Menu

అంగడి తెరు (తమిళ్) – అద్భుతం !

గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్ చేసుకొచ్చేయ్యడమే మనకు తెలిసిన ఆనందం. ఆ అందమైన అనభవాన్ని మనకు అందించేవారి వెనుక కొన్ని చీకటి కోణాలుంటాయని గానీ, కొన్ని వందల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోయాయని మనకు తెలీదు. బహుశా తెలియాల్సిన అవసరం కూడా లేదేమో ! కానీ అవి తెలిస్తే!? మన షాపింగ్ అనుభవాల్లోని తీపిదనం చేదెక్కదా?  ఏమో!!

బిగ్ బజార్లూ, షాపింగ్ మాల్స్ రాక ముందునుంచే చెన్నై నగరం ఈ కొత్త ఒరవడిని తన సొంతం చేసుకుంది. నిజానికి ‘వాల్ మార్ట్ సంస్కృతిని భారతదేశంలోకి ఎలా తీసుకురావాలా!’ అని ఆలోచిస్తున్న కొందరు వ్యాపారులకు ప్రేరణా నిలిచింది. బిగ్ బజార్ (ప్యూచర్ గ్రూప్) అధినేత ‘కిషోర్ బియానీ’ తన వ్యాపార అనుభవాల్ని పంచుకుంటూ, బిగ్ బజార్ ఎలా పెట్టాడో వివరిస్తూ తన ప్రేరణ చెన్నైలోని శరవణ స్టోర్స్ అని చెప్పడం అందరికీ తెలిసిందే. అలాంటి చెన్నైలోని ఒక సాంప్రదాయక షాపింగ్ మాల్ వెలుగుజిలుగుల మాటునున్న చీకటి బ్రతుకుల గురించి అంతే శక్తివంతంగా తెలియజెప్పిన చిత్రం “అంగడి తేరు” (అంగడి వీధి).

చిత్రం ప్రారంభంలోనే హృద్యమైన ప్రేమ పాటతోపాటూ ఒక షాక్ ఇచ్చి దర్శకుడు ప్రేక్షకుల్ని ముందుచూపబోయే ఘటనలకు తయారు చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో చెప్పే ఆ తరువాత కథ ‘తిరునల్వేలి’జిల్లా నుంచీ ఇంటర్ ఫస్టుమార్కులతో పాసై పై చదువులకు వెళ్ళాలనుకునే తరుణంలో తండ్రి చనిపోవడంతో  పరిస్థితుల ప్రభావం వల్ల ఉద్యోగం కోసం వెతికే‘జ్యోతిలింగం’ (మహేష్)తో ఆరంభమౌతుంది. చెన్నై నుంచీ సేల్స బాయ్స్/గర్ల్స్ వర్కర్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఒక మధ్యవర్తి దగ్గరున్న పట్నానికి రావడం, జ్యోతిలింగంతో పాటూ తన బాల్య స్నేహితుడు ‘మారిముత్తు’ (పాండి)ను ఉద్యోగాల్లో భర్తీచేసుకుని వెళ్ళడం జరిగిపోతుంది. కథ చెన్నైకి మారి నిజానిజాలు తెలిసొచ్చేసరికీ దాదాపు జైల్లాంటి పరిస్థితుల్లోకి ఇద్దరు వచ్చిపడతారు.

దాదాపు వందమంది కలిసిపడుకోవాల్సిన పెద్దరూము. పొద్దునైతే టాయిలెట్ కోసం కూడా క్యూకట్టాల్సిన పరిస్థితికి తోడు షాపు తెరిచినప్పటి నుండీ అర్థరాత్రి షాపు మూసేవరకూ నిలబడుకునే ఉద్యోగాలు. బౌతికంగా కొట్టిహింసిస్తూ,లైంగిక వేధింపులకు గురిచేస్తూ రాక్షసంగా ప్రవర్తించే సూపర్వైజర్లు.  కుక్కల్లా కొట్టుకుంటూ తిండితినే ఖర్మ. వెట్టిచాకిరికన్నా హీనంగా ఇరుక్కుపోయిన స్థితి. పారిపోవాలన్నా కుదరకుండా చేసే ఇంట్లో పరిస్థితి.

ఆ పరిస్థితుల్లో జ్యోతిలింగానికి పరిచయమౌతుంది ‘కని’(అంజలి) అనే సేల్స్ గర్ల్. మొదటగా ఇద్దరికీ మధ్య దాదాపు యుద్దమే నడిచినా, ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే పరిస్థితిలో సూపర్వైజర్ ‘కరుంగలి’ (వెంకటేష్) దౌర్జన్యానికి బలై స్నేహితులవుతారు. మెల్లగా ప్రేమికులౌతారు. మనుషులు మనుషులుగా జీవించడానికీ, కనీసం మాట్లాడుకోవడానికే హక్కుల్లేని ఆ షాపింగ్ మాల్ లో అప్పుడే వికసిస్తున్న ఒక సేల్స్ గర్ల్ ప్రేమ – ద్రోహం – ఆత్మహత్యల మధ్య షాపులో మరిన్ని ఆంక్షలు మొదలౌతాయి. పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

ఈ నేపధ్యంలో జ్యోతిలింగం – కని ల ప్రేమ సఫలమౌతుందా? ఆ అమానవీయ పరిస్థితుల నుంచీ వాళ్ళు బయటపడతారా? చివరికి వాళ్ళ జీవితం సుఖ్ఖాంతం అయ్యిందా అనేది మిగతా కథ.

ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు కళ్ళలో నీళ్ళు నింపితే, మరికొన్ని గుండెలోని చెమ్మని ఆవిరయ్యేలా చేస్తాయి. సినిమా మొత్తం చూశాక కనీసం ఒకరోజైనా డిప్రెషన్ కిగానీ సబ్ధతకి గానీ గురవ్వని మనిషి దాదాపు ఉండడు. ఇవేవీ జరక్కపోయినా, మరోసారి షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు మనం పొందే ఆనందంలో కొంత సానుభూతి మాత్రం ఖచ్చితంగా నిండుతుంది.

జ్యోతిలింగం ‘కని’ని ఇరుకునపెట్టి సూపర్వైజర్ కు పట్టిస్తాడు. సూపర్వైజర్ షాపు జరుగుతున్న సమయంలో ఒక కర్టెన్ వేసున్న మూలకు తీసుకెళ్ళి సేల్స్ వాళ్ళని చాలాసేపు కొడుతుంటాడు.

కని త్వరగా వచ్చేస్తే జ్యోతిలింగం “అంత త్వరగా ఎలా వదిలేడు” అంటాడు.

అప్పుడు కని “నా మానం మీద చెయ్యివేసినా ప్రతిఘటించకుండా సహించాను. అందుకే వదిలేశాడు” అంటుంది.

ఒక్కసారిగా జ్యోతిలింగం కళ్ళలో నీళ్ళు నిండుతాయి. కడుపులో దేవేసినట్లుండే ఇలాంటి దృశ్యాలు, మాటలు, సంఘటనలూ ఈ చిత్రంలో కోకొల్లలు.

ఒక సేల్స్ గర్ల్ తన ప్రియుడికి రాసిన ప్రేమలేఖ దొరకబుచ్చుకున్న సూపర్వైజర్  నిజం చెప్పమని అందరినీ హింసిస్తుంటే ఆ సేల్స్ గర్ల్ తనే రాశానని ఒప్పుకుంటుంది. నీప్రియుడెవరో చెప్పమంటే  అతడిని చూపిస్తుంది.

అన్ని రోజులూ ప్రేమించమని వెంటపడిన కుర్రాడు ‘ఆ అమ్మాయిని నేనసలే ప్రేమించలేదు. తనోపిచ్చిది. నాకేమీ తెలీదు’ అంటాడు.

ఆ అమ్మాయి అదే ఫ్లోర్ నుంచీ దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రియుడు తనని ప్రేమించనేలేదు అన్నప్పుడు ఆ సేల్స్ గర్ల్ చూసినచూపు ఒక్కటిచాలు నటన రాబట్టుకోవడంలో దర్శకుడు చూపిన ప్రతిభ తెలియజెప్పడానికి.

నాయికా-నాయకులుగా మహేష్- అంజలిల నటన మహామహానటులకు కూడా కష్టమనే చెప్పాలి. బహుశా వాళ్ళు నటించడంకన్నా పాత్రల్లో జీవించారనడమే బెటర్. హీరో బాల్యస్నేహితుడి మారిముత్తుగా నూతన నటుడు పాండి నటన సినిమాలో కావలసిన హాస్యరసంతోపాటూ చాలా సన్నివేశాలకు బలం చేకూర్చింది. చాలావరకూ డిప్రెసింగ్ గా ఉండే ఈ సినిమాలో పాండి లేకుంటే, కష్టమయ్యేది. ఫ్లోర్ సూపర్వైజర్ గా మరో దర్శకుడు ఎ.వెంకటేశ్ నటన గుండెలు జలదరింపజేస్తుంది.

ఇప్పటికే తమిళచిత్రపరిశ్రమ “మాస్టర్ పీస్”గా అభివర్ణిస్తున్న ఈ సినిమా ఒక అద్భుతం అనేది నా అభిప్రాయం. విజయ్,జివి.ప్రకాష్ ల సంగీతం. రిచర్డ్ మారియా నాథన్ సినెమాటోగ్రఫీ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అంతర్జాతీయప్రమాణాలలో ఉంటే, అన్నిటికన్నా ముఖ్యంగా దర్శకుడి ఊహకు వీళ్ళు జోడించిన హంగులు అభినందనీయం

మొదటి చిత్రం “వెయిల్” (వేసవి) తో ఒకవైపు కమర్షియల్ సక్సెస్ ని క్రిటికల్ విజయాన్నీ (ఈ చిత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు నామినేట్ చెయ్యబడ్డది) సొంతం చేసుకున్న దర్శకుడు ‘వసంత్ బాలన్’ నాలుగు సంవత్సరాల విరామం తరువాత మలి ప్రయత్నంగా తీసిన చిత్రం ఇది. వెయిల్ సినిమా విజయంలో వసంత్ బాలతోపాటూ అతని గురువు శంకర్ కు భాగం చెందుతుందనడంలో అతిశయోక్తి లేకున్నా, తనదైన శైలి కథాకథనాల్లో ఉన్నదని నిరూపించుకున్న వసంత్, ‘అంగడి తేరు’ తో ప్రముఖదర్శకుల జాబితాలోకి చేరడం ఖాయం. ముఖ్యంగా బాలచందర్, భారతీరాజా,బాలుమహేంద్రల వారసత్వాన్ని నిలుపుకొస్తున్న కొత్తతరం దర్శకుల్లో ఒకడిగా నిలబడటంలో ఏమాత్రం సందేహం లేదు.

40 Comments
 1. naresh Nunna April 13, 2010 / Reply
  • kanred April 13, 2010 / Reply
   • rahul April 15, 2010 /
 2. Darth Vader April 13, 2010 / Reply
  • naresh Nunna April 13, 2010 / Reply
 3. j.surya praksh April 13, 2010 / Reply
 4. mohan ram prasad April 13, 2010 / Reply
 5. Prasad April 13, 2010 / Reply
   • Prasad April 13, 2010 /
 6. basho April 13, 2010 / Reply
 7. kvrn April 14, 2010 / Reply
  • G April 16, 2010 / Reply
 8. Venkat Gopu April 14, 2010 / Reply
   • Venkat Gopu April 14, 2010 /
  • VASANTH April 15, 2010 / Reply
 9. Venkat Gopu April 14, 2010 / Reply
   • అబ్రకదబ్ర April 15, 2010 /
   • రవి April 15, 2010 /
   • G April 16, 2010 /
 10. అభిమాని April 14, 2010 / Reply
 11. ravi April 14, 2010 / Reply
 12. జగన్ మోహన్ April 14, 2010 / Reply
 13. G April 14, 2010 / Reply
 14. $hankar Gangadhari April 14, 2010 / Reply
 15. nagireddy April 15, 2010 / Reply
   • keshavcharan April 16, 2010 /
   • keshavcharan April 16, 2010 /
 16. nagireddy April 15, 2010 / Reply
 17. CineHerald April 16, 2010 / Reply
 18. Venkat Gopu April 17, 2010 / Reply
 19. sowmya April 19, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *