికి బాగా అర్ధమయ్యేవి. ఉపన్యాసాలకన్నా వీటినుండే ఎక్కువ ప్రేరణ పొందేవారు.

హాలీవుడ్ చిత్రాలను నిరాకరిస్తూ, సోవియట్ చిత్రాల పట్ల మక్కువ చూపిస్తూ కార్మిక చిత్రాలు వచ్చాయి. కాని ఈ చిత్రాలు రష్యాచిత్రాలకన్నా విభిన్నమయిన రీతిలో వచ్చాయి. వీటిని కేవలం, దృశ్య కరపత్రాలు అనవచ్చు. ఇంగ్లీషులో agitiki (Agitational Films) అనేవారు. వీటిలో పోరాట చైతన్యం నిండి ఉండేది. ఈ చిత్రాల ముడిసరకుతో 1960 ప్రాంతంలో కార్మిక రాజకీయం కోసం అమెరికాలో కొన్ని చిత్రాలు వచ్చాయి.. ఇవి కొంత ఈస్తటిక్ విలువలతో, తీవ్రభావసమన్వితంగా ఉన్నాయి. హాలివుడ్ రంగుల ప్రపంచంలో అణగదొక్కబడిన నలుపు తెలుపు వాస్తవాలు బయటపెట్టడానికి మళ్లీ ఈ చిత్రాలు ఉపయోగపడ్డాయి. అంటే మళ్లీ పునరుజ్జీవనం పొందాయి.

సాంబ్రాడీ, లీవర్ విడ్జ్, డేవిడ్ స్లాట్, ఆల్ఫ్ స్టెయిన్ లీసెల్ డ్జరీ, లెవీ జాకబ్, టాంబ్రాండెన్ మొదలగువారంతా ఒక దశాబ్ధం విశేషంగా కృషిచేసి కార్మిక సినిమాని సుసంపన్నం చేశారు. టాంబ్రాండెన్ వామపక్ష సినీనిర్మాణం పంపిణీ రంగంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోదగిన విధంగా పనిచేశాడు.