Menu

ప్రస్థానం—My View—వెంకట్ గోపు

(ఈ సమీక్షలో సినిమా కథలోని కొన్ని కీలక దృశ్యాలను వెల్లడించడం జరిగింది. పాఠకులు జాగ్రత్త వహించగలరు.)

నేపధ్యం:

తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల మద్య జరిగే సంఘర్షణ ఎప్పూడూ ఆసక్తికరంగా ఉంటుంది..
హాలీవుడ్ క్లాసిక్ “గాడ్ ఫాదర్” దగ్గర్నుండి, ఘర్షణ(పాత), నిన్న మొన్న వచ్చిన “సర్కార్” సినిమా వరకు ఈ తరహా సన్నెవేశాలు చూడొచ్చు..
సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అన్నదమ్ముల మద్య ఆదిపథ్య పోరు అసక్తికరమే… దానికి ఉదాహరణగా ధీరుభాయి అంబానీ కుటుంబం గురించి చెప్పుకోవచ్చు. అంబానీ చనిపొయాక ఆస్తి విషయం లో అన్నదమ్ముల మద్య జరిగిన రాద్దాంతం దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది…
అలాంటి తరహా కథతో వచ్చిన చిత్రమే “ప్రస్థానం”
గాడ్ ఫాదర్, సర్కార్ చిత్రాల్లోని కుటుంబాలకు మాఫియా నేపథ్యం ఉంటే, ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉంటుంది.
అంటే దర్శకుడు తను ఎంచుకున్న కథ తోనే సగం విజయం సాధించాడు, దానికి తగ్గ నటీనటులు, డైలాగ్స్ కుదరడం వల్ల విజయం అనేది నల్లేరు మీద నడక అయింది.

కథ
ముందుగా కథ విషయానికి వస్తే….

ఒక గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల గొడవల్లో “లోకనాథ నాయుడు” (సాయి కుమార్) యజమాని “కేశవ” చంపబడతాడు… తప్పనిసరి పరిస్థితుల్లో “లోకనాథ నాయుడు” తన యజమాని భార్యని పెళ్ళి చేసుకుంటాడు.
అప్పటికే ఆవిడకి ఒక పాప(సురెఖా వాణి) , ఒక బాబు (శర్వానంద్) ఉంటారు… తర్వాత “లోకనాథ నాయుడు” వల్ల ఒక బాబు(సందీప్) పుడతాడు.

అక్కడి నుండి “లోకనాథ నాయుడు” రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి M.L.A అవుతాడు.
ఈ క్రమంలో పెరిగి పెద్దవాడైన “మిత్ర” (శర్వానంద్) ప్రతి పనిలో తండ్రికి అండగా ఉంటాడు. దాంతో “లోకనాథ నాయుడు”, “మిత్ర” ని ప్రత్యేకంగా చూస్తుంటాడు.. ఇది చూసి మరో కొడుకు “చిన్నా”(సందీప్) జీర్ణించుకోలేకపోతాడు. ఒక రకంగా “చిన్నా”కి “మిత్ర” పై అసూయ మొదలవుతుంది.

ఈ క్రమంలో “మిత్ర” యూత్ లీడర్ అవుతాడు. ఇది చిన్నకి పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది.
తండ్రి చీదరింపులు, అన్న ఎదుగుదల తట్టుకోలేక “చిన్నా” ఒక సైకో మాదిరి తయారవుతాడు. ఈ సమయం లో “లోకనాథ నాయుడు” ని వెన్నంటి ఉండే ఒక అనుచరుడు “బాషా” కూతురిని “చిన్నా” మాన భంగం చేసి చంపేస్తాడు.
పోలీసులు ఆ అమ్మాయి శవాన్ని పోస్ట్ మార్టం కోసం తన అక్క (సురేఖా వాణి) డాక్టర్ గా ఉన్న హాస్పిటల్ కి పంపిస్తారు. పోస్ట్ మార్టం లో ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుని చనిపోయింది, మాన భంగం జరగలేదు అని రిపోర్ట్ ఇవ్వమంటాడు “చిన్నా”, కానీ “సురెఖా వాణి” అందుకు ఒప్పుకోదు. ఆ కసితో సురేఖ వాణిని, తన భర్తను హత్య చేస్తాడు “చిన్నా”.
ఈ విశయం తెలిసిన “మిత్ర”, “చిన్నా”ని చంపడం కోసం లోకనాథ నాయుడు దగ్గరికి ఆవేశంగా వస్తాడు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న లోకనాథ నాయుడు చిన్నా ని కాపాడటం కోసం “మిత్ర”ని కొట్టిస్తాడు, అక్కడి నుండి “చిన్నా” పారిపోతాడు.
ఈ చర్య ద్వారా “లోకనాథ నాయుడు” నీ కన్నా నాకు నా సొంత కొడుకే ఎక్కువని “మిత్రా”కి చెప్తాడు.
ఇదే సమయంలో “చిన్నా”ని చంపడం కోసం “బాషా” ( మానభంగం చేయబడ్డ అమ్మాయి తండ్రి) తిరుగుతుంటాడు. చివరికి “చిన్నా” చంపబడతాడు.
“చిన్నా” మరణ వార్త తెలిసి లోకనాథ నాయుడు హతాశుడవుతాడు. ఇంత ఆస్తి, పలుకుబడి సంపాదించింది ఎవరికోసం అని విలపిస్తాడు.
చివరిగా “బాషా” ద్వారా ఒక నిప్పు లాంటి నిజం తెలుసుకున్న “మిత్ర” ఏం చేశాడు, ఆ నిజం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!!

నటీనటుల ప్రదర్శన

సినిమా ప్రారంభం అవడమే “డైలాగ్ కింగ్” సాయి కుమార్ వాయిస్ తో ప్రారంభం అవుతుంది… వెంటనే మనసులో అనుకున్నాను “సాయి కుమార్ వర్థిల్లాలి” అని….
“లోకనాథ నాయుడు” గా సాయి కుమార్ జీవించాడు. ఒక రకంగా ప్రతీ సీన్ లో ఇతర పాత్రలని తినేశాడు అని చెప్పాలి. సినిమా చూశాక కొన్ని రోజుల వరకు సాయి కుమార్ నటన, డైలాగ్స్ మైండ్ లో నిలిచిపోతాయి.
శర్వానంద్ పాత్రకి న్యాయం చేశాడు, ఎంత వరకు అవసరమో అంతే చేశాడు. కానీ డైలాగ్ డెలివరీ (ఉచ్చారణ) ఇంకా మెరుగు పడాలి.
కొత్త నటుడు సందీప్ ఈ సినిమా ద్వారా తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చెసుకున్నాడు.. ఎక్కడ కూడా కొత్త నటుడు అన్న భావన రాలేదు.
( కానీ ఇతని పాత్రలో, ఆ మద్య వచ్చిన “రాఘవన్” సినిమాలో విలన్ పాత్రధారి “డేనియల్ బాలాజి” పాత్ర తాలూకు పోలికలు కనిపించాయి కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా అమ్మాయిని రేప్ చేసే ముందు సన్నివేశం లో)
శర్వానంద్ తల్లిగా చేసిన నటి తన నటన తో మెప్పించింది, సురేఖా వాణి్కి పెద్దగా సీన్స్ లేకపోయిన ఉన్నంతవరకు బాగా చేసింది.
ఇక జయప్రకాశ్ రెడ్డి సినిమాలో పెద్ద రిలాక్సేషన్, కామేడి బాగా పండింది.
జీవా విలనిజం బాగుంది, పొలీసాఫీసర్ గా నటించిన కొత్త నటుడు (పేరు తెలియదు) పరవాలేదనిపించాడు.
వెన్నెల కిశోర్ ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారో తెలియదు…. బహుశా దర్శకుడి “సెంటిమెంట్” కావచ్చు!!
హీరొయిన్ గురించి ఈ ముక్క రాయడం కూడా వేస్ట్.

దర్శకత్వం

దర్శకుడు “దేవా కట్టా” తన మొదటి సినిమాకి పూర్తి భిన్నంగా ఈ చిత్రం తీసాడు. విజయవాడ రాజకీయాల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాడు.
తను ఎంచుకున్న కథలోనే సత్తా ఉంది. ఈ చిత్రంలోని ప్రతి సీను, ప్రతి పాత్ర దర్శకుడి కష్టాన్ని, నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
ఆయా పాత్రలకి నటీ నటులని పకడ్బందీగా ఎన్నుకున్నారని తెలుస్తుంది, ఉదాహరణకి సినిమా ప్రారంభంలో గ్రామ పెద్దగా “బాలయ్య” గారిని తీసుకోవడం.
ఇక డైలాగ్స్ విషయంలో అధిక శ్రద్ద కనబరిచారు. ఒక రకంగా ఈ సినిమాకి డైలాగ్స్ ప్రాణం. చిత్ర విజయానికి ఎంతగానో దొహదపడ్డాయి, ఒక్కముక్కలో చెప్పాలంటే కుమ్మేశారు… ప్రతీ డైలాగ్ ఆలోచించే విధంగా ఉంది. డైలాగ్స్ లో ఫిలాసఫికల్ టచ్ ఉంది.

సినిమా లో ప్రతి పాత్రకి ఒక నిర్దిష్టమైన స్వభావం ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు తన గొప్పతనం చూపించాడు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో అరగంటకి ఒక రకంగా ముఖ్య పాత్రల స్వభావాలు మారుతుంటాయి, ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు..
సినిమాలో “మంచి వాడైన మిత్ర చుట్టూ ఉన్నవాళ్ళందరిని తన అనుకునే రకం. నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా తమ్ముడు, నా మనుషులు అనుకుంటాడు.
సినిమా చివరిలో తన అక్క, బావని చంపిన చిన్నాని చంపే అవకాశం ఉన్నా, అంత కోపంలో కూడ ఏమీ చేయకుండా వదిలేస్తాడు. అలాగే తన తండ్రిని కూడా! ఎందుకంటే “నా” అనుకున్నాడు కాబట్టి.
చెడ్డ వాడయిన చిన్నా చివరికి తండ్రిని కూడా చంపడానికి సిద్దం అవుతాడు.
లోకనాధ నాయుడు అవకాశాన్ని బట్టి మారే మనిషి, ముందుగా మిత్ర మీద ప్రేమ ఉన్నట్టు కనబడినా, చివరికి చిన్నాని వెనకేసుకొస్తాడు.” ముఖ్యంగా ఈ పాత్ర గురించి మీకు సినిమా చివరిలో బాగా అర్థం అవుతుంది.”
ఈ రకంగా పాత్రల తీరుని చాలా బాగా బ్యాలెన్సింగ్ చేశాడు దర్శకుడు.

చాలా మంది ఈ సినిమా, పాటల వల్ల లాగినట్టుగా ఉంది అన్నారు, కానీ నేను చూసినప్పుడు ఆ పాటలు లేవు ( తీసేసారు), నాకు అలా అనిపించ లేదు.

సినిమా శర్వానంద్ కోణంలో ప్రారంభం అవుతుంది. కానీ సినిమా నడుస్తూ ఉంటే అలా అనిపించదు. దర్శకుడు ఈ విషయం గమనించాలి.

సాంకేతిక విషయాలు

ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాలి.
కొన్ని సీన్స్ అంటే ……” చిన్నా చనిపోయాడని తెలిశాక సాయి కుమార్, శర్వానంద్, తల్లి బాదపడే సీన్స్ ఒక దాని తర్వాత ఒకటి స్క్రీన్ పై స్లైడ్ అవడం ఆ సంధర్భం లో డిస్టర్బెన్స్ గా అనిపించింది”
మరో చోట కంటిన్యుటి లేదు… సాయి కుమార్, చిన్నా ఉన్న రూమ్ లో పేపర్స్….
అలాగే సినిమా ఇంకొంచం వేగంగా వెళ్ళాల్సింది.

“సినిమాటొగ్రఫీ”ని అంత బాగా ఉపయోగించుకోలేదేమో అనిపించింది. ఎందుకంటే బరువైన సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది, పాత్రల మద్య సంఘర్శణని “మూడ్ ఆఫ్ లైటింగ్” తో ఇంకా హైలెట్ చేసే అవకాశం ఉంది ఆ విషయంలో కొంచం తగ్గినట్టుగా అనిపించింది, కానీ నటీనటుల నటన, డైలాగ్స్ ఆ లోటుని తెలియనివ్వలేదు.

మహేశ్ శంకర్ సంగీతం బాగా చేశాడు.. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చె శ్లోకాలు సీన్స్ ని, మొత్తంగా సినిమాని ఉన్నతంగా నిలబెట్టాయి.

డైలాగ్స్

“రాజకీయం అంతా చెప్పుకుని రాజీవ్ గాంధీ గురించి చెప్పుకోకపోతే దానికి అర్థం లేదు” అలాగే..
మొదటి నుండి సినిమాలో డైలాగ్స్ సూపరో సూపరు అని చెప్తున్నా కదా… అందుకని నాకు గుర్తున్నవి, నచ్చినవి కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.

“అవసరానికి అడ్డదారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో”
“గెలిచే వాడికి, ఓడే వాడికి తేడా గురువింజత లౌక్యం”____ (సాయి కుమార్)
“గెలిచే వాడికి, ఓడే వాడికి తేడా “కాన్ఫిడెన్స్”___ (శర్వానంద్)
“మనిషిలో ఉండే నిస్వార్థం…. తనలో ఉండే స్వార్థాన్ని కాపాడే కంచెలాంటిది”
“రాజకీయం అంటే పులి మీద స్వారీ లాంటిది… ఒక్కసారి ఎక్కితే చచ్చేవరకు స్వారీ చేయాల్సిందే”
“పుట్టిన దగ్గర్నుండి మనిషి మండుతూనే ఉంటాడు…పగతో, ఈర్శ్యతో, అహంతో, కామంతో…. కొంత మంది తను మండుతూ పక్క వాళ్ళని కూడా దహిస్తారు….కానీ కొంత మంది ఆ మంటనే దీపంగా చేసుకుని పది మందికి వెలుగునిస్తారు”
“నువ్వే నిజం అనుకుని బ్రతుకుతున్నాను నాన్నా, ఇప్పుడు అది అబద్దం అని తెలిస్తే!!”
“ఓటమంటే అంత భయమెందుకు నాన్నా!”

నాకు తెలిసి 90ల్లో విజయవంతమైన సినిమాల స్టోరీ ఆడియో క్యాసెట్స్ వచ్చేవి, “ప్రస్థానం” సినిమా స్టోరీ ఆడియో ని కనుక రిలీజ్ చేస్తే తీసుకునే వాళ్ళలో నేను మొదటి వాణ్ణి!

మొత్తానికి సినిమా చాలా బాగుంది.. చాలా రోజుల తర్వాత తెలుగు లో రొటీన్ కి భిన్నంగా ఒక మంచి పవర్ ఫుల్ సినిమా వచ్చింది..
భవిష్యత్తులో దర్శకుడు “దేవా కట్టా” నుండి ఇంకా మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను.

-వెంకట్ గోపు

8 Comments
  1. Rallapalli Krishna April 22, 2010 /
  2. Sarkar April 23, 2010 /
    • వెంకట్ గోపు April 23, 2010 /
  3. kay April 23, 2010 /
  4. తెలుగు ప్రేక్షకుడు April 23, 2010 /
  5. rayraj April 23, 2010 /
  6. వెంకట్ గోపు April 24, 2010 /
  7. pirate April 24, 2010 /