Menu

చిత్తూరు నాగయ్య

“చిత్తూరు నాగయ్య”

పాత తరం వారికి పరిచయం అవసరం లేని పేరు. నేటి తరం వారికి పెద్దగా తెలియని పేరు.. పేరు విన్నాం మనిషి గుర్తు లేడు అనేవారికోసం ఈ వ్యాసం లో ఆయన ఫోటో కూడా పెట్టాను.

ఆయన పేరు కూడా వినని వారికోసం ఆయన గురించి తెలుగు వీకీపీడియా వారి పరిచయ వాక్యాలు

“చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది – తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు.”

ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆయన నటనా పటిమను పొగడతం లేదా ఆయన ఫిల్మోగ్రఫీ రాయడం కాదు.. ఇది ఆ మహా మనీషి జీవితంలోని కొన్ని సంఘటనలను మెత్తగా సృసించి ఆ రోజులలో నటులు ఎలా ఉండేవాళ్ళో తరచి చూడాలనే ప్రయత్నం!

చిత్తూరు నాగయ్య గా ఖ్యాతినార్జించిన శ్రీ నాగయ్య గారి అసలు పేరు “ఉప్పలదడియం నాగయ్య”. చిత్తూరు రామవిలాస సభ వారి సారంగధర నాటకం లోని చిత్రాంగి వేషం ఆయనలోని నటుడిని నలుగురికీ పరిచయం చేసింది.. అప్పటినుంచీ చిత్తూరు నాగయ్యగా జన హృదయాలలో స్థిరపడిపోయారు.
చాలామంది నటులు పాత్రలలో నటిస్తారు కొంతమంది పాత్రలలో జీవిస్తారు, కానీ తను చేసిన పవిత్ర పాత్రలలాగా నిజ జీవితంలో జీవించడం శ్రీ నాగయ్య గారికి మాత్రమే సాధ్యపడింది.. చిన్న వయసులోనే కుటుంబం మొత్తాని కోల్పోవడం ఆయనను ఒక విరాగి గా మార్చింది.. కానీ నటనపై ఆయనకున్న మక్కువతో కడదాక పాత్రలలో నటిస్తూనే ఉన్నారు..

భక్త రామదాసు చిత్రం శ్రీ నాగయ్య గారి కలల చిత్రం.. ఆ చిత్రం నిర్మించడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందట. ఈ మధ్య కాలంలో ఆయన ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆ చిత్రం లో కబీరుకు సంబంధించిన పాటలను ప్రఖ్యాత హిందీ గాయకుడు శ్రీ రఫీ గారి చేత పాడించారు. దానికి రఫీ గారికి రెమునరేషన్ ఇస్తే అది తీసుకోక నాగయ్య గారికి ఆర్థిక పరంగా ఇంకా ఏదైనా చెయ్యగలిగితే చెప్పమని ఆడిగారట శ్రీ రఫీ. నాగయ్య గారికి హిందీ పరిశ్రమలో ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక్కటి చాలు.

శ్రీ నాగయ్య గారు దక్షిణ భారతదేశ నటులలో పద్మశ్రీ పొందిన మొదటి నటుడు.. ఆ అవార్డ్ తనకు కాదు పరిశ్రమ మొత్తానిది అని చెప్పిన వినయశీలి శ్రీ నాగయ్య. ఆయన పద్మశ్రీ అవార్డ్ వచ్చిందని ఎవరో అభినందినచడానికి వెళితే నా దగ్గర “పద్మ” మాత్రమే ఉంది “శ్రీ” లేదు అన్నారట.

నాగయ్య గారి భక్త పోతన సినిమా చూసిన ఒక బాలుడు బాలయోగి గా మారిపోయడట!! ఒక మనిషిని యోగిగా ఒక సినిమా మార్చగలిగిందంటే ఆ సినిమా, ఆ నటుల సత్తా ఏమిటో వేరే చెప్పనవసరం లేదు. గుమ్మడి గారు కూడా భక్త పోతన వేషం వేశారు కానీ అది ప్రజాదరణ పొందలేదు. ఒకసారి గుమ్మడి గారు నాగయ్య గారి తో బాలయోగిని తిరిగి మామూలు మనిషిగా మార్చడానికి నా భక్త పోతన చూపిస్తే చాలు అన్నారట. దానికి నాగయ్య గారు మీ మనసులోని ఆవేదనను అర్థం చేసుకోగలను నాకు నిర్మించే స్థోమత ఉండుంటే ఖచ్చితంగా మీతో మరో మారు ఆ సినిమా నిర్మించేవాడిని అన్నారట. ఇలాంటి మహా మనీషి ఔదార్యం వర్ణించడానికి మాటలు చాలవు!!

తారగా ఒకవెలుగు వెలిగినా నయా పైసా కూడా వెనుక వేసుకోలేక పోయారు శ్రీ నాగయ్య.. జీవిత చరమాంకం లో వచ్చిన ప్రతీ వేషాన్ని వేశారు కాదు కాదు వేయాల్సివచ్చింది. అలాంటి రోజులలో ఒకానొక కౌబాయ్ సినిమాలో సైడ్ రోల్ వేస్తున్నారట శ్రీ నాగయ్య గారు. షూటింగ్ సమయం లో ఆయన్ను గుర్తు పట్టిన ఒక పాత మిత్రుడు ఆయన పరిస్థితికి బాధపడితే ఆయన్ను ఓదార్చుతూ “ఉదర నిమిత్తం బహు కృత వేషన్ ” అన్నారట శ్రీ నాగయ్య.

ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన – తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, – నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. ‘త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్లూ, చిన్న టెక్నీషియన్లూ, అక్కడే బసా, భోజనాలూ! ‘పొట్టిప్లీడరు (1966) సినిమా తీస్తున్నప్పుడు పద్మనాభం ఆయనతో మాటల సందర్భంగా చెప్పారు తను కూడా ‘రేణుక’ ఆఫీసులో కొంతకాలం వున్నానని. దానికాయన ఎంతో స్పందించి, ‘అలాగా నాయనా! నీకు అప్పుడు ఏ లోపం జరగలేదు గదా, నువ్వెవరో నాకు తెలియకపోయెనే!’ అని బాధపడ్డారు. అవుట్ డోర్ షూటింగులకి వెళ్తే, మధ్యాహ్నం భోజనసమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. ‘వాళ్లు కూడా పొద్దున నుంచి మనతోపాటే ఇక్కడ వున్నారుగదా!’ అన్నది ఆయన సమాధానం. మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో ఆయన ఇంటిముందు విపరీతంగా జనం గుమిగూడేవారు – ఆయన లేఖలురాసి ఇస్తే కాలేజీ, హైస్కూళ్లలో సీట్లు దొరకడం సులభయయేది.

ఉన్నంతలో నలుగురికి సహాయం చేసిన శ్రీ నాగయ్య 1973లో స్వర్గస్తులయ్యారు..

–Kartik

References:

http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF

7 Comments
  1. సూర్యుడు March 28, 2010 /
  2. kalyani March 29, 2010 /
  3. SANJEEV March 30, 2010 /
    • karthik March 30, 2010 /
  4. శిరిగిరి భాను ప్రకాశ్ April 6, 2010 /
  5. రహంతుల్లా April 6, 2010 /
  6. venkat April 16, 2010 /