Menu

It’s a wonderful life

మనిషి జీవితం ఎంతో ఉన్నతమయినది. పది మందికీ ఉపయోగపడేది, పడాల్సినది.

కానీ మనం కాలక్రమంలో అప్పుడప్పుడూ మన జీవితం మీద ఆసక్తి కోల్పోతుంటాము. మన జీవితం యొక్క పరమార్థం గ్రహించకుండా ఉంటాము.

అసలు మీరు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాని వల్ల మీ చుట్టుపక్కల వారికి ఏదయినా మార్పు ఉందా ? లేకపోయినట్లయితే మీ జీవితానికి అర్థం లేదేమో ?

ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఒక మంచి సినిమా “It’s a wonderful life” .

ఇందులో స్థూలంగా కథ ఏమిటంటే కథానాయకుడికి చిన్నప్పటి నుంచీ ఎన్నో కలలుంటాయి వివిధ ప్రదేశాలకు వెళ్ళాలనీ, చదువుకోవాలనీ, ఏదయినా సాధించాలి అనీ.

కానీ ఎప్పుడు ఆ ప్రయాణం మీద బయలుదేరినా అతనికి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోవాల్సి వస్తుంది.

పేదలకూ, చిన్న ఉద్యోగస్తులకూ ఇళ్ళు కట్టుకోవడానికి రుణాలిచ్చే ఒక సంస్థ ఆ కథానాయకుడి వారసత్వం. అతడి తండ్రి చనిపోవడంతో అతను ఆ వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే తను కనక ఆ సంస్థని చేపట్టకపోతే అది ఒక జనాల్ని పీల్చి పిప్పి చేసే ఒక బడా వ్యాపారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

అక్కడ నుంచి సందిగ్ధం మొదలు. తను తన ప్రయోజనాల కోసం వెళ్ళిపోతే సంస్థ మీద బ్రతుకుతున్న అంత మందికి ద్రోహం చేసినవాడవుతాడు. సంస్థ ని చేపడితే తను ఆశించినవన్నీ సాధ్యం కావు.
అలాంటప్పుడు కథానాయకుడు ప్రజల కోసమే మొగ్గు చూపుతాడు. సంస్థ ని విజయవంతంగా నడిపించి మంచి పేరు తెచ్చుకుంటాడు. తనకి నచ్చిన పిల్లను పెళ్ళి కూడా చేసుకుంటాడు. కానీ అనుకోకుండా కొంత డబ్బు కనిపించకపోవడంతో అతను కష్టాలలో పడతాడు. డబ్బుని తీసుకు రాలేకపోతే సాంస్థ కాస్తా చేజారిపోతుంది. కానీ డబ్బు ఎక్కడా దొరకదు.

ఇక ఆ బాధలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని నీటిలో దూకబోతుంటే ఆకాశాన్నించి వచ్చిన ఒక గార్డియన్ ఏంజిల్ అతడిని కాపాడి అసలు అతను లేని లోకం ఎలా ఉంటుందో చూపిస్తాడు. జనాలందరూ ఎలా ఆ బడా వ్యాపారస్థుని బారిన పడి మగ్గుతున్నారో, ఎంత మంది అతని సహాయం లేక జీవితంలో ఎంతో కోల్పోయారో అతను కళ్ళారా చూస్తాడు.

అప్పటికి కానీ అతనికి తన జీవితం ఎంత విలువయిందో అర్థం కాదు. అంత మంది జీవితాన్నే మార్చగలిగిన అతని శక్తి అతనికి తెలుస్తుంది. మళ్ళీ నూతనోత్సాహంతో తన జీవితాన్ని తనకివ్వమని అడిగి ఉత్సాహంతో ముందుకు సాగుతాడు.

అతనికి గార్డియన్ ఏంజిల్ సహాయం దొరికింది కానీ మనకు దొరకకపోవచ్చు. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అసలు నా జీవితం ఎందుకు ? ఎవరికి ఉపయోగం ?
నేను ఏదయినా సాధించగలుగుతున్నానా ? అని.

ఎన్నో సార్లు మనం మన జీవితంలో మనకు దొరకని వాటి గురించి బాధపడతాము కానీ దొరికిన వాటి ప్రాముఖ్యత గుర్తించలేము.

ఉదా: మనకు దొరికిన ఉద్యోగం మనకి కావలసినది కాకపోవచ్చు కానీ దాని వల్ల ఉన్న ఉద్యోగంలో సరిగా పని చెయ్యగలిగీ చెయ్యకపోతే ?? అది స్వయంకృతాపరాధం.

అలాగే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగే శక్తి మనలో ఉంది. మన జీవితానికి మనమే బాధ్యులం అని ఈ సినిమా చెబుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. మీరెప్పుడు జీవితంలో నిరాశకు గురయినా ఒక సారి ఈ సినిమా చూస్తే వెంటనే చిరునవ్వు చిందించగలరు.

* నలభై యాభైలలో వచ్చిన సినిమాలలో నాకు నచ్చేది నటీ నటుల ప్రతిభ. అప్పుడప్పుడూ అనిపిస్తుంది ఆ సమయంలో ఎఫెక్ట్లూ గట్రా లేకపోవడంతో కేవలం నటన, కథ, దర్శకత్వం, కెమేరా పనితనం మీద ఆధారపడి మంచి సినిమాలొచ్చేవేమో.

–ప్రవీణ్ గార్లపాటి

12 Comments
 1. Sowmya February 24, 2008 /
 2. వెంకట్ February 24, 2008 /
 3. ప్రసాద్ సామంతపూడి February 24, 2008 /
 4. రానారె March 2, 2008 /
 5. Jonathan March 7, 2008 /
 6. Theja April 3, 2008 /
 7. Sowmya May 17, 2008 /
 8. kummy March 21, 2010 /
 9. kummy March 21, 2010 /
 10. V. Chowdary Jampala March 25, 2010 /
 11. Gangavaram Viswanath April 4, 2010 /