Menu

పెరుగుతున్న నిర్మాణం వ్యయంపై నిర్మాతల భేటీ

తెలుగు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించేందుకు నిర్మాతల మండలి ఏర్పాటు చేసుకున్న సమావేశం వాడివేడిగా సాగింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు థియేటర్ల అద్దె విధానంపై కూడా చర్చ జరిగింది. దీంతో థియేటర్లు తన గుప్పిట్లో పెట్టుకున్న నిర్మాత ఒకరు బయటికి వెళ్లిపోగా, అసలు నిర్మాతల మండలిపైనే తనకు నమ్మకం లేదని మరో సీనియర్‌ నిర్మాత సమావేశం నుంచి నిష్కృమించారు. బడ్జెట్‌ తగ్గించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయించేందుకు చిన్న, పెద్ద నిర్మాతలందరూ ఫిలించాంబర్‌లో దాదాపు రెండున్నర గంటల వరకు చర్చించారు.

కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ కమిటీని కూడా నియమించారు. ఈ విషయంలో కూడా నిర్మాతల మధ్య కాస్త అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఈ కమిటీకి దాసరి నారాయణరావు చైర్మన్‌గా ఉండాలని కొందరు నిర్మాతలు పట్టుబడితే..మరి కొంతమంది దాసరి కాకుండా వేరే వారేవరైనా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న అల్లు అరివింద్‌, దిల్‌రాజు, సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కె.ఎల్‌.నారాయణ,పోకూరి బాబురావు, సుప్రియా, అచ్చిరెడ్డితో పాటు నట్టికుమార్‌, సురేంద్రనాథ్‌రెడ్డి, సాయివెంకట్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ వంటి చిన్న నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరైయ్యారు.చిన్న నిర్మాతలు దాదాపు ముఫై డిమాండ్లతో నిర్మాతల మండలికి ఓ వినతి పత్రం కూడా అందజేశారు. పలు అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలోనే అసలు నిర్మాతల మండలిపై నమ్మకం లేదని, ఇవన్ని అమలు జరిగే పనులు కావని ఆదిశేషగిరిరావు బయటికి వెళ్లిపోయారు. థియేటర్ల అద్దె విధానంపై చిన్న నిర్మాతలు చర్చించడంతో అల్లు అరవింద్‌ సమావేశం నుంచి నిష్కృమించారు.

ఇప్పుడున్న స్టార్ హీరోల్లో చాలామంది ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల దాకా పారితోషికం డిమాండ్ చేస్తుండడంతో, వారితో సినిమాలు నిర్మించాలంటే నిర్మాతలకు తడిసి మోపడయిపోతోంది. సినిమా బడ్జెట్ ఇప్పుడు 30కోట్లు దాటి పోతోందని గర్వంగా చెప్పుకుంటుండగా, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు పక్కనపెడితే, సినిమాకయ్యే వ్యయం అంతంతమాత్రమేనన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కి అడ్డుకట్ట వేసేందుకుగాను, స్టార్ హీరోల రెమ్యూనరేషన్ మూడున్నర కోట్లకు మించరాదనే ప్రతిపాదనను నిర్మాతల మండలిలో పలువురు నిర్మాతలుంచారు. అంతేకాదు, సినిమా షూటింగ్ 45రోజుల్లోనే పూర్తయిపోవాలనీ, ఇందుకుగాను ఫిలిం అరవై వేల ఫీట్లకు మించరాదనీ..ఇలా పలు అంశాల్ని నిర్మాతల మండలి సుదీర్ఘంగా చర్చించింది. అత్యవసరంగా జరిగిన ఈ భేటీలో పలువురు నిర్మాతలు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టినట్లుగా చెప్పగా, ఇంకా చాలా అంశాలపై చర్చ జరగాల్సి వున్నందున సమావేశాన్ని ఈ వారాంతంలో మరోమారు జరపాలని నిర్మాతల మండలి నిర్ణయించింది.

4 Comments
  1. అభిమాని April 22, 2010 / Reply
  2. వెంకట్ ఉప్పలూరి April 30, 2010 / Reply
  3. rajasekhar May 9, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *