Menu

ప్రస్థానం-My view-గురు చరణ్

అసలు సినిమాలు ఎందుకోసం చూడాలి ? అని అడిగితే, కాలక్షేపం కోసమని, వినోదం కోసమనీ సగటు ప్రేక్షకుడు అభిప్రాయం చెబుతాడు.
దానికి మించి ప్రేక్షకునికి ఒక అనుభూతి, ఒక అవగాహన, ఒక ఇంగిత జ్ఞానాన్ని ఇనుమడింపజేయడం ఒక బాధ్యతాయుతమైన చిత్రం చెయ్యాల్సిన పని. ఈ మధ్యకాలంలో అవి కరువైన తెలుగు సినీ పరిశ్రమలో కంచెలు తెంచిన అతికొద్ది చిత్రాల్లో ఒకటి ‘ప్రస్థానం’.

ఈ చిత్ర దర్శకుడు దేవ కౌషిక్ కట్టా ఇంతకు ముందు తీసిన ‘వెన్నెల ‘ చిత్ర కథలో తగ్గిన స్పష్టతని ‘ప్రస్థానం’లో మెరుగుపరిచారు. ‘వెన్నెల ‘ చిత్రంలో ప్రవాస భారతీయ విద్యార్థుల జీవితాలని ఎంత వాస్తవీకంగా చూపించారో, అదే పంథాలో ప్రస్థానంలో ఒక బెజవాడ రాజకీయ నాయకుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడంతో, తెలుగు సినిమాని ఒక కొత్త కోణంలో చూపించగలిగే దర్సకుడు వచ్చారని రుజువు చేసుకున్నారు.

‘ప్రస్థానం’ ముగ్గురి కథ.
ఒక తండ్రి, ఇద్దరు కొడుకుల కథ.
మూడు రకాల మనుషుల కథ.

మొదటిది మిత్ర అనే యువ నాయకుడు, ఇతను పూర్తిగా ధర్మబద్ధుడు ఎలాంటి కష్టం చేరినా అధర్మం బాట పట్టలేడు.
రెండవది లోకనాథం అనే రాజకీయ నాయకుడు. ఇతని ఆశ హద్దు దాటితే ధర్మాన్ని వదిలేస్తాడు.
మూడవది చిన్నా అనే చెడిపోయిన కొడుకు. ఇతను అధర్మాన్ని ఆయుధం చేసుకొని మారణహోమం సృష్టించే దశకు వస్తాడు.

కథ విషయానికి వస్తే…

అత్యవసర పరిస్థితుల్లో లోకనాథం వితంతు వివహం చేసుకొని ఇద్దరు వేరు వేరు తండ్రులున్న బిడ్డలని పెంచుతాడు. ఒకడు మిత్ర, నాయకుడవుతాడు. ఇంకొకడు చిన్నా, నాశనమవుతాడు. లోకనాథం తన బలహీనతల వల్ల హంతకుడుగా మారిన చిన్నా పైన ప్రేమ పెంచుకొని మిత్రని దూరం చేసుకుంటాదు. మెల్లగా చెడ్డవాడవుతాడు. చిన్నా తన పాపపరిహారంగా ఒక శత్రువు చేతిలో చనిపోతాడు. చివరికి లోకనాథం మిత్రాలో మంచితనం చూసి, తను నీతి తపిన గతం గుర్తొచ్చి తనలో పాపాత్ముడే మిగిలాడని గుర్తించి ఆత్మహత్య చేసుకుంటాడు.

చిత్ర కథనం మొత్తం కథ మీదనే నడవకుండా మధ్యలో కొన్ని బావా మరదల్ల ముచ్చట్లు, రాజకీయ ప్రత్యర్థుల చేష్టలు కురిపించిన హాస్యపు జల్లులతో కూడి ఉంది. హాస్యం కథలో బాగా ఒదిగిపోగా ప్రేమ పాటలు నిద్రపుచ్చాయి.

  • ఈ చిత్రం కథని నడిపింది మాటలే అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఇన్ని అర్థవంతమైన మాటలు ఒక చిత్రంలో రాలేదు. ‘ఎంత మందిని చంపినా నేరం ఒకటే’ అని సంజాయిషీ వెతుక్కునే చిన్న, ‘మనిషికి ఉండేది స్వార్థమే’ అని చెప్పుకొచ్చే లోకనాథం, ‘మనిషి కథ కూడా అన్నదమ్ముల యుద్ధంతోనే మొదలయ్యింది’ అని ధర్మాధర్మాల గురించి ఆలొచించే మిత్రా… అలగే అందరి పాత్రలనీ, వారి ఔచిత్యాలనీ మాటలలో చూపించారు.
  • చాయాగ్రహణం మనిషిలోని ఒంటరితనాన్ని పదే పదే గుర్తుచేస్తూ ఆలోచనలకి తావునిచ్చింది.
  • ఈ చిత్రానికి న్యాయం చేసిన మరొక అంశం నటన. చాలా రోజుల తరువాత నాకు ఒక తెలుగు సినిమాలో నటుల బదులు పాత్రలు మాత్రమే కనిపించాయి. ముఖ్యంగా సాయికుమార్, ఒక వైపు అంత పవర్ఫుల్ గా నటిస్తూ, అదే రొజు రాత్రి తీ.వీ.ల్లో వ్యాఖ్యాతగా చూస్తూంటే, అతని పని పట్ల ఆశక్తి చూసి, మన సినిమా తారలు అందరి మీదా కోపం వచ్చింది !
  • కూర్పు బగుంది, అంతా ఒకే పంథాలో సాగుతుంది, చివరికి కథ సీరియస్ అవుతున్నకొద్దీ నెమ్మదిగా ఉంటుంది.
  • background music ఇమిడిపోయింది, పాటలు కొన్ని బాగున్నాయి.
    మొదటి పాట, డిస్కో పాటలలో వేదాంతంతో కలిపిన రచనని అర్థంచేసుకుంటూ వింటే బాగుంటాయి.
  • చివరిగా….. ఇక తెలుగులో  పెద్ద దర్శకులూ, నిర్మాతలూ అందరూ ఒక్క కథ, కథనాన్ని నమ్ముకునే ఇలాంటి తెలుగు చిత్రాలు మరిన్ని తీయాలని ఆశిస్తూ… ఒక తెలుగు సినిమా అభిమాని
2 Comments
  1. వనమాలి April 24, 2010 /
  2. pirate April 24, 2010 /