Menu

సినిమాదోవకిన్: ఎడిటింగ్ గురించి మరి కొంత సమాచారం

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. గత వ్యాసంలో ఎడిటింగ్ గురించీ, అలాగే దానికున్న విస్తృతార్థం గురించీ తెలుసుకుంటూ వచ్చాము.

ఒక దృక్కోణం లోంచీ తీయబడి తెరపై కనబడి ప్రేక్షకునికి చూపబడేదల్లా దృశ్యం కాలేదు (దృశ్యం == filmic object). అది ప్రాణం లేని కట్టె లాంటిది అది కెమేరా ముందు కదిలినదైనా సరే. కెమేరా ముందు అది సరైన కదలికే అయినా తెరపైకొచ్చేసరికి దాని ఉపయోగం వేరు రూపంలో ఉంటుంది. . అది కేవలం సినిమాకు సంబంధించి, దృశ్యానికీ సంబంధించిన ముడి సరుకే. ఎడిటింగు ద్వారా దానికో అర్థం చేకూరుతుంది. అదెలాగో ఇక్కడ చూద్దాము.

ఒక్కొక్క చిత్రాన్నీ, మరొక చిత్రంతో కలిపి, వాటన్నిటినీ ఒక ప్రత్యేకమైన వరుసలో ఉంచి, అవసరం లేదు అనుకున్న భాగాల్ని తీసివేసి, ఉన్న వాటిని అనుసంధానం చేసి ఉంచుకొనటమే ఎడిటింగ్ (కూర్పు). గతంలో చెప్పుకున్న పదం దండుగ మాదిరి ఉత్తగా ఉన్న పదానికీ, ఆ పద సమూహంలోకి వచ్చాక చేకూరిన అర్థంలా కెమేరాతో చిత్రించిన ప్రతి చిత్రమూ అలా మిగిలిన చిత్రాలతో కలసి ఒక అనుభూతిని కలిగించేలా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక దృశ్యంగా పరిణామం చెందుతుంది.

ప్రతి చిత్రాన్నీ పైన చెప్పినట్టుగా మార్చితే అది ఫొటోగ్రాఫిక్ రూపం నుండి సినిమాటోగ్రాఫిక్ రూపాన్ని సంతరించుకుంటుంది. ఇంతకీ ఫొటోగ్రాఫిక్ రూపమంటే ఏమిటి? సినిమాటోగ్రాఫిక్ రూపమంటే ఏమిటి?

ఫొటోగ్రాఫిక్ రూపమంటే…

ఏదైనా ఒక సంఘటనని ఫొటో తీయటమంటే ఉన్న దానిని ఉన్నట్టుగా లెన్స్ లో బంధించటమే. ఒక జరిగిన/జరుగుతున్న దాన్ని ఎలా ఉన్నదో అలా ఒక ఫిల్మ్ మీద లెన్స్ సహాయంతో చిత్రించటం.

సినిమాటోగ్రాఫిక్ రూపమంటే??? ఇక్కడే ఎడిటింగనే పదాన్ని గురించి విస్తృతంగా చర్చించాల్సి వస్తుంది. మన దగ్గర ఫొటోగ్రాఫిక్ రూపంలో ఉన్న చిత్రాలలో మనకు తెర మీద చలన చిత్ర రూపంలో చూపటానికి, కావలసిన ఎఫెక్టుని సృష్టించటానికీ, కొన్నిటిని ఎన్నుకుని, వాటిని సరియైన వరుసలో ఉంచి, అందులోనూ, అనవసరమైన భాగాలను తప్పించి, వాటన్నిటినీ అనుసంధానం చేసి ఉంచి, దర్శకుడు చూపాలనుకున్న రూపంలోకి తీసుకు రాబడ్డ దృశ్య మాలికనే సినిమాటోగ్రాఫిక్ రూపమంటారు. అంటే తెర పైన కనిపించి, ప్రేక్షకులను అనుభూతింపజేసే రూపం. అది కూడా దర్శకుడు అనుకున్న విధంగా.

ఈ రెంటి గురించీ ఒక్క మాటలో చెప్పాలంటే… ఫొటోగ్రాఫిక్ రూపం మనకు ఉన్న దానిని ఉన్నట్టు చూపగలిగితే, సినిమాటోగ్రాఫిక్ రూపం ఎలా ఉండగలదో, ఇంకెలాగూడా ఉండగలదో చూపుతుంది. (Photographic means ‘the incident/s as it/they is/are’, Cinematographic means ‘the incident/s as it/they might be and ought  to be).

దీన్నంతా ఒక ఉదాహరణ తీసుకుని చూద్దాము. దాని కన్నా ముందు సినిమాటోగ్రఫీ ఆవశ్యకత గురించి చెప్పనీయండి నన్ను. ఒక థియేటర్లో సాధారణంగా ఏదన్నా దృశ్యం యొక్క ఎఫెక్టనేది అందులోని నటీనటుల ప్రతిభ మీద ఆధార పడి ఉంటుంది. వారి హావభావాలు, ఆంగిక వాచిక ప్రతిభను బట్టీ ఆ సన్నివేశం ప్రేక్షకుని మీద ఒక ముద్ర వేస్తుంది. మరి సినిమాలోనూ అంతేనా? కాదు. ఫిల్మ్ మీద రికార్డు చేసిన చిత్రాలను తన ఊహా శక్తితో, ఆలోచనతో, మరింత సమగ్రంగా దర్శకుడు మలచి, ప్రేక్షకునికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాడు. పైగా థియేటర్కీ, సినిమాకీ మధ్య భేదముంది. సినిమాటోగ్రఫీ మరింత శక్తివంతమైనది. అపరిమితమైన పరిథి ఉన్నది కూడా.

The End of St. Petersburg లో ప్రారంభ దృశ్యాలు యుద్ధానికి సంబంధించినవి. అక్కడ ఒక పెద్ద పేలుడును చూపవలసి వస్తుంది. పేలుడును పేలుడులా ఉన్నదున్నట్టు చూపుదామని నేను ఒక పెద్ద డైనమైటును భూమిలో పాతించి, దాన్ని పేలేలా చేసి, ఆ సంఘటనని కెమేరాతో చిత్రించాను. అదేమంత పెద్ద ప్రభావవంతంగా అనిపించలేదు. నాకు దీని వల్ల పెద్ద ప్రయోజనం లేదనిపించి ఎన్నో రాకాలుగా ప్రయోగాలు చేస్తే ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారం ఆ ఫొటోగ్రాపిక్ రూపాన్ని, తీసుకుని, అనవసరమనుకున్న భాగాలని ఏరివేశాను మొదట. మెగ్నీషియం ముద్దను మండించి, దాని వల్ల వచ్చిన పొగని రికార్డు చేసి, రిథమిగ్గా చీకటి వెలుగులను కూర్చుకున్నాను. ఇంతకు మునుపెప్పుడో నేను చిత్రించిన నదీ ప్రవాహ దృశ్యాన్ని వీటికి జోడించాను. ఎందుకంటే నది అలలు, దానిని నేను చిత్రించిన తీరూ పేలుడు యొక్క తీవ్రతని చూపటానికి పనికి వచ్చే విధంగా ఉంది. వీటన్నిటినీ కలిపి, అందులోనూ, నాకు పనికి రావనుకున్న వాటిని తీసివేసి, ఎడిటింగు ద్వారా ఒక సినిమాటోగ్రాఫిక్ రూపంలోకి మార్చాను. తెరపైన కనిపించి, ప్రేక్షకులని పేలుడు అనుభూతికి లోనుజేసింది ఆ దృశ్యం. కానీ, నిజానికి మీరు నవ్వవచ్చునేమో మరి, మొదట నేను చిత్రించిన పేలుడుకు సంబంధించిన ఒక్క షాట్/చిత్రం కూడా ఆ తెర మీద కనబడిన దానిలో లేదు. ఉన్నదున్నట్టుగా చిత్రించిన ఆ ఫొటోగ్రాఫిక్ రూపాన్ని, నేను నాకుకావలసిన ఎఫెక్టును అందించే సినిమాటోగ్రాఫిక్ రూపంలోకి ఎడిటింగ్ ద్వారా మార్చగలిగాను. అందుకే ఎడిటింగు అనేది సినిమా అనే కళా రూపానికి ప్రాణం లాంటిదని నా భావన. థియేటర్లో ఈ విధమైన వెసులుబాటు ఉండదు.

అలాగే నేను తీసిన మరో సినిమా మదర్ లో కొడుకుకి తనని జైలు నుంచీ విడిపిస్తారని తెలిసింది. ఆ సందర్భంలో అతని హావభావాలను (పట్టలేని అతని ఆనందాన్ని) చూపాలి. మామూలుగా ఒక వ్యక్తి తన ఆనందాన్ని ప్రదర్శిస్తున్నటుగా అతని నవ్వు మొహాన్ని చూపిస్తే మనమనుకున్నంత ప్రభావవంతంగా తెరపైన ఉన్న దృశ్యం కనబడదు. అందుకే నేను ఆలోచించి నటుని యొక్క మానసిన పరిస్థితిని పట్టి ఇచ్చే హావభావాల చిత్రీకరణ ద్వార కాకుండా నా ఎడిటింగు ద్వారా ప్రేక్షకులను స్పందింపజేయాలనుకున్నాను. అందుకే అతని ముఖం క్రింది భాగాన్ని (అతను నవ్వుతున్నప్పుడు పెదవులు విచ్చుకున్న తీరును), అతను చేతులను ఆడిస్తున్న విధానాన్ని చిత్రించి పెట్టుకున్నాను. దానికి వసంత కాలపు చిత్రాలనూ, నది నీటి మీద ప్రభాత భానుని కిరణాలు పడుతున్న చిత్రాలనూ (నీటి మీద కిరణాలు పడి, బంగరు వర్ణంలో మెరుస్తున్న చిత్రాలు), ఒక పల్లెటూళ్ళో నీటికుంట వద్ద పక్షులు చేస్తున్న సందడినీ (ఎగరడం, రెక్కలల్లల్లార్చటం, వాతి కిలకిలారావాలు), పసిపిల్లవాని బోసినవ్వునూ జోడించి, వాటిలో పనికిరావనుకున్న భాగాలను తప్పించి నాకు కావలసిన సినిమాటోగ్రాఫిక్ రూపాన్ని ఎడిటింగు ద్వారా రప్పించగలిగాను. ఆ దృశ్యాన్నంతటినీ తెరపైన చూసిన ప్రేక్షకులు ఏ విధంగా స్పందించారో నాకు తెలియదు కానీ, నాకు మాత్రం దాని ప్రభావమెంత శక్తివంతమైనదో తెలుసు.

థియేటర్ పద్ధతుల నుంచీ బయటపడి, తనకున్న అపరిమితమైన అవకాశాలను వాడుకోగలిగితే సినిమాటోగ్రఫీ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించగలదు. ఇది నా నమ్మకం.

***   ***   ***

1950లకి మునుపే వ్రాయబడ్డ ఈ పుస్తకంలో చాలా తెలుసుకోదగ్గ అంశాలున్నాయి. అంతే కాకుండా ఇప్పటి సినిమాలు, ఎస్పెషల్లీ అవతార్, టైటానిక్ లు పుదొవ్కిన్ మెథడ్ కి గొప్ప ఉదాహరణలుగా ఉన్నాయి. అందులోనూ టైటానిక్ లో జాక్ ని బంధించిన తరువాత వచ్చే దృశ్యాలన్నీ ఈ విధంగా చిత్రీకరించబడ్డవే. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పైగా అప్పటికి ఇన్ని ఎడిటింగు టెక్నిక్స్ లేవు కూడా. ఈరకమైన టెక్నిక్స్ కిఆద్యులు పుదొవ్కిన్, మరియూ కులషెవ్.

ఈ వ్యాసం ఆంగ్లానువాదం అక్టోబరు 28 1928 న లండను ద ఫిల్మ్ వీక్లీలో ప్రచురితమైనది. వీలైనంతలో స్వేచ్ఛానువాదమిది.

The next part in this series… సినిమాదోవకిన్ will be on Film Scenario.