Menu

గమ్యానికి చేరువగా ‘ప్రస్థానం’ (సమీక్ష)

తొంబై దశకంలో వచ్చిన  కోడిరామకృష్ణ తరహా అచ్చతెలుగు ఆంధ్రా పొలిటికల్ థ్రిల్లర్ల తరువాత శంకర్ తరహా “అవినీతిని అంతంచేద్ధాం!” టైపు ఫాంటసీ ఆదర్శాల సినిమాలొచ్చాయి. మొన్నమొన్న వచ్చిన ‘లీడర్’ కూడా శంకర్ తరహా ఫాంటసీకి మరోరూపం. కానీ దేవకట్టా ‘ప్రస్థానం’ ఒకడుగు పక్కకొచ్చి పొలిటికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ జాన్రా ను తెలుగు తెరకు పరిచయం చేసింది. ‘రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించడమో లేక ఫాంటసీ సొల్యూషన్లు ఇవ్వడమో ఈ సినిమా ఉద్దేశం కాదు. రాజకీయనేపధ్యంలో ఒక కుటుంబ కథను ఎంత శక్తివంతంగా రూపొందించవచ్చో చూపించడం’ ఈ సినిమా ఉద్దేశమేమో అనిపిస్తుంది.

క్షేత్రస్థాయి రాజకీయాలనుంచీ ఒక కుటుంబం జిల్లా/రాష్ట్ర స్థాయి రాజకీయాలను శాసించే స్థితికి ఎలా వచ్చింది. ఆ ప్రస్థానంలో ఆ కుటుంబంలో వచ్చే ఈర్షలూ, ఇన్సెక్యూరిటీలూ,ద్వేషాలూ, ప్రేమలు,కలహాలూ, కుట్రలు,హత్యలూ, ఘాతుకాల కథ ప్రస్థానం. ఇదొక మారు బిడ్డలకథ. ఒక ఆక్కాతమ్ముళ్ళ కథ. అన్నకాని, అన్నాతమ్ముళ్ళ కథ. తండ్రికాని, తండ్రీ కొడుకుల కథ.

మిత్ర (శర్వానంద్‌)  తండ్రి చిన్నప్పుడే రాజకీయకక్షల నేపధ్యంలో హత్యగావించబడతాడు. తండ్రి అనుచరుడుగా ఉండే లోకనాథం నాయుడు (సాయికుమార్‌) అతని తల్లిని పెళ్ళాడి మిత్రాకు మారు తండ్రి అవుతాడు. అయితే అది మిత్ర అక్క (సురేఖా వాణి) కి సుతారామూ ఇష్టం ఉండదు. మిత్ర తల్లికి, మారు తండ్రికి పుట్టిన మరో కొడుకు చిన్నా(సందీప్). కాలగమనంలో స్ధానిక ఎమ్మల్యే గా ఎదిగిన మారు తండ్రిని ఆదర్శంగా తీసుకుని అతని అడుగుజాడల్లో నడుస్తూ లీడర్ గా (రాజకీయవారసుడిగా) ఎదుగుతున్న  మిత్రాని అతని సవితి తమ్ముడు చిన్నా ద్వేషంతో అడ్డుకుంటూంటాడు.  ఐడెంటిటీ క్రైసిస్ మధ్యన ఉన్మాదిగా తయారైన చిన్నా ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. కొడుకుని రక్షించుకునే ప్రయత్నంలో లోకనాధం నాయుడు అప్పటివరకూ కాపాడుతున్న ప్రజాప్రయోజనాల్నిగాలికొదిలి తన రాజకీయ ప్రత్యర్ధులతో చేతులు కలుపుతాడు. అప్పటివరకూ నిబద్ధతకలిగిన నాయకుడుగా ఎదిగినవాడు పతనానికి చేరువవుతాడు. తను చేసిన హత్యకేసులో పోస్టుమార్టం రిపోర్టు తయారుచేసి తనను  కటకటాలపాలుచెయ్యబోతున్నదన్న కోపంలో చిన్నా,  తన డాక్టర్ అక్కని – బావని దారుణంగా చంపేస్తాడు. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేక ఆదర్శవంతుడైన మిత్రా ఎదురుతిరుగుతాడు. ఆ సమయంలో తన నమ్మకాలను, విశ్వాసాన్నీ కాల్చేసే ఓ దారుణమైన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి…అది తెలిసాక జరిగే పర్యవసానాలు ఏమిటీ అనేది తెరపైచూడాల్సిన కథ.

నటీనటుల్లో శర్వానంద్ పాత్రోచితమైన నటన కనబరిచి తన పరిణితిని చాటాడు. కానీ వాచకం విషయంలో కొన్ని నిరాశలు తప్పలేదు. హీరోయిన్ రూబీపరిహార్ కు నటనరాదు. నిజానికి ఈ పాత్ర  సినిమాకు అస్సలు అవసరం లేదు. కనీసం గ్లామర్ కోసం పెట్టుకున్నారా అందీ లేదు. కాబట్టి దర్శకుడు ఏవరైనా తెలుగమ్మాయికి అవకాశం ఇచ్చుండాల్సింది. నూతన నటుడు సందీప్ చిన్నాగా ఆశ్చర్యపరిచే నటన కనబరిచాడు. మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. అక్కగా సురేఖావాణి నటన ఫరవాలేదు. తల్లిపాత్రధారిణి పేరు తెలీదుగానీ ఆ పాత్రలోని నిస్సహాయతను చాలా బాగా ప్రతిఫలించింది.భాషాపాత్రలో నటించిన టివి నటుడు చాలా బాగా చేశాడు. భాషా కూతురిగా నటించిన నటి హీరోయిన్ కన్నా బాగా ఉంది. బాగా నటించిందికూడా.  జయప్రకాష్ రెడ్డి పండించిన కామెడీ ఒక అదనపుఆకర్షణ. ఇక ముఖ్యంగా చెప్పుకోవసింది సాయికుమార్ నటన. ఈ చిత్రం ఆద్యంతం సాయికుమార్ చిత్రం. నటనకు ఖచ్చితంగా కొన్ని అవార్డులు రావడం ఖాయం.

సాంకేతికంగా ఈ చిత్రం చాలా మంచి విలువలని అందించింది. దేవకట్టా మాటలు కొన్ని కొటేషన్లుగా దాచుకోదగ్గవైతే మరికొన్ని ఆలోచించి మెచ్చుకోదగ్గవి. అయితే అక్కడక్కడా అసందర్బంగా కొన్ని అనవసరమైన పాత్రలు ఫిలాసఫీమాట్లాడుతూ ఇబ్బందిని కలిగిస్తాయి. బహశా దర్శకుడిలోని రచయిత టెంప్టేషనేమో! మహేష్ శంకర్ సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని శ్లోకాలను నేపధ్యసంగీతంగా మలచడం సినిమాకు పనికొచ్చింది. ధర్మేంద్ర ఎడిటింగ్ లో ఆలోచన కనిపిస్తుంది. సబ్జెక్టుమీదున్న ఆకళింపు ప్రతిఫలిస్తుంది. ఏది అనవసరమైన సీనో తెలిసీ ‘వదిలేస్తున్నాను ఫో’ అనే యాటిట్యూడ్ తెరపైన అనిపిస్తుంది. సాంకేతికవర్గంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఛాయాగ్రహకుడు శ్యామ్ దత్ గురించి. ప్రతిఫ్రేములోనూ తన స్కిల్, టేస్ట్ కనిపిస్తాయి.

పేరుకి శర్వానంద్ చేసిన మిత్రా పాత్ర హీరో అయినా, కథమాత్రం సాయికుమార్ పాత్ర లోకనాథం నాయుడిది. అందుకే మిత్రా వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవడంతో ప్రేక్షకుడు మిత్రాతో సినిమాను ఫాలో అయితేమాత్రం  పప్పులో కాలేసినట్టే. నెరెటివ్ విషయంలో దర్శకుడు శ్రద్ధవహించి ఉండాల్సింది. హీరో మిత్రా పాత్రలో పరిణితి ఉన్నా, చివరకు ఒక మహామనీషిగా ప్రవర్తించినా ‘హీరోస్ జర్నీ’కి కాలవసిన సరంజామా కథలో లేక ఒక ఫ్లాట్ కేరెక్టర్ గా మిగిలిపోతుంది. కామిక్ రిలీఫ్ కావాలనుకున్నప్పుడల్లా ప్రధానకథలోంచీ పక్కకు తప్పుకుని మిత్రా, మాటిమాటికీ అక్క ఇంటికి రావడం అనవసరమైన సీన్లు పెంచిందేతప్ప సినిమాకు ఏవిధంగానూ తోడ్పడలేదు. ‘వెన్నెల’ మహేష్ పాత్ర ఈ సినిమాలో ఎందుకుందో దర్శకుడికే తెలియాలి. ద్వితీయార్థమంలో కథ క్లైమాక్స్ కొచ్చే సమయంలో వచ్చే అనవసరపు సన్నివేశాలూ పాటల్ని నిర్ధాక్షిణ్యంగా కత్తిరించకపోతే సినిమా ఐపోయిందని ప్రేక్షకులు థియేటర్ నుంచీ లేచిపోవడం ఖాయం.

దర్శకుడిగా దేవకట్టా విజయవంతమైనా, కథకుడిగా కొన్ని చోట్లవిఫలమయ్యాడు. తెలుగు సినిమాలో చాలారోజుల తరువాత మంచి సినిమా చూశామన్న అనుభవాన్ని మాత్రమే మిగిల్చాడు. తెలుగు సినిమా మసాలాలు అవసరం అనే ఉద్దేశంతో, కొంత అనవసరాల్ని సినిమాకు జోడించి ఒక గొప్ప సినిమా చూశామన్న అనుభవాన్ని ప్రేక్షకులకు దక్కకుండా చేసాడు.

ఎప్పుడోగానీ మంచి సినిమారాని తెలుగులో ‘ప్రస్థానం’ ఖచ్చితంగా చాలా మంచి సినిమా.  తెలుగు సినీప్రేక్షకులు చూడాల్సిన సినిమా. చూడండి.

72 Comments
 1. గౌతమి April 18, 2010 / Reply
  • chiratlasuresh April 19, 2010 / Reply
 2. Bluto April 18, 2010 / Reply
 3. prem April 18, 2010 / Reply
 4. Prasad April 18, 2010 / Reply
 5. Venkat Gopu April 18, 2010 / Reply
 6. గౌతమి April 18, 2010 / Reply
  • guru April 18, 2010 / Reply
 7. గౌతమి April 18, 2010 / Reply
 8. గౌతమి April 18, 2010 / Reply
  • zion April 18, 2010 / Reply
 9. శరత్ April 18, 2010 / Reply
 10. Rajasekhar April 18, 2010 / Reply
 11. Venakat April 18, 2010 / Reply
 12. rachamalla shashipal reddy April 18, 2010 / Reply
 13. vinaychakravarthi April 18, 2010 / Reply
 14. అభిమాని April 18, 2010 / Reply
 15. keshavcharan April 19, 2010 / Reply
 16. Rajesh April 19, 2010 / Reply
 17. Rajesh April 19, 2010 / Reply
 18. Venkat Gopu April 19, 2010 / Reply
 19. గౌతమి April 19, 2010 / Reply
  • Rajesh April 19, 2010 / Reply
  • guru April 19, 2010 / Reply
   • viplove April 20, 2010 /
   • viplove April 20, 2010 /
 20. Rajesh April 19, 2010 / Reply
 21. గౌతమి April 19, 2010 / Reply
 22. గౌతమి April 19, 2010 / Reply
  • guru April 19, 2010 / Reply
 23. Venkat Gopu April 19, 2010 / Reply
 24. a2zdreams April 19, 2010 / Reply
 25. uma April 20, 2010 / Reply
 26. viplove April 20, 2010 / Reply
 27. చక్రధారి April 20, 2010 / Reply
 28. kay April 20, 2010 / Reply
 29. Rajesh April 20, 2010 / Reply
  • Rajesh April 20, 2010 / Reply
   • Venkat Gopu April 20, 2010 /
   • Venkat Gopu April 20, 2010 /
   • Rajesh April 20, 2010 /
 30. kay April 20, 2010 / Reply
 31. sowmya April 20, 2010 / Reply
 32. sowmya April 20, 2010 / Reply
 33. Rajesh April 20, 2010 / Reply
 34. గౌతమి April 20, 2010 / Reply
 35. గౌతమి April 20, 2010 / Reply
  • Srinivas.E April 20, 2010 / Reply
 36. Gurivinda April 21, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *