Menu

నెలవంక (1983)


నాకు బాగా నచ్చే సినిమాల్లో, జంధ్యాల తీసిన ’నెలవంక’ ఒకటి. ఇన్నాళ్టికి మొదటిసారి ఈసినిమాని మోసర్బేర్ పుణ్యమా అని పూర్తిగా చూడగలిగాను. ఎప్పట్లాగే – I am still in love with it.

చాలామంది జంధ్యాల సినిమాలంటే – ’ఆహ నా పెళ్లంట’, ’వివాహభోజనంబు’, ’చూపులు కలసిన శుభవేళ’ – ఇలా కామెడీలనే గుర్తుపెట్టుకుంటారు. నేను మాట్లాడిన వాళ్ళలో తొంభై శాతం మంది ’నెలవంక’ అన్న ఒక సినిమా ఉంది అంటేనే తెలీదన్నవారు! ఇది జంధ్యాలకి కేవలం నాలుగో సినిమా అంటే – మొదటిసారి నమ్మడం కష్టమైంది.

ఈ సినిమా ప్రత్యేకతలు దానివి. తెలుగుతో పాటు ఉర్దూలో టైటిల్ వేసి, ఉపోధ్ఘాతాన్ని తెలుగు-ఉర్దూల్లో చెప్పి – వీలైనంత వరకు ముస్లిం జీవితాన్ని ఆథెంటిగ్గానే చూపాము, తప్పులుంటే క్షమించండి – అని డిస్‍క్లైమర్ పెట్టిన తెలుగు చిత్రాన్ని నేనెప్పుడూ చూళ్ళేదు. అలాగే, గాంధీగారికి అంకితమిచ్చిన చిత్రం కూడా.

కథ: ’హిందు-ముస్లిం’ భాయి భాయి కాన్సెప్టు. (కథ మీకెక్కడైనా దొరుకుతుంది. అమూల్యమైన నా అభిప్రాయాలు (హీహీహీ) నేనే చెప్పగలను కనుక, నా పాయింటుకొచ్చేస్తున్నా.

నటీనటులు: ’శంకరశాస్త్రి’ గా నటించిన సోమయాజులుగారిని, రహీంగా చూపాలన్న ఆలోచన రావడమే ఒక సాహసమని నాకనిపిస్తుంది. కానీ, ఆయన భలే కుదిరారు ఆ పాత్రకి. గుమ్మడి గారికి, సోమయాజులు గారికి మధ్య దృశ్యాల్లో నాకు ఇద్దరూ చాలా నచ్చారు. ఇక, తక్కిన వారిలో, నాకు అందరికంటే నచ్చింది – అలీ. రాజేష్-తులసి-రాజ్యలక్ష్మి : వీళ్ళెవరూ నాకు పెద్దగొప్పగా అనిపించలేదు (అసలా మొదటి ఇద్దరిపై జంధ్యాలకెందుకంత లవ్వో అర్థం కాదు!) ఇక, గుర్రం – గుర్రం చేత కూడా నటింపజేసారీ సినిమాలో!! రాజ్యలక్షి భర్తగా, తులసిని ప్రేమించినవాడిగా వేసినతను – మహా చిరాగ్గా ఉన్నాడు. ’అసలా ఫేస్ నచ్చలేదు నాకు’ – మరో జంధ్యాల డైలాగే వాడుతున్నా.

నచ్చిన సంగతులు:

– తోలుబొమ్మలాట దృశ్యాలు. ముఖ్యంగా, సీతమ్మవారి బొమ్మ మాట్లాడ్డం మొదలుపెట్టగానే సాక్షిరంగారావు బీడీ ఆపేసి భక్తితో వినే దృశ్యం

-రామాయణంలో పాదుకల కథ చెబుతూ – “అందుకే పాదుకలు రాముడికి దూరమయ్యాయి” అని చెప్పి నిట్టూరుస్తూ సోమయాజులు గుమ్మడివాళ్ళ భవంతివైపుకి చూసే దృశ్యం.

-’ఏది మతం, మనకేది హితం’ పాట తీసిన విధానం. మనకెన్నో సమస్యలున్నాయి అని చూపుతూ, ఇప్పుడు మతం అంత ముఖ్యమైన సమస్యా? మిగితావి పట్టించుకోవచ్చుగా అని ప్రశ్నించే సన్నివేశం

-జనం అమాయకత్వాన్ని, మూడభక్తిని ఆసరాగా తీసుకుని ఈ సినిమాలో రెండు పాత్రలు – కొత్త దేవుణ్ణి సృష్టించే దృశ్యం.
(ఈ సినిమా వచ్చి ఇరవైఏడేళ్ళైనా ఇంకా పై రెండూ జరుగుతూనే ఉన్నాయంటే ఏమనాలో తెలియట్లేదు!!)

-తులసి మతం మార్చుకునే దృశ్యం. మొదటిసారి ఈ దృశ్యం చూసినప్పుడు అవాక్కయ్యా. కొన్ని సెకన్లు పట్టింది ఆ దృశ్యాన్ని జీర్ణించుకోడానికి. (అప్పటికి నాకు ఇరవైలోపే. ఒక పట్టాన ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాన్లెండి.)

-’కనుబొమ్మల పల్లకిలోన’ పాట తీసిన విధానం ( ఈ సినిమాలో పిక్చరైజేషన్ పరంగా నాకు నచ్చిన ’ప్రేమ’ పాట ఇదొక్కటే!)

-సినిమా టైటిల్స్ సమయంలో – నటీనటుల పేర్లు వేస్తూ, ఒక దగ్గర మీ … జంట అని రాసి మధ్యలో సుత్తి బొమ్మ పెట్టేరు 🙂 నవ్వొచ్చింది. అలాగే, ఈ సినిమాలో వేలు వీరభద్రరావుకి మేకులు దించడం – రోల్ రివర్సల్ బాగుంది.

నచ్చని సంగతులు మరియు పిడకలవేట:

-ఈసినిమాకి సుత్తి ద్వయం అనవసరం అనిపించింది. ఏదో హాస్యం కావాలి కనుక పెట్టినట్లుంది. అంతమటుకు బానే ఉంది కానీ, చివరాఖర్లో ’ఈగొడవకి కారణం మనమని తెలిస్తే, మనల్ని బ్రతకనివ్వరు’ అనుకుని సుత్తివేలు ఊరు వదలాలనుకుంటున్నట్లు చూపడం అనవసరం ఏమో అనిపించింది. ఒక కామెడీ ట్రాక్ గా అంతా బానే ఉంది కానీ, ఈ సినిమాలో భాగంగా నాకేమిటో అంత నచ్చలేదు.

-ఇక ’ఏది మతం …’ పాట సోమయాజులు, ఇతర ముస్లిం సోదరులు ఈ అసలు ఊర్లోకొచ్చేసి ఎలా పాడారో ఏమిటో. అప్పుడు కథ ప్రకారం వీళ్ళంతా చెరువుదాటి ఈవలి తీరానికి రాకూడదు కదా?

-తులసి ప్రియుడి పాత్రకు ఆ కుర్రాడు కాక ఎవర్నో పెట్టి ఉండాల్సింది.

-ఎందుకోగానీ, జంధ్యాల గారు పాటల చిత్రీకరణపై అంత శ్రద్ధ పెట్టరనిపిస్తుంది. ఆ కుర్రాడు (పైలైను వాడు) – వాడికి చేతకానప్పుడు వాడి చేత డాన్సులూ అవీ వేయించి ఎందుకు మన ప్రాణాలు తీయడం – అని చిరాకేసింది (ఏమిటో లెండి, అతన్ని తల్చుకుంటేనే నచ్చట్లేదు నాకు!!) పాటల ఐడియాలు బానే ఉన్నా – చిత్రీకరణ నచ్చలేదు నాకు. సంగీతం వినసొంపుగానే ఉండింది.

-ఇక సినిమాని గుమ్మడి-సోమయాజులు ల మరణ దృశ్యంతో ఆపేసి ఉండాల్సిందనిపించింది. మళ్ళీ మన రాజేషు ఆవేశపడి జనాల్ని ఆవేశపెట్టే మాటలనడం – అనవసరం ఏమో. (మన్లోమన మాట -నాకు ఇతగాడు కూడా పెద్దగొప్పగా అనిపించలేదు)

కొన్ని డైలాగులు:

“”వెళ్ళుబాబూ వెళ్ళు. మందిస్తారు. వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకో” – సుత్తివేలు వద్ద మందు తీస్కోడానికి వచ్చిన వ్యక్తితో వీరభద్రరావు

సుత్తివేలు “సుత్తి” మొదలు పెట్టగానే వీరభద్రరావు: “దించకండి. మెదడులో మేకులు దించకండి…” అంటాడు. ఇంతలో, ఒక పేషంటు అరుస్తాడు మందుకోసం. దానితో ఇతను: “బాబూ, మేకలా అరిచి, మేకుల బారినుంచి కాపాడావు..” అంటాడు.

“మా ముందు తరం వాళ్ళు చెప్పిన మాట నిజంకాదని తెలిసినా అబద్ధమనలేము. మీ తరం వారు చెప్పిన మాట అబద్దం కాదని తెలిసినా నిజమనలేము” -తరాల అంతరం గురించి గుమ్మడి డైలాగ్.

“ఎక్కడున్నాడయ్యా దేవుడు? ఉన్నాడనుకున్నవాడి మనసులోనూ, లేడనుకున్న వాడి మాటలోనూ ఉన్నాడు దేవుడు”

“’రహీం శారదా అని పెరెట్టాడా?” – గుర్రానికి రహీం శారద అని పేరుపెట్టడం గురించి గురవయ్య వ్యాఖ్య.

“తూ ఆకే ఖానా ఖావో రే..” సినిమా మొదట్లో సోమయాజుల్ని వాళ్ళమ్మ (ఆవిడ పేరు గంగారత్నం ట, వికీ చెప్పింది) పిలిచే పద్ధతి – నాకు తెగ నచ్చేసింది. నవ్వుకుంటూనే రాస్తున్నా ఈ వాక్యం కూడా.

“శివుని జటను వెలిసినది..మా జెండా నిలిపినదీ…ఒకటే నెలవంక
ఇక మన చూపులేల నేలవంక…”
(ఏది మతం, మనకేది హితం – పాటలోని వాక్యం)

– మీరెవరన్నా చూడకుంటే తప్పక చూడండి. మన సినిమా దురదృష్టం – ఈసినిమాని అప్పట్లో ప్రేక్షకులు ఆదరించలేదట!! ఎందుకని ఈ సినిమా ఎక్కువ మందికి తెలీకుండా పోయిందో మరి! పులగం చిన్నారాయణ గారి ’జంధ్యామారుతం’లో కూడా ఈపుస్తకాన్ని గురించి ఎక్కువ రాయలేదనుకుంటాను… (నేను పొరబడి ఉండవచ్చు. ఆ పుస్తకం చివరిసారి చూసి చాలారోజులైంది).

5 Comments
  1. ప్రదీప్ March 8, 2010 /
  2. మేడేపల్లి శేషు March 9, 2010 /
  3. Madhava June 11, 2010 /