Menu

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది నీచా నగర్ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand Prize) ని అందుకుంది ఈ  చిత్రం.

కొంతకాలం క్రితం ఒకసారి ‘హిందూ’ పత్రికలో ఈ చిత్రం గురించి తెలుసుకున్న తర్వాత, నీచా నగర్ విసిడి తెప్పించి చూశాను.  అప్పటినుంచీ ఈ సినిమా గురించి ‘నవతరంగం’లో రాయాలనుకున్నా, నాకంటే దీన్ని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా రాస్తే బాగుంటుందని ఎదురుచూశాను. కాని ఎవరూ ఆ పని చేయకపోవటంతో, మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన   ఈ చిత్రం గురించి, ఆ దర్శకుడిని గురించి రేఖామాత్రంగానైనా  సినిమాకళను అభిమానించేవారు తెలుసుకోవలసిన అవసరం ఉందని, నేను సేకరించిన కొద్దిపాటి వివరాలతో ఈ నాలుగు ముక్కలు –

‘నీచా నగర్’ స్థూలంగా రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ రాసిన ‘Lower Depths’ అనే నాటకంపై ఆధారపడినది. ‘నీచా నగర్’ అనే టైటిలు Downtown అన్న ఇంగ్లీషు మాటకి సమానార్థకం. ఉన్నవారు, లేనివారి మధ్య తారతమ్యాలు, ఉన్నవారు, లేనివారిపై ఏ విధంగా ఆధిపత్యం చలాయిస్తారనేదే దీని కథాంశం. హిందీలో ఈ కథను రాసింది హయతుల్లా అన్సారీ.

ఒక చిన్న కొండపైన ఒక విలాసవంతమైన బంగళాలో ఉండే ధనం, దర్పం గల పెద్దమనిషి, తన ప్రాంతంలో ఉండే వ్యర్థజలాలను కింద పేదప్రజలు నివసించే బస్తీకి ఒక కాలువద్వారా మళ్ళిస్తాడు. దానివల్ల, ఆ బస్తీలో రకరకాల జబ్బులు ప్రబలి, ఆ ప్రజలు రోగాలపాలవుతారు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన వాళ్ళను తన డబ్బుతో, పలుకుబడితో నోళ్ళు మూయించాలని చూస్తాడు. వాళ్ళకో ఆస్పత్రి ఏర్పాటుచేసి వాళ్ళను నోరెత్తనీయకుండా చేయాలని చూస్తాడుగాని, తాను  మురికి నీళ్ళను ఆ బస్తీకి మళ్లించటం తప్పని ఒప్పుకోడు. అతడి ధనమదానికి లొంగని ప్రజలు చావనైనా చస్తాం గాని, ఆ ఆస్పత్రి సేవలు వినియోగించుకునేది లేదని భీష్మించుకుంటారు.  చివరికి తన కన్నకూతురు కూడా, తాను చేస్తున్నది తప్పని, ఆ బస్తీ ప్రజలనే సమర్థిస్తుంది. తాను ‘కొనేసిన’ అనుయాయులూ దూరమవుతారు. చివరకు అతను దిక్కులేని చావు చస్తాడు.

ఇందులో కథానాయికగా చేతన్ ఆనంద్ భార్య ఉమా ఆనందే నటించింది. తొంభై ఏళ్ళు పైబడిన పండు వయసులో ఇప్పటికీ  ఎంతో చలాకీగా కనిపించే, జోహ్రా సెహగల్ ను ఆమె యుక్త వయసులో ఇందులో చూడవచ్చు. మరో ప్రధానపాత్రలో కామినీ కౌశల్ నటించింది. ఈ సినిమాకి సంగీతం అందిం

చింది కూడా పండిట్ రవిశంకరే.  ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వపు ఆంక్షలవల్ల ఈ సినిమా మన దేశంలో విడుదలకు నోచుకోలేదు.

2008 లో చేతన్ ఆనంద్ కుమారుడు, కేతన్ ఆనంద్ తన తల్లి ఉమా ఆనంద్ తో కలిసి “Chetan Anand: The Poetics of Film” అనే పుస్తకాన్ని, అదే టైటిలుతో ఒక డాక్యుమెంటరీని విడుదల చేశాడు.

చేతన్ ఆనంద్, ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ సోదరుడు (అన్న). చేతన్ ఆనంద్, దేవానంద్, విజయానంద్ ఆనంద్ త్రయంగా హిందీ చిత్రసీమలో ప్రసిద్ధులు. ఆనాటి బలరాజ్ సహానీ, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ వంటి హిందీ చిత్రసీమ ఉద్దండులలాగానే, చేతన్ ఆనంద్ కూడా కమ్యూనిస్టు భావజాలం చేత, ఆనాటి రష్యన్ సాహిత్యం చేత  ప్రభావితుడైనవాడు.

‘నీచా నగర్’ చేతన్ ఆనంద్ మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత 1950 లో తమ్ముడు దేవానంద్ తో కలిసి ‘నవకేతన్ ఫిల్మ్స్’ అనే బ్యానర్ ప్రారంభించి మరికొన్ని చిత్రాలు నిర్మించాడు. రష్యన్ రచయిత నికోలాయ్ గోగోల్ నాటకం Inspector General ఆధారంగా తీసిన ‘అఫ్సర్’ అనే చిత్రం ఈ వరుసలో మొదటిది. తర్వాత, ‘ఆంధియా’ (1952), ‘టాక్సీ డ్రైవర్’ (1954) ‘ఫంతూష్’ (1956) చిత్రాలు ఈ బ్యానర్ మీద వచ్చాయి.  వీటిలో ‘టాక్సీ డ్రైవర్’ బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఆ తర్వాత, ‘హిమాలయ ఫిల్మ్స్’ పేరిట తన స్వంత బ్యానర్ ప్రారంభించి, ‘హకీకత్’, ‘హీర్ రాంజా’, ‘హస్తే జఖ్మ్’, ‘కుద్రత్’, ‘హిందూస్తాన్ కి కసం’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో, 1964 లో తీసిన ‘హకీకత్’ అనే చిత్రం 1962 లో జరిగిన ఇండియా, చైనా యుద్ధం నేపధ్యంగా నిర్మించింది. దీనిని కాశ్మీర్ లోనూ, టిబెట్ లోనూ actual locations లో చిత్రించాడు. దీనిని అప్పటి ప్రధాని నెహ్రూకు అంకితమిచ్చాడు. తన చిత్రాలు ఎక్కువగా స్టూడియోలో కాకుండా, లొకేషన్స్ లోనే తీయటానికి ప్రాదాన్యమిచ్చేవాడు. పదిహేనుకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన చేతన్ ఆనంద్ 1988 లో దూరదర్శన్ కోసం ‘పరమవీర చక్ర’ అనే సీరియల్ ను కూడా రూపొందించారు.  అనేక చిత్రాలకు దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా పనిచేసిన చేతన్ ఆనంద్ ను, కథనం, కెమెరా విషయాల్లో ఒక వినూత్నమైన ప్రయోగశీలిగా సినీ విమర్శకులు పేర్కొంటారు.

2 Comments
  1. SRRao March 16, 2010 /