Menu

Before The Rain – పరిచయం

“Time Never Dies. The Circle Is Not Round”

పై వాక్యం అంతఃసూత్రంగా నడిచే Macedonian సినిమా, Milcho Manchevskiచే డైరెక్ట్ చేయబడిన Before The Rain (1994) . ఈ సినిమాకి నేపథ్యం 90 లలో Macedonian క్రిస్టియన్లకి, Albanian ముస్లింలకు మధ్య తరతరాలుగా…కచ్చితంగా చెప్పాలంటే 500 సం.లుగా నడచిన ఘర్షణలు. వీటికి Balkan Conflict అని పేరు.

story has a beginning, a middle and an end… but not necessarily in that order అని సినిమా పెద్దలు చెప్పినట్టు ఈ సినిమాలో కథ మొదలు, మధ్య మరియు చివర క్రమంలో ఉండవు. ఇదేమీ విశేషం కాకపోయినా ….సినిమా మొదలు , చివర ఒకటే కావటమే పెద్ద విశేషం. అంటే సినిమా ఎక్కడ మొదలవుతుందో అక్కడే ముగుస్తుంది. ఎక్కడ ముగుస్తుందో అక్కడే మొదలవుతుంది. మొదలు, ముగింపు ఒకటే కావటం మనకు Circle ని గుర్తు చేసినా పైన చెప్పినట్టుగా “Circle Is Not Round”అనే విషయాన్ని తనదైన శైలిలో నిరూపణ చేస్తాడు దర్శకుడు.

కథని చెప్పడంలో దర్శకుడు ఒక వినూత్న పంథా అనుసరించాడు. కథని మూడు episodes లో, non-linear, non-chronological స్టయిల్లో చెప్తాడు. కథని మూడు అధ్యాయాలుగా విడగొట్టి చెప్పడంలో ఇలాంటి Screenplay తోటే వచ్చిన Pulp Fiction సినిమా ప్రభావం Before The Rain మీద ఏ మాత్రమూ లేదు. ఎందుకంటే రెండు సినిమాలు Simultaneous గా తయారయ్యాయి. రెండూ 1994 లోనే రిలీజ్ అయ్యాయి.

కాలక్రమంలో సాధ్యం కాని కొన్ని సంఘటనల్ని జరిగినట్టుగా చూపించి మనల్ని కన్ఫ్యూజన్కి గురి చేసి, మన చేత ఆలోచింపచేసి, మనల్ని మనం లాజికల్‌గా సమాధానపరచుకోలేక, కేవలం తాత్వికంగా మాత్రమే సమాధానపడేట్టు చేసి, మనకు ఏం చెప్పాలనుకున్నది స్పష్టపరుస్తాడు Milcho. ఈలాంటి సంఘటనలవల్ల సినిమాకు ఎంతో డెప్త్, ఇంటెన్సిటి కలుగుతాయి, అదే సమయంలో ఒక గొప్ప సినిమాగా తయారవ్వటానికి మూలమవుతాయి. కథని ఇలాగే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో దర్శకుడి మాటల్లోనే…

“I am Macedonian but I live in Germany. So I think I have an overview so that I am able to criticize. The problem between the ethnic groups in Macedonia go around in circles. But in the end it turns out that the circle goes round like a ferry wheel. Everything is happening again and again. The circle is not round though. In every end there is a change. A change which always makes the new beginning worse. In a way it is like a spiral.”

ఇక కథలోకి వస్తే, పైన చెప్పినట్టుగా కథ మూడు అధ్యాయాలుగా -Words, Faces, Pictures –చెప్పబడుతుంది. మూడు కథలూ విడివిడి గా చూస్తే షార్ట్ ఫిల్మ్స్ లానే ఉంటాయి. కానీ ఇవి ఒకదానికొకటి interlinked. వీటిని గురించి నేనిక్కడ చెప్పబోవడం లేదు. మొదటి మూడవ కథలు Macedonia లోనూ రెండవ కథ London లోనూ సాగుతుంది. కథలోని ప్రధాన పాత్రలు తరాలుగా సాగుతున్న ఈ రావణ కాష్టం(Balkan Conflict)తో ఏ మాత్రం సంబంధం లేని పాత్రలు. కానీ ఈ పాత్రలు మూడు కథల్లోనూ ఏదో ఒక పక్షం వహించాల్సిన పరిస్థితులు ఎదుర్కొని, ప్రేమ, జాలి, దయ వంటి ఉన్నత మానవతా విలువలవైపు మొగ్గుచూపి ఓడిపోతాయి.

మౌనవ్రతం పాటిస్తున్న ఒక యువ Macedonian క్రైస్తవ సన్యాసి-కిరిల్-కి. Albanian ముస్లిం యువతి-జమీరా-కి మధ్య సాగుతుంది “words” అనబడే మొదటి అధ్యాయం.

Macedonian అతివాదులచేత హత్యానేరం ఆరోపింపబడి, ఆత్మరక్షణకై కిరిల్ గదిలో తలదాచుకుంటుంది జమీరా. మొదట సంశయించినా… జాలితో జమిరాకీ ఆశ్రయమిస్తాడు. మరుసటిరోజు తనని  వెతుకుతూ వచ్చిన Macedonian అతివాదులనుండి, అబద్దం చెప్పి(సంజ్ఞతో) కాపాడుతాడు. కానీ ఈ విషయం చర్చి పెద్దలనుండి దాచలేక పోతాడు. దీంతో తన మౌనవ్రతం వీడి తనను ప్రేమిస్తున్న జామీరాతో అక్కడినుండి బయటపడతాడు కిరిల్. కానీ వీళ్ళ ప్రేమ కథ త్వరలోనే..జమీరా మృతితో ముగిసిపోతుంది.

London లో సాగే “Faces” అనే రెండవ అధ్యాయం…. Anne అనబడే English యువతి కథ. Pulitzer అవార్డ్ పొందిన Aleksander అనే Macedonian Photo Journalist Anne ప్రియుడు. సడన్‌గా ఒకరోజు Aleksander తన స్వదేశం (Macedonia) వెళ్తున్నాను తనతో వచ్చేయమని అడుగుతాడు, అప్పటికే తన భర్త వల్ల అన్నే గర్భవతి. ఈ విషయాన్ని చర్చించడానికి భర్తని ఒక రెస్టారెంట్లో కలుస్తుంది. అక్కడ పనిచేసే ఒక వెయిటర్‌కి, ఒక కస్టమర్‌కి మధ్య జరిగిన గొడవ Anne జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. విచిత్రంగా ఈ ఘర్షణకు కారణమైన వ్యక్తులు Balkan కు సంబంధించిన వాళ్ళే. ప్రపంచంలో ఏదో ఒక మూల జరిగే హింస ప్రభావం , తక్కిన ప్రపంచం మీద కూడా ఉంటుందనీ, అదే సమయంలో ఏ ప్రాంతమూ హింసకు అతీతం కాదని చెప్పకనే చెపుతాడు దర్శకుడు.

మిగిలిన రెండు కథల కంటే ఎక్కువ నిడివి ఉన్న కథ “Pictures”. బోస్నియాలో తన వృత్తి (Photo Journalism) ఒక సైనికుడి మరణానికి కారణమైందని London లో తన ఉద్యోగాన్ని విడిచి తన సొంత గూటి(Macedonia)కి చేరుతాడు Aleksander. తుపాకిలతో స్వాగతం పలుకుతారు తన సొంత ఊరి ప్రజలు. తన చిన్ననాటి స్నేహితురాలిని – Albanian Muslim -కలవడానికి వెళ్ళినపుడు, రెండు వైపుల ప్రజలు ఎంత విద్వేషంతో రగిలిపోతున్నారో తెలుసుకుంటాడు అలెక్స్. తన వారినుండి ఎంతో ఒత్తిడి ఉన్నా ఏ పక్షమూ వహించడు. కానీ తన స్నేహితురాలి కూతుర్ని(జమీరా) కాపాడే ప్రయత్నం చేస్తాడు అలెక్స్. మళ్ళీ మానవత్వం, తుపాకీ చేతుల్లో ఓడిపోతుంది.

ఈ సినిమాలో అతిపెద్ద లోపం ఏ కారెక్టర్ని కూడా పూర్తిగా expose చేయడు దర్శకుడు. పాత్రల పరిధి చాలా తక్కువ, ఈ సినిమాని ఒక డాక్యుమెంటరీ కాకుండా కాపాడింది దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్‌ప్లే. సినిమాలో అందరికన్నా నిడివి ఎక్కువగా ఉన్న Aleksander పాత్రకి కూడా చాలా తక్కువ డైలాగులుంటాయి. Macedonian పర్వతాలని అద్బుతంగా చూపించిన కామేరా పనితనానికి మిగతా విభాగాలకన్నా ఎక్కువ ప్రశంసలు లభించాయి. విమర్శలున్నా దర్శకుడి ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేము.

“Before The Rain” మనకి నచ్చినా నచ్చకపోయినా మనల్ని ఆలోచింపచేయకుండా మాత్రం ఉండదు.

–Vamsi K Kumar

6 Comments
    • వంశీ కె కుమార్ May 11, 2010 /
  1. rayraj May 14, 2010 /
    • Vamsi K Kumar May 15, 2010 /