Menu

’కళ’ కోల్పోతున్న భారతీయ సినిమా

జాతీయ స్థాయిలో తెలుగు సినిమా రంగం సంఖ్యాపరంగా ద్వితీయ స్థానం ఆక్రమిస్తూ వుంది. కాని కళాత్మక విలువల పరంగా ఆలోచించినప్పుడు దాని స్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇండియన్ పనోరమాకి ఎంపికయ్యే స్థాయి చిత్రాలు కూడా తెలుగులో రావడం లేదు. సరిగ్గా ఇదే స్థితి అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమా ఎదుర్కొంటుంది.ఉత్తమ కళాత్మక చిత్రాల్ని నిర్మించడంలో భారత చలనచిత్రసీమ తీవ్రంగా విఫలమవుతోంది. ప్రపంచ స్థాయిలో ఇరాన్, కొరియాలాంటి ఆసియన్ దేశాలు తమ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయ పరంపరను కొనసాగిస్తే ఉంటే మన సినిమా రంగం అత్యంత విషాదకరమైన స్థితికి క్రమంగా నెట్టివేయబడుతున్నది.

ఇటీవల జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలని పరిశీలిస్తే మన సినిమా స్థాయి స్పష్టమవుతున్నది. గత సంవత్సరం లో జరిగిన ఎన్నో చలనచిత్రోత్సవాల్లో దాదాపుగా సగం ఆసియా దేశాల చిత్రాలు ప్రదర్శనకు నోచుకోగా వాటిల్లో ఎన్నో చిత్రాలు అవార్డులూ గెలుచుకున్నాయి. ఏటా ఆరు వందల పై చిలుకు సినిమాలు నిర్మించే ఘనత మనకున్నఫ్ఫతికీ అంతర్జాతీయ స్థాయి కళాత్మక విలువలకు ధీటైన ఒక్క చిత్రాన్ని కూడా భారతీయ సినిమా రంగం అందించలేకపోతుంది. మన సినిమా రంగం ఈ స్థితికి చేరుకోవడానికి కారణమైన అంశాల్ని ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో మన చిత్రాలు లేనంత మాత్రాన ఏం మునిగిందని ఎవరయినా ప్రశ్నించవచ్చు. కాని సినిమా కళ కొలబద్ద ప్రకారం అనేక దశాబ్దాలుగా కేన్స్ లాంటి చలనచిత్రోత్సవాలు సమున్నత స్థానాన్ని పొందివున్నాయి.

ఇన్నేళ్ళ ప్రపంచ సినిమా చరిత్రలో గొప్ప చిత్రాలుగా నిలిచిన అనేక చిత్రాలు కేన్స్ లో బహుమతులు అందుకున్నవే. ఇదే కేన్స్‍ ఫెస్టివల్ లో 1956 లో సత్యజిత్ రే మొట్టమొదటి చిత్రం ’పథేర్ పాంచాలి’ బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ అవార్డు అందుకుంది. ఆ సినిమానే మన భారతీయ నవ్య సినిమా ఉద్యమానికి పాదులు వేసింది. అంతేకాదు, సత్యజిత్ రే నిర్మించిన మిగిలిన చిత్రాలు కూడా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి. 1980 వ దశకంలో కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మన భారతీయ సినిమాలు పలుసార్లు ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్నాయి.

ఆ దశాబ్దంలో సత్యజిత్ రే, మృణాల్‍సేన్, గౌతంఘోష్, అదూర్ గోపాలకృష్ణన్, తదితరులు తమ చిత్రాల్లో కేన్స్ ను అలంకరించారు.ఆ దశాబ్దం చివరి సంవత్సరాల్లో మీరా నాయర్ నిర్మించిన ’సలాం బాంబే’ అవార్డును కూడా అందుకుంది.అంతకు ముందు పరిస్థితిని పరిశీలిస్తే వి.శాంతారాం (దోభీగా జమీన్, సుజాత), ఎం.ఎస.సత్యు (గరం హవా), శ్యాం బెనగల్ (నిశాంత్), మృణాల్ సేన్, అదూర్, గౌతంఘోష్ మొదలైన దర్శకులు కేన్స్ లో తమ చిత్రాలు చూపించి గౌరవభిమానాలు పొందారు.

అయితే 1990 తర్వాత పరిస్థితి క్రమంగా నిరాశాజనకంగా తయారయ్యింది. ఆ దశాబ్దంలో కనీసం నాలుగు సంవత్సరాలు కేన్స్ లో మన సినిమా ప్రదర్శించబడలేదు. కాని ప్రఖ్యాత మళయాలీ దర్శకుడు షాజీ కరుణ్ మాత్రం తనదైన స్థానాన్ని కేన్స్ లో సుస్థిరం చేసుకున్నారు. ఆయన నిర్మించిన తొలి మూడు చిత్రాలు కేన్స్ లో ప్రదర్శింపబడడం ఒక విశేషం. ఆయన చిత్రాలు ’పిరవి’, ’స్వాహం’, ’వానప్రస్థం’, చిత్రాలు కేన్స్ లో ప్రశంసలు అందుకున్నాయి. కేన్స్ లోని ప్రధాన పోటి విభాగంలో కాకున్నా కనీసం ’ఎ సర్టెన్ రిగార్డ్’ విభాగంలోనైనా భారతీయచిత్రాలు ప్రదర్శనకుండడం గొప్ప విశేషమే. అయితే 90వ దశకంలో కేన్స్ లో ఒక అవార్డును గెలుచుకున్ చిత్రం ’మరణ సింహాసనం’. అప్పట్లో లండన్ లో (ప్రస్తుతం హైదరాబాద్ లో )నివసిస్తున్న భారతీయ దర్శకుడు మురళీనాయర్ నిర్మించన చిత్రమిది.

అలాగే ఈ మధ్యనే బెర్లిన్ చలన చిత్రోత్సవాల్లో రజనీశ్ అనే ప్రవాసాంధ్రుడు నిర్మించిన ’వనజ’ చిత్రం కూడా అవార్డు గెలుచుకుంది. ఇలా చెదురు ముదురు సందర్భాలు మినహాయిస్తే భారతీయ సినిమా గర్వించదగిన ఘనతేమీ సాధించలేకపోయిందనే చెప్పుకోవచ్చు. కేన్స్ ఫెస్టివల్ లాంటి వాటిల్లోనే కాదు, ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా మన సినిమా గడపదాటని పరిస్థితినే ఎదుర్కుంటోంది. శేఖర్ కపూర్ లాంటి వారు నిర్మించిన ’ఎలిజెబెత్’ కూడా నామినేషన్లు పొందినప్పటికీ అవార్డుల విషయం వచ్చే సరికి చతికిలబడిపోయింది. మొత్తం మీద అటు కళాత్మకంగా ఇటు సాంకేతికంగా భారతీయ సినిమా పేదరికాన్ని అనుభవిస్తున్నది. నిజానికి గత కొన్ని సంవత్సరాల్లో మన సినిమా రంగం తీవ్రమయిన ఆటుపోట్లకు గురవుతూ వస్తున్నది. అమితంగా పెరిగిపోయిన నిర్మాణ ఖర్చులు, ఎలక్ట్రానికి మీడియా ప్రభావంతో భారతీయ ప్రధాన స్రవంతి సినిమా ఎటు పయనిస్తుందో అర్థం కాకుండా వుంది. దే వ్యాప్తంగా ఏటా చలనచిత్రాల నిర్మాణ సంఖ్య పడిపోతుంది. విడుదలైన చిత్రాల్లో కూడా అత్యధిక చిత్రాలు ఆర్థికంగా వైఫల్యం చెంది పెట్టుబడులు కూడా తిరిగి తెచ్చుకోలేని స్థితికి నెట్టివేయబడుతున్నాయి.

ఈ స్థితిలో కొన్ని చిత్రాలకు బయటి దేశాల్లో మార్కెట్ ను వెతుక్కోవాలసిన అవసరం పెరిగింది. చాలా చిత్రాలు అలా బతికి బట్టకడుతున్నాయి కూడా కానీ ఆ క్రమంలో ఆ సినిమాల్లో హాలీవుడ్ అనుకరణలు విపరీతంగా పెరిగి నేటివిటి, ప్రాంతీయ గుబాళింపులు మచ్చుకైనా కనిపించకుండా పోతున్నాయి. ఇక ప్రధాన స్రవంతికి సమాంతరంగా రూపుదిద్దుకున్న నవ్య సినిమా ఉద్యమంలో నిర్మాణ వ్యయం కూడా పెరిగిన ఫలితంగా చిత్ర నిర్మాణాల వేగం తగ్గిపోయింది. ఇంకా కొంత మంది కళాత్మక దర్శకులు ప్రధాన సినిమా స్రవంతి వైపు మరలిపోవడం ఆ ఉద్యమంపై ప్రభావాన్ని చూపించింది.ప్రభుత్వపరంగా కళాత్మక సినిమా రంగానికి లభించే ఆర్థిక పరమైన వెసులు బాట్లు కూడా దాదాపు నిలిచిపోవడంతో కళాత్మక చిత్రాల నిర్మాతలు వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఉత్తమ సినిమాల్ని ఆర్థికంగా ప్రోత్సాహించాల్సిన ఎన్.ఎఫ్.డి.సి. సంస్థ లాభనష్టాల వ్యాపారంలో పడి అసలు లక్ష్యాన్ని గాలికొదిలేసింది.

చివరికి మొన్నామధ్యన కేన్స్ చలనచిత్రోత్సవం సందర్భంగాభారతీయ చిత్రాలకు మార్కెట్ చేయాల్సిన ఎన్.ఎఫ్.డి.సి. కేన్స్ కు వెళ్ళనే లేదు. మార్కెట్ విభాగంలో స్థలాన్ని రిజర్వ్ చేసుకుని కూడా మన ఎన్.ఎఫ్.డి.సి. ఫ్రాన్స్ కు వెళ్ళలేకపోయింది. కారణాలేమయినా కావచ్చు కానీ ఇప్పుడు ఈ సమ్సథ నిబద్ధత ప్రశ్నార్థకమై కూచుంది.

వీటన్నింటిని మించి 90 ల తర్వాత మన దేశ సామాజిక రాజకీయ రంగాల్లో వచ్చిన పెను మార్పులు మన సినిమా రంగపతనానికి బలమయిన కారణంగా గోచరిస్తాయి. ప్రభుత్వాల్లో పెరిగిన వ్యాపార లక్షణాలు, కుటుంబ సామాజిక రంగాల్లో వచ్చిన స్వీయ కేంద్రీకృత ధోరణి, మధ్య ఉన్నత వర్గాల మేధావుల్లో పెరిగిన నిరాసక్త ధోరణి కళాసృజనాత్మక రంగాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో మొట్టమొదటిగా సినిమా రంగమే తన మౌళిక లక్షణాల్నించి దూరమై నిస్సారంగా నిర్మాణం కావడంతో వాటి స్థాయి క్రమంగా తిరోగమన దిశకు మళ్ళింది.

ప్రపంచ చలనచిత్ర పటంలో సంఖ్యాపరంగా ఉన్నత స్థితిలోనూ, స్థాయిపరంగా దిగువ స్థాయికి మన భారతీయ సినిమా దిగజారిపోతుంది. ఇలాంటి స్థితిలోనూ నవతరం దర్శకులు చలనచిత్రాల్లో నవ్యత కోసం తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారి కృషే మనకి ఆశాదాయకం.

4 Comments
  1. Vvenkat.Gopu April 2, 2010 /
  2. Vvenkat.Gopu April 2, 2010 /