Menu

తెలుగు సినిమా వ్యాపార రహస్యం !

ఒక సినిమా విజయవంతం కావటానికి ఎన్ని కారణాలుంటాయో,అపజయం పాలుకావటానికి అంతకన్నా ఎక్కువే కారణాలు ఉండొచ్చు.అయితే అటు విజయానికీ,ఇటుపరాజయానికీ గల కారణాలు ఇవీ అని ఇతమిద్దంగా ఎవరూ చెప్పలేకపోవటమే సినిమా వ్యాపారంలో ఉన్న మిస్టరీ.ఆ మిస్టరీనీ ఛేదించటానికి సుమారు శతాబ్దకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.అవి చిత్రనిర్మాణంలో పాల్గొన్నవారు కావచ్చు,ఇతర నిపుణులు కావచ్చు,పత్రికలు,ఇతరమీడియా కావచ్చు.కానీ ఇంతవరకూ ఎవరూ ఖచ్చితమైన నివేదికను ఇచ్చిన దాఖలాలు లేవు.

కాకుంటే ఒక సినిమా,రెండుసినిమాల జయాపజయాలను విశ్లేషించి ఫలానా కారణాల వల్ల ఇది సంభవించిదీ అని చెప్పారేమో కానీ ఏకమొత్తంగా అసలు సినిమా వ్యాపారానికి ఉండితీరాల్సిన్స్ విధినిషేధాలు ఇవీ అని ఇప్పటివరకూ క్రోడీకరణమాత్రం జరగలేదు అని మాత్రం గట్టిగా చెప్పవచ్చు.

దశాబ్దాల చరిత్ర గల  తెలుగుసినిమాకి పాతికేళ్ళ క్రితం గ్రహణం పట్టింది అన్నమాట మాత్రం దాదాపుగా అందరూ అంగీకరిస్తున్నారు.మరి ముఖ్యంగా గడచిన పదేళ్ళుగా తెలుగుసినిమా పోకడ కాకలుతీరిన చలనచిత్రప్రముఖులకే అంతుపట్టని ఒకరకమైన అయోమవాస్థలో ఉండిపోయారు.ఇది మంచి ఇది చెడు అని సర్దిచెప్పాల్సిన పెద్దలు నిష్క్రియాపరత్వంలో ఉండటంతో అప్పటికే ప్రబలుతున్న పెడధోరణులను అడ్డుకునే వారే లేకపోయారు.ఈ ఇబ్బందికరస్థితిలో మార్గదర్శకత్వం వహించాల్సిన వారు కూడా గుంపులోగోవిందయ్యలాగా తమతమ సంకుచితస్వార్ధప్రయోజనాలకోసం తెలుగుసినిమా అస్తిత్వాన్నే బలిపెట్టేందుకు కూడా సాహసించారు.ఫలితం ఇవ్వాళ మనముందుకొస్తున్న అసంఖ్యాక అమాంబాపతు సినిమాలు. అసలు మన రాష్ట్రంలో ఉన్న సినిమా హాళ్ళెన్ని?మన సినిమా ఎన్ని చోట్ల,ఎన్ని సినిమా హాళ్ళలో విడుదల చెయ్యగలం?దేశంలో మార్కెట్ ఎంత వుంది?ఓవర్సీస్ రెవెన్యూ యేమేరకు వసూలు చెయ్యవచ్చు,ఆడియో మీద రాబడి ఎంత ఉండొచ్చు(పబ్లిసిటీలో చెప్పుకున్న ఇన్ని లక్షల యూనిట్లు అమ్మామని కాకుండా అసలు అమ్మకాలు)శాటిలైట్,టీవీ హక్కులు సంగతేమిటి?రీమేక్ కోసం ఎవరన్నా వస్తారా?వస్తేగిస్తే యేమాత్రం గిట్టొచ్చు?ఇప్పుడు మనం అనుకుంటున్న అంకెంత? వాస్తవానికి అవుతున్న ఖర్చెంత?మనం అనుకున్నది అనుకున్నట్టు అవక కాస్త అటూ ఇటూ అయితే తట్టుకుని.ల్యాబ్ నుంచి ప్రింట్ బయటకు తెచ్చుకోగల సత్తా మనకుందా?లేక హుస్సేన్ సాగర్ నీళ్ళేమన్నా మార్గం చూపుతాయా? ఇలాంటి కీలకాంశాలను పరిగణనలోనికి తీసుకున్న పనిమంతులు లేకపోబట్టే ఇవ్వాళ ఇన్ని సంక్షోభాలు తలెత్తుతున్నాయి.

సినిమా అన్నది,వ్యాపారాత్మక కళ,కళాత్మక వ్యాపారం అని ఎన్ని సుద్దులు పలికినా అది అసలు సిసలు వ్యాపారమే అని అందరికీ తెలుసు.అలాంటప్పుడు పక్కా ప్రొఫెషనల్ గా ఆ వ్యాపారాన్ని ఎందుకు చెయ్యలేకపోతున్నారన్నది బ్రహ్మరహస్యం.

ఎవరో ఒకరికి వచ్చిన ఒక ఆలోచన కదిలేబొమ్మ్లల కధగా ప్రేక్షకుల ముందుకు రావాలంటే ప్రధానంగా మూడు విభాగాలు సమర్ధవంతగా పనిచెయ్యాలి.అవి నిర్మాణం,పంపిణీ,ప్రదర్శన.గతకొన్నేళ్ళుగా పంపిణీ విభాగం గబ్బుపట్టిపోయింది,ప్రదర్శనా రంగం ఒకవైపు పెనుమార్పులకు గురవుతూ,మరోవైపు థియేటర్ కంట్రోలర్ అనే ఒక కొత్తతరం నియంతచేతుల్లో సతమతమవుతూ ఉంది.ఇన్నాళ్ళూ గుట్టుగా దాచాం అనుకున్న నిర్మాణరంగపు రహస్యాలన్నీ బట్టబయలవుతున్నాయి ఆ నిర్మాతల ద్వారానే.

2 Comments