Menu

డాక్యుమెంటరీ సినిమా-3

చైనా సినిమా – చరిత్ర – దశలు

అభ్యుదయ సినిమాలకి అభివృద్ధి నిరోధక సినిమాలకీ ఉన్న సంఘర్షణే చైనా సినిమా చరిత్ర. “పోరాటం – ఓటమి” పోరాటం – ఓటమి – గెలుపు” అన్న మావో సూక్తి చీకటి కోణంలో దాగిన సినిమా చరిత్రను చదవటానికి ప్రేరేపిస్తుంది.

చైనాలో 1896 లోనే సినిమా ప్రదర్శింపబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాతే చైనాలో సినిమాలు తీయడం ప్రారంభించారు.

చైనా సినిమా చరిత్రని సమగ్రంగా తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఇప్పటిదాకా ప్రయత్నం జరుగలేదు. నిజానికి చైనా సినిమాకి చైనా చరిత్రకి గొప్ప సంబంధం వుంది.

చైనా సినిమా చరిత్రను ప్రధానంగా నాలుగు భాగాలుగా చేయవచ్చు. 1896 నుండి 1962 మధ్యకాలంలో సినిమా ఏ ఏ విషయాలమీద కేంద్రీకరింపబడిందో, వాటి ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటో ఇంకా తెలుసుకోవల్సి ఉంది. మొదటి దశ 1896 నుండి 1931 వరకు. ఈ దశలో సినిమా ఒక రూపం తీసుకొంది.

అంతవరకు సినిమా సామ్రాజ్యవాదుల భూస్వామ్య దళారీ వ్యాపారస్థుల, బూర్జువాల చేతుల్లో ఒక పిండ రూపంలో ఉండిపోయింది. అదే కాలంలో జాతీయ పెట్టుబడిదారులు ఒక ప్రత్యేక సినిమా పరిశ్రమని నెలకొల్పాలని ప్రయత్నించారు. కాని అది సాధ్యం కాలెదు. చాంగ్‌కై షేక్ నాయకత్వంలో పెద్ద భూస్వాములు పెట్టుబడిదారులు విప్లవాన్ని వెన్నుపోటు పొడిచారు. ప్రత్యేక ప్రతిపత్తి కోసం పాటుపడుదామనుకున్న జాతీయ పెట్టుబడిదారులు నిలద్రొక్కుకోలేక అభివృద్ధి నిరోధకులలో, రియాక్షనరీలలో చేరిపోయారు.

ఈ దశలో 1895లో “వర్కర్స్ లీవింగ్ ది ఫాక్టరీ” అనే చిన్న చిత్రం మొదటగా వచ్చింది. బీజింగ్, షాంగాయ్, టైన్‌జిన్ పట్టణాల్లో సినిమా ప్రదర్శనశాలలు ఏర్పాటయ్యాయి. నాటక ఫక్కీతో చిత్ర నిర్మాణం ప్రారంభమయింది.

జెంగ్ జెంగ్కీ 1913లో మొదటిసారిగా పెద్ద ఎత్తున మొదటి కథాచిత్రం నిర్మించాడు. ఇతణ్ణి చైనా సినిమా పితామహుడిగా చెబుతారు. ఇతను తీసిన “డిఫికల్ట్ పీపుల్” చిత్రం విముక్తి పోరాటానికి ముందే అదృశ్యమైంది.

ఆ తరువాత జాపనీ, అమెరికా కంపెనీల సహకారంతో ఫక్తు వినోద చిత్రాల వ్యాపారం ప్రారంభమైంది. చైనా ఒపేరా ప్రక్రియనే చిత్రాలుగా తీసారు. చైనా దేశం “గాన” ప్రధానమైంది. ఈ లక్షణం నాటి చిత్రాల్లో సైతం ప్రతిబింబిస్తుంది. సకయు, షెన్‌జిలిన్ ఈ చిత్రాలు తీసిన వారిలో ప్రముఖులు.

హాస్య విషాద చిత్రాలు కూడా చెప్పుకోదగిన విధంగా వచ్చాయి. ఇందులో లాస్ లాంబ్ చెప్పుకోదగింది. వీధి అనాధలను కథా వస్తువుగా ఒక చిత్రం తీశారు. ఈ దశలో పేద ప్రజలను ప్రధానంగా చేసుకొన్నారు.

రెండవ దశ :

1931 నుండి 1937 వరకు, ఈ దశలో అభివృద్ధి నిరోధకుల విషవలయంలోంచి తప్పించుకున్న సినిమా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కింద విప్లవ సినిమాగా ప్రారంభమైంది. కాని ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యింది. సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్య విధానాన్ని, పెట్టుబడిదారీతత్వాన్ని (Beurocratic Capitalism ) వ్యతిరేకించే ప్రజా విప్లవ సినిమాలు, కొమింటాన్ ప్రతిఘాతమైన అభివృద్ధి నిరోధక సినిమాలకి బలంగా ఎదురు నిల్చాయి. పార్టీ నాయకత్వం చైనా సినిమాకి కొత్త ఊపిరిపోసి కొత్త జీవితాన్ని ఇచ్చింది. 1930-40 మధ్యన కొమింటాంగ్ ఆధీన ప్రాంతంలో [Along the Sangarl River మొ.) సామాజిక స్పృహతో సినిమాలు తీయబడ్డాయి. 1931లో చైనా కమ్యూనిస్తు పార్టీ మార్గ దర్శకత్వంలో దాని ప్రభావంతో షాంఘై తదితర ప్రాంతాల్లో అభ్యుదయకరమయిన చిత్రాలు తీసారు.

లేనోవా స్టూడియో తీసిన చిత్రాల్లో కొత్తదనం నిండి ఉంది. 1933లో జియాన్ (Sia yan), ఇతర విప్లవకారుల ప్రవేశంతో మంచి చిత్రాలు వచ్చాయి. ఈ స్టూడియోకి అనుబంధంగానే “The film group of the communist party” ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడిన ఐదేళ్లలో ఎన్నో మంచి చిత్రాలకు ఊపిరి పోశారు. జాపాన్ ప్రతిఘటనా పోరాటం ప్రారంభమయ్యాక ఈ రకం చిత్ర నిర్మాణం ఆగిపోయింది.

మవో జన్ రాసిన “స్ప్రింగ్ సిల్క్‌ వామ్స్” అనే నవలని Xia yan వాస్తవిక వాద చిత్రంగా తీశాడు. ఈ చిత్రం వాస్తవిక చిత్రాలకు నాంది పలికింది.

కాయ్ చూషెండ్ మొదట కొన్ని చిత్రాలు తీసాడు. తరువాత వామపక్ష దర్శకునిగా మారాడు. లాంబ్ ఏస్ట్రే , సాంగ్ ఆఫ్ ఫిషర్ మెన్ అనే ఇతని చిత్రాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి.

మూడవదశ:

1937 నుంచి 1949 వరకు, అది జపాన్ వ్యతిరేక యుద్ధం, విముక్తి యుద్ధం జరుగుతున్న సమయం. కొమింటాంగ్ ప్రాంతంలో కొమింగ్ టాంగ్ ఏకాధికారానికి, దురాగతాలకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో విప్లవ సినిమా ఉద్యమం కూడా అభివృద్ధి చెందింది. 1938 తరువాత యెనాన్‌లోను ఇతర విప్లవస్థావరాలలోనూ ప్రజల సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. అభ్యుదయ సినిమా ఉద్యమం కొమింటాంగు పరిసర ప్రాంతాల్లోనే కాక హాంగ్‌కాంగ్‌లో కూడా బలపడింది.

1938 లో విముక్త ప్రాంతాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో యెనాన్ సినిమా గ్రూపు అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ జపాను సామ్రాజ్యవాదులతో యుద్ధం తదితర స్వేచ్చా పోరాటాలను విలువయిన డాక్యుమెంటరీలుగా చిత్రీకరించింది. అదే సంవత్సరం జోరిస్ ఐవెన్స్, ఎర్నిస్ట్ హెమింగ్వే, లీలియన్ హెల్మెన్ మొదలగువారు స్పెయిన్ అంతర్యుద్ధాన్ని సమర్ధించారు. జోరిన్ ఐవెన్స్ స్పెయిన్ యుద్ధకాలంలోనే అక్కడికి వెళ్లి ఫాసిజాన్ని ఎదిరించిన ప్రజల చరిత్రని “స్పానిష్ ఎర్త్ ” గా ఒక పూర్తి నిడివి డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు. ఇది అతని మొట్టమొదటి యుద్ధచిత్రం. ఈ చిత్రానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. “స్పానిష్ ఎర్త్ ” సినిమా ప్రదర్శించిన డబ్బుతో, పోరాడుతున్న చైనా ప్రజలకు మందులు, దుస్తులు కొని పంపారు.

మళ్లీ అదే 1938లో జపాన్ సామ్రాజ్యవాదులు చైనాపై దండెత్తారు. చైనా ప్రజల పోరాటాన్ని సమర్ధిస్తూ హాంకాంగ్ మీదుగా జోరిస్ హాంకూ వెళ్లాడు. తన వెంట జాన్ ఫెర్నోని, రాబర్టు కాపను తీసుకువెళ్లాడు. జపాను నిరంకుశ దాడికి వ్యతిరేకంగా పోరాడే చైనా ప్రజలు పోరాటాన్ని “400 మిలియన్ ” చిత్రంగా నిర్మించాడు. జాన్‌ఫెర్నో డచ్ దేశస్తుడు. జోరిస్‌కు విద్యార్థి. ఆయన్ అ”స్పానిష్ ఎర్త్ ” కు చాయాగ్రాహకుడుగా పనిచేశాడు. రాబర్ట్ కాపా హంగరీ దేశస్థుడు. తూర్పు యూరపులో మంచి పేరున్న చాయాగ్రహకుడు. స్పానిష్ అంతర్యుద్ధంలో ధైర్యంగా తిరిగి ఎంతో విలువయిన ఫోటోల్ని తీయగలిగాడు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో జోరిస్ ఐవెన్స్ హాంకాంగ్, కొమింటాంగులో ఉంటూ ప్రజా పోరాటాల గురించి సమాచారం సేకరించాడు. యుద్ధరంగానికి వెళ్లి (Taler Zuang), షాడోంగ్‌ని (Shadang) _ తిరిగి వశం చేసుకునే పోరాటాన్ని చిత్రీకరించాడు. “హాంకూ”లో మొదటిసారిగా చౌ ఎన్ లైన్ ని కలిశాడు. ఎయిత్ రూట్ ఆర్మీ యొక్క అతి ముఖ్యమయిన మిలటరీ సమావేశాన్ని చిత్రీకరించాడు. యెనాన్ స్థావరానికి వెళ్లాలని చాలా ప్రయత్నించాడు. కాని వెళ్లలేకపోయాడు. జియాన్‌లో జరిగిన ఎన్నో జపానీ వ్యతిరేక ప్రజా ప్రదర్శనలను దృశ్యీకరించాడు. అవన్నీ ఆనాటి ప్రజల సాహసానికి చిహ్నంగా నిలచిపోయాయి.

జూరిస్ ఐవెన్స్ తనదగ్గర ఉన్న మూవీ కెమెరా కొన్నివేల ఫీట్ల నిడివిగల ముడిఫిలింని చౌ్ఎన్‌లై జియాన్ యింగ్ మొ.. వారి ద్వారా యెవాన్ విప్లవకారులకు కానుకగా ఇచ్చాడు. ఇదె యెనాన్ ఫిలిం గ్రూపుకు లభించిన మొదటి స్వంత మూవీ కెమెరా. ఇప్పటికీ ఇది చైనా విప్లవ చరిత్ర ప్రదర్శనశాలలో భద్రం చేయబడి ఉంది. ఈ కెమెరాతోనే మొదటిసారిగా ఎనాన్ ఫిలిం గ్రూపువారు మావో, చౌ్ఎన్‌లై, చూటే మొ.. వాళ్లు విప్లవ కార్య నిమగ్నతతో ఉన్నప్పుడు చిత్రంగా తీసారు. అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీ ఏడో కాంగ్రేసు సమావేశాన్ని కూడ చిత్రీకరించారు. జోరిస్ ఐవెన్స్ చైనాలో ఉన్న కాలంలో మేటం సన్‌యెట్‌సన్, చౌ్ఎన్‌లై, వాంగు బింగునాన్ మొ…నాయకులను గువామోరా అనే చిత్ర నిర్మాత, తరచుగా కలుసుకుంటూ విప్లవ పరిస్థితుల్ని చర్చించేవాడు.

జోరిస్ ఐవాన్స్ 1938 జూన్ లో చైనా గ్రేట్ వాల్‌ని చిత్రీకరించాలని జియన్ ప్రాంతం వెళ్ళాడు. అక్కడినుండి యెనాన్ వెళ్లి విముక్త ప్రాంతంలోని దృశ్యాలను చిత్రీకరించాలనుకున్న్నాడు. యెనాన్ స్థావరానికి వెళ్లడానికి రహస్యంగా రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాని చాంగుకై షేక్ ప్రభుత్వం వీలుపడనివ్వలేదు. గెరిల్లా వీరుల దళాల సహాయంతో కేవలం ఆ ప్రాంతాన్ని దూరం నుండి చూడటం మాత్రం జరిగింది. లాన్‌జి్‌లో గ్రేట్ వాల్ చిత్రీకరించడం అనువుగా వుంటుందని అక్కడకు వెళ్లాడు. అప్పటికి గ్రేట్ వాల్ మొత్తం శిధిలమై వుంది. చైన అభూస్వామ్యాధికారం క్షీణించిపోతుందనటానికి సంకేతంగా జూరిస్ ఐవెన్స్ తన చిత్రాల్లో ఈ శిధిలాలలను ఉపయోగించుకున్నాడు. కామ్రేడ్ గూవామోరా జపాన్ వ్యతిరేక యుద్ధనిధి ప్రజల నుండి తీసుకొంటూ ఉపన్యసిస్తున్న దృశ్యాన్ని, ప్రజలు తమ ఆభరణాల్ని ఉదారంగా ఇస్తున్న దృశ్యాల్ని అజ్ఞాతంగా మరణించిన వీరుల సమాధుల ఎదుట అవనతులయిన ప్రజల్ని చిత్రీకరించాడు. కాంటన్‌లో జపాన్ కురిపించే బాంబుల వర్షంలో అమాయక ప్రజల మరణాల్ని చరిత్రకి సాక్ష్యంగా నిలిపాడు.

కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకుల ఫోటోలు అందుబాటులో లేవు. తనని యెనాన్‌కి వెళ్ళనివ్వలేదు. ఈ విషయం చౌ్ఎన్‌లైకి చెప్పగా ఒకరోజుచైనా కమ్యూనిస్టు పార్టీ కర్యకర్తల సహాంతో మరోచోట జరిగే ఒక సమావేశానికి తీసుకుపోయారు. అక్కడ మిలటరీ సమస్యల మీద చర్చించే చౌ్ఎన్‌లై, యేజియాన్‌యింగ్, లిన్ బాకు మొదలగువారిని చిత్రీకరించడం జరిగింది.

ఎయిత్‌రూట్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ చూటే యెనాన్‌లోనే ఒక ప్రధానమైన స్థవరం దగ్గర ఉన్నప్పుడు ఒక అమెరికా జర్నలిస్టు కొంత ఫిలిం తీశాడు. ఆ దృశ్యాన్ని జోరిస్ ఐవెన్స్ తన చిత్రంలో వాడుకున్నాడు. ఈ దృశ్యం పక్కనే “కొమింటాంగులో చాంగ్‌కై షేకు మిలటరీ సమావేశంలో మాట్లాడుతుంటాడు. అయినా వారి అసహనం అలాగే ఉంటుంది. ఇక్కడ జనరల్ చూటే మాత్రం, నిదానంగా, నిబ్బరంతో ఆలోచిస్తుంటాడు. ఈ దృశ్యాలను పక్క పక్కనే జతచేయడం వలన యుద్ధ నియంతలు, భయవిహ్వలులైనట్టు కనిపించింది. ఈ దృశ్యాల కారణంగా “400 మిలియన్” చిత్రాన్ని చాంగ్ కై షేకు ప్రభుత్వం చైనాలో నిషేధించింది.

కొమింటాంగ్ రియాక్షనరీలు జోరిస్ ఐవెన్స్‌ని యెనాన్ ప్రాంతానికి వెళ్లనివ్వకుండా నిరోధించారు. కాని అతని ఆయుధం (కెమెరా) అక్కడకు వెళ్లింది. జోరిస్ తీయాలనుకున్న దృశ్యాలను యెనాన్ సినిమా గ్రూపు తీసింది. జోరిస్ ఇచ్చిన మూవీ కెమెరాలో యెనాన్ కమ్యూనిస్టు సినిమా గ్రూపు. చైనా ప్రజల విముక్తి సైన్యాల సాహసాలను చిత్రీకరించాడు. ఒక చాయాగ్రహకుడు రైతువేషంలో కెమెరాని దాచుకుని శత్రు శిబిరంలోకి వెళ్లి ఎన్నో దృశ్యాలను తీసుకువచ్చాడు.

కొమింటాంగులో ఫాసిస్టులు జోరిస్ లాంటి చిత్రనిర్మాతలకు ఎన్నో అడ్డంకులు కలిగించారు. తమ అనుమానం, భయంవల్ల వారి వెంట ఎప్పుడూ వెంటాడే గూడచారులను నియమించారు. అనుమానంగా తోచిన ఫోటోలను, ఫిలిం భాగాలను లాక్కున్నారు. అయినా వారు తమ ప్రయత్నాలను మానుకోలేదు.

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకొని చైనా ప్రజల వీరోచిత పోరాటాన్ని ప్రపంచ ప్రజల కళ్లెదుట నిలబెట్టారు. అప్పుడు తీసిన సినిమా “1948 లో చైనా” పేరుతో 1939 లో చిత్రంగా విడుదల అయింది. అభ్యుదయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వివిధ దేశాల్లోని ప్రజాతంత్రవాదులు చైనా ప్రజల మహత్తర పోరాటాన్ని చూసి ఉత్తేజితులయ్యే అవకాశం కలిగింది.

దౌర్జన్యం, అణచివేతలోంచి షాంఘయిలో రహస్య సినిమా కార్యకలాపాలు జరిగాయి. సెన్సార్ వాళ్లను మాయచేసి వాళ్లు ప్రమాదకరంగా భావించే సంభాషణలను, అంశాలను సినిమాలో పెట్టడానికి సినిమాకథని చాలా తెలివిగా అల్లేవాళ్లు. నిషేధింపబడిన విషయాలను పాటరూపంగా గానీ, ఒక్కోసారి చిన్నపిల్లల మాటల్లోగాని సెన్సారు వాళ్లకు అందకుండా రూపొందించేవాళ్లు.

ఎంత జగ్రత్తగా ఉన్నా ఎన్నిఉపాయాలు పన్నినా జైళ్లు ఉరికంబాలు నోళ్ళు తెరుచుకుని ఉండేవి. సెన్సారు నిబంధనలు కఠినంగా ఉండేవి. ఏ మాత్రం అనుమానంగా తోచినా అడుగడుగునా గండాలే. సెన్సారు ఆఫీసు చుట్టూ తిరుగుతూ, లంచాలతో జోలపాటలు పాడాల్సి వచ్చేది. ఐతే ఒకటి మాత్రం నిజం. విప్లవానికి పూర్వం ఏ దేశంలోనయినా వెలువడే విప్లవ చిత్రాలకు చైనా సినిమా తీసిపోని విధంగా వచ్చింది. నాజీ పాలకుల చెతుల్లో ఉన్న జర్మనీలో కమ్యూనిస్టులు తీసిన జర్మనీ సినిమాల భావ ప్రచారం కన్నా ఏ విధంగా చూసినా చైనా సినిమా అంతకన్న ఎక్కువే ముందంజ వేసింది. రహస్యంగా షాంఘయిలో తీసిన సినిమాలు ప్రజావిప్లవ పోరాట దశలను తెలియజేస్తాయి. వాస్తవ పరిస్థితిని చాటుతాయి. ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. చైనా సినిమా చరిత్రలో ఇదొక ముఖ్యమైన ఘట్టం.

చైనాలో విప్లవ సినిమా అభివృద్ధి చెందినంతగా విప్లవ సినిమా విమర్శ అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ లోపాన్ని ఆ తర్వాత చైనా మేధావులు గుర్తించడం జరిగింది.