Menu

సెవెన్‌ సమురాయ్ – ఒక సమాలోచనం – 2

మొదటి భాగం తరువాయి

పాత్ర చిత్రణ

నాయకులు సాధారణంగా తమ బృందంలో సభ్యులందర్నీ తమ లాగా ఆలోచించేట్టూ, తమలాగా ప్రవర్తించేట్టూ తయారు చేస్తారు. మిలటరీ నాయకులు మరీను. ఈ శిక్షణలో వ్యక్తిగత లక్షణాలకి తావుండదు, అవి బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు. సాధారణంగా నాయకులు చేసే ఈ పొరబాటు కాంబే చెయ్యడు .. అదే అతని వ్యక్తిత్వంలో గొప్ప విషయం. తన బృంద సభ్యులకే కాదు, తాము రక్షించ వచ్చిన పల్లీయుల మనస్తత్వానికీ, ఇంకా తాము ఎదుర్కొని జయించాల్సిన బందిపోట్ల మన్స్తత్వాన్ని కూడా అతను బాగా అర్ధం చేసుకుంటాడు. అందుకే అతను మహోన్నతమైన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. కేవలం తన వ్యక్తిత్వ బలం వల్ల లోకంలోని అన్యాయాన్ని ఎదుర్కోగలను అన్నట్టు ఉంటాడు. అందుకే అతని బృందమంతా అతని పట్ల ఆకర్షితులై, ఏవ్హీ ప్రతిఫలం దొరకదని తెలిసి కూడా, తమ ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధ పడతారు.

కాంబే పల్లీయుల మొర విని వాళ్ళ పల్లెని రక్షించడానికి ఒప్పుకోవడంలోనే ఈ సూచన కనిపిస్తుంది. ఒప్పుకోవడానికి అతను క్షణం కూడా ఆలోచించడు. పైగా పనిని సమర్ధవంతంగా పూర్తి చెయ్యడానికి కనీసం ఏడుగురు సమురాయ్ లైనా కావాలని చెప్పి ఆ బృందాన్ని కూడగట్టే బాధ్యత కూడా తన పైనే వేసుకుంటాడు. ఎందుకూ అంటే .. కాంబే అలాంటి మనిషి మరి.

ఈ పని చేపట్టటం వల్ల, యుద్ధం చేసినంత సేపూ దొరికే తిండి తప్ప, వేరే పారితోషికం కానీ కీర్తి కానీ ఏమీ లేదని అతనికి ముందే తెలుసు. పల్లీయులు సమురాయ్ లని అపనమ్మకంతో చూస్తారనీ, పని ముగిశాక వాళ్ళ నించి కృతజ్ఞత ఆశించడం కూడా వ్యర్ధమనీ అతనికి తెలుసు. మరి తెలిసీ ఈ బాధ్యత ఎందుకు నెత్తిన వేసుకున్నట్టు? ఎందుకూ అంటే, కాంబే అలాంటి మనిషి కాబట్టి. ఈ ప్రపంచంలో జరిగే చాలా సంఘటనలకి అర్ధం ఏవీ ఉన్నట్టు కనబడదు. చివరికి ప్రయోజనం ఏవీ ఉన్నట్టు కనబడదు. కానీ ఒక రక్షణ సమస్య తన దృష్టిలోకి వచ్చింది. తను దాని బాధ్యత తీసుకోవచ్చు, లేక ఈ పని నాది కాదని కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. బాధ్యత తీసుకోవడమే సరైన పని. దాన్ని తన కర్తవ్యంగా భావించడమే సరైన పని. అదీ తన ఆర్జన కోసమో, పేరు కోసమో కాక, పరుల మేలు కోసం చెయ్యడం, చేస్తున్నది ధర్మం కాబట్టి చెయ్యడం, ఫలితం ఆశించకుండా చెయ్యడం, అందులోనూ ఒక స్థితప్రజ్ఞత .. అదీ అతనిలోని ఔన్నత్యం. అతని నిర్ణయంలోనూ, అటుపైని అతని ప్రవర్తన లోనూ “కర్మణ్యేవాధికారస్తే..” అన్న గీతా వాక్య సారాంశం నిండి ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇంత స్థితప్రజ్ఞుడైన కాంబే కూడా చివరి సన్నివేశంలో, బందిపోట్లందరూ ఖతమై పోయాక, తన బృందంలో తనతో కలిపి ముగ్గురే మిగిలి ఉండగా, అనుచరుడు షిచిరోజితో అనే మాటల్లో .. ” మళ్ళీ ప్రాణాలతో బయట పడ్డాం. కానీ మనం మళ్ళీ ఓడిపోయాం. గెలిచింది పల్లె వాసులు, మనం కాదు.” అనడంలో కించిత్ నిరాశ ధ్వనిస్తుంది.

ఇంకో మహోన్నతమైన పాత్ర క్యూజో. ఇతను ఖడ్గ విద్యలో గొప్ప నిపుణుడు. అతనికి యుద్ధం అంటే, శత్రువుల్ని నిర్జించడమే కాదు, తన విద్యకి సానబెట్టుకోవడం కూడా. ఒక్క మాట అనవసరంగా మాట్లాడడు, యుద్ధంలో ఒక్క అడుగు అనవసరంగా వెయ్యడు. బందిపోట్లతో తల పడినప్పుడల్లా వొంటి చేత్తో ఒక నలుగుర్నైనా మట్టి కరిపిస్తుంటాడు. ఇంతటి మహా వీరుడూ చివరికి ఒక తుపాకి గుండు దెబ్బకి నేలకూలడం కథలోని పెద్ద ఐరనీ. గ్రీకు పురాణాల్లోని ఎఖిలీస్, భారతంలో కర్ణుడూ గుర్తుకొస్తే మీ తప్పేం లేదు.

కాంబే పాత్రకి కాంట్రాస్టుగా యువకుడైన కట్సుషిరో, తిక్కలాడైన కికుచియో కనిపిస్తారు. కట్సుషిరో ఇంకా పాల బుగ్గల పసివాడు. ఉన్నత కుటుంబం నించి వచ్చాడు, పెద్దగా లోకాన్ని చూసిన అనుభవం లేదు. యుద్ధమంటే శౌర్యమూ, సాహసమూ, కీర్తీ అని కలలు కంటుంటాడు. కాంబే ఈ పిల్లవాణ్ణి శిష్యుడిగా స్వీకరించడమే కాక, ఒక తండ్రి తన కొడుకుని చూసుకున్నంత వాత్సల్యంతో చూసుకుంటాడు. ఇంత పిల్లగాడూ ఒక పల్లెటూరి పిల్లని చూసి ప్రేమలో పడి ఎలాగో తిప్పలు పడి ఒక రాత్రి ఆమెతో గడుపుతాడు .. ఒక విధంగా బాల్యాన్ని వదిలి అతను మగవాడైనట్టు లెక్క. మరునాడే జరిగే సంకుల సమరంలో తన సాహసాన్నీ శౌర్యాన్నీ చాటుకుంటాడు. ఐతే, యుద్ధం చివర్లో తను ఎంతగానో ఆరాధించే క్యూజో గుండు దెబ్బ తగిలి చనిపోవడం చూసి, శవం మీద పడి పసి పిల్ళాడీలా రోదిస్తాడు. పాపం, ఇంకా పసితనం ఎక్కడో ఉన్నట్టుంది.

కికుచియో ఒక రైతు బిడ్డ. సమురాయ్ కావాలని ఉవ్విళ్ళూరుతుంటాడు. సమురాయ్ లందరూ ఒక మాదిరి హుందా తనంతో ప్రవర్తిస్తూ ఉంటే వీడు మాత్రం వెకిలిగా పిచ్చి పిచ్చిగా ఉంటాడు. పెద్ద గొంతేసుకుని గొడవ గొడవ చేస్తుంటాడు. వీడికి కాంబే నించి మెప్పు కావాలి, తానూ యోధుణ్ణే అని. అది సంపాయించడానికి ప్రతి పనికీ ముందు వీడే సిద్ధం. అలాగని తెలివి తక్కువ వాడు కాదు. బ్రహ్మాండమైన తెలివిగా దొంగల స్థావరంలోకి జొరబడి, వాళ్ళని అల్లకల్లోలం చేసి కొన్ని తుపాకుల్ని దొంగిలించి తెస్తాడు. ఐతే, ఒక ఆకస్మిక దాడిలో పసి పిల్లని పట్టుకుని పారిపోతున్న ఒక తల్లి తన బిడ్డని వీడి చేతుల్లో ఉంచి ప్రాణాలు విడుస్తుంది. దాంతో వాడికి తన గతమంతా గుర్తొస్తుంది. ఆ క్షణంలో వాడు తనని తాను తెలుసుకున్నాడని అనుకోవచ్చు. తమాషాగా, వాడూ రైతు బిడ్డే అయుండి కూడా, పల్లెలో ఉన్నంతసేపూ పల్లీయుల్ని నానా తిట్లూ తిడుతూ పురుగుల కన్నా హీనంగా చూస్తాడు వాళ్ళని. మనం వీళ్ళ కోసం ఇంత చేస్తున్నా వీళ్ళకి మన పట్ల ఏమీ కృతజ్ఞత ఉండదని మొదణ్ణించీ ఇతర సమురాయ్ లతో చెబుతూనే ఉంటాడు. చివరికి కాంబే పక్కనే పోరాడుతూ వీరమరణం పొందుతాడు.

కాంబే ఒక పక్క మహోన్నతంగా మేరు పర్వతంలాగా కనిపిస్తుంటే ఎదురుగా కికుచియో మనిషి కుత్సితాలకీ, కోరికలకీ, బలహీనతలన్నిటికీ ప్రతీకగా కనిపిస్తాడు. అతనంత నేల బారు మనిషి కాబట్టే నేల మీద ఉన్న సత్యం అతనికి ముందు గోచరిస్తుంది .. పల్లీయుల దృష్టిలో ఒక పక్క బందిపోట్లూ, మరొక పక్క సమురాయ్ లూ ఇద్దరూ ఒకటే, ఇద్దరూ దోపిడి గాళ్ళే, తమ శ్రమని దోచుకునే వాళ్ళే.

నిజంగా ఇది భయం గొలిపే ప్రశ్న. ఏ కాల్పనిక సాహిత్యంలోనూ, సినిమాల్లో ఐతే మరీనూ, హీరోలెప్పుడూ అతి మంచికి ప్రతీకలు. విలన్లెప్పుడూ చెడుకి. కానీ నిజ జీవితంలో అలా ఉండదెప్పుడూ. ఇద్దరూ ఒకే నాణేనికి రెండు పక్కలు అనే సత్యాన్ని ఒప్పుకోడానికీ, ఒప్పుకున్నాక దాన్ని అలాగే చిత్రీకరించడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. మిగతా విషయాలన్నీ అలా ఉంచితే కేవలం ఈ సత్యాన్ని ఆవిష్కరించిన ఒక్క కారణం వల్లా సెవెన్ సమురాయ్ గొప్ప సినిమా అయింది, కురోసావా గొప్ప దర్శకుడయ్యాడు. ఐతే కురోసావా వాస్తవిక ధోరణి అక్కడితో ఆగి పోలేదు. ఆ విశేషాలు చిత్రీకరణ సందర్భంలో చెప్పుకుందాం.

పల్లీయులలో ప్రముఖంగా చెప్పుకో వలసిన వాడు రికిచి. తన తోటి వారందరికన్నా భిన్నంగా ఆలోచించి, ఎలాగైనా బందిపోట్ల దాడుల్ని ఎదుర్కోవాలనే ఆలోచనకి శ్రీకారం చుడతాడు. పట్టణానికి వెళ్ళి సమురాయ్ లని తీసుకురావడానికీ తనే ముందుంటాడు. బందిపోట్లని ఎదుర్కునే సన్నాహంలో సాహసం కనబరిచి పల్లీయుల సైన్యానికి నాయకుడిగా నిలబడతాడు. బందిపోట్ల మీద కక్ష గట్టటానికి అతనికి బలమైన కారణముందని కథలో మనకి తెలుస్తుంది. పల్లీయుల్లో మనల్ని ఆకట్టుకునే ఇంకో పాత్ర యోహే. ఇతను మొదణ్ణించీ పిరికి వాడుగా, అందరి అపహాస్యానికీ గురవుతూ చాలా దయనీయంగా కనిపిస్తాడు. కికుచియో చేత నానా తిట్లూ పడుతుంటాడు. అలాంటివాడు, కీలకమైన క్షణంలో అసాధారణ ధైర్యం కనబరిచి కికుచియోతో బాటు మనల్నీ అబ్బుర పరుస్తాడు. మొదణ్ణించీ సమురాయ్ ల రాకని వ్యతిరేకిస్తూ, వాళ్ళని మహా అనుమానంతో చూసే పల్లె పెద్ద మాంజో. ఎక్కడ వయసొచ్చిన తన కూతురు షీనో మీద సమురాయ్ ల పాడు కళ్ళు పడతాయో అని భయపడి ముందు జాగ్రత్తగా ఆ పిల్లకి బలవంతంగా జుట్టు కత్తిరించి పిల్లాడిలాగా మారు వేషం వేస్తాడు. ఐనా ఏం ప్రయోజనం, ఆమె అందగాడూ యువకుడూ ఐన కట్సుషిరో కంట పడనే పడుతుంది, వారి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. ఇంతటి కల్లోలం మధ్యలోనూ కట్సుషిరో షీనోల మధ్య ప్రేమ చిగురించడాన్ని ఎంతో లలితంగా చిత్రీకరించాడు కురోసావా.

(ఇంకా ఉంది)

9 Comments
  1. శిద్దారెడ్డి వెంకట్ April 1, 2008 /
  2. శిద్దారెడ్డి వెంకట్ April 1, 2008 /
  3. Kiran April 1, 2008 /
  4. కొత్తపాళీ April 1, 2008 /
  5. చక్రి April 5, 2008 /
  6. venkat Balusupati June 12, 2008 /
  7. zulu March 26, 2010 /
  8. peepu March 26, 2010 /
  9. Faustin Donnegal March 26, 2010 /