Menu

‘A’ సర్టిఫికెట్

నిన్ని ప్రమాదవశాత్తూ ‘గోలీమార్’ సినిమాకి వెళ్ళా.
ఈ వ్యాసం ఆ సినిమా సమీక్ష కాదు. విశ్లేషణ అంతకన్నా కాదు. కాబట్టి రిలాక్సైపోండి!

9.30 కి కలవాల్సిన స్నేహితుడు లేటవుతోందని చెబితే, అంతవరకూ టైంపాస్ కోసం పక్కనే ఉన్న GVK One మాల్ కి వెళ్ళా.
9.40 కల్లా అక్కడున్నా, అప్పుడే ఐనాక్స్ బాక్సాఫీస్ తెరిచి పది నిమిషాయ్యింది.
ఈ రోజే గోలీమార్ రిలీజు. డిస్ప్లే లో దాదాపు ఏడు షోలు చూపిస్తోంది. మొదటి ఆట 10.00 కి.
“టికెట్లు ఉన్నాయి” అంటూ గ్రీన్ లైటు టిమటిమలాడింది.
ఈ మధ్యకాలంలో ప్రీమియర్లకు అలవాటుపడి మనసు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి చాన్నాళ్ళయ్యింది. పదపద’ అంది.
వెంఠనే ఫ్రెండుకి ఫోన్ చేస్తే….‘ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నా’ అన్నాడు.
‘సరే. స్ట్రెయిట్ గా ఐనాక్స్ కొచ్చెయ్. గోలీమార్ చూద్దాం’ అని ఫోన్ పెట్టేసి లైన్లో నిలుచున్నా.

నా ముందు కేవలం ఇద్దరే ఉన్నారు. ఒకమ్మాయి. ఆ తర్వాత మరో పెద్దాయన.
అమ్మాయి టికెట్ తీసుకుని వెళ్ళిపోయింది. పెద్దాయన వంతొచ్చింది.
కౌంటర్ దగ్గర నించుని ఏదో చెబుతున్నాడు. కౌంటర్లో టికెట్లిచ్చే అమ్మాయి మరేదో అడుగుతోంది.
ఆ పెద్దాయన వెనక్కుతిరిగి ఎవర్నో చూపిస్తున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఏదో అడిగింది. ఈయన మళ్ళీ ఏదో చెప్పాడు.
9.48 అయ్యింది. నాకు ఏదో తెలియని అసహనం. వెనకనుంచీ విసుగ్గా చూస్తున్నాను.

‘ఐతే sign చెయ్యండి’ అని ఆ టికెట్ కౌంటర్ అమ్మాయి.
నాకు ఆశ్చర్యంగా అనిపించింది.
‘ఈ మధ్య సినిమా టికెట్టుకి ఆస్తుల్ని రాయించుకుంటున్నారా ఏమిటి?’ అనే అనుమానం వచ్చి పర్సులోంచీ డబ్బులు తీసి చేతిలోపట్టుకున్నా.
సంతకం చేసి ఆ పెద్దాయన టికెట్లు తీసుకుని వెళ్ళిపోయాడు.
ఇప్పుడు నా వంతు…
‘గోలీమార్ టెనోక్లాక్ షో, two tickets’ అన్నా మూడువందరూపాయ నోట్లు ముందుకి తోస్తూ.
‘This is an A rated film sir ! do you have any children with you?’ అని అడిగింది.
ఒక్క క్షణం ఏమడిగిందో అర్థం కాలేదు.
సర్దుకుని, ‘No. Me and my friend only ’ అన్నాను.
‘Can you please show me who it is?’ అంది వెనకనున్నారా అంటూ సైగచేస్తూ.
‘ఇంకా రాలేదు. కాసేపట్లో వస్తాడు.’ అన్నాను నసుగుతూ.
‘Then you have to sign this sir !’ అంటూ ఒక పేపర్ ముందు తోసింది.
అందులో నేను పేరు రాసి సంతకం చేసేసరికీ తను టికెట్లు ప్రింట్ తీసి దానిమీద “A” అని ఒక ముద్దరేసి నాకిచ్చింది.

అప్పుడు నాకు చిరాకెయ్యలేదు. అసహనంగా అస్సలు అనిపించలేదు.
ఒకే ఒక ఆలోచన వచ్చింది. ‘ఒకవేళ నేను నా ఏడేళ్ళ కొడుకుతో ఈ సినిమాకు వచ్చుంటే, సంతకం చేసి టికెట్ తీసుకునేవాడినా?’ అని.
ఖచ్చితంగా తీసుకుని ఉండను.

ఈ మధ్యకాలంలో హిట్టయిన తెలుగు సినిమాలలో 90%  సెన్సార్ ద్వారా ‘A’ సర్టిఫికెట్ పొందిన చిత్రాలే. అయినా మన పిల్లలు వాటిని దర్జాగా థియేటర్లలో చూసేస్తారు. వీలుంటే మనమే దగ్గరుండి చూపిస్తాము కూడా. ఇది వ్యవస్థ లోపమా, మనం పెంపకంలో చేస్తున్న తప్పా అనేది మనం వ్యక్తిగతంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఇలాంటి ఒక వ్యవస్థ థియేటర్లలో వస్తే సహనం కోల్పోకుండా భరించడం, హర్షించడం మనకు ఎంతైనా అవసరం.

సెక్సు, వయలెన్సూ సినిమాల్లో ఉండటం తప్పుకాదు. కానీ అవి పిల్లలు చూసే అవకాశం ఇవ్వడం తప్పు. పిల్లలకు అవి చూపించడం తప్పు. ఐనాక్స్ లో మొదలైన ఈ ఏర్పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లకీ రావాలని మనమందరం ఆశించాలని కోరుకుంటాను.

*****

ఈ వ్యాసం చదివిన ఒక స్నేహితురాలు ఇప్పుడే ఫోన్ చేసి “నిజంగా సెన్సార్ సెన్సిబుల్ నిర్ణయాలే తీసుకుంటుందంటారా?” అని ప్రశ్నించారు. నిజమే…మన సెన్సార్ మార్గదర్శకాలు ఒక్కోసారి అర్థరహితంగానూ మరికొన్ని సార్లు హాస్యాస్పదంగానూ ఉంటాయి. ఇక నిర్ణయాలలో consistency అస్సలుండదు. ఉదాహరణకు మన బోర్డు ఒకసారి ప్రతిపాదించిన ఈ క్రింది మార్గదర్శకాల్ని చూడండి.

 1. ఏదైనా కులాన్ని,మతాన్నీ,ప్రాంతాన్నీ లేక వృత్తిని సూచించే దృశ్యాలనూ లేక సంవాదాలు be scrupulously avoided.
 2. Should refrain from using words like “కుంటోడా, గుడ్డోడా, చెవిటోడా, మూగోడా,నత్తి,”
 3. Words like “నీయమ్మ, నీయమ్మ, నాకొడుకా, దొంగనాకొడుకు, దొబ్బెయ్యడం, తొక్కలో, etc may be removed.
 4. Lampooning or portraying or making mockery of their caste/religious status must be avoided. Should refrain from     showing physically challenged as villains and comedians and showing them in bad light.
 5. కులపర మతపరమైన పేర్లు should not be used. ప్రాంతీయ యాసల్నీ, మాండలికాల్నీ విలన్లకూ, కామెడియన్ల చిత్రీకరణలో may not be used
 6. పోలీసు, వైద్యం మరియూ టీచర్ల వంటి వృత్తులను should not be show in poor light as they would demoralize the respective     professions.
 7. Extra care should be taken not to film violent scenes and objectionable scenes at places of worship. The sanctity of the place of worship should be kept in mind.

ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటిస్తే ఏదైనా సినిమా తియ్యగలమా? అసలు ఉద్దేశమేమిటో…ఈ నియమావళి ఎందుకో… దీనికి రూపకల్పన చేసినవాళ్ళకైనా తెలుసోలేదో సందేహమే!

కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సెన్సార్ బోర్డు నిబంధనలు అనుసారం మనం ఫాలో అవ్వాల్సిందే…ఒక వేళ మార్పు కోరుకుంటే నిబధనలను, సభ్యుల ఎంపిక విధానాన్నీ మార్చే డిమాండ్ చెయ్యాలి. అంతే !

20 Comments
 1. శారద May 28, 2010 /
 2. శర్మ May 28, 2010 /
   • శర్మ May 28, 2010 /
 3. సౌమ్య May 28, 2010 /
 4. తెలుగు ప్రేక్షకుడు May 28, 2010 /
 5. అరిపిరాల May 28, 2010 /
 6. SuryaKiran May 28, 2010 /
 7. Sharath Chandra May 28, 2010 /
 8. సుజాత May 28, 2010 /
 9. rayraj May 29, 2010 /
 10. Raghu May 29, 2010 /
 11. NaChaKi May 29, 2010 /
 12. సుజాత June 8, 2010 /
 13. Sree June 9, 2010 /
 14. మేడేపల్లి శేషు November 15, 2010 /