Menu

సెవెన్‌ సమురాయ్-ఒక సమాలోచనం-3

మొదటి భాగం
రెండవ భాగం

చిత్రీకరణ

ముందటి రెండు వ్యాస భాగాల్లో కథ, పాత్రలూ, పాత్ర చిత్రణ ఎలా ఈ సినిమాని బలోపేతం చేశాయో పరిశీలించాం. కాయితం మీద కథ, స్క్రీణ్ ప్లే రాసుకోవడం ఒక యెత్తు, దాన్ని సమర్ధవంతంగా తెర కెక్కించడం పూర్తిగా ఇంకో యెత్తు. ఈ సినిమా తీసేప్పటికే కురోసావా మంచి దర్శకుడిగా, కనీసం జపాన్‌లో, మంచి పేరే సంపాయించాడని వ్యాసం మొదట్లోనే చెప్పాను. తన చిత్రీకరణ ప్రతిభని ఈ సినిమాలో ఉపయోగించాడో ఈ చివరి భాగంలో చూద్దాం.

సినిమా అంటే మూవింగ్ పిక్చర్స్ లేదా మోషన్ పిక్చర్ అని పరిభాష ఉంది. కురోసావా ఈ నిర్వచనాన్ని అక్షర సత్యంగా తీసుకున్నాడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. ప్రతి ఫ్రేములోనూ పాత్రలైనా కదులుతూ ఉంటారు, నటులు కదలక పోతే కేమెరావే కదులుతూ ఉంటుంది. సినిమా మొదటి నించీ చివరి దాకా ఎక్కడా కదలిక లేని సీన్ కనబడదు అసలు. కేమెరా కదలిక ఎంతో అర్ధవంతంగా ఉంటుంది, ఊరికే చూసేవాళ్ళకి కళ్ళనెప్పి తెప్పించడానికి చేసినట్టు కాకుండా.

ఒకే దృశ్యం (సీన్) లో విభిన్న దృక్పథాలు చూపించడానికి కేమెరాని తిప్పడం సర్వసాధారణమైన టెక్నిక్. ఉదాహరణకి ఇద్దరు (ఒక భార్యా భర్తా) మాట్లాడు కుంటున్నారనుకోండి. భర్త మాట్లాడుతుండగా కేమెరా అతని మొహాన్ని చూపిస్తుంది, అతనన్నదానికి సమాధానంగా భార్య మాట్లాడుతున్నప్పుడు ఆమె మొహాన్ని చూపిస్తుంది. కానీ ఇద్దరి కంటే ఎక్కువ మంది దృశ్యంలో ఉన్నప్పుడు సాధారణంగా కేమెరా ఒక చోట బిగుసుకు పోయి, ఏదో స్టేజి నాటకంలో దృశ్యాన్ని చూస్తున్న అనుభూతినే మిగులుస్తుంది ప్రేక్షకులకి. కురోసావా అలాంటి పని ఎప్పుడూ చెయ్యడు.

ఒక మంచి ఉదాహరణ కాంబే ఇతర సమురాయ్ లని పరీక్షించడానికి పూనుకున్నప్పుడు. కేమెరా దృక్కోణం మారినప్పుడల్లా ఒక వైప్ (wipe) తో రెండో ఏంగిల్ కి మారడం తో ప్రేక్షకుడు జరుగుతున్న దృశ్యం మధ్యలో నించోని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సత్రం ముందు గదిలో కాంబే కూర్చుని ఉంటాడు. బయటినించి పల్లీయుడు రికిచి ఒక కొత్త సమురాయ్ ని వెంట బెట్టుకుని వస్తుంటాడు. కాంబే శిష్యుడైన కట్సుషిరోకి సైగ చేస్తాడు. కట్సుషిరో ఒక దుడ్డుకర్ర పట్టుకుని గుమ్మం వెనకాల దాక్కుంటాడు. గుమ్మం బయట కొత్తగా వచ్చిన సమురాయ్ ఏదో ప్రమాదాన్ని పసిగట్టి బయటే ఆగిపోతాడు. అది చూసి కాంబే అమిత సంతోషంతో ఉబ్బెత్తున లేచి నించుని అతన్ని ఆహ్వానించడానికి ముందుకి వస్తాడు.

ఈ దృశ్యం అంతా మాటల్లో చెప్పడానికి ఇంత సేపు పట్టింది కానీ, తెర మీద ఇదంతా క్షణంలో జరిగిపోతుంది. దృశ్యంలోని పాత్రళేవీ ఒక్క మాట కూడ మాట్లాడవు కానీ చూసేవారికి కాంబే ఆంతర్యం ఏవిటో, కట్సుషిరో ఎందుకు దుడ్డుకర్ర పట్టుకుని దాక్కున్నాడో, అన్నీ విప్పి చెప్పినట్టుగా అర్ధమవుతాయి.

కురోసావా గొప్ప ప్రతిభతో ఉపయోగించే ఇంకో టెక్నిక్ “టెలిస్కోపింగ్”. ఇది కెమెరాకి వాడే టెలిస్కోపిక్ లెన్సు కాదు. వేర్వేరు దృశ్యాల సముదాయాన్ని ఒక పద్ధతిలో కుదించడం ద్వారా ఆ సన్నివేశపు మూడ్ లో మార్పు తీసుకురావడం దీనికి ఒక ఉదాహరణ.

సమురాయ్‌లలో హైహచి అనే వాడు సరదాగా అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. వాళ్ళు పల్లెలోకి ప్రవేశించిన కొత్తలో తమ ప్రతాపానికి గుర్తుగా వాడొక జెండా తయారు చేస్తాడు. దురదృష్ట వశాత్తూ బందిపోట్లతో జరిగే తొలిపోరులోనే హైహచి చనిపోతాడు. వాడి శవాన్ని పాతి పెట్టిన సమాధి చుట్టూ సమురాయ్ లందరూ విషాదంగా నించుని ఉంటారు. కొద్ది దూరంలో పల్లీయులు కొందరు ఏడుస్తూ ఉంటారు. పిచ్చాడిలా ఉండే కికుచియో (మిఫునె) ఉనట్టుంది పరిగెట్టుకెళ్ళి హైహచి తయారు చేసిన జెండా తెచ్చి, దాన్ని ఎగరెయ్యడానికని ఒక ఇంటి కప్పు మీదికి ఎక్కుతాడు. జెండా ఎగరేసి వాడు దూరంలోకి చూస్తుండగా .. అల్లంత దూరంలో కొండల మీదనించి వరదలాగా బందిపోట్లు పరవళ్ళు తొక్కుతూ రావడం కనిపిస్తుంది. ఆ లాంగ్ షాట్ నించి కెమెరా పల్లె మీదికి పేన్ చేస్తుంది. అదే సమయంలో నేపథ్యంలో వినిపిస్తున్న పల్లీయుల రోదన ధ్వనులు ఆందోళనతో నిండిన అరుపులుగా మారుతాయి. సమురాయ్ ల విషాద భరితమైన నిశ్శబ్దం పటాపంచలై సింహనాదాలుగా విరుచుకు పడుతుంది. కేవలం రెండు క్షణాల్లో అప్పటిదాకా ఘనీభవించి ఉన్న దుఃఖం ఆవిరైపోయి ఆ స్థానంలో వీర్యమూ శౌర్యమూ ఉప్పొంగుతాయి. దృశ్యం అదే, కానీ మూడ్ పూర్తిగా మారిపోయింది.

ఇంకొక తమాషా టెక్నిక్ “షార్ట్ కట్స్.” కురోసావా దీన్ని కథలో ఏక్షన్ని ముందుకు నడిపించడానికే కాక ఒక రకమైన హాస్యం పుట్టించేందుకు భలే ఉపయోగిస్తాడు. పట్నం నించి ప్రయాణమై సమురాయ్ లు పల్లెకి చేరుకునే సన్నివేశం మంచి ఉదాహరణ. ఈ ప్రయాణం మొత్తాన్నీ అనేక చిన్న చిన్న దృశ్యాలుగా తీసి, వైప్ (wipe) లతో వాటిని కలిపి చూపిస్తాడు. కెమెరా నిలబడ్డ చోటు, ఏంగిల్, ఇత్యాది టెక్నిక్స్ తో ఈ ప్రయాణంలో ఆయా పాత్రల స్థితిగతులని చూపిస్తాడు. తెరమీద కేవలం మూడు నిమిషాలు మాత్రం నడిచే ఈ సంఘటన, ప్రేక్షకులకి ఏదో సుదీర్ఘమైన శ్రమతో కూడిన ప్రయాణం (ఆ ప్రయాణం నిజంగా అలాంటిదే) జరిగిన అనుభూతి కలిగిస్తుంది. ఈ ప్రయాణం అంతటిలోనూ తిక్కలాడైన కికుచియో చేసే పిచ్చి చేష్టలు ఒక అంతస్సూత్రంలాగా ఉండి, హాస్యం పండిస్తూ మన దృష్టి చెదిరి పోకుండ పట్టి ఉంచుతుంది.

ఇవన్నీ అలా ఉండగా, చిత్రీకరణ ప్రతిభలో తలమానికం అని చెప్ప దగినది చివరిగా బందిపోట్లతో జరిగే సంకుల సమరం. సంకుల సమరం అంటేనే కల్లోలం, గందరగోళం, అయోమయం. ఆ యుద్ధంలోని కల్లోల వాతావరణాన్ని పట్టుకుంటూనే, కురోసావా ఏ ఒక్క ఫ్రేములోనూ గందరగోళం లేకుండా జాగర్త పడతాడు. యుద్ధంలో జరిగే ప్రతి పరిణామం మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇంతా చేసి అప్పటికి మిగిలింది ఓ పదిహేను మంది బందిపోట్లు, నలుగురు సమురాయ్ లు, ఆయుధాలు పట్టిన కొందరు పల్లీయులు. ఐనా మనకి ఏ కురుక్షేత్ర మహాసంగ్రామమో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా తరువాత అనేక ప్రపంచ సినిమాల్లో అనేక రకాల యుద్ధ సన్నివేశాలనీ, కల్లోల సన్నివేశాలనీ చిత్రించారు, కానీ ఈ యుద్ధ చిత్రీకరణ మాత్రం ఫిలిం హిస్టరీలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

ముగింపు

సినిమా తయారీలో ఉపయోగకరమైన సాంకేతిక వివరాలూ, విశేషాలూ అలా ఉండగా, స్పష్టమైన కథ, పకడైన కథనం, తీర్చి దిద్దిన పాత్రలు, ఆ పాత్రలకి తగిన పాత్రధారులు, అర్ధవంతమూ, సమర్ధవంతమూ అయిన చిత్రీకరణ – మంచి చిత్రం రూపొందడానికి ఇవి అవసరమైన పునాది రాళ్ళని పదే పదే నిరూపిస్తున్నది సెవెన్ సమురాయ్. అంతే కాదు, ఏదో అదృష్టం వల్లనో, యాదృఛ్ఛికంగానో గొప్ప చిత్రాలు పుట్టవు. గొప్ప చిత్రాల పుట్టుక ఎప్పుడూ స్పష్టత, నిర్ధిష్టత, సమగ్రమైన వ్యూహ రచన, ఎక్కడా అలసత్వానికి సందివ్వని దృఢమైన పట్టుదల, అన్నిటినీ మించి అలుపెరగని శ్రమ – వీటి ద్వారా మాత్రమే గొప్ప సృష్టించగలము అని ఈ సినిమాతో చాటి చెప్పాడు కురోసావా. ఈ సినిమా తియ్యడానికి సంవత్సరం పైనే పట్టింది.

కొన్ని కొన్ని సినిమాలలోనూ పుస్తకాలలోనూ ఒక లక్షణం ఉంటుంది – మంచికో చెడుకో గానీ – వాటిని గురించి అనంతంగా విశ్లేషించుకుంటూ ఉండొచ్చు. వంద సార్లు విశ్లేషించాక, మళ్ళీ నూటొకటో సారి ఇంకా ఏవో కొత్త ఆలోచనలు, ఇదివరకు తట్టని కోణాలు స్ఫురిస్తాయి. సెవెన్ సమురాయ్ కూడా అలాంటి సినిమా. ఐతే దీనిలో విశ్లేషణకి అతీతంగా తృప్తి కలిగించే గుణం ఒకటి ఉంది. నన్నడిగితే, నిజానికి ఈ సినిమా సిసలు గొప్పతనం ఇదే. అది ఎవరికి వారు సినిమా చూసి అనుభవించాల్సిందే.

References:

 1. Seven Samurai DVD – full restored, rented from Netflix.com
 2. Webpages from Netflix and IMDB
 3. Seven Samurai and Other screenplays, Akira Kurosawa, Faber and Faber, 1992
 4. Introductory essay by Donald Richie

People may be interested in this monumental book by Donald Richie on Kurosawa

అకిరా కురోసావా శతజయంతి సందర్భంగా పున:ప్రచురణ

22 Comments
 1. వెంకట్ July 1, 2008 /
 2. Jonathan Ed July 1, 2008 /
 3. venkat Balusupati July 8, 2008 /
 4. కొత్తపాళీ July 10, 2008 /
 5. PATRIKEYA September 30, 2008 /
 6. నవీన్ గార్ల December 24, 2008 /
 7. చందు January 21, 2009 /
 8. mohanramprasad March 27, 2010 /
 9. Prasad March 27, 2010 /
 10. Faustin Donnegal March 27, 2010 /
 11. Faustin Donnegal March 27, 2010 /
   • వంశీ కృష్ణ April 6, 2010 /
 12. venkat April 2, 2010 /
 13. venkat April 2, 2010 /
  • కొత్తపాళీ April 7, 2010 /
   • venkat April 7, 2010 /