Menu

మరణించేలోగా చూడాల్సిన చిత్రం – డిపార్చర్స్

మనందరికీ తెలిసినా మనం తలుచుకోకూడదు అనుకునే పరమ సత్యం : మరణం.

చచ్చిపోతాం అని తెలిసినా బ్రతుకుకోసం ఆరాటపడతాం. జీవితంలో అందరం ఇంకొందరితో భవబంధాలతో ఇరుక్కున్నవాళ్ళం. తల్లి, తండ్రి, సోదరులు,భార్య, భర్త, స్నేహితులు..మనకంటే మనకు అమూల్యమైనవారు ఎందరని ? మనం ఎలా ఉన్నా వీళ్ళు బావుండాలి అని ఎంతగా తాపత్రయపడతామో కానీ. ఇటువంటి మానవజీవితంలో మనిషికి తన మరణం కంటే కూడా భయంకరమైన శాపం, ఆప్తుల మరణాన్ని చూసే స్థితి.

ఇప్పటికి ఈ వ్యాసం చదువుతున్న మీరు, ఒక క్షణం ఆగండి. మీకు ఒక కఠినమైన పరీక్ష పెడుతున్నాను. మీ జీవితాలను బాగా కలచివేసిన మరణం ఏమిటో గుర్తుకుచేసుకోండి. ఆ వ్యక్తి. ఎవరు ? ఆ వ్యక్తికీ మీకూ ఉన్న అనుబంధం. ఆ వ్యక్తి ముఖం కళ్ళ వెనుక మెదులుతోందా ? ఇప్పుడు.. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని మీరు చూసారా ? అప్పుడు ఆ ముఖం ఎలా ఉంది ? జీవం లేని ఆ వ్యక్తి శరీరం, స్పర్శ ఏమైనా మెదులుతున్నాయా ? బాగా గుర్తుకుచేసుకోండి.

ఎవరికైనా భరించలేనంట దు:ఖం వస్తే తనివితీరా ఏడ్చండి. ఇదంతా గుర్తుచేస్తున్నందుకు నన్ను ఎలా అయినా తిట్టుకోండి. కానీ , ఇదంతా ఒక చిన్నపాటి సైకలాజికల్ ఎక్సర్సైజ్ అనుకోండి. ఇప్పుడు… మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తులయిన వారు ఎవరైనా రేపు మరణిస్తే ? ఆ ఊహ…. భరించగలరా? ఆ ముఖాలను అలా జీవం లేకుండా చూడగలరా ? అసాధ్యం అనిపిస్తోంది కదూ ? కానీ ఇది ఎప్పుడయినా జరగొచ్చు. ఆ విషయం తెలిసీ మనం ఎదుర్కోలేకుండా దాటవేస్తున్న నిజం.

ప్రతి మనిషీ పారిపోయే ఈ నిజం గురించి తీసిన ఒక అద్భుతమైన సినిమా గురించి ఈ ఉపోద్ఘాతమంతా. నా మటుకు నాకు, ఇది ఒక సినిమా మాత్రమే కాదు , ఒక పాఠం, వేదం . పేరు :  DEPARTURES language : Japanese (http://www.imdb.com/title/tt1069238/ ) 2009 సంవత్సరానికి ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కారు అందుకున్నది. నటులు , దర్శకులు ఎవ్వరూ నాకు తెలియదు. కాబట్టి వారి గురించి గూగుల్ చేస్తే వచ్చే సమాచారం నేను చెప్పబోవట్లేదు.

ఈ సినిమాలో కథ అనేది చెప్పాలంటే ఒకే ఒక వాక్యం :
ఉద్యోగం కోల్పోయిన ఒక ఫిడేలు వాద్యకారుడు ( cellist. cello కూడా ఫిడేలులాంటిదే కదా ), ఉపాధికోసం ట్రావెలింగ్ ఏజెన్సీ అనుకుని , పార్థివ దేహాలకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించడమే పనిగా చేసే ఒక కంపెనీకు వెళ్ళి , మెల్లగా ఆ ఉద్యోగం ద్వారా జీవితం అంటే ఏమిటో తెలుసుకుని, తన వాళ్ళకు తెలియజెప్పి  తన బ్రతుకును అత్యంత ప్రేమమయంగా మలుచుకుంటాడు. అంతే కథ.

మనం భయపడే మరణం మనలో జీవితం అంటే ప్రేమను రగల్చగలదా? అవునేమో అనిపిస్తుంది ఈ చిత్రంలోని సన్నివేశాలు చూస్తే.  నా గుండెకు హత్తుకున్న సన్నివేశాలు కొన్ని చెప్పడం మినహా ఈ చిత్రం గొప్పదనం చెప్పడానికి నేను చాలను అనిపిస్తోంది. ప్రతి సన్నివేశమూ గొప్పదే , వాటిల్లో టాప్ అని కాదు కానీ అయిదు సీన్లు చెబుతాను  ( ఇలాంటివి చా…లా ఉన్నాయి ఈ సినిమాలో..ఇవి శాంపుల్స్ మాత్రమే )

1. మొదటి రోజు డ్యూటీ చేసాక, హీరో తనపై శవం తాలూకు కంపు వస్తోందని paranoic గా భయపడిపోయి , దారిలోనే స్నానాలగదికి వెళ్ళీ, సబ్బుతో ఒళ్ళు అరగదీసి ఇంటికెళతాడు. తాను చేస్తున్న పని ఏమిటో భార్యకు చెప్పడు , ఆమె అసహ్యించుకుంటుందేమో అని. భోజనానికి ఒక కోడిను వడ్డిస్తే , అందులోనూ కోడి శవమే కనిపించే వాంతులవుతాయి. ఏమయ్యిందని భార్య అతడి దరికి చేరితే……   జీవించి ఉన్న, రక్తమాంసాలతో ,శ్వాసతో కదులుతున్న ఒక శరీరం దొరికిందన్నట్లు ఆత్రంగా ఆ శరీరంలోకి ఇమిడిపోవాలని చూస్తాడు. ఆ కౌగిలింతను చిత్రీకరించిన తీరు అత్యద్భుతం.

2.జపాన్ వారి సాంప్రదాయం ప్రకారం మృతదేహాలకు మంచి బట్టలు తొడిగి , ముఖానికి మేకప్ వేసి (బ్రతికున్నప్పుడు ఆ మనిషి ఎలాంటి మేకప్ వాడితే అలాంటిది) పిదప ఖననం చేస్తారుట. ( మన దేశంలో హిందువులు కూడా ముఖానికి పసుపు పూయడమో, బొట్టు పెట్టడమూ..చాలా చేస్తారు కదా ). ఒక స్త్రీ చావుకు అయిదు నిముషాలు ఆలస్యంగా వెళ్ళిన హీరోనూ, అతని బాస్‍ను మృతురాలి భర్త దుర్భాషలాడుతాడు ” శవాలమీద ఆధారపడి బ్రతుకుతున్నావ్ , నీ స్థానం తెలిసి ప్రవర్తించు” అని.  క్షమాపణల తర్వాత వాళ్ళిద్దరూ తమ పని మొదలెడతారు. మృతురాలి ఫోటోలో ఆమె నవ్వుతూ అందంగా కనిపిస్తుంది. కానీ శవం మాత్రం కాస్త నోరు తెరుచుకుని , ప్రేతకళతో ఉంటుంది. వాళ్ళు ఆ స్త్రీ శరీరానికి మేకప్ వేస్తుంటే తన భార్య ముఖం కనిపించే విధానం మారుతుంటే ఆ భర్త నిర్వేదంగా చూస్తుండిపోతాడు. ఈవిడ ఫేవరెట్ లిప్‍స్టిక్ ఏది అని అడుగుతారు వాళ్ళు. తెల్లమొహం వేస్తాడు భర్త. పక్కనే ఉన్న పదేళ్ళ కూతురు పరుగున తెచ్చి ఇస్తుంది. అంతవరకూ తన భార్యకు ఒక రకమైన లిప్‍స్టిక్ అంటే ఇష్టమనీ ,అది తనకు తెలియనీ లేదనీ ,తన కూతురుకు తెలుసనీ అర్థం చేసుకున్న భర్త నిర్ఘాంతపోతాడు. ఆ లిప్‍స్టిక్ వేసాక. …శవం ముఖం అచ్చంగా ఫోటోలో ఉన్న ముఖంలానే కనిపిస్తుంది. అంతసేపూ పెదవి చాటున దు:ఖాన్ని అణుచుకున్న కూతురు , తన తల్లిని మళ్ళీ చూసినట్లు , గుర్తుపట్టినట్లు ” మా” అంటూ అప్పుడు భోరుమంటుంది. ఇక భార్యను పెట్టెలో పెట్టేస్తుంటే అంతసేపూ రాయిలా భావాలను అణుచుకున్న భర్త కూడా తల్లడిల్లిపోతాడు.  మునుపు తిట్టినందుకు హీరోనూ, అతడి బాసునూ పదేపదే క్షమాపణ కోరి బహుమతి ఇచ్చి పంపుతాడు.

3.  ఒక ముసలాయన మృతదేహానికి మేకప్ చేసాక, అతని మనవరాళ్ళలో ఒక అమ్మాయి దు:ఖిస్తూ శవం నుదుటిని చుంబిస్తుంది. ఆ అమ్మాయి పెదవులనుంచి లిప్‍స్టిక్ ముద్రలు , శవం నుదుటిపై అతుక్కుంటాయి. అంత దు:ఖంలోనూ ఆ దృశ్యం చూసిన మనవరాళ్ళు ఫక్కుమని ఆనందబాష్పాలు రాల్చుతారు. ఇది సన్నివేశం కాదు కానీ మాంటేజ్‍గా వచ్చే కొన్ని దృశ్యాల్లో ఒకటి.

4. ” నువ్వు చేసేదీ ఒక ఉద్యోగమా అదీ ఒక వృత్తేనా ? ” అంటూ ఛీదరించుకుని కథానాయకుడికి దూరమైపోయిన ఒక స్నేహితుడు , తన తల్లి చనిపోయినప్పుడు ఉద్యోగధర్మంలాగానే అయినా perfectionతో , ప్రేమతో హీరో చేసే పనిని చూసి ఆ పనిలో అతడికి ఎంత సంతోషం వస్తోందో ఊహించగలుగుతాడు. అదే సన్నివేశంలో హీరో భార్య కూడా తన భర్తను చాలా ముచ్చటగా చూస్తుంది. సంభాషణలే లేకున్నా కళ్ళతో , హావభావాలతో ఈ నటులు అభినయించిన తీరు గుండెను హత్తుకుంటుంది. అప్పటివరకూ చావును అసహ్యించుకున్న ఆ వ్యక్తి , దానిపట్ల ఆకర్షితుడవుతాడో లేక తన తల్లి శరీరం నశించేంతవరకూ చూడాలనో మరి INCINERATORలోకి తన తల్లి శవం ఉన్న పేటికను ఉంచుతున్నప్పుడు అక్కడ ఉండే ఉద్యోగిని అడుగుతాడు : ” నేను పూర్తిగా చూడొచ్చా? ” అని. మంటల్లో శరీరం బూడదవ్వడం కూడా చూసాక కానీ అతడికి తల్లిపోయిన లోటు పూర్తిగా అర్థం కాదు. అంతవరకూ అణిచిపెట్టుకున్న దు:ఖం ముంచెత్తుతుంది. అప్పుడు అక్కడి ఉద్యోగి తమ వృత్తి గురించి చెప్పే మాట : ” మరణం అంతం కాదు. ప్రాణానికి తన ప్రయాణంలో ఒక తలుపు లాంటిది. నేను ఆ తలుపు దగ్గరి ద్వారపాలకుడని మాత్రమే. నేను సాగనంపే ప్రతిప్రాణానికి చెప్పుకుంటాను…. గుర్తుంచుకో , నేను నిన్ను ప్రేమగా, ఇష్టంగా, జాగ్రత్తగా పంపుతున్నాను అని ”

బహుశా , మరణం పట్ట అంతటి ప్రేమను సంపాదిస్తే మనిషి దాన్ని జయించినట్లే అనిపించింది నాకు. నేర్చుకోవలసిన, ఆచరించవల్సిన గొప్ప విషయం అనిపించింది.

5. ఇది ఒక సన్నివేశం అని కాదు కానీ , సినిమాలో కొంత కథ జరిగాక , హీరో , తన బాసూ , కంపెనీలో రిసెప్షనిస్టులా పన్జేసే ఒక అమ్మాయీ , ముగ్గరూ కూడా తమ పని పూర్తయ్యాక వచ్చిన డబ్బులతో మంచి రెస్టారెంట్లకు వెళ్ళి కోరికోరి రుచికరమైన ఆహారపదార్థాలను తింటారు. అంత చావును చూసి , తద్వారా వచ్చిన డబ్బుతో ,అది మరచిపోయి జిహ్వను తృప్తి పరుచుకున్నందుకు తమను తామే ద్వేషించుకోవాలి అనుకుంటున్నా అలా అహారానికి అడిక్ట్ అయిపోతారు.  ఇక్కడ అంతర్లీనంగా దర్శకుడు చెప్పదల్చుకున్నది ,తృప్తి అన్నది మనసుకు  ఎంత అవసరమో శరీరానికీ అంతే అవసరం. ఆకలి , కడుపునింపుకోవడం అనేది ప్రతి జంతువుకూ BASIC NEED. కానీ జంతువుకూ మనిషికీ మొట్టమొదటి తేడా , అవసరం తీర్చుకోవడంలోని refinement. జిహ్వను తృప్తిపరుచుకుంటే జీవాత్మను తృప్తి పరిచినట్లే అని మన పెద్దవాళ్ళుకూడా అనడం , ఏ సెలబ్రేషన్ అయినా మంచి ఆహారంతోనే ముగుస్తుంది. మరణాన్ని అలా పండుగలా జరుపుకోవాలి అంటే జీవితాన్ని మరింతగా అనుభవించడమే అని చెప్పడానికే ఆ పాత్రలు అలా భోజనప్రియులు అవుతారు.

ఇక నాకు నచ్చని అంశమూ ఒకటి ఉంది. అంటే నచ్చలేదు అని కాదు కానీ, అంత గొప్పగా అనిపించనిది.. క్లైమాక్స్. కానీ plot కోసం అనో , feel good Note తో ముగిద్దాం అనో మరి , మామూలుగా ప్రతి చిత్రంలోనూ ఉండే గ్రీటింగు కార్డు తరహా మెలోడ్రామాతో , హీరో తండ్రికి ,అతనికి పుట్టబోయే బిడ్డకూ సంబంధించిన ట్రాక్‍తో సినిమా ముగించారు. ఆ ముగింపును రకరకాలుగా చెప్పుకోవచ్చు , అవి ఏమిటో నేను చెప్పడం అంటే మరీ అరటిపండును వలిచి నోటికి అందించడమే. కాబట్టి మీ పండును మీరే తినండి.

ఇక టైటిలు గురించి. జపనీస్ భాషలో ఎలా కుదిరిందో కానీ ఇంగ్లీషు తర్జుమాప్రకారం అయితే , DEPARTURES కంపెనీ అని పేపరు ప్రకటన చూసి ఈ ఉద్యోగానికి వెళతాడు హీరో. వెళ్ళాక అక్కడి బాసు ఆ ప్రకటనను చూసి , అచ్చు తప్పు ఉందనీ , departed అని ఉండాల్సింది అని చెబుతాడు.  కానీ సినిమా పేరు మాత్రం departures అనే ఉంచారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఛమక్కు. పైన చెప్పిన సంభాషణ ఉదాహరణ ప్రకారం మరణం అంటే పోవడ్ంఅ కాదు , పోతూ ఉండడం అని టైటిలులోనే చెప్పదల్చిన ఉద్దేశ్యం.

ఇక కొంతమంది ఛాందస జపనీయులకు ఈ చిత్రంపై కినుక. Japanese traditional death rituals గురించి పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా చెప్పలేదు అని. కానీ అవంతా చెప్పి ఉంటే అసలు భావం మరుగున పడేది అని నాకు అనిపించింది. అయినా ఈ సినిమాలోనే ఒక డైలాగు ఉంది, ” క్రిస్తియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, హిందూ అయినా.. ఎవరయినా మనకేంటి , మన పని ఒకటే ” అని. కాబట్టి దర్శకుడు కావాలనే సాంప్రదాయాల్ని చూపించదలచలేదు అనుకుంటున్నాను. .  ఈ సినిమా చూసేటప్పుడు చాలా మందికి కన్నీళ్ళు వస్తాయి , కాబట్టి మీరు ఏడ్వడం ఎవ్వరూ చూడకూడదు అనుకుంటూ ఒక్కరే చూడండి.(నువ్వు ఏడవలేదా అని నన్ను అడిగితే గర్వంగా చెప్పుకుంటాను , కొన్ని సన్నివేశాలకు కళ్ళారా ఏడ్చాను , కొన్నిటికి ఏడవకుండా అదుపు చేసుకోగలిగాను,కళ్ళు తడిసేలా నవ్వాను కూడా )

ఇదిగో ఈ సినిమాకు సంబంధించిన  ట్రైయిలరు

ఇక… ఆఖరుగా సొంతగోల.
ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనలో చాలా మంది అనుకునే మాట, మన భారతీయ/తెలుగు సినిమాలు ఇంత అద్భుతంగా ఎందుకు ఉండవు అని. ఇలాంటివి నచ్చే చాలా మందికూడా ఇలాంటి సినిమా తీస్తే జనాలు థియేటర్లలో చూడడం జరగదు. వందల రూపాయలు పెట్టి థియేటర్లకు వచ్చేది పాప్‍కార్నులూ, కూల్‍డ్రింకులూ తాగుతూ ఎంజాయ్ చెయ్యడానికే కానీ సినిమా ఆద్యంతం కళ్ళు చెమర్చేలా ఉంటే వ్యాపారం ఎలా జరుగుతుందీ అని. ఆ మాట నేనూ ఒప్పుకుంటాను. ఇలాంటి సినిమా నిజంగా మన దేశంలో అయితే థియేట్రికల్‍ వ్యూయింగ్ కష్టమే. కానీ , ఇలాంటి సినిమా తీయాలి అంటే అందులో ఆర్థికపరమైన లాభం చూసుకుంటే పని జరగదు అనిపిస్తోంది. పెద్ద సెట్టింగులు లేవు , కెమెరా, ఫోటోగ్రఫీ అన్నీ చాలా basic లెవెల్స్‌లో ఉన్న ఇలాంటి చిత్రం తీయాలి అంటే… మన పెద్ద హీరోల రెమ్యూనరేషన్‍లో పదో వంతు చాలు. ఎవరో ఏదో చేస్తారు అని ఈ మాట చెప్పడం లేదు, మంచి సినిమా తీయాలి అందుకు కోట్లు లేవు అనుకునే సినీ ప్రేమికులందరూ ఈ సినిమా చూసి , ధైర్యం తెచ్చుకోవచ్చు….. కేవలం నలభై యాభై లక్షల్లో ఇలాంటి సినిమా రూపొందించవచ్చు అని. ఆ ధైర్యం , నమ్మకం మీక్కూడా కలిగాలి అంటే , సినిమా చూసాక , లొకేషన్లూ, నటులూ, లైటింగ్ సెటప్పులూ , ఎన్ని రోజుల షూటింగు సరిపోతుందో ఒక పేపరు మీద లెక్కవేసుకుని చూడండి. లెక్కలు అబద్ధాలు చెప్పవు.

ఇక చివరగా.. దర్శకుడి నిబద్ధత. వికీపీడియాలో ఉన్నదే అయినా మళ్ళీ చెబుతాను : ఈ సినిమా ఒక పుస్తకం ఆధారమే అయినా , ఆ పుస్తకం చదివిన దర్శకుడు తను కూడా స్వయంగా ఇటువంటి భావనలు అనుభవించడానికి తానూ ఎన్నో చావులకు వెళ్ళాడట. పది సంవత్సరాల మేకింగ్ పట్టిందట ఈ చిత్రానికి , మానసికంగా అతను సిద్దమవ్వడానికి. జోహార్.

– విప్లవ్
http://viplove.blogspot.com/

16 Comments
 1. kvrn May 5, 2010 /
 2. venu May 5, 2010 /
 3. sujata May 5, 2010 /
 4. Srinivas Komanapalli May 5, 2010 /
 5. raghu May 5, 2010 /
 6. rajasekhar May 5, 2010 /
 7. rahul May 5, 2010 /
 8. అభిమాని May 5, 2010 /
 9. Kala May 10, 2010 /
  • Kala May 10, 2010 /
   • viplove May 10, 2010 /
 10. radhika May 11, 2010 /
 11. keshavcharan May 17, 2010 /
 12. Ramachandra Murthy June 1, 2010 /
 13. srikanth June 2, 2010 /