Menu

కథాచౌర్యం – మల్లీశ్వరి వివాదం-ఒక స్పందన

శ్రీనరేష్‌నున్నాగారికి నమస్కారములు

ఒంటిచేత్తో పదిమంది దొంగలను ఎదుర్కొన్న మహావీరుడుగా,  పేద ప్రజలపాలిటి పెన్నిధిగా మహానటుడు సినిమాలలో ప్రజల మనసులలో నిలుస్తాడు. అంతమాత్రాన అతడు నిజజీతములో ఆ సినిమా ప్రదర్శనంతటి శౌర్య పరాక్రమ శోభితుడని అనుకోలేము. అతడిచ్చిన ప్రేరణ మాత్రము మహావీరులను తయారు చేస్తుంది.అలా అసాధారణ జనవ్యక్తిత్వ వికాసపాత్రకు ప్రేరణ ఇవ్వగల నటుడు పదిమంది దొంగలను ఒక్కసారిగ మీదపడితే ఎదుర్కోవడముకాని, ఉదాత్తజీవిత ప్రమాణాలతో నిజజీవిత నటనలో ఆదర్శము అవ్వాలని ప్రయత్నించి భంగపడకుండా నటుడిగా నిలిచిపోతే చిరస్మరణీయుడవుతాడు. అపహాస్యముగా
భంగపడితే ఒక నటుడుగా కూడ ఉనికి కోల్పోతాడు. అలాగే రచయిత కూడా సమాజాన్ని ప్రబోధించి చిరస్మరణీయుడవుతున్నాడు. ప్రబోధములో పిరికితనముండదు.

‘గోరింటాకు’ సినిమాకథ రచన తనదని ముప్పాళ రంగనాయకమ్మ కోర్టుకెక్కి జయము సాధించి గ్రంధకర్తృత్వ చౌర్యము చేసేవారికి హెచ్చరికగా ప్రేరణ కలిగించే
రచయిత్రిగా జయము సాధించింది. రసభావపోషణ, మానవ ప్రవృత్తి చిత్రీకరణకు పేరు కెక్కిన రచయిత బుచ్చిబాబు. 1964 విశ్వవాణి ప్రచురణలో మాత్రమే బుచ్చిబాబు రచించిన 1944నాటి రాయలకరుణకృత్యం నాటిక భారతిపత్రికలో ప్రచురింపబడిన ఏడేళ్లతరువాత మల్లీశ్వరి చిత్రకథకు ప్రేరణ అన్నది అన్యాపదేశంగ ఉందని చెప్పడమే తప్ప నిజమని ఖచ్చితంగా ధ్రువీకరింపబడకపోవడము రచయిత బ్రతుకున్నకాలంలో జరగకపోవడము ప్రతిఘటించమని సమాజాన్ని ప్రేరేపించగలగొప్ప రచయితగ బుచ్చిబాబు మల్లీశ్వరి విషయంలో ఓటమినంగీకరించి నట్లేనని అని నా అభిప్రాయము.

మల్లీశ్వరి కథా చౌర్యమును గురించిన మీ అభిప్రాయములు కొట్టిపారవేయదగ్గవి కావు. మరింత తులనాత్మక పరిశీలనకు మీ వ్యాసము ఉపకరిస్తుంది. మీ నిర్ణయానికి సమర్థన లభించేముందు మరింత చర్చజరగాలని నాకోరిక. దేవులపల్లి రెడ్డిగము వేసుకుని మహాగ్రంథము రాయలేకపోయినా, బయట పెట్టిన అక్షరములు ప్రోతస్సులు అని ప్రశంసించిన మధునాపంతుల వారి మాటలవలె మీ అభిప్రాయములు ఆహ్వనించతగినదే. శైలి అనితరసాధ్యమని అనిపించుకున్న ఆ మహాకవి రచించిన ‘తొలిసంజవేళలో’- అన్న సీతారాముల సినిమా లోని దర్శకరత్న పాటరచన దేవులపల్లిని మరపింపచేయజాలదన్న ప్రశంశ విమర్శ లేక చురక అనేది తేల్చులేకపోయినా శైలి భుజాలు తడుముకునేలా చేయగలగడముతో మహాకవికి బ్రతికున్న నివాళి అయింది.

ఇటీవలికాలంలో ‘భరతఖండంబు చక్కనిపాడియావు’అని చిలకమర్తివారు రాజమండ్రిలో పాల్‌చౌక్‌లో స్వరాజ్యము రాక మునుపు ఆశువుగా సభలో ప్రబోధించిన దేశభక్తి పద్యము ఆశువుకాదని తన స్నేహితుని పద్యము వాడుకుని తనదిగ ప్రచారము చేసుకున్నారన్న వాదన తెరమీదకు వచ్చింది. భావ చౌర్య అపవాదు ఆదికవి కూడా భరిస్తున్నాడు. అధర్వుని తెలుగు భారతాన్ని నాశనము చేసి నన్నయ ఆదికవిగా పేరుకెక్కాడని పుక్కిటిగాధ ప్రచారము ఖండింపబడినా నమ్మేవారుంటూనే ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు పెద్దన రచించిన పద్యాలు మర్యాదపూర్వకంగా ఆత్మస్తుతి నివారణకు చేర్చినందుకు ఆముక్తమాల్యద గ్రంధరచనా సామర్ధ్యకర్తృత్వమునకు సందేహింపబడుతున్నాడు. కంకంటిపాపరాజు అధికారహుకుంతో ఉత్తర రామాయణగ్రంధకర్తను సొమ్ముతో కొనేసి తాను కృతి కర్తగా ప్రచారమయ్యాడని అంటారు.

అయితే మడికిసింగన రచించిన విష్ణుమాయాలాసము నాటకగ్రంధములో కృత్యాది మరియు ఆశ్వాశాంతపద్యములు తప్ప మిగిలిన పద్యరచన చింతలపూడి ఎల్లనార్యుడిదన్న అపవాదును గ్రంధచౌర్యముకాదని ఆంధ్రకవితరంగిణి తొలగించే ప్రయత్నము చేసింది. అలాగే కవి మృతుడైననూ చనిపోరాదన్న కృష్ణశాస్త్రి ఆశయానికి రుజువుగా మీ వ్యాసము బుచ్చిబాబును మల్లీశ్వరిలో సజీవము చేసింది. ‘పిల్లనగ్రోవిని వెడలునింతతీయదనముల లీనమైన కృష్ణశాస్త్రి
ఎడదలోని క్షీరసాగరమును’ విమర్శ హాలాహలమై కుత్తుక దిగి బాధించేకన్న నీలకంఠుని విశ్వశ్రేయమై మల్లీశ్వరి రసాత్మకం వాక్యంకావ్యముగ దేవులపల్లికి అంకితముగ నిలిచి పోయిందన్నది వాస్తవమని నా అభిప్రాయము. అదే మీ అభిప్రాయముకూడ అని నేను భావిస్తున్నాను.

డా.జొన్నలగడ్డ మార్కండేయులు

3 Comments
  1. Ram April 13, 2010 /
  2. Srinath April 16, 2010 /