Menu

సెవెన్‌ సమురాయ్ – ఒక సమాలోచనం – 1

సెవెన్‌ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది – ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ – మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి ఉండేవి. ఇటు కురోసావా తన సినిమాల్లో వాస్తవికతకి పెద్ద పీట వేసేవాడు. ఈ రెండు విరుద్ధమైన దృక్పథాలు కలిసేదెలా? తమాషా ఏంటంటే .. తన పద్ధతి మార్చుకోకుండానే, జిడాయ్ గికీలోని ఆసక్తి కరమైన వినోద కరమైన అంశాల్ని ఉపయోగిస్తూ అర్ధవంతమైన ఒక చిత్రం నిర్మించ వచ్చని ఆయన బలంగా నమ్మాడు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి, ప్రతిఘటనల్ని ఎదుర్కుని తన కలని సాకారం చేసుకున్నాడు కూడా. ఆ కష్టంలోంచి ఆవిర్భవించినదే సెవెన్‌ సమురాయ్! జపనీస్ సినిమాల్లోనే గాక ప్రపంచ సినిమా చరిత్రలోనే తనకంటూ ఒక విశిష్ఠమైన స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా ప్రేరణతో ప్రపంచ వ్యాప్తంగా తయారైన అనేక చిత్రాల్లో హాలీవుడ్ తారలతో క్రిక్కిరిసిన ది మేగ్నిఫిషెంట్ సెవెన్‌ ఒకటి మాత్రమే. అయితే, ఈ అనుసరణాల్లో ఏ ఒక్కటీ మూల చిత్రం యొక్క ఉన్నతిని అందుకోలేకపోయాయనేది ఒప్పుకోవలసిన నిజం. ఒక దర్శకుడిగా కురోసావా ఊహాబలం, వ్యూహబలం, కథని తెరకెక్కించే పద్ధతి, శ్రద్ధ, అన్నిటినీ మించి వాస్తవిక కథనం మీద ఆయనకున్న అపారమైన గౌరవం – ఎంత ఉన్నతమైనవో అర్ధం చేసుకోడానికి అది చాలు.

నేపథ్యం

జపనీస్ చరిత్రలో సమురాయ్ వీరులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక యోధ జాతిగా సమురాయ్ లు ఎప్పుడు వృద్ధి చెందారో ఖచ్చితంగా చెప్పటం కష్టమే కాని పదిహేనవ శతాబ్ది నాటికి ఈ యోధ పద్ధతి స్థిరపడింది. ప్రతి సమురాయ్ ఎవరో ఒక ప్రభువుకి విశ్వాసం ప్రకటించి ఆ ప్రభువు కొలువులో ఉంటాడు. అవసరమైనప్పుడూ ఆ ప్రభువు తరపున యుద్ధం చేస్తాడు. తాను చనిపోవాలి తప్ప తన ప్రభువుకి ప్రకటించిన విశ్వాసం చెదరదని సమురాయ్ ప్రతిజ్ఞ. ధైర్యానికీ విశ్వాస పాత్రతకీ సమురాయ్ వీరులు పేరు పొందారు. సమురాయ్ కుటుంబాలు వేరుగా ఏర్పడ్డాయి – వీళ్ళు సామాన్యులతో సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కాదు.

తన ప్రభువు వారసులు లేకుండా మరణిస్తేనో లేదా మరికొన్ని పరిస్థితుల్లో సమురాయ్ కి ప్రభువు లేని పరిస్థితి రావచ్చు. ఇలా ప్రభువు లేని సమురాయ్ ని రోనిన్ అంటారు. పదహారో శతాబ్దంలో జపాం దేశమంతా అంతర్యుద్ధాలు చెలరేగాయి. కొన్ని దశాబ్దాల పాటు అనేక ప్రభు కుటుంబాలు సామ్రాజ్య సింహాసనం కోసం పోటీ పడ్డాయి. ఈ కల్లోలంలో చాలా ప్రభు కుటుంబాలు తుడిచి పెట్టూకు పోయి వందలకొద్దీ సమురాయ్ లు రోనిన్లయ్యారు. తమకంటూ ఏదన్ణా ఆస్తి సంపాయించుకుని ఉండకపోతే ఈ రోనిన్ల పని దయనీయంగా ఉండేది. వీళ్ళకి యుద్ధ విద్య తప్ప ముద్ద సంపాయించుకోడానికైనా యింకో పని తెలీదు. అప్పటిదాకా వీరులుగా గౌరవంగా బతికి ఇప్పుడూ నీచమైన వృత్తుల నవలంబించలేరు. అలా దేశ ద్రిమ్మరుల్లా తిరుగుతుండేవారు.

సెవెన్‌ సమురాయ్ కథ ఈ నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో మనకి కనబడే సమురాయ్ లు పైన చెప్పిన రోనిన్లే.

కథ

రైతులు మాత్రమే ఉండే ఒక చిన్న పల్లె మీద బందిపోట్ల గుంపు సరిగ్గా పంట కోతల సమయంలో దాడి చేసి దోచుకుపోతూ ఉంది. పంటనీ పశువుల్నే కాక తమ వినోదం కోసం పల్లె పడుచుల్ని కూడా చెరబట్టి ఈడ్చుకు పోతున్నారు ఈ బందిపోట్లు. ఈ పల్లీయుల మొర వినే నాథుడు లేడు. తమని తామే రక్షించుకోవాలని నిశ్చయించి ఆ ప్రయత్నంలో సమురాయ్ లని నియోగించాలని పల్లెవాసులు నిర్ణయించి తమలో ముగ్గుర్ని దగ్గరలో ఉన్న పెద్ద ఊరికి పంపారు. పల్లెని బందిపోట్లనించి రక్షించినందుకు ఆ సమురాయ్ లకి ముట్టే ప్రతిఫలం అన్నాళ్ళూ దక్కే తిండి మాత్రమే. వాళ్ళ అదృష్టం బావుండి వాళ్ళకి కాంబే అనే ఉదార బుద్ధిగల నడివయసు సమురాయ్ దొరికాడు. కట్సుషిరో అనే యువ సమురాయ్ అతన్నే గురువుగా అనుసరిస్తూ తను కూడా చేరాడు. ఇంతలో కాంబే పాత మిత్రుడు షిచిరోజీ తారస పడ్డాడు. గోరొబే అనే అతన్ని కాంబే పరీక్షించి తమతో చేరమని ఆహ్వానించగా గోరొబే హైహచి అనే వాణ్ణి కూడ తెచ్చాడు. ఈలోగా క్యూజో అనే గొప్ప కత్తి యుద్ధ నిపుణుడి యుద్ధ చాతుర్యం కళ్ళారా చూసి కాంబే అభ్యర్ధించగా అతను కూడా కలిశాడు. అప్పటి వరకూ వీళ్ళని వెన్నంటే తిరుగుతున్న కికుచియో అనే రైతు బిడ్డ , సమురాయ్ కావాలని కలలు కనే ఒక తిక్కలాడు కూడా వాళ్ళతో కలిశాడు. మొత్తం ఏడుగురు యోధులు సమకూడారు.

పల్లెకి చేరంగానే యోధులు యుద్ధ సన్నధులైనారు. బందిపోట్ల దాడి కోసం ఎదురు చూడకుండా తామే వాళ్ళ స్థావరం మీద మెరుపు దాడి జరిపి స్థావరానికి నిప్పంటించి చాలా మంది బందిపోట్లని మట్టుబెట్టారు. ఎప్పుడూ అందర్నీ నవ్విస్తూ ఉండే హైహచి ఈ దాడిలో చనిపోయాడు. బందిపోట్లు కూడగట్టుకుని పల్లె మీద దాడి చేస్తే వీళ్ళు తిప్పి కొట్టారు గానీ ఆ పోరులో గోరొబే అసువులు బాశాడు. కాంబే కొత్త వ్యూహం పన్ణాడు – బందిపోట్లు దాడి చేసినప్పుడు కొందర్ని లోనికి రానిచ్చి, మిగతా వాళ్ళని సరిహద్దులోనే నిలువరించి, లోపలికి వచ్చిన వాళ్ళ పని పట్టాలి. ఇలా కొన్ని సార్లు జరిగాక చివరిగా జరిగిన సంకుల సమరంలో క్యూజో, కికుచియో ఇద్దరూ వీరమరణం చెందారు. బందిపోట్లందరూ హతమై పోయారు.

వసంత కాల పునరాగమనంతో పల్లీయులందరూ నాట్లపనులతో హడావుడిగా ఉన్నారు. ఏడుగురు సమురాయ్ లలో ముగ్గురే మిగిలారు. వచ్చిన పని ముగిసింది. వాళ్ళూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.

కథ ముఖ్యంగా మూడు గుంపుల గురించి – వందకి పైగా ఉన్న పల్లీయులు, నలభైమంది బందిపోట్లు, ఏడుగురే సమురాయ్ లు. సినిమా మొదటి దృశ్యంలోనే బందిపోట్ల గుంపు మనస్తత్వం చిత్రీకరించ బడింది – ఆ మందలో ఎవరికీ సొంత వ్యక్తిత్వం లేదు. రెండో ముఖ్యమైన దృశ్యంలో చిక్కగా గుమిగూడిన పల్లీయులు కనిపిస్తారు. ఆ గుంపులోనించి మెల్లగా కొద్దిమంది మాత్రమే వ్యక్తిగతంగా గుర్తించ బడతారు. ఇక మూడో ప్రధాన దృశ్యంలో సమురాయ్ ల ఎంపిక. వ్పూర్తిగా విభిన్న వ్యక్తులైన ఏడుగురు యోధులు ఎలా ఒక బృందంగా ఏర్పడ్డారో చూస్తాం. సినిమా నడిచినంత సేపూ ఈ మూడు గుంపులూ విడివిడిగానే ఉంటాయి. చిత్రీకరణ ద్వారానే గాక, మూడు గుంపులకీ మూడు ప్రత్యేకమైన ధ్వని సంకేతాల నేర్పాటు చేసి, నేపథ్య సంగీతం ద్వారా కూడా కథనంలో ఈ గుంపుల మధ్య భేదాన్ని పదే పదే నొక్కి చెబుతుంటాడు కురోసావా.

(ఇంకా వుంది)

అకిరా కురోసావా శతజయంతి సందర్భంగా పున:ప్రచురణ

9 Comments
  1. Jonathan March 11, 2008 /
  2. శిద్దారెడ్డి వెంకట్ March 12, 2008 /
  3. kalhara March 14, 2008 /
  4. కొత్తపాళీ March 14, 2008 /
  5. venkat Balusupati June 10, 2008 /
  6. venkat Balusupati June 10, 2008 /
  7. Naresh Kumar March 25, 2010 /
  8. G March 26, 2010 /