Menu

సినిమాదోవకిన్: ఫిల్మ్ సినారియో గురించి

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం యొక్క స్వేచ్ఛానువాద ప్రయత్నమిది.  ఇంతకు మునుపు ఈ పుస్తకపు జర్మను అనువాదమునకు ఇచ్చిన ముందు మాటలో ఎడిటింగు గురించి చెప్పిన సమాచారాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిల్మ్ టెక్నిక్ విభాగం లో ఇచ్చిన పరిచయ వ్యాసంలో లో చెప్పిన మాటలను చూద్దాము.

***   ***   ***

సాధారణంగా ప్రొడక్షన్ ఫర్ముల (లేదా నిర్మాతల) వద్దకు వచ్చే సినారియోలు ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఏదన్నా ఒక ఆలోచనను పట్టుకుని తమకు తోచిన విధంలో రచయిత వ్రాసుకుని ఉంటాడు. దానిలో సాహిత్య విలువలుంటాయిగానీ, సినిమాటోగ్రాఫిగ్గా అది ఎంతమాత్రమూ పనికి రాని విధంగా ఉంటుంది. ఒక కథకుడు తాను చెప్పదలుచుకున్న అంశాన్ని తనకు తగిన విధంగా, అంటే పాఠకునికి చేరవేయటానికి తగిన రీతిలో మల్చుకుని, అలాగే అతనికి అందిస్తాడు. అదే విధమైన చిత్రీకరణ సినిమాటోగ్రాఫిగ్గా పనికి రాదు. అతనా సందర్భంలో దాని ఆవశ్యకతను గుర్తించకనూ పోవచ్చు.

ఉదాహరణకు చలం వ్రాసిన దోషగుణం అనే చిన్న కథను ఇంద్రగంటి మోహనకృష్ణ గ్రహణం అనే పేరు మీద సినిమాగా తీశారు. కానీ, అది సినిమాగా తీయాలనో, లేదా దృశ్య రూపంలో జనానికందించాలనో, మరే ఆలోచనతోనో దాన్ని చలం వ్రాయలేదు. ఆయన దృష్టంతా వ్రాస్తున్న నవల మీదా, చెప్పాలనుకున్న అంశమ్మీదా మాత్రమే ఉంటుంది. సాహిత్యపు విలువలున్నాయా అని తప్ప వేరొక అంశమ్మీద ఆయనకు ఆలోచన ఉండదు. కానీ, అదే నవలను సినిమాగా తీసే సమయంలో మోహన కృష్ణ సినిమాటొగ్రాఫిగ్గా ఆలోచించక తప్పదు. ఆ కథను తెర పైన చూసే ప్రేక్షకునికి ఎలా చేరవెయ్యాలనేది దర్శకునిగా అతని బాధ్యత. కథన రూపంలోని అంశాన్ని దృశ్య శ్రవణ రూపంలోకి మార్చుకునే బాధ్యత అతను నెరవేర్చవలసి ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ ఫర్ముల వద్దకు వచ్చే సినారియోలు కూడా సినిమాటోగ్రాఫిక్ రూపానికి తగినట్లు ఉండవు. అలా ఆశించలేము కూడా చాలా సందర్భాల్లో.

ప్రతి కళకూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. రచనకు ఎలాంటి లక్షణాలుంటాయో, అలాగే సినిమాకు కూడా దాని ప్రత్యేకతలుంటాయి. పైగా అది దృశ్య శ్రవణ మాధ్యమం. ఇక్కడ చేరవెయ్యవలసిన అంశం కన్నా ఆ మార్గం మరింత సంక్లిష్టంగా ఉంటుంది. ఆ వ్రాయబడిన సినారియో సినిమాటొగ్రాఫిగ్గా ఎంత వరకు పనికి వస్తుంది? దాన్ని సినిమాటొగ్రాఫిగ్గా ఎలా మలచుకోవాలి? అనేవి ఇక్కడ ఉదయించే పశ్నలు.

ఒక అంశాన్ని (ఇక్కడకి ఒక సన్నివేశమనుకోండి) సినిమాటొగ్రాఫిగ్గా మలచాలంటే దర్శకత్వపు అంశాల మీద పట్టు ఉండాలి. అవి… ఊహా శక్తి. తెర మీద ఎలా చూపాలన్న దానిని బాగా ఊహించగలగాలి. అదంతా తన మనోఫలకమ్మీద ఆవిష్కరించుకోగలగాలి. ఊహించుకున్న దానిని తెర మీదకు తెచ్చే మార్గాలు తెలిసి ఉండాలి. ఆపైన కెమేరాతో చిత్రించి, గతంలో చెప్పుకున్న రీతిలో ఆ ఫొటోగ్రాఫిక్ రూపం నుంచీ, సినిమాటొగ్రాఫిక్ రూపంలోకి మార్చగలగాలి. రచయిత తన కథను పాఠకునికి ఎలా చేరాచాలని అనుకుంటాడో, ఎలా దానిని అక్షరాల రూపంలో ఉంచుతాడో అలా ఒక దర్శకుడు (ఫిల్మ్ మేకర్) ఆ ఒక్కొక్క దృశ్యాన్నీ కూర్చుకుని అన్నిటినీ కలిపి చివరకు తెరమీద చూపుతాడు. ప్రేక్షకునికి చేరవేస్తాడు.

ఇవన్నీ తెలియని వ్యక్తి (అంటే సినిమాటొగ్రాఫిక్ అంశాలు తెలియని వ్యక్తి) సినిమా తీయబూనటమంటే అరవ సినిమాని ఉన్నదున్నట్లు తెలుగులోకి దించబూనటం కన్నా హాశ్యాస్పదంగా ఉంటుంది. ఇదే విషయాన్ని నవతరంగంలోనే ఒరిజినల్లో ఉన్న కుక్కను పాముతో రీప్లేస్ చెసిన నిర్మాత కథ రూపంలో ఇచ్చారు.

***   ***   ***

అలాగే రచయిత బాధ్యత కేవలం సినారియోనిచ్చివేయటంతోనే ముగుస్తుందనుకోవటం కూడా పొరబాటే. అలాగే దర్శకుని బాధ్యత ఉన్న సినారియోని సినిమాటొగ్రాఫిగ్గా మార్చటం వరకే అన్నది కూడా సరియైన విషయం కాడు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాలంటే ఒక ఆంగ్లం తెలిసిన తెలుగు వ్యక్తి అనువదించాలా? లేక తెలుగు తెలిసిన ఆంగ్లేయుడు అనువదించాలా? ఆలోచించాల్సిన ప్రశ్నే. ఎందుకంటే ఆంగ్లం తెలిసిన తెలుగు అనువాదకుడు పూర్తి ఆంగ్ల ఫ్లేవర్ ని పట్టలేక పోవచ్చు. అక్కడి నేటివ్ శ్లాంగ్‍నీ, వారి సెన్సిటివిటీస్ నీ అంది పుచ్చుకోలేక పోవచ్చు. అలాగే తెలుగు వచ్చిన ఆంగ్లేయునికి కూడా సమస్యలున్నాయి. అతను అక్కడి నేటివిటీని అందుకోగలడేమో కానీ, ఇక్కడి సున్నితమైన భావాలను పూర్తిగా అందుకోలేక పోవచ్చు.

మరలాంటప్పుడు ఎలా? ఇద్దరూ అవసరమున్నంత మేరా సహకరించుకోగలిగితే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. అలాగే రచయిత కేవలం తన ధోరణిలోనే కాకుండా కొంత మేరకైనా సినిమాటోగ్రాఫిక్ అంశాలను దృష్టిలో ఉంచుకుకోగలగాలి. అలాగే రచయిత దృక్కోణం కూడా దర్శకునికి తెలిసి ఉండాలి. (ఇక్కడ సినిమా కొరకు రచయిత పని చేయబోతున్నాడనే ఎజమ్షను). అప్పుడు సినిమా కొరకు ఏ విధంగా కథను మలచాలని రచయితా, రచయిత చెప్పిన దాన్ని అతని దృక్కోణంలోచీ ఎలా సినిమాటొగ్రాఫిగ్గా మలచాలని దర్శకుడూ ఆలోచించగలుగుతారు.

ఇక్కడ చెప్పుకున్న రచనా, దర్శకత్వమ్ అనేవి విభిన్నమైన వృత్తులే అయినా సినిమా అనే కళలో అవి భాగమే. కనుక వాటి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండి తీరాలి. రచయిత పూర్తిగా తన సినారియోని ఎలా సినిమాటొగ్రాఫిగ్గా మార్చాలనేదాని మీద దృష్టి ఉంచకపోయినా, కనీసం తనకున్న అవగాహనలో అటు వైపూ ఆలోచించగలిగితే దర్శకుని పని సులభమవుతుంది. లేక పోతే కొన్ని సందర్భాలలో ఆ సినారియో అనేది సినిమాటొగ్రాఫిగ్గా ఎంత మాత్రమూ పనికిరాకుండా పోవచ్చును. అందుకే తెర పైన చూపగలిగేలా కథను/సినారియోను తయారు చేయాలంటే కనీసపు అవగాహన ఉండాలి. దృశ్యావిష్కరణను దృష్టిలో ఉంచుకుని సినారియోను మలచగలగాలి.

వీటి గురించిన మరిన్ని వివరాలను రేఖామాత్రంగానైనా ముందు ముందు తెలుసుకుందాము. కానీ, పూర్తి వివరాలు మాత్రం ఆయా అంశాలలో ఉన్న స్పెషలైజ్డ్ పుస్తకాలలో మత్రమే దొరుకుతాయి.

***   ***   ***

తరువాయి భాగంలో షూటింగ్ స్క్రిప్ట్ గురించి…

One Response
  1. Faustin Donnegal April 14, 2010 /