Menu

పైరసీ అనే ఒక పిచ్చ (కాపీ) కామెడీ కథ 1

1981 వ సంవత్శరం.అప్పటికి ఓ రెండేళ్ళ నుంచి మాంఛి ఫామ్ లో ఉన్న చిరంజీవి అనే యువనటుడు నటించిన ‘చట్టానికి కళ్ళులేవు’అనే సినిమా గల్లాపెట్టెల దుమ్మురేపుతుంది.చిరంజీవికి మాధవి జంటకాగా,సీనియర్ నటి లక్ష్మి అక్కగా నటించిన ఈ సినిమా తెలుగుసినిమాల్లో ముఖ్యంగా అప్పటికి కాస్త్ర వెనకబడి ఉన్న క్రైమ్ సినిమాలకు మరొక మారు కాస్త ఊపు తీసుకొచ్చింది.తన కుటుంబానికి అన్యాయం చేసిన విలనాసురలను ఎంతమాత్రం సాక్షాధారాలు లేకుండా హీరో మట్టుబెట్టటం అనేది ఇందులోని కొత్తపోకడ.బహుశా ఈ ఫార్ములాతో ఎన్నో ఆంగ్ల,హాలీవుడ్,యూరోపియన్,హిందీ సినిమాలు వచ్చి ఉండొచ్చుకానీ తెలుగు ప్రేక్షకులకు కధాంశం,చెప్పిన తీరు బాగా నచ్చి బ్రహ్మరధంపట్టారు.

ఈ సినిమాకు దర్శకుడు యస్.ఎ.చంద్రశేఖర్,ఇప్పటి తమిళ హీరో విజయ్ తండ్రి.చంద్రశేఖర్ ప్రత్యేకత ఏమంటే ఆయనకు ఇవ్వాళ కొత్తసినిమాతీసే అవకాశం ఇచ్చినా ఇదే కధను మళ్ళీ ఇలాగే తీయటం.కారణాలు యేమైనా గత పాతికేళ్ళకు పైగా అంటే1985 నుంచి   తెలుగుసినిమాపరిశ్రమ ఆయన్ను దూరంగా పెట్టింది. ఆ సంగతి అలా ఉంచి ..

మళ్ళీ ఈ సినిమా దగ్గరికి వస్తే..అట్లూరి పూర్ణచంద్రరావు,మన తెలుగు సినిమాలకు హిందీ సినిమారంగంలో రెసిడెంట్ ప్రతినిధిలాంటి తాతినేనిరామారావు దర్శకత్వంలో రీమేక్ చేసారు. ఈ సినిమాతో రజనీకాంత్ హిందీ చలనచిత్రప్రవేశం జరిగింది.తెలుగులో నారాయణరావు పోషించిన బిచ్చగాడిపాత్రను అమితాబ్ అధ్భుతంగా తెరపై ఆవిష్కరించారు.

‘చట్టానికి కళ్ళులేవు’లో నారాయణరావు రిక్షా కార్మికుడు కాగా హిందీలో అమితాబ్ స్థాయికి దాన్ని అటవీశాఖాధికారిగా పెంచారు.చిరంజీవిపక్కన హీరోయిన్ మాధవి హిందీలో అమితాబ్ భార్యగా నటించటం ఒక విశేషం.ఫారెస్ట్ ఆఫీసరు అమితాబ్ కుటుంబానికి అన్యాయం జరగటం ,ఆక్రమంలో భార్యను,బిడ్డను పొగొట్టుకోవటం,కోర్టుల్లో న్యాయం జరగకపోవటం,దానితో విసిగివేసారిన అతను యే అంధాకానూన్ హై పాడుకుంటూ తిరగటం,రజనీ కాంత్ తో చేయికలిపి ధర్మసంస్థాపనకు సాయంచెయ్యటం ఇదీ క్రమం.1983విడుదలైన ఈ సినిమా కూడా గల్లాపెట్టెల దుమ్ము తెగ దులిపింది.అంత వరకూ బాగుంది.

ఇదిలా ఉండగా,ఈ సినిమా విడుదలైన మూడేళ్ళకు అంటే1986 లో పరశురాముడు అని ఒక తెలుగుసినిమా విడుదల అయ్యింది.విజయనిర్మల దర్శకత్వం,కీర్తి అన్న ఒక కొత్తనటి కధానాయిక.కధేమిటయ్యా అంటే..అంధాకానూన్ లోని అమితాబ్ ఎపిసోడ్.ఇందులో యధావిధిగా కృష్ణ ఫారెస్ట్ ఆఫీసర్,కుటుంబానికి అన్యాయం జరగటం,రజనీకాంత్ సాయమేమీ లేకుండానే దుష్టసంహారం చేసి చట్టం లోని లొసుగులనాధారం చేసుకుని శిక్షలేకుండా బయటపడటం.సినిమా పరాజయం పాలవటంతో అంధాకానూన్ లోని అమితాబ్ ఎపిసోడ్ ను అచ్చంగా దించేసిన సంగతి కూడా జనాలు,క్రిటిక్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు.

చట్టానికి కళ్ళులేవు అన్న సినిమా కధ ఒకవేళ సదరు దర్శకుడు పదిసినిమాల నుంచి ఎత్తుకొచ్చి పంచకూళ్ళకషాయంలా చేసి వార్చినా ఎక్కడా అది కాపీ అనో ,మరొకటనో ఎవరూ అనలేదు,కారణం సొంత కధేమో అన్నంతగా ట్రీట్ మెంట్ ఇవ్వటం,అంతకన్నా బాగా తెరకెక్కించటం.ఆ సినిమాను హిందీ లో తీస్తే రీమేక్ అన్నారు,మరి ఆ రీమేక్ లో నుంచి ఒకముక్క తీసుకుని అచ్చంగ మరొకసినిమాను తీసిపాడెయ్యటాన్ని యేమనాలో?అన్నది ఆరోజుల్లోనే కాదు ఇవ్వాళా ఎవరూ చెప్పటం లేదు.

అలాగే చట్టానికి కళ్ళులేవు విడుదలైన మరో దశాబ్దానికి హిందీలో మరొక బ్లాక్ బస్టర్ వచ్చింది.సినిమా పేరు ‘పూల్ ఔర్ కాంటే’.హిందీ చలనచిత్రరంగంలో ప్రముఖ పోరాటాల నిపుణుడు వీరూ దేవ్ గన్ కుమారుడు అజయ్,రోజా సినిమాతో ప్రజలందరికీ తెలిసిన మధుబాల ఈ సినిమా ద్వారా హిందీ చిత్రప్రేక్షకుల ముందుకొచ్చారు.మాఫియా డాన్ అయిన తండ్రి నుంచి దూరంగా పెరిగి,తనుకోరుకున్న అమ్మాయినే పెళ్ళాడి,స్వంత ఉపాధి కల్పించుకుని,ఆనందంగా గడుపుతున్న అజయ్ కి ఒక కుమారుడు పుట్టటం,కొన్నాళ్ళకు ఆ బాబును ఎవరో ఎత్తుకెళ్ళటం,చివరాఖరికి మరొక దుర్మార్గుడైన విలన్ బారినుంచి బిడ్డను కాపాడే క్రమంలో అమ్రీష్ పురి మరణించటం కధ.మాఫియాడాన్ కీ మనసుంటుందనీ కన్నబిడ్డ పలకరింపుకోసం అతనూ పరితపిస్తాడు అన్న పాయింటును కొత్త గా చూయించటంతోపాటు,మంచిపాటలు,కొత్త హీరోహీరోయిన్లు కూడా జనాలకు నచ్చటంతో పూల్ ఔర్ కాంటే మంచి సూపర్ హిట్ అయ్యింది.

యధావిధిగా మనవాళ్ళు తెలుగులో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున ,నగ్మా హీరోహీరోయిన్లుగా ‘వారసుడు’అన్నపేరుతో రీమేక్ చేసారు.హిందీలో అమ్రీష్ పురి పోషించినమాఫియాడాన్ పాత్రను తెలుగులో హీరో కృష్ణపోషించటం విశేషంకాగా ఆపాత్ర కొడుకుపాత్రధారి నాగార్జున అరేయ్,ఒరేయ్ అనటం పట్ల హీరోగారి వీరాభిమానులు ఆగ్రాహావేశాలు వ్యక్తంచెయ్యటం,అది కాస్త వివాదాస్పదమవటం కూడా మరొక కోణం.ఈ సినిమా కూడా మంచివిజయమే సాధించింది.ఈ సినిమా విడుదల అయిన 1993లోనే మరొక సినిమా మామ-కోడలు పేరుతో వచ్చింది.అప్పటికి మాంఛి ఊపుమీదున్న మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిర్మించిన సినిమా అంటూ ఈ చిత్రప్రచారం ఊదరకొట్టింది.

సమకాలీనసామాజిక సమస్యల పై తనదైన ధోరణిలో సినిమాలు తీసే దాసరినారాయణరావు ఈ సినిమాకు దర్శకుడు,ప్రధానపాత్రధారికావటంతో మామ-కోడలు సినిమా పట్ల సహజంగానే పెరిగిన ప్రేక్షకుల అంచనాలు,విడుదల అయ్యిన మొదటిరోజు మొదటి ఆటతో పటాపంచలయ్యాయి.

దాసరి దర్శకత్వం వహించగా దారుణంగా పరాజయం పాలయిన చిత్రాలలో మొదటి పాతికలోనో,యాభయ్ లోనో ఈ సినిమా కూడా చేరింది.

ఇంతకీ ఈ సినిమా కధేమిటయ్యా అంటే అదే పూల్ ఔర్ కాంటే.అందులోని మాఫియా డాన్ ఇందులోని సారాయికాంట్రాక్టర్ రావుల అంకయ్యరెడ్డి అనగా దాసరి నారాయణరావు.కొడుకు రమేష్ బాబును గారాబంగా పెంచుకోవటం,ఆ కొడుకు వాణీవిశ్వనాధ్ ను ప్రేమించి,ఇల్లొదిలిపెట్టటం,అతనూ ఒక కొడుకును కనటం అంతా అదేకధ,కాకుంటే సారావ్యతిరేక ఉద్యమం కలర్ ఇవ్వటం,నెల్లూరు జిల్లాకు చెందిన అబ్కారీ వ్యాపారి,సినీ నిర్మాత రావుల అంకయ్య గౌడ్ పేరును మార్చి అంకయ్య రెడ్డిగా మార్చటం ఇలా సినిమాకు తెలుగుజాతీయత రంగులద్దినా అది అచ్చం పూల్ ఔర్ కాంటే సినిమాకు మక్కీకిమక్కీ.

(సశేషం)

14 Comments
 1. రాజు సైకం April 20, 2010 /
  • వంశీ కృష్ణ April 20, 2010 /
 2. అభిమాని April 20, 2010 /
 3. అబ్రకదబ్ర April 21, 2010 /
  • Hari April 21, 2010 /
   • అబ్రకదబ్ర April 21, 2010 /
 4. Shiva Bandaru April 21, 2010 /
 5. zuran April 22, 2010 /
 6. Srinivas Komanapalli April 26, 2010 /