Menu

విజయ “ప్రస్థానం”

నేపధ్యం:

ఈ సినిమా వేల ఏళ్ళ తరబడి మనిషి సాగించిన / సాగిస్తున్న ప్రస్థానం గురించి. ఐతే ఈ ప్రస్థానం లో మనిషి ఏం నేర్చుకున్నాడు అనేదే ప్రశ్న. ఒక పాట లో “సిరివెన్నెల” అంటారిలా.

వేట అదే వేటు అదే
నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

రెండే రెండు వాక్యాల్లో మనిషి తత్వం గురించి స్థూలంగా చెప్పారాయన. ఆ పాట తో ఇన్స్పైర్ అయి తీసిన సినిమా డ్రమాటిక్ ముగింపు తో ముగిసినా, ఈ సినిమా మాత్రం అదే కాన్సెప్ట్ ని అంతే క్లారిటీ తో చూపించగలిగింది. ఈ వేల సంవత్సరాల ప్రస్థానం లో మనిషి తన లోని మృగానికి విలువలు అనే వలువలు కట్టటం నేర్చుకున్నా కూడా, ఆ మృగం ఎప్పుడో ఒకప్పుడు విలువల వలువలు వదిల్చేసుకుని బయటకొచ్చి, మెరుపుదాడి చేసి మళ్ళీ ముసుగు లోపలి కెళ్ళి పోతుంది. దీనికి ఏ మనిషీ అతీతుడు కాదేమో. ఐతే మనని మనం ప్రతీ క్షణం ఎనలైజ్  చేసుకుంటూ మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ ని అవగాహన చేసుకుంటూ, నియంత్రించుకుంటూ సాగితే అదే  విజయం.

ఈ నేపథ్యం తో చాలా సినిమాలు అన్ని భాషల్లోనూ వచ్చాయి కానీ ఈ దర్శకుని నిజాయితీ దీన్ని విలక్షణంగా నిలబెడుతుంది. మనస్తత్వాలూ, అందులోని వైరుధ్యాలూ,  కష్టనష్టాలెదురైనప్పుడు మనకే తెలీకుండా మనం ప్రతిస్పందించే విధానమూ, ఎంతో నేర్పుతో పట్టుకుని గ్రిప్పింగ్ నారేషన్ తో మనముందుంచారు. ఈ దర్శకుని గురించి నాకు ముందుగా తెలిసింది “వెన్నెల” విడుదల అప్పుడు. జెమిని ఛానెల్ లో “24 ఫ్రేంస్” అనే ప్రోగ్రాం లో “దేవా కట్టా” ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. చైతన్య ప్రసాద్ (ఈ చిత్రం లో ఒక పాట వ్రాసినట్లున్నారు) ఇంటర్వూ చేశారు. ఆయన లోతైన ప్రశ్నలకు, దర్శకుని విశ్లేశణాత్మక సమాధానలకి ఇంప్రెస్ అయి వెన్నెల చూడటమూ, డిజప్పాయింట్ అవటమూ జరిగాయి. దానితో ప్రస్థానం మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఐతే ఈ చిత్రం తో ఆయన ప్రతిభ నిరూపించుకున్నారు.

పాత్ర చిత్రణ;

కథ గురించి తెలిసిందే కాబట్టి, వివరముగా చెప్పటంలేదు. పాత్రల్లోకొస్తె, సాయికుమార్ ది క్లిష్టమైన పాత్ర. కళ్ళులేక చూడలేని ధ్రుతరాష్ట్రుడూ, కళ్ళుండి చూడలేని ఈ పాత్రా, రెండూ, పుత్రప్రేమతో తప్పటడుగులు వేస్తాయి. సాయికుమార్ బాగా చేశారు. ఆయన విగ్ మాత్రం మారిస్తే బావుండేది :).

ఈయన స్టెప్ సన్ గా చేసిన శర్వానంద్ పాత్ర భారతం లో అర్జునుడి(విజయుడి) లాంటిది. కురుక్షేత్రము లో అర్జునుడు అస్త్ర సన్యాసము చేసి, “నేనీ యుద్ధం చేయలేను, సన్నిహితులనూ, బంధువులనూ నేను చంపలేను” అన్నప్పుడు కృష్ణుడు గీతోపదేశము చేసి కర్తవ్యబోధ చేస్తాడు. ఈ సినిమా లో అలాంటి కృష్ణుడెవరూ లేరు కాబట్టి, సగటు మనిషి లాగే, “నిన్ను ప్రేమించకుండా వుండలేకపోతున్నా నాన్నా” అని నిస్సహాయంగా కళ్ళనీళ్ళు పెట్టుకుని వుండి పోతాడు.  సగటు మనిషి లాగే ఇతడూ “ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదంటూ తాత ఫోటోతో మొర పెట్టుకుంటాడు. ఈ పాత్ర చిత్రణ ఈ సినిమా కు విలక్షణత ను సమకూర్చింది. ఇతను సినిమాటిక్ రివెంజ్ తీసుకునుంటే, ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసుకునే మరొ వ్యాపార చిత్రంగానే మిగిలిపోయేది. శర్వానంద్ అతికినట్లు సరి పోయాడు. కానీ మెరుగు పరచుకోవల్సింది చాలా వుంది. ముఖ్యంగా వాయిస్ మాడ్యులేషన్. అది మెరుగు పడితే, వారసుల సెగకు బీడు పడి ఎడారి ఐపోతున్న ఫీల్డ్ లో ఒయాసిస్ అవుతాడు, లేదంటె ఎండమావే.

మరో ముఖ్య పాత్ర సందీప్. సాయికుమార్ కొడుకూ, శర్వానంద్ కి సవతి తమ్ముడూ ఐన ఈపాత్ర ఐడెంటిటీ క్రైసిస్ తో పెరిగి ఆ ఫ్రస్ట్రేషన్ తో తప్పు దారి పట్టి, ఒక తప్పు సరి చేసుకొవటానికి ఇంకొకటి చేస్తూ, కళ్ళు మూసి తెరిచేలోగా ఊబి లో కూరుకుపోతూ తన తండ్రినీ, తరువాత చుట్టూ ఉన్న వాళ్ళనీ దానిలోకి లాగేస్తాడు. ఈ అబ్బాయి బాగా చేశాడు.

తల్లి రోల్ ఓకే. కానీ పిడుక్కీ బియ్యానికీ ఒకతే మంత్రంగా, ఎప్పుడూ ఒకటే భావం పలికిందా ఫేస్లో. చివర్లో సాయికుమార్ ఆమెతో, “నీ కొడుకు నా కొడుకును చంపేశాడు” అన్నప్పుడు కూడా ఆమె ఫేస్ మీద జూం ఐన కామెరా వేరే  ఎక్స్ప్రెషన్ ఏదీ పట్టుకోలేకపోయింది.

ఒకే వాతావరణం లో పెరిగిన అక్కాతమ్ముళ్ళిద్దరూ జీవితంలో జరిగిన సంఘటనలకు వేరు వేరుగా స్పందించటం, దాన్ని చూపిన విధానం బావుంది. హీరోయిన్ పాత్ర, దాని ఔచిత్యం గురించి, దర్శకునికేవొ పరిధులు, తప్పనిసరి పెట్టుబడులూ ఉంటాయేమొననే గుర్తింపుతో  నేను వ్రాయటం లేదు.

ఆన్నిటికంటే చెప్పుకోవలసినది, డైలాగ్స్ గురించి. చమక్కుమని ఉండి ఉండి మెరిసే డైలాగ్స్ లోతైన భావాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక పాటలు మాత్రం మాటలు కన్వే చేసినంత బాగ ఎమోషన్స్ ఎలివేట్ చేయలేకపోయాయి.

ముగింపు వాక్యం-

క్రెడిట్ అంతా దర్శకునికి చెందుతుంది. తప్పక చూడవలసిన చిత్రం. దీనికి సబ్ టైటిల్స్ ఉంటే బావుండేది. పరభాషా ప్రేక్షకులు చూసి ఆనందించేవాళ్ళు.

– పద్మజ

7 Comments
    • Padmaja April 22, 2010 /
  1. Rallapalli Krishna April 22, 2010 /
  2. వెంకట్ ఉప్పలూరి April 23, 2010 /
  3. kay chekolu April 23, 2010 /
  4. rayraj April 23, 2010 /
  5. Rallapalli Krishna April 23, 2010 /