Menu

“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం

వాడికి చికెన్ అంటే చాలా ఇష్టమండి…అస్సలు వాడ్ని మర్చిపోలేకపోతున్నాం…ఎప్పుడూ మా వెనకే తిరిగేవాడు.అంటూ ఒక్కసారిగా గొల్లుమంది ఆవిడ. టీవీ పెట్టుకుని వేరే పని చేసుకుంటున్న నేను ఆ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసా..ఆవిడ కళ్ళల్లో నీళ్ళు..ప్రక్కనే ఓ ఫొటో,అగరొత్తులు వగైరా. పాపం ఏ కొడుకో చిన్న వయిస్సులోనే చచ్చిపోయింటాడు అనుకుని ఎలర్టయి చూస్తే…ఫొటోలో క్లోజప్ లో దర్జాగా ఓ కుక్క నిలబడి ఉంది. షాకయ్యా…మనిషికి జంతువులంటే ఎంత ప్రేమ.కన్న బిడ్డలను సాకినట్లే సాకుతారు అనుకుంటూంటే టింగ్యా గుర్తుకు వచ్చింది. ఆస్కార్ ఎంపికకు ఇండిపెండింట్ ఎంట్రీగా నామినేట్ అయ్యిందని డీవిడీ తెప్పించటం జరిగింది. వెంటనే రాత్రి వెళ్ళి చూసా..

‘టింగ్యా’ ఓ మరాఠి సినిమా. తన ఇంట్లో ఉన్న ఎద్దు పై ఓ ఎనిమిదేళ్ళ పిల్లవాడు పెంచుకున్న మమకారాన్ని,మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యల నేపద్యంలో చిత్రీకరించిన చిత్రం అది. టింగ్యా తండ్రి కారబారి ఓ సన్నకారు రైతు. పాక్షిక నిరుద్యోగం వ్యవసాయంలో కామన్ కాబట్టి పండినప్పుడే పని,పుడ్డు ఉంటాయని తెల్సుకుని చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకొస్తూంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు టింగ్యా పుట్టిన రెండు నెలలకు చిట్యాంగా అనే మగ దూడ పుడుతుంది. దాన్ని మూడో కొడుకులా భావించి సాకుతూంటాడు. ఈలోగా మన టింగ్యాకి,చిట్యాంగాకి స్నేహం కలుస్తుంది. ఇద్దరూ ఆడుకుంటూంటారు. దాని ఫేస్ ని అద్దంలో చూపెడుతూంటాడు. తను బడిలో నేర్చుకున్న పాఠాలు పలకపై రాసి దానికి చూపెడుతూంటాడు. అలాగే దానికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు. ఓ రోజు అది నూతిలో పడిపోతే నానా అల్లరి చేసి పైకి తీసే దాకా ఊరుకోడు. అది ఓ రోజు దారి తప్పి ఇంటికి రాకపోతే వెతుక్కుంటూ రాత్రి పూట భయం లేకుండా వెళ్ళిపోతాడు. ఆరేళ్ళు అలా ఇద్దరూ కలిసే గంతులేస్తారు..తిండి తింటారు.. అరుస్తారు..పరుగెడతారు. ఈ లోగా చిట్యాంగా దూడ నుంచి ఎద్దు గా మారి ఆ కుటుంబ భారాన్ని మోయటానికి రెడీ అవుతుంది. ఇలా ఆ అనుబంధం అద్బుతంగా కొనసాగుతూంటే…అనుకోని అవాంతరం వచ్చి పడుతుంది.

పొలం పనులు(బంగాళ దుంప సాగు)కోసం దుక్కి దున్నుతూంటే గోతిలో పడిపోతుంది.కాలు మడతపడిపోతుంది. ఎందరు వచ్చినా లేవతీయలేకపోతారు. చివరకు ఎలాగో తీసినా దానికి మునపటి ఓపిక ఉండదు. వ్యవసాయదారులకు కాలం ముఖ్యం. టైమ్ కి ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాలి. కుంటు పడిన ఎద్దుతో జీవనం కుంటు పడటానికి వీల్లేదు. అలాగని వైద్యం చేయించే శక్తి ఉండదు. అలా దీనంగా ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో టింగ్యా తండ్రి ఆలోచనలో పడతాడు. ఈ లోగా టింగ్యా ప్రక్కింటి ప్రెండ్ నాయనమ్మ కి అనారోగ్యం చేస్తుంది. వాళ్ళు డాక్టర్ ని తీసుకొచ్చి చూపెడతారు. అది తెలుసుకున్న టింగ్యా మరుసటి రోజు బడి ఎగ్గొట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎడ్రస్ తెలియని ఆ డాక్టర్ ని వెతుక్కుంటూ బయిలు దేరతాడు.చివరకు ప్రక్కనున్న టౌన్ లో ఉన్న ఆ డాక్టర్ ని కలసి మా చిటింగ్యాకి ఒంట్లో బాగోలేదు రమ్మని అంటాడు. ఆయన రేపు వస్తానంటాడు. అప్పటి దాకా అది బ్రతకదు అంటాడు. ఆయన షాకయ్యి ఎంత వయిస్సు ఉంటుంది. ఏం జరిగింది అంటాడు.అప్పుడు బోధపడుతుంది ఆ డాక్టర్ కి టింగ్యా అంటే ఎద్దు అని.

సరే నని మరుసటి రోజు పశువుల డాక్టర్ ని టింగ్యా ఇంటికి పంపుతాడు. అయితే టింగ్యా తండ్రి దగ్గర డబ్బులేదు. డాక్టర్ ఫీజ్ కయినా,వైద్యానికయినా. దాంతో ఆయన ఎద్దుని ముట్టుకోవటానికి కూడా ఆ డాక్టర్ కి ఫర్మిషన్ ఇవ్వడు. ఆ స్ధితిలో కొడుకు వేదన గమనించిన టింగ్యా తల్లి సర్ది చెప్పి డాక్టర్ ని చెక్ చెయ్యమని చెప్తుంది. ఆ డాక్టర్ టెస్ట్ చేసి కాలు బాగవటం కష్టమని తేల్చేస్తాడు. దాంతో టింగ్యా తండ్రి ఆ ఎద్దుని కసాయివాడికి అమ్మేసి,వచ్చిన డబ్బుకి మరికొంత వేసి వేరే ఎద్దుని కొందామనే నిర్ణయానికొస్తాడు. దానికి ససిమేరా ఒప్పుకోడు టింగ్యా. ఏడుస్తాడు …మొత్తుకుంటాడు…అలుగుతాడు…శాయిశక్తులా పోరాడతాడు. అయితే తండ్రి ఏ టాక్టర్ అన్నా సంపాదించి పని కానిద్దామనుకుని తన చెల్లి ఇంటికి వెళ్ళతాడు. కాని అక్కడా మొండి చెయ్యే కనపడుతుంది. ఓ ప్రక్కన తీర్చాల్సిన అప్పులు కళ్ళెదురుగా…మరో ప్రక్క కొడుకు. వీటిన్నటికీ తోడు మహారాష్ట్రలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న భయంకర వ్యవసాయ సంక్షోభం. ఎటూ తేల్చుకోలేని స్ధితిలో తన నిర్ణయానికే కట్టుబడి ఉండాలని చూస్తాడు.అమలు పరుస్తాడు. ఆ స్ధితిలో టింగ్యా ఎలాంటి మానసిక ఆందోళన అనుభవించాడు..చివరకు ఎలాంటి స్వాంతన పొందాడన్నిది క్లైమాక్స్.

ఈ సినిమాని చూస్తూంటే 2001లో వచ్చిన చూరి సినిమా బాగా గుర్తు వచ్చింది.ఆ సినిమా ఓ కోడి పిల్లతో ఓ చిన్నారి అల్లుకున్న ప్రేమానుబంధం వివరిస్తుంది. అందులోనూ కోడిపిల్ల కాలు విరిగితే తన తాతను తీసుకుని హాస్పటిల్ కి వెళ్తుంది. రెండు రూపాయలు కూడా విలువచెయ్యని కోడిపిల్లకు యాభై రూపాయలు వైధ్యం చెయ్యాలా అని పెద్దలు అడిగితే ఏం మీ ప్రెండ్ కాలు విరిగితే నువ్వు బాగుచేయించవా..వదిలేస్తావా అని అమాయికంగా అడిగి పోరాడుతుంది. అలాగే కోడిపిల్లని మార్చేసి అలాంటిదే మరొకటి అదే ప్లేసులో పెడితే గుర్తుపట్టి…ఏం నా ప్రెండ్ ని గుర్తు పట్టలేనా అని అరుస్తుంది.అలా అదో అధ్బుతం అనుకోండి. ఐతే ఈ సినిమాలో మహారాష్ట్రలో ఉన్న రైతుల దారుణ పరిస్ధితులను ఈ కధ అడ్డం పెట్టుకని చెప్పటానికి దర్శకుడు ప్రయత్నించటం నాకు బాగా నచ్చింది. ఒక సీన్ లో టింగ్యా ప్రెండ్ అయిన ప్రక్కింటి పాప ని వాళ్ళమ్మ కొడుతుంది. ఆమె ఏడుస్తూ తన నానమ్మ దగ్గరకి వెళ్తుంది. ఆవిడ తన దగ్గరున్న డబ్బులు మనమరాలు కిచ్చి ఏదన్నా కొనుక్కోమని చెప్పు..కోడల్ని పిలిచి ఎందుకు కొట్టావని తిడుతుంది. అప్పుడు కోడలు అత్తయ్య గారు…మీ మనమరాలుని ఒట్టినే కొట్టలేదు. అది మన కోడికి ఉరేస్తోంది. అందుకే అలా చేసానంటుంది. అప్పుడు షాకయిన ఆ ముసలావిడ అదేంటి కోడిని చంపటమేంటని మనమరాలుని అడిగితే…టింగ్యా అలా చేసి ఆడుకుందామని చెప్పాడని చెప్తుంది. అంటే అక్కడ ఆత్మహత్యలు చాలా కామన్ అయ్యి పోయాయని,చివరకు పిల్లలు అమ్మా,నాన్న ఆట ఆడుకున్నట్లుగానే ఆత్మహత్యా ఆట ఆడుకునేంతలా వాళ్ళ పసి మనస్సులో రిజిస్టర్ అయి పోయిందని ఇండైరక్ట్ గా కథని చెప్పుతాడు.

ఇలా చాలా సీన్లు సినిమా అయిపోయాక మనని వెంబడిస్తాయి. అయితే కొన్ని చోట్ల మరీ మెలోడ్రామా విసిగిస్తుంది కూడా. ఎద్దుని తోలుకెళ్తుంటే అది కదలటం లేదని కొట్టడానికి బదులుగా టింగ్యా తన కాలుని తనే కొట్టుకోవటం వంటివి.

దర్శకుడు గురించి…

టింగ్యా చిత్రాన్ని మంగేష్ హడ్ వాలె(27)దర్శకత్వం వహించాడు. అతనికి ఈ సినిమానే మొదటి సినిమా. కథ ఫినిష్ చేసాక నిర్మాతని పట్టుకుని ఒప్పించటానికి అతనికి రెండేళ్ళు పట్టింది. ఎడతెగకుండా తిరిగి 41 మంది నిర్మాతలను కలిస్తే ఇది కార్య రూపం దాల్చింది. అందులో కొందరు కమర్షియల్ కాదని తిప్పికొడితే,మరికొందరు ఎద్దుకి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఫర్మిషన్ తేలేమని చేతులు ఎత్తేసారు. ఇంకొంతమంది అయితే కొంచెం ముందుకెళ్ళి ఊర్మిళా మండోర్కర్(రంగీళా ఫేమ్)ని టింగ్యా తల్లి పాత్రకు తీసుకుని,కథను మార్చి ఆమె చుట్టూ అల్లితే ప్రొడ్యూస్ చేస్తామన్నారు. అలాగే మరో నిర్మాత ఏకంగా టింగ్యా పాత్ర చివరలో సంతకెళ్ళినప్పుడు అక్కడ రాఖి సావంత్ ఐటం సాంగ్ పెడితే ఆలోచిస్తామన్నాడు. సుభాష్ గయ్ ముక్తా ఆర్ట్స్ వారిని సంప్రదిస్తే..వారు రీజనల్ సినిమాలు తీయనన్నారు(అఫ్ కోర్స్ ఇప్పుడు తీస్తున్నారు).అప్పుడు తన ప్రెండ్ పరిచయం చేసిన రవిరాయ్ అనే టీవీ నిర్మాత సాయంతో ఈ సినిమా పూర్తి చేసాడు. ఆయన కూడా మొదట హిందీలో తీస్తేనే నిర్మిస్తానన్నాడు. అయితే తమ సమస్యలు తమ భాషలోనే తీస్తేనే సులభంగా ఐడెంటిటి దొరుకుతుందని వాదించి గెలిచాడు. అయినా ఆ దర్శకుడు తనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం ముఖ్యంగా ఇంగ్లీష్ భాష సరిగ్గా రాకపోవటం ఇబ్బందిగా మారిందని,లేకపోతే కార్పోరేట్ సంస్ధలును సంప్రదించేవాడినని చెపుతున్నాడు.(ఇదంతా ఎందుకంటే ఓ మంచి కాన్సెప్ట్ ని అతను తెరకెక్కించటానికి ఎంత కష్టపడ్డాడు అనేది చెప్పటానికే). ఇక ఆర్టిస్టుల సెలక్షన్ లో టింగ్యా పాత్రకి గొర్రెల కాపరుల ఫ్యామిలీకి చెందిన పిల్లాడునే ఎంపిక చేసాడు. ఎందుకలా అంటే…వారికి జంతువుల మీద ప్రేమ రక్తంలోనే ఉంటుందంటాడు.

అలాగే పంటలు పండటం లేదంటూ వచ్చిన ఈ టింగ్యాకి అవార్డుల పంట బాగేనే పండింది.ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తారే జమీన్ పర్ చిత్రం పోటీ ఉన్నా జ్యూరి సభ్యుల క్రిటిక్స్ పురస్కారం పొందింది.ఇక ఈ సినిమాలో కెమెరా హైలెట్ గా ఉంటుంది. కుర్రాడి నటన బాగుంటుంది. కథ అక్కడక్కడా లాగ్ లు ఉన్నా సాఫీగానే వెళ్ళిపోతుంది. దర్శకత్వ విలువలు బాగానే ఉంటాయి. అయితే టెక్నికల్ గా ఆస్కార్ కి వెళ్తున్న చిత్రాల స్టాండర్డ్స్ లో మాత్రం ఉండదు. పబ్లిసిటీ కూడా అంతంత మాత్రమే. ఇక గవర్నమెంట్ సపోర్టు కూడా లేదు. ఇక ఈ ప్రాంతీయ భాషా చిత్రానికి అవార్డ్ వస్తే మాత్రం ఇప్పుడున్న సీన్ మొత్తం మారిపోతుంది.ఆ ఎఫెక్ట్ మిగతా రీజనల్ సినిమాలపై గ్యారింటీగా ప్రభావం చూపిస్తుంది. అందులోనూ ధైర్యం చేసిన ఆ చిత్ర నిర్మాతకు ఆర్ధిక వెసులబాటుకి బాగా తోర్పాటును అందిస్తుంది. మరిన్ని మంచి చిత్రాలకు అంకురార్పణ జరిగే అవకాశం ఇస్తుంది. మరి ఈ సారన్నా మన ప్రాంతీయ ప్రతిభా పరిమళం ప్రపంచ మార్కెట్ లో సువాసనలు వెదజల్లుతుందా…చూద్దాం.

8 Comments
  1. చావా కిరణ్ కుమూర్ November 30, 2008 /
  2. venkat December 1, 2008 /
  3. j.suryaprakash December 1, 2008 /
  4. మేడేపల్లి శేషు December 1, 2008 /
  5. విజయవర్ధన్ February 22, 2010 /
  6. మేడేపల్లి శేషు February 22, 2010 /
  7. basavara October 1, 2014 /