Menu

మొదటి సినిమా – అన్నే మోహన్ గాంధీ

శ్రీ మోహన్ గాంధీగారు ‘కర్తవ్యం’ , ‘మౌనపోరాటం’.. లాంటి సందేశాత్మక, సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలతోపాటు ‘మంచి మనసులు’ , ‘వారసుడొచ్చాడు’ లాంటి ఫేమిలీ సెంటిమెంట్ సినిమాలకూ దర్శకత్వం వహించి సూపర్‍ హిట్‍ చేసిన ఘనత ఆయనది. ఇంతవరకూ దాదాపు 40 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన గాంధి గారు కొన్ని కన్నడ సినిమాలకి కూడా దర్శకుడిగా పనిచేశారు.

మొదటిసినిమా అనుకోగానే ఒక్కసారిగా మనసు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. చిత్రరంగంలో పనిచేసే వాళ్లకి మొదటి సినిమా అంటే .. ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి, మొదటి సినిమాకి ఇచ్చే నిర్వచనాన్ని బట్టి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమే .. అంటే .. సినిమా రంగంలోకి ఏదో ఒక సినిమా తోటి ప్రవేశిస్తాం, మరో సినిమాతోటి మా రంగానికి చెందిన శాఖలో అడుగుపెడతాం .. ఇంకో సినిమా తోటి మా శాఖలో నిజమైన పేరు తెచ్చుకుంటాం. ఒక్కో కోణంలో ఇలా ఇవన్నీ మొదటి సినిమాలే అనిపిస్తాయి ..

నా విషయానికొస్తే ..

విజయవాడలో బి.ఎస్సీ ముగించుకుని కేరళలోని మణిపాల్‍లో ఇంజనీరింగ్ కోర్సులో చేరినా, ఆరోగ్యం దెబ్బతినడం వల్ల 4 నెలలు తిరక్కుండానే చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పి ‘ బ్యాక్‍ టు హోమ్ ‘ అవ్వాల్సి వచ్చింది. ఒక విశేషమేమిటంటే, మణిపాల్ వెళ్ళేటప్పుడల్లా మాకజిన్ వెంకటరత్నం నాకు తోడుగా  నన్ను దిగబెట్టి వస్తుండేవాడు. ఆ ప్రయాణం మధ్యలో మద్రాసులో దాదాపు ఉదయంనుంచీ సాయంకాలం వరకూ ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో మా కజిన్ వెంకటరత్నానికి దూరపు బంధువూ, అంతకు మించి మంచి మిత్రుడూ, అప్పుడే తెలుగు చలన చిత్రరంగంలో హీరోగా ఎదుగుతున్న శ్రీ శోభ‌న్‌బాబు గారింటికి వెళ్ళేవాళ్ళం. ఆయన నాగురించి క్షేమ సమాచారాలు తెలుసుకుంటుండేవారు.

చదువు మానేసి విజయవాడ వచ్చేసాక మళ్ళీ ఆరోగ్యం కుదటపడడానికి ఏడెనిమిది నెలలు పట్టింది. చదువు మీద ఆసక్తి తగ్గింది. అప్పటికే స్టేజి నాటకాలతో అనుభవం ఉండటం వల్ల, వెంకటరత్నంతో చెప్పాను ” అన్నయ్యా.. నాకు చదువుకోవాలని లేదు.. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆరోగ్యం చెడగొట్టుకోలేను. ఇక్కడా నా మార్కులకి సీటు రాదు. సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని ఉంది.. నువ్వేమైనా శోభ‌న్‌బాబు గారికి రికమండేషను చెయ్యగలవా? ” అన్నాను. ఆయన నా పరిస్థితిని అర్ధం చేసుకుని మద్రాసు తీసుకెళ్ళారు. శోభ‌న్‌బాబు గారు వివరాలు తెలుసుకున్నాక
” … సినిమా రంగంలో కెరీర్ వెదుక్కోవడం మంచిదే. కాకపోతే ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉంటుందీ అనేది ఎవ్వరూ ఇతమిత్థంగా చెప్పలేరు. చాలా కష్టాలుపడాల్సి రావొచ్చు. నా పరిస్థితీ ఇంతే.. లాయర్ చదువుదామని మద్రాసు వచ్చి సినిమాల ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టాను. ఎన్నో సంవత్సరాల తరవాత ఇప్పటికి కొంచెం నిలదొక్కుగోగలిగాను..” అన్నారు.

అది 1968 వ సంవత్సరం..

ఎవరో చెప్పిన మాట మీద ఎడిటింగ్ నేర్చుకోవాలని ఉంది అన్నాను. “ఎడిటింగ్ అంటే ఒక్క రంగానికే లిమిట్ ఐపోతావు.. ఎలానూ నాటకాల్లో అనుభవం ఉందంటున్నావు కదా.. దర్శకత్వ శాఖలో ప్రయత్నించు..” అని సలహా ఇచ్చారు. “ఇక్కడ నాకెవ్వరూ తెలీదు.. మరి మీరే ఎవరికైనా రికమండేషన్ చెయ్యాలి” అని అడిగాం. ఆయన వెంటనే అంగీకరించి, అప్పుడే కొమ్మూరి సాంబశివరావుగారి నవల ఆధారంగా మొదలౌతున్న ‘ చావు తప్పితే చాలు ‘ దర్శకుడు గురుదేవ్ గారి వద్ద అప్రెంటిస్ గా చేర్చారు.. కరెక్టుగా చెప్పాలంటే ఇదీ నాకు సినిమా రంగంలో అడుగుపెట్టనిచ్చిన మొదటి సినిమా. శోభ‌న్‌బాబు, రాజశ్రీ గార్ల కాంబినేషన్. ‘సంగీతలక్ష్మి’ నిర్మాణంలో భాగస్వామ్యులైన ఒకరు సినిమా నిర్మాతలు. గురుదేవ్ గారు నర్తనశాల కి కో-డైరెక్టర్‌గా చేసి ఉన్నారు. ఆయన నిర్మాత లక్ష్మీరాజ్యంగారికి దూరపు బంధువుకూడా (తరువాత విశ్వనాథ్ గారికి కూడా చాలాకాలం సహాయకులుగా పనిచేశారు). ఐతే ఆ యూనిట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ అంటూ వేరే ఎవరూ లేకపోవడంతో గురుదేవ్ గారు అన్నింటికీ నా మీదే ఆధారపడే వారు. చిత్ర నిర్మాణం, దర్శకత్వంలోని అనేక మెళకువల్ని చాలా ఓపికగా చెప్పేవారు. అప్పుడే ఆ రంగాన్ని అర్థం చేసుకుంటున్న నాకు ఇది చాలా ఉపయోగపడింది. దురదృష్టవశాత్తూ రెండు షెడ్యూళ్ళు ముగిశాక ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆ సినిమా ఆగిపోయింది. చాలా నిరాశపడ్డాను.

మళ్ళీ శోభ‌న్‌బాబు గారి వద్దకే వెళ్ళాను. ఆయనే మళ్ళీ అప్పుడే స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ‘బంగారు  పంజరం’ యూనిట్లో నన్ను చేర్పించారు. ఐతే నా మొదటి సినిమాకీ ఇక్కడికీ చాలా తేడా కనిపించింది. ఇక్కడ అంతా సీనియర్స్.. నన్ను అంతగా దగ్గరికి చేరనిచ్చేవాళ్ళు కాదు. లోపల స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంటే నన్ను బయట ఉండమనేవారు.. కొన్ని రోజులు చూశాక, ఇంక ఆ వాతావరణం నచ్చకా, మళ్ళీ శోభ‌న్‌బాబు గారి వద్దకి వెళ్ళడానికి మొహం చెల్లకా విజయవాడ తిరిగొచ్చేశాను. మళ్ళీ కొన్ని నెలలు ఖాళీగా విజయవాడ రోడ్లు సర్వే.. నాన్నకి కోపంగా ఉండేది, నేను ఎక్కడా స్థిరపడలేదని.. ఐదారు నెలల తరువాత, మళ్ళీ కజిన్ వెంకటరత్నాన్ని కలిశాను..

“నీకు నువ్వే డిసైడ్‍ చేయ్యాలి.. ఒకరం సలహా చెప్పినా నీ మనసుని నువ్వే సమాధానపరుచుకోవాలి” అన్నాడు తను.

“సరే అన్నయ్యా.. మళ్ళీ ఒక్కసారి మద్రాసు వెళ్ళి ప్రయత్నిస్తాను. ఈ సారి ఆరునెలలుంటాను. ఏమీ ప్రోగ్రెస్ లేకపోతే వచ్చేస్తాను” అని పట్టుదలతో మద్రాసు వెళ్ళాను. ఈ సారీ శోభ‌న్‌బాబు గారిని కలవడానికి మొహం చెల్లలేదు. ఎక్కడైనా కుదురుకున్నాకే ఆయన్ను కలవాలని నిర్ణయించుకున్నాను. లోగడ జరిగిన పరిచయాలతో నాగేంద్రరావుగారనే ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్ ఒకాయన నన్ను ‘మనుషులు మారాలి’ సినిమాకి సెన్సారు స్క్రిప్ట్ వ్రాయడానికి అవకాశం కల్పించారు. మూవియోలాలో ప్రతిసీనూ మళ్ళీ, మళ్ళీ చూస్తూ డైలాగులన్నీ గ్రంధస్థం చేసే పని.. మొట్టమొదటిసారిగా పారితోషికం అందుకున్న మొదటిసినిమా ‘మనుషులు మారాలి’. తరువాత నాగేంద్రరావుగారే పనిచేస్తున్న ‘నాటకాల రాయుడు’ కి దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడంతో దర్శకత్వ శాఖలో నేను పూర్తిగా పనిచేసిన మొదటిసినిమా ‘నాటకాల రాయుడు’ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మంచి అనుభవాల్నిచ్చింది. తరువాత ఉషశ్రీ ప్రొడక్షన్  చిన్నపురెడ్డి పరిచయమవ్వడం, మాకిద్దరికీ విజయవాడలోనే లోగడ పరిచయం ఉండడం.. వీటన్నింటివల్లా ఆయన కంపెనీలో చేరి ఆయన సినిమాలన్నింటికీ 1973-74 వరకూ దర్శకత్వ శాఖలో పని చేశాను. మళ్ళీ శోభ‌న్‌బాబు గారి సలహామేరకు తాతినేని రామారావుగారి వద్ద ‘దేముడు చేసిన పెళ్ళి’ కి సహాయ దర్శకుడిగా చేరాను. తాతినేని రామారావు గారి ద్వారానే పి.ఎ.పి లో ‘అల్లుడొచ్చాడు’ కి పనిచేసే అవకాశం లభించింది. అక్కడే నాకు ప్రత్యగాత్మ గారి పరిచయం జరిగింది.

మొదటిసినిమా తోటే నా చురుకుదనాన్ని గమనించిన రామారావు గారు ప్రత్యగాత్మ గారికి ప్రత్యేకంగా చెప్పడం ఆయన నన్ను అభిమానంగా చూసుకోవడం జరిగాయి.

1975 జనవరిలో మహాబలిపురంలో ‘అల్లుడొచ్చాడు’ కోసం ‘కొడితే పులినే కొట్టాలిరా’ అనే పాట చిత్రీకరణ జరుగుతోంది.. వర్షం బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు రోజులు తీసిన పాట అనుకున్నట్లు రాకపోవడంతో రీ-షూట్ చేద్దామని అందరూ నిర్ణయించుకున్నారు. ఐతే ఆ పాటలో పాల్గొంటున్న ప్రభకి డేట్స్ విషయంలో క్లాష్ వచ్చి ‘నేను వెళ్ళిపోవాలి కుదరదు’ అంది. ఆవిడ డేట్స్ మాట్లాడింది నేనే. ఆవిడ వెళ్ళిపోతే, షూటింగ్ వాయిదా వేస్తే మళ్ళీ జయసుధ డేట్స్ దొరకడానికీ మరో నెలరోజులు పడుతుంది. ఇవన్నీ సుబ్బారావు గారికీ, ప్రత్యగాత్మ గారికీ తెలిస్తే నా మీద వాళ్ళకి చెడ్డ అభిప్రాయం వస్తుందే అని భయం. ఐతే ప్రభ వాళ్ళన్నయ్యతో మాట్లాడి ఆమె షూటింగ్ కంటిన్యూ చేసేలా ఏర్పాటు చేశాం.. ఇది జరిగిన రోజు రాత్రే సుబ్బారావు గారి వద్దనుంచీ నాకు కబురు వచ్చింది ‘ఒకసారి రావాలి’ అని. ఇంక నాపని ఐపోయిందనే అనుకున్నాను. డేట్స్ సరిగా చూడలేకపోయినందుకు నన్ను మందలించడానికే పిలిపించారనుకున్నాను.

హోటల్‌కి వెళ్ళే సరికి సుబ్బారావు గారు, ప్రత్యగాత్మ గారు, రామారావు గారు కూడా అక్కడే ఉన్నారు. అందరూ ఒక్కచోట ఉండి నాకు కబురుచెయ్యడం వెనుక ఆంతర్యం అర్ధం కాలేదు.. ‘రావయ్యా.. గాంధీ రా..’ అని సుబ్బారావు గారు పిలవడం, ఆయన గొంతులోని ఆత్మీయత నాకు కాస్త ఆశ్చర్యం కలిగించాయి. ఏదో మందలించడానికి పిలిపించారనుకుంటే, ఇంత మృదువుగా రమ్మంటున్నారే అనుకున్నాను. ‘ఈ రోజు నా పుట్టినరోజయ్యా’ అన్నారు. ‘హేపీ బర్త్ డే  సార్..’ అని ఒక మూల ఒదిగి కూర్చున్నాను. కొంతసేపు అయ్యాక ఆయనే ప్రత్యగాత్మ, తాతినేని రామారావు గార్ల సమక్షంలో ‘గాంధీ నిన్ను దర్శకుడ్ని చేస్తున్నాను’ అని ప్రకటించారు.. నా విస్మయానికి హద్దులు లేవు. పి.ఎ.పి లాంటి సంస్థలో దర్శకుడుగా పనిచేసే మొదటి అవకాశం.. నన్ను నేను నమ్మలేకపోయాను.. అది 1975 జనవరి 20 వతేదీ..!

సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత 1977 లో పి.ఎ.పి వారి రజతోత్సవ సంవత్సరంలో వారు నిర్మించిన మూడు సినిమాల్లో ఒకటైన ‘అర్ధాంగి’ కి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. గురువుగారు ప్రత్యగాత్మగారిదే కథ.. దర్శకుడిగా చెప్పుకోవాలంటే ‘అర్ధాంగి’ నా మొదటి సినిమా.. మురళీమోహన్, జయసుధ, మోహన్‍బాబు, చంద్రమోహన్..ల కాంబినేషన్.. 1977 మే 1 న హైదరాబాదులోని గోల్డ్ స్పాట్  కంపెనీలో జయసుధ మీద ఫస్ట్ షాట్.. రామారావు గారు క్లాప్, ప్రత్యగాత్మగారు కెమెరా స్విచ్ ఆన్ తో దర్శకుడిగా నా కెరీర్ మొదలైంది.. “మేడే నాడు మెగా ఫోన్ పట్టిన మోహనగాంధీ” అని గిరిధర్ అనే పాత్రికేయ మిత్రుడు పెద్ద పెద్ద శీర్షికలతో న్యూస్‍ వ్రాశాడు..

మొత్తం 28 రోజుల్లో హైదరాబాదులోనే సినిమా పూర్తిచేసి, కొంచెం ప్యాచ్‌వర్క్ ని మద్రాసులో ముగించి దరిదాపు రెండున్నర నెలల్లో సినిమా మొత్తం పూర్తిచేసి రిలీజ్‌కి సిద్ధం చేశాను. అప్పుడే మొదలయ్యాయి అసలు సమస్యలు … ‘అర్ధాంగి’  టైటిల్ తో ఒక పాతసినిమా ఉండటంతో చాలా మంది ఆ టైటిల్ వొద్దు అని సలహా ఇచ్చారు.. పి.ఎ.పి. సుబ్బారావుగారు, ప్రత్యగాత్మగారు నిర్ణయాన్ని నాకొదిలేశారు. కథా, కథనం దృష్ట్యా అదే సరైన టైటిల్‍ అని ‘అర్ధాంగి’ పేరుతోనే సినిమా రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించాం. 1977 అక్టోబర్ లో రిలీజ్. మా సినిమా రిలీజ్ అవడానికి వారం ముందే పాత ‘అర్ధాంగి’ సినిమాని కొత్త ప్రింట్లతో మా సినిమా రిలీజ్ అయ్యే ధియేటర్లకి పక్క ధియేటర్లలోనే రిలీజ్ చేశారు.. ఐనా నవయుగ ద్వారా మా సినిమా కూడా మంచి ధియేటర్లలోనే రిలీజ్ అయింది. కానైతే సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. ఇందుకు కారణం.. దాదాపు ఇదే కథాంశంతో అప్పటికే మరో రెండు కొత్త సినిమాలు రావడం..! కేవలం యాదృచ్చికమే ఐనా దాదాపు ఇదే కథాంశంతో ఒకే సమయంలో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అమరదీపం – సూపర్ హిట్ , ప్రేమ లేఖలు – అబౌవ్ ఏవరేజ్ … మా ‘అర్ధాంగి’ – ఏవరేజ్. నాలుగో సినిమా ‘గోరంతదీపం’ – ఫ్లాప్..! పైగా మా సినిమా రిలీజ్ ఐన 2-3 వారాల్లోనే ఆంధ్రా అంతా అతలాకుతలం చేసిన భయంకరమైన తుఫాన్..! గమనించదగ్గ విషయం ఏమిటంటే – ఇన్ని ఆటంకాలెదురైనా పి.ఎ.పి కి మాత్రం నష్టాలు రాని సినిమాగ నిలిచింది నా మొదటి సినిమా ‘అర్ధాంగి’.

ఇదీ దర్శకుడిగా నా మొదటి సినిమా వరకూ జరిగిన నా సినీ జీవిత ప్రస్థానం..!

 కౌముది సౌజన్యంతో–కిరణ్ ప్రభ

ఈ వ్యాసాలను యూనికోడ్ లోకి మార్చడంలో సహాయం చేస్తున్న నవతరంగం సభ్యుడు స్నేహిత్ కి ధన్యవాదాలు.

One Response