Menu

డాక్యుమెంటరీ సినిమా-4

మొదటి ప్రపంచ యుద్ధంలో సినిమా

కళ చాలా పవిత్రమైనదని, దాన్ని క్షుద్రమైన తాత్కాలిక ప్రయోజనాలకు వాడకూడదని, కళావిలువలకు, కళా ప్రయోజనానికి శాశ్వతత్వం ఆపాదించే అన్ని వర్గాల వారు కూడా కళను ఒక చీపురుకట్టలాగ, ఒక గ్లాసుడు మంచినీళ్లలాగా తక్షణావసరాలకు వాడుకోవడం చరిత్ర అంతటా జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా యుద్ధం, సరిహద్దు తగాదాలు మొదలైన సందర్భాలలో కవులూ, కళాకారులూ విజృంభించి ప్రచారంతో హోరెత్తిస్తారు.

మొదటి ప్రపంచయుద్ధం సందర్భంగా ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీ దేశాలే కాక తటస్థంగా ఉన్న అమెరికా కూడా సినిమాకళని తమ అవసరాలకి అనుగుణంగా మలచుకొని ఉపయోగించుకుంది. ఒకవైపున జర్మనీ, మరోవైపు ఫ్రాన్సు, ఇంగ్లండు మొదటి ప్రపంచయుద్ధంలో ప్రతిపక్షాలు, సహజంగా యుద్ధంలో పాల్గొనే దేశం తమదె న్యాయం అనీ, తామే ధర్మయుద్ధం చేస్తున్నాననీ చెప్పడం, నమ్మించడానికి ప్రయత్నించడం జరుగుతుంది.

మొదటి ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ తమ శత్రువులకంటే ముందుగా రంగంలోకి దిగి సినిమాని ప్రచారానికి వాడుకుంది. ప్రత్యక్షంగా యుద్ధరంగంలో వార్తా చిత్రాలు తీయడానికి ఓ ప్రైవేటు సంస్థకు అనుమతి ఇచ్చింది జర్మనీ ప్రభుత్వం. తయారైన వార్తాచిత్రాలను ఒక పద్ధతిలో ఎడిట్ చేసి దేశమంతటా చూపేది. ఇంగ్లండు, ఫ్రాన్స్ లు మొదట్లో అలాంటి వార్తా చిత్రాలు తీయడానికి సిద్ధపడలేదు. యుద్ధదృశ్యాలు చూస్తే మొత్తం యుద్ధం పట్లే వెగటు కలుగుతుందని భయం ఒకవైపునా, ఈ చిత్రాల ద్వారా తమ వ్యూహ రహస్యాలు శత్రువులకు తెలుస్తాయనే జంకు ఒక వైపునా ఇంగ్లండు, ఫ్రాన్సులను బాధించాయి. అందుచేతనే యుద్ధం ప్రారంభించిన ఒకటిన్నర సంవత్సరాలకు గానీ పునరాలోచన చేసి యుద్ధ వార్తా చిత్రాలు నిర్మించాలనే నిర్ణయానికి రాలేకపోయారు.

మొదటి ప్రపంచ యుద్ధకాలంలో వచ్చిన చిత్రాలన్నీ మొరటుగానూ, కేవలం ప్రచార సాధనాలుగానూ మాత్రమే ఉండేవి వాటిలో కళా లక్షణాలు మృగ్యం. ఆ తరువాత 20 సంవత్సరాలకు ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తయారైన యుద్ధవార్తా చిత్రాలతో పోల్చి చూస్తే, ఈ సంగతి స్పష్టంగా బోధపడుతుంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోని సినిమాలు చాలా మొరటుగా ఉండేవి. అయినా ప్రచార సాధనాలుగా సినిమాకున్న శక్తిని బలంగా రుజువు చేయగలిగాయి.

జర్మనీ ఇంచుమించు 1910 ప్రాంతంనుండే యుద్ధ వాతావరణాన్ని, యుద్ధావసరాన్ని నెమ్మదిగా మూకీ చిత్రాల ద్వారా ప్రజలకు నూరిపోస్తుండేది. వాటన్నింటిన్లోనూ దేశాభిమానం, జాతీయ ఆగ్రహం పెచ్చు మీరి కనబడుతుండేది. నిజానికి ఆ చిత్రాల పేర్లే సంకుచిత, జాతీయతత్వానికి ప్రతీకలుగా ఉండేవి.

ఉదా :- ‘ జర్మనీ స్త్రీయే జర్మన్ ధర్మానికి ప్రతీక “(Deutsche Franen Deutsche Trene), ‘ గౌరవ రంగం ‘ (Ant Dos Felde Der Ehre – 3) ‘ మాతృదేశం పిలుస్తోంది ‘ మొదలైనవి.

అలాగే ఫ్రాన్సు, ఇంగ్లండు దేశాలు కూడా గర్వపడే విధంగా దేశభక్తిని ధ్వనించే పేర్లు పెట్టేవారు.. ఉదా:- ‘ఇంగ్లండుకోరేదేమిటి?’ ‘జర్మనీ పెత్తనం ‘, ‘ శాంతి సరిహద్దులు ‘ వగైరా…

ఈ చిత్రాలన్నీ సంకుచిత జాతీయ భావాలకు బహిరంగ ఉద్ఘాటనలు, యుద్ధం ఎవరెవరికి ఏ రకంగా సహాయపడబోతోందో వివరంగా బట్టబయలు ప్రచారం చేస్తుంది. అంటే తాము యుద్ధంలో గెలిస్తే, ఎటువంటి దౌర్భాగ్యులకైనా తమ దేశస్థులైతే బంగారు భవిష్యత్తు గ్యారంటీ అయినట్టు ప్రచారం సాగేది.అలాగే సైనికులుగా చెరినవారికి జరగబోయే సత్కారాలు, సన్మానాలు నోరూరేలా ఈ చిత్రాల్లో చూపేవారు. అంతే కాకుండా ప్రేక్షకులను ఈ చిత్రాలు మోహపరవశులను చెసేవి. ఈ యుద్ధ చిత్రాలు అతిశయోక్తులతో ఆర్భాటంగా కనబడేవి. నైతికంగా తమదేశం ఉన్నతమైనట్టిదిగాను, శత్రుదేశం నీచమైనదిగానూ ఆ చిత్రాల్లో వక్రీకరించేవారు. శత్రుదేశీయులు పిరికితనానికి, మూర్ఖత్వానికి, తెలివితక్కువతనానికి ప్రతినిధులుగానూ ఆయా చిత్రాలలో కనిపింపచేసేవారు.

మనదేశంలో ఇంచుమించు అన్ని భాషలలోనూ వెలువడిన డిటెక్టివ్ సాహిత్యంలోనూ, అడపాదడపా కనపడే యుద్ధ నేపధ్య చిత్రాలలోనూ కూడా ఈ లక్షణం గమనించవచ్చును. ఓ చైనీయుడు లేక పాకిస్థానీయుడు అతి నికృష్టమైన సైనికాధికారిగా మనకు దర్శనమిస్తాడు. అదె సమయంలో మన భారతీయపౌరుడు సర్వలక్షణ సంపన్నుడుగానూ, సుందరుడుగానూ విశ్వరూపం ప్రదర్శిస్తాడు.

ఈ లక్షణం ఎక్కువగా యుద్ధ ప్రచార సంస్కృతినుంచి వచ్చింది. మరో వైపున విచిత్రంగా “హిందీ – చీనీ భాయీ – భాయీ” రోజుల్లో భారత – చైనా మైత్రితోనే కాక, ప్రాచీన చరిత్రలో కూడా ఈ రెండు దేశాలు ఎంత శాంతికాముకమైనవో, ఎంత స్వాదు స్వభావం గలవో వివరించడానికి కూడా చిలువలు పలువలుగా చేటభారతాలు అల్లడం ఈ తరంలోనే జరిగింది. ఈ లక్షణం మనకు ఆదిమ నాగరికతనుంచి వారసత్వంగా సంక్రమిస్తూ వచ్చింది. యుద్ధప్రచారం ఎప్పుడూ ఏకపక్షమే! దానికి వాస్తవిక ఆదర్శాలను అన్వయించాలనుకోవడం అజ్ఞానం. అంతెందుకు సామాన్య రష్యా పౌరునికి అమెరికా అంటేనో, అమెరికా పౌరునికి రష్యా అంటేనో సానుభూతి రేఖామాత్రంగా కూడా లేదు. ఇది మరోరకపు యుద్ధ సంస్కృతి – శీతలయుద్ధం. చూడబోతే ఒక దేశం ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణం కట్టుకున్న అద్భుతమైన స్వర్గం, మరో దేశం భూతలస్వర్గంగా, పేదలరాజ్యంగా సమతా సమాజానికి ఆదిమాతగా పరసిద్ధి కెక్కిన మహారాజ్యం.

పురాణాల్లోనూ, జానపద సాహిత్యంలోనూ కూడా ఆదర్శపురుషులు, ఆరాధ్య విగ్రహాలు ప్రముఖ పాత్ర వహించాయి. ప్రాధమికంగా ప్రచారంలో ఈ అంశాన్ని ప్రధాన ఆయుధంగా తీసుకొని ప్రచార వ్యూహాన్ని నిర్ణయిస్తారు.

శ్రీదేవి లక్స్ టాయిలెట్ సోఫుకు తన పేరుని, అభిప్రాయాన్ని అమ్మినా, కపిల్‌దేవ్ ఎరాస్మిక్ వారికి తన ముఖాన్ని అద్దెకిచ్చినా ఈ సూత్రమే అమలులో ఉన్నట్టు లెక్క. మరియుద్ధానికి మాత్రం అలాంటి విగ్రహాలు ఉపయోగపడవా? అమెరికాలో ప్రసిద్ధికెక్కిన తారలు ఎంతోమంది ఉండేవారు. వారిలో బాగా ప్రస్తిద్ధి పొందిన విలియం హార్ట్, చార్లీ చాప్లిన్, డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, థెడాబర్రా ప్రచార సేవ చెశారు. వీరు ప్రభుత్వ బాండ్లు, లిబర్టీ లోన్‌లు, రెడ్ క్రాస్ సహాయనిధులు పోగు చేయడానికి కృషి చేశారు. ఆయా సందర్భాలలో ప్రచార చిత్రాలలో నటించారు. ఫ్రెంచి ప్రధమశ్రేణి తారలంతా దేశభక్తి, జాతీయభావం ప్రజల్లో రగుల్కొల్పడానికి సభలు, ఊరేగింపులు, ప్రదర్శనలు జరిపారు. ఆనాడు దివినుండి భువికి దిగివచ్చిన దేవకాంతగా ప్రసిద్ధి చెందిన “సారా బెర్న్ హార్డ్” నర్స్ వేషంలో ప్రజల జాతీయాభిమానాన్ని, ఆవేశాన్ని పెంచేందుకు కృషి చేసింది. సారా ఫ్రెంచి తార మాత్రమే కాదు, అప్పటి నటనా ప్రపంచానికి ఆమె మకుటంలేని మహారాణి. సినిమా చరిత్రలో ఈ సంఘటనను అద్యద్భుతమైనదిగా చెబుతారు.

శత్రుదేశాల నాయకుల్ని ఎగతాళి చేయడం మొదటి ప్రపంచయుద్ధ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. “శత్రువులను చులకన పరచండి” అనే మావో యుద్ధతంత్ర సూత్రం అప్పటికే ఆచరణలో ఉంది. బ్రిటీషువారు నిర్మించిన “సముద్ర స్వప్నాలు” మొ.. చిత్రాలలో జర్మన్ చక్రవర్తి కైజర్ ను ఒక హాస్యగానిగా చూపించారు. అప్పుడేవచ్చిన కార్తూన్ చిత్రాలు కూడా ఇందుకు బాగా దోహదపడ్డాయి.

మరోవైపున జర్మన్ చిత్రరంగం 1910 ప్రాంతం నుండి రాబోయే యుద్ధాన్ని, దాని “అవసరాన్ని కీర్తిస్తూ, యుద్ధానికి స్వాగతం, చెబుతూ ప్రచారం ప్రారంభించింది. 1914 వరకూ తటస్థంగా ఉన్న అమెరికా కూడా ఫ్రాన్సు, బ్రిటన్‌లతో కలిసింది. అప్పటివరకూ శాంతిబోధ చేస్తున్న అమెరికా సినిమాలు హటాత్తుగా మిలిటరీ తత్వాన్ని కీర్తిస్తూ రావటం మొదలయ్యింది. రూజ్వెల్ట్ కూడా కొన్ని చిత్రాల ప్రణాలికల్లో పాలు పంచుకున్నాడు. అలా వచ్చిన చిత్రాల్లో “శాంతి కోసం యుద్ధం” ముఖ్యమైనది. ఆ చిత్రంలో ట్రాట్‌స్కీ కూడా నటించాడని వదంతి. కాని అది పచ్చి జర్మన్ వ్యతిరేక చిత్రం. ప్రెసిడెంట్ విల్సన్ యుద్ధంలో ప్రవేశించాలని నిర్ణయించడానికి ముందే కొన్ని జర్మన్ చిత్రాలు వచ్చాయి. కానీ అమెరికా సినిమారంగంలో జర్మన్ అనుకూల శక్తులు కూడా ఉన్నాయి. రాండాల్ ఫాస్ట్ ఆ వర్గానికి చెందినవాడు.

1916 లో తయారైన “వార్ బ్రైట్స్” చిత్రం ఒక చరిత్ర సృష్టించింది. దాన్లో కథానాయిక శత్రు సేనాని ద్వారా వచ్చిన గర్భంవల్ల కనబోయే బిడ్డని కనడానికి ఇష్టపడక ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది తెరమీద కనిపించేసరికి యుద్ధ వ్యతిరేక చిత్రంగా ప్రేక్షకులకు తోచింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాద లక్షణాన్ని పసిగట్టి ప్రభుత్వం ఆ చిత్రాన్ని నిషేధించింది. అప్పటికే అమెరికా యుద్ధానికి తటస్థంగా ఉండే దశదాటి, యుద్ధాన్ని సమర్ధించే దశకి రావడంవల్ల ఈ నిషేధం అమలులోకి వచ్చింది. అలాగె రాబర్ట్ గోల్డ్ స్టైస్ నిర్మించిన “1876 స్పూర్థి” చిత్రం అమెరికా యుద్ధానికి వెళ్లేముందు విడుదలైంది. అందుచేత ఈ చిత్రాన్ని నిషేధించడమే కాక, ఆ నిర్మాతకు పది సంవత్సరాలు కారాగార శిక్ష విధించారు. ఆ రకంగా యుద్ధ వ్యతిరేక చిత్రాలు గొంతు నులిమివెయబడ్డాయి. ఆ తరువాత వచ్చిన అమెరికన్ చిత్రాల్లొ జర్మన్ల యుద్ధప్రీతి, వారి రాక్షస రతిక్రీడలు విస్తృతంగా కనిపించాయి. సిసిన్ బిడి మిల్ చిత్రాల్లో జర్మన్ల జంతులక్షణాలు అసహ్యంగా వివరించబడ్డాయి. ఆ రోజుల్లో తయారైన యుద్ధ చిత్రాల్లో జర్మన్ చక్రవర్తి కైజర్‌కు అనుచరుడు ‘ సాతన్ ‘ అంటే ప్రపంచానికి అరిష్టం జర్మనీ మాత్రమే అని పాఠాలు చెప్పడమే అమెరికా చిత్రాల లక్ష్యం.

ఆస్ట్రియాలో మహారాజుగారి ఆస్థానం దేశభక్తియుత చిత్రాలు తీయాల్సిందిగా ఆదేశించింది. ఫ్రాన్సులో యుద్ధశాఖామంత్రి తన శాఖలో సినిమా విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సినిమా విభాగంలో పని చేసిన ఏబెల్ గ్రాన్స్, మార్షల్ వెర్చియా, జాన్ బెనోయ్ లెవి మొ.. వారు తరువాత కాలంలో చాలా ప్రసిద్ధి చెందారు. అలాగే సినిమా చిత్రకారుడు రెనెజా కూడా ఆ శాఖలో పనిచేసినవాడే. బ్రిటిష్ ప్రభుత్వం అనేక దేశభక్తి చిత్రాలకు ఆర్ధిక సహాయన్ని అందచేసింది. గ్రిఫిత్‌ను ఒక చిత్రం తీయడానికి తన దేశం రప్పించుకుంది. ఈయన తీసిన “హార్ట్ ఆఫ్ ది వర్ల్డ్” గొప్పదేం కాదు. ఫ్రాన్స్‌లో జర్మనుల అనాగరిక ప్రవర్తన అందులోని కథావస్తువు. అప్పటికే యుద్ధమంటే విసిగిన ప్రజలు ఆ చిత్రాన్ని తిరస్కరించారు. “కళావస్తువుగా యుద్ధం చాలా అసంతృప్తికరం” అన్నాడు గ్రిఫిత్.

తొలిరోజుల్లో తటస్థంగా ఉన్న అమెరికా ప్రచార చిత్రాలకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన మొదటిదేశం కావడం విచిత్రం. 1917 జులై 4 న జర్మన్ సైన్యాధికారి రాసిన ఒక పత్రంలో సినిమాకు ఉన్న ప్రచార విలువను స్పష్టంగా గుర్తించాడు. కాకపోతే అది తమకంటే తమ శత్రువులకు ఎక్కువ ఉపయోగపడిందని విచారించాడు. ఆ తరువాత జర్మనీలో చలనచిత్ర ప్రచారశాఖ ఏర్పడింది.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సినిమా చరిత్రని పరిశీలించి చూస్తే రెండు అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి – యుద్ధంపై, యుద్ధ ప్రచారంపై సినిమా ప్రభావం తిరుగులేనిదని నిస్సంశయంగా రుజువైంది. మరో ముఖ్యమైన విషయం.. అంతకు ముందువరకూ సినిమా ఒక ప్రత్యేక తరగతికి చెందిన యాంత్రిక వ్యవహారంగా ఉండేది. యుద్ధం పుణ్యమా అని సినిమా రంగానికున్న ఆత్మ న్యూనతాభావం పోయింది. ప్రపంచ కళారంగంలో గర్వంగా తలెత్తుకోగల స్థితి సినిమాకి లభించింది. కాకపోతే యుద్ధప్రచారంలంటి హీన కార్యక్రమంలోఆ పరిగణన రావడం పెద్ద ఐరనీ. అంతకుముందే కొన్నైనా ఉత్కృష్టమైన చిత్రాలు వచ్చాయి. మానవతని, కారుణ్యాన్ని ఇంకా మనిషిలో ఉండే ఉన్నత సంస్కారాన్ని సినిమా తెరపై చూపిన ఘట్టాలు ఇంతకుముందే ఉన్నాయి. కాని సినిమాకున్న విస్తృత శక్తి మొదటి ప్రపంచయుద్ధం వల్లనే అందరికీ బోధపడింది. దీనికి లాభనష్టాల ప్రమేయం కూడా లేకపోలేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ సినిమా రంగానికి చేతినిండా పని దొరికింది. యుద్ధ సందర్భంలో ప్రభుత్వం నుంచి సహకారం లభించింది. యుద్ధం ఆఖరిదశలో యుద్ధం పట్ల వైముఖ్యం పెరిగి అలిసిపోయిన ప్రజలకు వినోదాన్ని, కాలక్షేపాన్ని పంచిపెట్టడం సినిమాకు ఆర్ధిక సౌష్టవం కలిగించింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధకాలంలోకూడా ఇదే జరిగింది. ఇప్పటికీ అక్కడ కూడా జరుగుతున్న చిల్లరమల్లర ప్రాంతీయ యుద్ధాలు కూడా సినిమాకు ధనం సమకూరుస్తుంది. అంతేగాక కొందరికైనా చౌకబారు కథావస్తువు యుద్ధంలో దొరుకుతుంది.

మొదటి ప్రపంచయుద్ధంలో ప్రత్యక్షంగా ప్రమేయం లేని దేశాలతో సహా అన్నిచోట్లా యుద్ధం ఒక అద్భుతమైన వినిమయ సరుకుగా ఉపయోగపడింది. అందుకు సినిమా ముఖ్యమైన వాహకం.

3 Comments
  1. mohanramprasad April 5, 2010 /
  2. జాటర్ డమాల్ April 6, 2010 /