Menu

సహజమైన ప్రేమకథ- విన్నైతాండి వరువాయా -will you cross the skies for me? (తమిళ్)

సింబు (సిలబరసన్) కథానాయకుడిగా గౌతమ్ మీనన్ చిత్రమనగానే అదొక స్టైలిష్ యాక్షన్ సినిమా ఏమో అనుకోవడం సహజం. కానీ ఈ ఇద్దరూ ఒక ప్రేమకథ కోసం ఒకటయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గౌతమ్ మీనన్ సినిమాల్లో (కాకా-కాకా, వెట్టయాడు విలయాడు, వరణం ఆయిరం)ని ప్రేమకథలు ఎప్పుడూ హృద్యంగానే ఉంటాయి. కాబట్టి తను పూర్తిస్థాయి ప్రేమకథ చెయ్యడం వింతకాదు. కానీ సింబుకు తమిళ్ సినిమాలో ఉన్న ఇమేజ్ లవర్ బాయ్ కన్నా ఒక మాస్ హీరోగానే ఎక్కువ. తనూ సొంతంగా దర్శకత్వం వహించినా అలాంటి చిత్రాలతోనే సరిపెట్టాడు. మరలాంటిది ఇదేమిటి? అని ప్రశ్నించుకునే ప్రేక్షకుడ్ని ఉక్కిరిబిక్కిరిచేసి ప్రేమింపజేసే సినిమా ‘విన్నైతాండి వరువాయా’

వ్యాలెంటైన్స్ డే బహుమతిగా రిలీజైన సినిమా అర్బన్ ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కథాపరంగా చూస్తే అన్ని ప్రేమకథలూ ఒక్కటే అన్నట్లు ఇక్కడా పెద్ద వైవిధ్యమేమీ ఉండదు. ఒక అమ్మాయి – ఒక అబ్బాయి- ప్రేమ- తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం- గొడవలు- విడిపోవడం – మళ్ళీ కలవడం ఇంతే కథ. కానీ గౌతమ్ మీనన్ కథనం. నటీనటుల నటన, సహజమైన సంభాషణలు, అద్భుతమైన చిత్రీకరణ ఆ సాధారణమైన కథను ఒక అనుభవంగా చేసి ప్రేక్షకులను ప్రేమికులుగా చేస్తాయి.

22 సంవతసరాల కార్తీక్ ఇంజనీరింగ్ చదివి సినిమా డైరెక్టర్ అవ్వాలుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నిస్తుంటాడు. జెస్సీ (త్రిషా కృష్ణన్) తన జీవితంలోకి కలలాగా వస్తుంది.జెస్సీ కార్తీక్ కన్నా రెండుసంవత్సరాలు పెద్ద. మొదటి చూపులో ప్రేమిస్తాడు. రెండో కలయికలో ఆపుకోలేక తనని ప్రేమిస్తునాను అని చెప్పేస్తాడు. తరువాత సారీ చెప్పడానికి కేరళా ప్రయాణమౌతాడు. స్నేహితులుగా ఉందామంటుంది జెస్సీ. స్నేహం చేస్తారు. తిరుగుప్రయాణంలో మళ్ళీ ప్రేమిస్తాడు (literally) కార్తీక్. ఈ ప్రేమ అనుభవాన్ని కాదనుకోలేకుండానే నాన్నకోరిక కోసం కార్తీక్ ప్రేమను దూరం చేసుకోవాలని జెస్సీ విఫల ప్రయత్నం చేస్తుంది. ఈ మీమాంశల మధ్య జెస్సీ కార్తీక్ కు (ఇటు ప్రేక్షకులకూ) ఒక పజిల్ లాగా అనిపిస్తుంది. ఈ ఇద్దరి ప్రేమా చివరకు ఏమయ్యింది? కార్తీక్ దర్శకుడయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ప్రేమించిన అందరికీ ఈ చిత్రంలోని దృశ్యాలు మన జీవితాల్లోంచీ వచ్చాయేమో అనిపించక మానవు. అందుకే బహుశా ఇది దర్శకుడు గౌతమ్ మీనన్ ఆత్మకథేమో అనే సందేహం వస్తుంది.సింబు నటనలో ఈజ్ తోపాటూ ఒక స్థిరత్వం కనబడుతుంది. యాభైమందిని అలవోకగా పడగొట్టే అతని మాస్ చిత్రాలకన్నా ఈ చిత్రంలో తను ప్రదర్శించిన నటనలోని పరిణితి వెయ్యిరెట్లు ఎక్కువ. ప్రతి ఫ్రేములోనూ టైట్ క్లోజప్పులోకూడా కార్తీక్ కనిపిస్తాడే తప్ప సింబు కనిపించడు. ఈ చిత్రం సింబు కెరీర్ లో నిలిచిపోతుంది. త్రిష ఈ మధ్య తెలుగులో అగ్రహీరోల సరసన కనిపించడం వలన తన అసలు వయసు తక్కువనే భావన మనమధ్యలేదు. ఈ సినిమాలో జెస్సీగా 24 ఏళ్ళవయసున్న పాత్ర చేసినా ఇప్పుడే టీనేజ్ దాటిన అమ్మాయిలాగా అనిపిస్తుంది. కొత్తనటిలాగా అనిపించే ఫ్రెష్ నెస్ ఈ చిత్రంలోకి త్రిష తీసుకొచ్చింది. త్రిష పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి కి చాలావరకూ క్రెడిట్ వెళ్ళాలని చెప్పకతప్పదు.

కార్తీక్ పాత్రకన్నా జెస్సీ పాత్ర ఈ చిత్రంలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. “అవునంటే కాదనిలే కాదంటే ఔననిలే… ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే” అనే పాటను నిజంచేసేదిలాగా ఈ పాత్ర ప్రర్తిస్తూ ఉంటుంది. సహజసిద్ధమైన బిడియం, చంచలత్వం, ప్రేమను కాదనలేని బలహీనత, కార్తీక్ ను బలంగా ప్రేమించగలిగే శక్తి, తండ్రిని కాదనలేని నిస్సహాయత ఈ అన్ని భావనలమధ్య తమ ప్రేమే పెద్ద సమస్య అనుకునే సందేహం, తనను ప్రేమించడం వల్లే కార్తీక్ జీవితంలో సమస్యలొచ్చాయనే న్యూనత, ఈ సమస్యలన్నింటి మధ్యా అసలు ప్రేమించాలా అనే ధర్మసందేహం. వీటన్నింటినీ త్రిషా చాలా సమర్థవంతమైన నటనతో పోషించింది. ఇతర నటీనటుల్లో చెప్పుకోతగ్గది ఇప్పటిరకూ గౌతమ్ మీనన్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తూవచ్చిన గణేష్ ది. హీరో స్నేహితుడిగా నటనకు కొత్తవాడైనా చాలా బాగా చేశాడు.

ఈ సినిమాని ఒక కావ్యం చేసేది గౌతమ్ మీనన్ రచనైతే దృశ్యకావ్యం చేసింది మాత్రం సినెమాటోగ్రఫర్ మనోజ్ పరమహంస అని చెప్పుకోవచ్చు. నటీనటుల నటనను కెమెరాతో బంధించడం నుంఛీ కేరళ,గోవా,చెన్నై,అమెరికా అందాల్ని ఆవిష్కరించిన తీరు వరకూ అన్నీ అత్యద్భుతం. ఎడిటింగ్ చాలా బాగుంది. రెహమాన్ సంగీతం బాగున్నా చిత్రాన్ని మరింతగా ఎలివేట్ చెయ్యడంలో పెద్దగా సహాయపడలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా నేపధ్యసంగీతం మరింత మెరుగ్గా ఉండే అవకాశం  కనిపించింది.సంభాషణలు  సహజంగా ఉన్నాయి. అందుకే కొంచెం ఇంగ్లీషు ఉపయోగం ఎక్కువయ్యింది. కార్తీక్ పాత్ర ఈ చిత్రంలో యధేచ్చగావాడే ఇంగ్లీషు బూతులు తమిళ్ లో అయితే కత్తెరకు గురయ్యేవి.  I want to make love to you forever లాంటి భావప్రకటనలు బహుశా ఇంగ్లీషులో ఉండటమే మంచిదేమో!

చిత్రం ప్రధమార్థం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నా ద్వితీయార్థంలో సాగతీత కనిపిస్తుంది. అప్పుడప్పుడూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ self indulgence అక్కడక్కడా మితిమీరిన భావన వస్తుంది. క్లైమాక్స్ కు వచ్చేసరికీ సహజత్వానికీ సినెమాటిక్ సహజత్వానికీ మధ్యనున్న తేడాని గౌతమ్ పక్కనపెట్టి డ్రమాటిక్ ఇంపాక్ట్ తీసుకురాలేక నిరాశపరిచాడు అనిపిస్తుంది.  “నాకోసం ఆకాశాన్ని దాటివస్తావా” అనే సినిమా శీర్షికను జస్టిఫై చెయ్యదగిన అవకాశం ఉండికూడా ఒక పేలవమైన పతాకదృశ్యంతో సినిమాని క్లైమాక్స్ కు తీసుకురావడం, ఆ తరువాత మళ్ళీ సాధారణజీవితాల్లోకి నాయికా-నాయికల్ని తీసుకురావడం కొంత వెలితిగా అనిపిస్తాయి. కానీ నిజ జీవితంలో ప్రేమకథలు ఇలాగే ఉంటాయి కాబట్టి సినెమాటిక్ సహజత్వాన్ని ఆశించడం మనతప్పేమో తెలీదు.

మొత్తానికి ప్రేమను అనుభవించినవాళ్ళు, ప్రేమికులు, రొమాంటిక్ ప్రేమని తమ జీవితంలో ఆశించేవాళ్ళు అందరూ చూడాల్సిన చిత్రం. అక్కడక్కడా బోర్ కొట్టినా ఒక అందమై అనుభవాన్ని మాత్రం ఖచ్చితంగా అందించే చిత్రం.

45 Comments
 1. అభిమాని February 27, 2010 /
 2. సూది February 27, 2010 /
   • Uttara March 8, 2010 /
 3. chandritha February 27, 2010 /
 4. నాగప్రసాద్ February 27, 2010 /
 5. rAsEgA February 27, 2010 /
  • GopiCM March 1, 2010 /
   • veeru March 1, 2010 /
   • rAsEgA March 1, 2010 /
   • veeru March 1, 2010 /
   • rAsEgA March 3, 2010 /
   • ramgopal August 15, 2010 /
 6. zulu March 1, 2010 /
  • Aditya March 7, 2010 /
   • zulu March 8, 2010 /
   • Aditya March 10, 2010 /
 7. V. Chowdary Jampala March 2, 2010 /
   • ramu March 2, 2010 /
   • Harsha April 26, 2010 /
   • tt August 14, 2010 /
 8. ramu March 2, 2010 /
 9. Sri March 4, 2010 /
 10. Murali Krishna March 6, 2010 /
 11. rahul March 6, 2010 /
 12. Uttara March 8, 2010 /
  • Yogi March 9, 2010 /
 13. Nagendra March 9, 2010 /
 14. ratnakar March 14, 2010 /
 15. GopiCM March 14, 2010 /
 16. Venugopal March 27, 2010 /
 17. Srinivas Komanapalli April 28, 2010 /
 18. Sowmya August 14, 2010 /
 19. geethoo August 15, 2010 /
   • geethoo August 15, 2010 /
 20. Nagarjuna August 16, 2010 /