Menu

వోల్వో బస్సులో “ప్రస్థానం”

మిత్ర (శర్వానంద్): “ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తలదన్నే పాత్రలేదు నాన్నా”

లోకనాధం (సాయి కుమార్): “పురాణాల్ని దాటి వచ్చి చూడు. ఇంతకంటే దారుణమైన పాత్రలు కనిపిస్తాయి… ఈ నాటకంలో హీరోలు విలన్లు వుండరు”

ప్రస్థానం చి త్రంలో ప్రధాన పాత్రల మధ్య జరిగే సంభాషణ ఇది. నిజంగానే ఈ సినిమాలో హీరోలు విలన్లు అంటూ ఎవరూ లేరు. కేవలం పాత్రలున్నాయి. ఎందుకంటే ఇది కథని నమ్ముకున్న ఓ దర్శకుడి చిత్రం. ఆ రకంగా దేవ కట్ట ఒక మంచి సినిమా తీసాడని నిశ్చయంగా చెప్పొచ్చు.

ప్రస్థానం అంటే ప్రయాణం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం సుఖవంతంగా వుండాలని ఎలా అనుకుంటామో అలాగే ఏదైనా సినిమా చూసినప్పుడు ఆ సినిమా వీక్షణం ఎలాటి ఒడిదుడుకులు లేకుండా వుండాలని ఆశిస్తాం. ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా హాలు ముందర నిలబడి, తెలుగు సినిమా చూసొచ్చే ప్రేక్షకుణ్ణి చూస్తే, సదరు ప్రేక్షకుడి ముఖంలో ఎర్రబస్సు ఎక్కి గతుకుల రోడ్డుపైన 300 కీ.మీ ప్రయాణం చేసిన అలసట, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి వోల్వో బస్సులాంటి ప్రస్థానం చేయిస్తుంది ఈ “ప్రస్థానం”.

కథ కథనాల మీద దర్శకుడికి వున్న నమ్మకం, పట్టు కారణంగానే ఈ సినిమా చూసిన ప్రేక్షకుడికి “బాగుంది” అనే అభిప్రాయం కలుగుతుంది. చాలా సినిమాలలోలాగా ఈ సినిమాలో సాయికుమార్ అనవసరంగా అరవడు, కథానుసారం కొంచెం సీరియస్‌గా వుండే శర్వానంద్ హీరోయిన్ కల కనిందని స్టెప్పులెయ్యడు, మొదటి సినిమా చేస్తున్నా కొత్త నటుడు సందీప్ వత్తులు పలకలేని తెలుగు మాట్లాడడు, ఇంకా ఈ సినిమాలో అనవసరంగా పాత్రలు పుట్టుకురావు, విలన్‌ని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి ఒక సైడు పాత్ర అనవసరంగా చావదు, పంచ్ డైలాగుల పేరుతో సంబంధంలేని విషయాలు మాట్లాడరు, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రత్యర్థులు హత్యలు వున్నాయని కథ కర్నూలో కడపో వెళ్ళిపోదు, క్లబ్ పాట ఎట్లాగు వుంది కదాని ముంబై నుంచి మమైయత్ ఖాన్ దిగిపోదు.. ఇలాంటివన్ని వుంటే తప్ప సినిమా ఆడదు అని అందరూ అనుకునే టైంలో ఇలాంటివి లేకపోతేనే బాగుంటుందని నమ్మిన నిర్మాత రవి అభినందనీయుడే.

ఈ సినిమా కథ గురించి ఇప్పటికే మీరు చదివి వుండొచ్చు కాబట్టి ఆ ప్రస్తావన తేవటం లేదు. చాలా మంది ఈ సినిమాని పొలి టికల్ థ్రిల్లర్ అని అన్నా నాకెందుకో ఇది థ్రిల్లర్ కన్నా డ్రామా జాన్రాకు చెందినదేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇంగ్లీషు ” గాడ్ ఫాదర్”, హిందీ “సర్కార్” తరహాలో ఇది రాజకీయ నేపధ్యంలో కుటుంబ కలహాలు ప్రధాన ఇతివృత్తం వున్న చిత్రం. అయితే తీసుకున్న రెండు అంశాలని (రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు) చాలా నేర్పుతో బాలన్స్ చేశాడు దర్సకుడు. ప్రతి పాత్రకి మరో పాత్రతో వుండే సంబంధం, వారి మధ్య వుండే సంఘర్షణ మాటల్లో పదునుగా పలికాయి. అక్క తమ్ముడు, అన్న తమ్ముడు, సొంత కొడుకు – సవతి కొడుకు లాంటివే కాక నాయకుడు అనుచరుడు, నాయకుడు నమ్మినబంటుల మధ్య వుండే ఎమోషన్స్ కూడా చక్కగా రూపొందించాడు దేవ.

అసలు ఈ సినిమాలో ఏం నచ్చింది అంటే చాలామంది దర్శకత్వం, లేకపోతే నటన చప్పొచ్చు. కానీ నాకు నచ్చింది దర్శకుడి కష్టం – ఒక కథని నమ్ముకోని దాని తగ్గట్టుగా పాత్రలు తయారు చేసుకోని ప్రతి సన్నివేశంలో గుర్తుండిపోయే మాటల రాయడం కేవలం ప్రతిభ మాత్రమే కాదు – ఒక శ్రమ కూడా. ఆ శ్రమని అభినందించి తీరాలి. అలాగని ఈ సినిమాలో తక్కువగా చెప్పేవే లేవా అంటే – వున్నాయి. వున్నా అవి పంటి కింది రాయిలా అడ్డం పడవు. మంచి కథ, పక్కాగా రూపుదిద్దుకున్న పాత్రలు, ఆ పాత్రలకు తగ్గట్టు చక్కటి నటన ప్రదర్శించిన నటులు, పదునైన సంభాషణలు, ఫొటోగ్రఫీ (ముఖ్యంగా నలుపు తెలుపు) ఈ చిత్రానికి వెన్నెముక. సంగీతం, ఎడిటింగ్ లోపాలు కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ అభిప్రాయం మీద అంత ప్రభావం చూపించలేదు

ఈ సినిమాని ప్రపంచ సినిమాతోనో హిందీ సినిమాతోనో పోల్చి మాస్టర్‌పీస్ అని చెప్పాల్సిన పని లేదు కాని, ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాలతో పోలిస్తే “మంచి సినిమా” అన్నది నాతో సినిమా చూసిన ఒక సగటు ప్రేక్షకుని మాట.

– అరిపిరాల సత్యప్రసాద్


7 Comments
  1. rayraj April 22, 2010 /
    • అరిపిరాల April 22, 2010 /
  2. రవి April 22, 2010 /
  3. కొత్తపాళీ April 22, 2010 /
  4. mohan ram prasad April 23, 2010 /
  5. గిరీష్ కె. April 23, 2010 /