పాటల పారడీ

noise

ఎన్నో చిత్రాలు వస్తున్నాయి పోతున్నాయి. కొన్ని రోజులు తర్వాత కధలూ, సినిమా పేర్లు మర్చిపోతున్నాము. కాని మంచి పాటలను మాత్రం నెమరు వేస్తూనే ఉంటాము. కొన్ని పాటలు దశాబ్దాలు గడచినా కమ్మగా పాడుకుని ఆనంద పడతాము. ఆ అనుభూతే వేరుగా ఉంటుంది.

సలలిత రాగ సుధా(నర్తనశాల).. నీలీల పాడెద దేవా (మురిపించే మువ్వలు) వివాహ భోజనంబు (మాయాబజార్) ఇది మల్లెల వేళ యని (సుఖదుఖాలు) కళ్ళలోకళ్ళు పెట్టి చూడు (భలేమాష్టారు)మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ (రాము) గోదారి గట్టుంది (మూగమనసులు) ఓ బాటసారి ( బాటసారి) నా హృదయం లో నిదురించే చెలీ (ఆరాధన) నిలువవే వాలు కనుల దానా(??), మనసున మనసై (??)- ఇవి మచ్చుకి కొన్నిమాత్రమే. ప్రతి పాత సినిమాలో ను మంచి సంగీతం అందించాలనే తాపత్రయం ప్రతి ఒక్కరిలోను కనుపించేది. ముందుగా పాట రాసుకుని దానికి తగ్గ సంగీతం అందించేవారు. ప్రతి ఒక్క చరణం లోను ఒక భావుకత ఉట్టి పడాలని ప్రతి పాటల రచయిత ఉత్సుకత చూపించేవారు. సీను కు తగ్గ భావం భాష్యం సంగీతం తో పాటలు రక్తి కట్టేవి. ఒకవేళ పాట కమెడియన్ల మీద చిత్రీకరించినా దానికి తగ్గ సాహిత్యం సంగీతం ఉండేవి. అయెయొ చేతిలో డబ్బులు పోయెనే, డివ్వీ డివ్వీ డివ్వట్టం – ఈ కోవ లోకి వస్తాయి. ఇక అల్లరి పాటలు కావాలంటే మాఊళ్ళో ఒక పడుచుంది (అవేకళ్ళు) విన్నారా విన్నారా ఈ వింతను ..(సంబరాల రాంబాబు).. ఇలా ఎన్ని పాత సినిమాల గురించి అయినా మాట్లాడుకోవచ్చు. ప్రతి సినిమాలోనూ ఎన్నో మధుర గీతాలుండేవి. వాన పాటలకు వస్తే కురిసింది వాన.. నా గుండెలోన ..నీ చూపులే ఝల్లుగా, నిద్ర గురించి ఆలోచిస్తే నీలాలకన్నుల్లో మెలమెల్లగా నిదుర రావమ్మ.. ఇలా ప్రతి భావనకు కొన్ని మధుర గీతాలు నెమరు వేసుకోవచ్చు. వేణు, సత్యం, రమేష్ నాయుడు, సాలూరి రాజేశ్వరరావు, మహదేవన్, ఇళయరాజా ఇంకా ఎందరో మహానుభావులు.. అందరికి వందనాలు.

మరి ఇప్పుడేమయ్యింది. ఫాస్ట్ బీట్ పేరుతో రణగొణ ధ్వనులతో అర్ధంగాని సాహిత్యం తోనూ నేటి సంగీత దర్శకులు మతి పోగొట్టుతున్నారు. ఆ మధ్య వచ్చిన బాయ్స్ సినిమా లో పాటల సాహిత్యం వింటే తెలుగు తల్లీ నీ కెంత దుర్గతీ అని ఎలుగెత్తి ఏడవాలనిపిస్తుంది హీరో హీరోయిన్ల పాట .. వాన నీటి బురద లో వానపాము లము..కుళ్ళిన మామిడి కాయ ల లో జత పురుగులము అని.. ఒక్క సారి పాత పాట గుర్తుకు చేసుకోండి.. మధురాతి మధురం మనప్రేమ మధురం.. ఆపాట కు ఈ పాటకు నింగికి నేలకు ఉన్నంత దూరం ఉంది. ఈ పాట ప్రేమికుల మధ్య ఉన్న ఒక మధురానుబంధం ఎత్తిచూపుతోంది. మరి పైపాట ఆలోచించటానికే భయం వేస్తోంది. పైగా ఈ తరం పాటలు వినటానికే గాని సాహిత్యం గుర్తుంచుకొని మళ్ళీ పాడుకోలేని పరిస్థితి.

అలా అని ఈ మధ్యకాలంలో మంచిపాటలు రావట్లేదని అనట్లేదు. కాని నూటికి ఓ పది పాటలు కూడా మంచివి నెమరువేసుకోలేకున్నాము. కొన్నిపాటలు సాహిత్య సంగీత పరంగా బాగున్నా పర రాష్ట్రీయుల ఉచ్ఛారణ తో ఒక మంచి అనుభూతిని ఇవ్వలేకున్నాయి.

అస్సలు పాటలు ఎందుకు బాగా ఉండట్లేదో అని కాస్త ఆలోచిద్దామా. ఒకటి నాసిరకం సంగీత దర్శకులు. ఏవో కొన్ని రెడీమేడ్ ట్యూన్ల తో రంగంలోకి ప్రవేశిస్తునారు. మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తే చతికిల పడుతున్నారు. సెటిల్ అయిన సంగీత దర్శకులయితే డబ్బు కొద్ది రొట్టె సామెత గా కోట్లు గుమ్మరిస్తే లేక పోతే పెద్ద హీరోల సినిమాకైతే నే హిట్ పాటలు అందిస్తున్నారు.

ట్యూన్ రెడి అయిన తర్వాత పాట రాస్తున్నారు. అది చాలా సులభం అని చాలా మంది పాటల రచయితలు సంగీత దర్శకులు సెలవిస్తునారు. ఎవరికి .. అది వాళ్ళకి మాత్రమే కాని వినే మనకి కాదు. అంటే తయారయిన పాటకి తగిన సంగీతం అందించ గలిగిన సంగీత దర్శ కులు మనకు లేరా.

అలానే రణగొణ ధ్వనులకి తగిన మాటలు చొప్పించగలిగిన రచయితలు మాత్రమే మనకు ఉన్నారంటారా. ఇది మాత్రం మనం ఒప్పుకోనక్కర్లేదు. సిరి వెన్నెల, చంద్రబోస్ మరింకా చాలా మంది పాటల రచయిత లు తమ సత్తా ఇప్పటికే ఋజువు చేసుకున్నారు. రణగొణ ధ్వనులకి తమ సహకారం అందిస్తూనే ఉన్నారు. వాటి మధ్యలోనే మంచి సాహిత్యాన్ని చొప్పించి కొన్నయినా మంచి పాటలు వినగలిగేలా చేస్తున్నారు.

కాని సంగీత దర్శకులకి అంత సీన్ ఉన్నట్లు లేదు. ఏఆర్ రహమాన్ పాటలలో కూడా రోజా తర్వాత పాడుకో తగ్గవి చాలా తక్కువే. ఆనంద్ డివిడి లో కె మ్. రాధాక్రిష్ణ మాట్లాడుతు నా దగ్గర్ చాలా ట్యూన్స్ రెడీగా ఉన్నాయండి అని డప్పు కొట్టుకున్నాడే గాని ఏ పాట కైనా సంగీతం అందించగలను అని చెప్పలేకపోయాడు. ఒకోసారి మన సూపర్ హిట్ పాటలకి మాతృక లైన జపనీస్ లేక స్పానిష్ పాటలు వింటూంటే సిగ్గేస్తుంది ఇంతేనా మన వారి ప్రతిభ అని.

మన దర్శక రత్నాలకి కూడా ఈ విషయంలో శ్రద్ధ ఉన్నట్లు లేదు.

కధలకే కాదు పాటల సంగీతానికి కూడా మనకు దౌర్బాగ్యస్థితి ఉన్నట్లే ఉంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

వెంకట్ ఉప్పలూరి

రచయిత:

పుట్టింది విజయవాడ. పెరిగింది - అనంతపూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, సికిందరాబాదు. చదివింది ఛార్టర్డ్ అకౌంటన్సీ కానీ చేసేది సాప్ట్ వేర్ గిరీ. అమెరికా వచ్చి 14+ సంవత్సరాలు గడచిపోయాయి. ఎప్పటికైనా ఓ మంచి సినిమా తియ్యాలనే కల కలగానే మిగిలిపోయేటట్లుంది.

38 Comments to “పాటల పారడీ”

  • సినిమాల నాణ్యతకు తగ్గట్లే సంగీతం-సాహిత్యం ఉంటుంటాయి.పాటరాసే సిట్యువేషన్ లేనప్పుడు గీత-సంగీతకారులు చేసేదేముంటుంది? ఆడియో రిలీజుకోసమో లేకపోతే ఆరుపాటలు సినిమాలో టైంఫిల్/కిల్ చెయ్యడానికి కావాలి కాబట్టి ఉంటున్నాయిగానీ, నిజమైన అవసరం ఉండి ఉంటున్నాయంటారా?! మరి ఈ బాధెందుకు?

  • మహేష్ గారు, మీ భావన తప్పు, పాత సినిమాలలో చుస్తే తక్కువ బడ్జెట్ కలిగిన సినిమాలు కూడా చక్కటి సంగీతాన్ని కలిగిఉన్నాయి. పైన వ్రాయబడిన విషయం అక్షర సత్యం. దర్శకులకు శ్రద్ద లేదు అంతే….!

    • @రాజేష్: ఇక్కడ సమస్య పాత-కొత్త, బడ్జెట్-లోబడ్జెట్ కాదు. పాట కథకు అనుగుణంగా,అవసరంగా ఉందా లేదా అనేదే ముఖ్యమైన విషయం.

      అనవసరమైన పాట ఎంత స్వరబద్ధంగా,సాహితీవిలువలతో ఉన్నా సినిమాకి అతకదు. పదిసన్నివేశాల్ని సమయాభావంచేత మూడు నిమిషాల్లో చూపించి డయలాగుల్లో చెప్పలేనివాటిని గీతాల్లో చెప్పడానికి పాటలుగానీ గెంతులేస్తూ చెట్లచుట్టూ తిరగడానికి కాదు అని నా ఉద్దేశం. I think we need to first understand why songs are used as a narrative device in cinema before judging the sheer quality of them.

  • మన యూత్ కుడా ఒక పాటలో అర్ధం కన్న బీట్ మరియు వెస్టెర్న్ స్టైల్ వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నారు..ఎవరిని తప్పు పట్టాలో అర్ధం కావట్లే…కాని ఒక్క విషయం మాత్రం నిజం..మంచి అర్ధవంతమైన గీతాలు మంచి ట్యూన్స్ ఉంటే..ఆల్బం హిట్టే..గోపి గోపీక గోదావరి లా….

  • ఈ gross generalization ఇటీవలి కాలంలో చాలా సార్లు చూసాను. నేనూ పాత పాటలకు వీరాభిమానినే… అయినా పాతంతా గొప్పేనంటే ఒప్పుకోను. కాలానుగతంగా మంచి మాత్రమే మిగులుతుంది. “పోయినోళ్ళందరూ మంచోళ్ళు…” అన్నట్టు ఒక కాలం గడిచిపోయాక “గతమెంతొ ఘనకీర్తి” అనిపిస్తుంది… ఎవరైనా ఒక చిట్టా వ్రాయండి 1950-’80 లో వచ్చిన “మంచి” పాటలతో. నేను 1980-2010 మధ్య వచ్చిన “మంచి” పాటల చిట్టా తయారు చేస్తా. ఇంకా వ్రాయక ముందే చెబుతున్నా… మీరు వ్రాసిన పాటలకు తూగే సంక్యలోనే నేను వ్రాస్తా. :-) ఎవరైనా ముందుకు వస్తే నాకూ ఇదొక మంచి homework అవుతుంది. (ఇది challenge అని నేను అనుకోవటం లేదు… ఎవరైనా అనుకున్నా నాకు బాధ లేదు. :-) ! నా దృష్టిలో ఇదొక తప్పనిసరి కార్యం.)

    ఇక ఇటీవలి పాటలలో (దాదాపుగా) సాహిత్యమే లేదనటం గురించి: ఎన్నో పాటలను మనం వినకుండానే “ఆఁ.. ఏముం”దని కొట్టి పారేస్తూ ఉంటే, చిన్న చిత్రాల ద్వారా struggle for exsistence అన్నట్టు కొట్టుమిట్టాడుతున్న సంగీతదర్శకులు, గీతరచయితలు మన కళ్ళ ముందే ఉంటున్నా కూడా పట్టించుకో(లే)కపోతుంటే …ఎప్పుడు చూడగలం మనం కొత్త వెలుగును? దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడిని వదిలిన కిరణమే మనకు దాదాపు ఎనిమిది నిముషాలకు కనిపిస్తే… ఇక ఈ “కవితాక్ష విలోకన తీక్ష్ణధార” ఎప్పటికి కనిపిస్తుంది చేరుతుంది జనబాహుళ్య మనోనేత్రానికి… రణగొణ గడబిడలో, సిరి కొరకురుకులలో!? (ఆవేశానికి క్షమించాలి.) చిక్కని సాహిత్యం వ్రాసే వాళ్ళూ, చక్కని సంగీతం చేసే వాళ్ళూ, అలాంటి వాళ్ళొక్కరైనా ఉంటారా అని ఆనవాళ్ళ కోసం చూసే వాళ్ళూ ప్రతి కాలంలోనూ ఉన్నారు, ఉంటారు …అనే నా నమ్మకం.

    All said and done, I agree … సాహిత్యం, సంగీతం అల్చబడినట్టు అనిపించటం సహజం. అందులో నిజమూ ఉంది… అది అబద్ధమని కాదు నా వాదన. కానీ, మంచి అన్నది వెతికి చూస్తే ఎప్పుడూ ఉంటుంది. Time is but a filer that thankfully leaves the best for the next generation.

    • పైన వ్రాసిన టపా టపటపా కొట్టటం వల్ల అందులో రాలిన కొన్ని “అచ్చ” తప్పులు:

      * “సంఖ్య” అనబోతే మహాప్రాణం అల్పమై..పోయింది.
      * “కనిపిస్తుంది/చేరుతుంది” అన్న చోట మధ్యలో “/” కనపడకుండాపోయింది.
      * “existence”, “filter” అన్న ఆంగ్లపదాలలో ఒక్కో అక్షరం హెచ్చుతగ్గుల్లో చేరి…పోయింది.
      * మరీ “పల్చ”బడేసరికి “ప”కారం పంటి కింద ఫలహారమై హరించుకుపోయింది. ది. గమనించగలరు.

      • well said nachaki…i strongly agree wid u…these ppl think that old is gold and everytime old has more craze than present one…

        and he s commentin on rehman’s music …the lyrics in boys were assum…vanapamulu, puttagodugulu shows the different angle in writin lyrics…

        and even more yuvan shankar, harris jayraj’s song lyrics sounds much more better than above told “mooga manasulu” etc…lyrics…

    • తెలుగు సినిమాపాటలో మంచి కోసం వె..తి…కి…చూడ్డం అనే పరిస్థితి వచ్చిందనే అనుకుంటా ఈ వ్యాసమూ చెబుతున్నది. కానీ ఆ మాటని మొదటగా పాతపాటల్ని ఆకాశానికెత్తేస్తూ చెప్పడం వలన “పాతమాత్రమే బంగారం” అనే ధోరణి కనిపించుండొచ్చు.

      ఈ మధ్యకాలంలో “రింగారింగా” లాంటిపాటలు విజయవంతంగా రాజ్యమేలుతుంటే మంచిపాటలు వెతికినా కనిపించడం లేదు. విచిత్రమేమిటంటే హిందీలో మాత్రం ఈ మధ్యకాలంలో విరివిగా అస్వాదించదగ్గ,ఆకట్టుకునే పాటలు వినిపించేస్తున్నాయి. దానికున్న ఒకేఒక కారణం సినిమాల్లో కథ-ఆ కథలో పాటకు అనుగుణమైన సిట్యుయేషన్- పాటల రచయితకు అవసరమైన స్వేచ్చ/గౌరవం ఉండటమే. అవిక్కడ ఉంటే మనకూ రాయగలిగేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఆపరిస్థితి వచ్చేనా?

      • మీరన్నదీ నిజమే… కానీ, ఆణిముత్యాలు వెతకాలంటే అగాథమౌ జలనిధిలో వెతకక తప్పునా, వెతికితే తప్పౌనా? :-) …అన్న అర్థంలో మాత్రమే అన్నాను. మీ ఉద్దేశంతో నేను ఏకీభవిస్తాను. బిగి ఉన్న సన్నివేశాలకు తగినట్టి పాటలు వ్రాసే ప్రాజ్ఞులూ ఉన్నారు, వాటికి స్వరాలు కట్టే సంగీతజ్ఞులు కూడా కొందరైనా ఉన్నారు, వాటిని వెతికిపట్టే విజ్ఞులూ ఉన్నారు. నేనూ ఏకీభవిస్తాను. లేనిదల్లా time… పాపం, ఎవరికీ లేదు(ట). “రింగ రింగా…” లాంటి పాట మోగిపోతుంటే ఊగిపోతున్న కుర్రకారుని చూసి బుగ్గలో కణతలో నొక్కుకుంటూ మనం ఒకటి గమనించటంలేదేమో: ఒకప్పుడు trendsettersగా పేరు గాంచిన ప్రముఖులు (బాపు, విశ్వనాథ్, వంశీ, ఇళయరాజా, రహమాన్, తదితరులు) కూడా ఇటీవలి కాలంలో “పాత బంగారం”తో ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యకుండా కొత్త కంగారులో కొట్టుకుపోయి సోదిలో కూడా లేకుండానే పోతున్నారు! …అంటే కొత్త మోజులో ఉన్నది కుర్రాళ్ళే కాదు మరి! :-(

    • దయచేసి, గత సంవత్సరకాలములో వచ్చిన ఆణి ముత్యాల లాంటి పాటలను ఒ పదిటిని చెప్పండి. నిజంగా తెలియకనే అడుగుతున్నాను. కనీసము వాటినైనా నా ప్లే లిస్టలో పెట్టుకుంటాను. ఈ రణగొణి ద్వనుల పాటల బురదనుంచి ముత్యాన్ని ఏరుకోవటము చాలా కష్టముగానే ఉంది.

      • ఇవన్నీ “ఆణిముత్యాలు” అని నేను అనను, కానీ… గోల లేని పాటలు, మంచి సాహిత్యమో సంగీతమో నేపథ్యగాత్రమో ఉన్న పాటలు ఇవి కొన్ని. వీటిలో నుంచి ముత్యాలు ఏరుకోవటం సులువే కావచ్చు. :-) ఎవరికి ఎలాంటి ముత్యాలు కావాలో నాకు తెలియదు కదా… అందుకని ఈ ఏర్పాటు. ఇవన్నీ “ఆణిముత్యాలు” అని నేను అనను, కానీ… గోల లేని పాటలు, మంచి సాహిత్యమో సంగీతమో నేపథ్యగాత్రమో ఉన్న పాటలు ఇవి కొన్ని. వీటిలో నుంచి ముత్యాలు ఏరుకోవటం సులువే కావచ్చు. :-) ఎవరికి ఎలాంటి ముత్యాలు కావాలో నాకు తెలియదు కదా… అందుకని ఈ ఏర్పాటు.

        * “అంజనీపుత్రుడు” చిత్రంలో దాదాపు అన్ని పాటలు (సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, గీతరచన: జొన్నవిత్తుల, కరుణాకర్ అన్న కొత్త అబ్బాయి)
        * “18, 20 Love Story” చిత్రంలో “చిట్టి కోకిల…” (సంగీతం: శ్రీమురళి, గీతరచన: రామారావు, గాత్రం: పృథ్వీ ఆనంద్, ఐశ్వర్య). ఈ చిత్రంలోని తక్కిన పాటల్లో కూడా కొన్ని ఒక మోస్తరుగా బానే ఉంటాయి.
        * “Kavya’s Diary” చిత్రంలో “హాయిరే హాయిరే…” (సంగీతం: మను రమేశన్, గీతరచన: అనంతశ్రీరాం, గాత్రం: హేమచంద్ర). ఈ చిత్రంలోని తక్కిన పాటల్లో కూడా కొన్ని ఒక మోస్తరుగా బానే ఉంటాయి.
        * “మంజీర” చిత్రంలో “తొలితొలిసారిగా…” (సంగీతం: శేఖర్‌చంద్ర, గీతరచన: చిర్రావూరి విజయ్ కుమార్, గాత్రం: చిన్మయి)
        * “ష్… ఇది చాలా మంచి ఊరు” చిత్రంలో “ఎవరో ఎవరో… (సంగీతం: శ్రీవసంత్, గీతరచన: వేటూరి, గాత్రం: చిత్ర, కార్తీక్, గీతామాధురి)
        * “బాణం” చిత్రంలో “నాలో నేనేనా…” (సంగీతం: మణి శర్మ, గీతరచన: రామజోగయ్య శాస్త్రి, గాత్రం: హేమచంద్ర, సైంధవి), “మోగింది జేగంట…” (గీతరచన: రామజోగయ్య శాస్త్రి, గాత్రం: శ్రేయ ఘోసల్)
        * “Chapter 6″ చిత్రంలో “ఓ నెలవంకా…” (సంగీతం: ప్.సి. శివన్, మోహన సితార, గీతరచన: రామజోగయ్య శాస్త్రి, గాత్రం: విదు ప్రతాప్, జ్యోత్స్న)
        * “Comedy Express” చిత్రంలో “నువ్వుంటే నిత్య వసంతం…” (సంగీతం: సాం డిక్యాస్టో, గీతరచన: పైడిపల్లి శ్రీనివాస్, గాత్రం: ‘జై’ శ్రీనివాస్, నాగసాహితి)
        * “Joy” చిత్రంలో “ఆశ పూయు వేళ…” (సంగీతం: విద్యాసాగర్, గీతరచన: భువనచంద్ర, గాత్రం: సుజాత)
        * “తాజ్ మహల్” చిత్రంలో కొన్ని పాటలు బాగుంటాయి (సంగీతం: అభిమాన్, గీతరచయితలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ)
        * “Villageలో వినాయకుడు” చిత్రంలో కొన్ని పాటలు బాగుంటాయి (సంగీతం: మణికాంత్ కద్రి)
        * “Romeo” చిత్రంలో కొన్ని పాటలు బానే ఉంటాయి (సంగీతం: అగస్త్య, గీతరచన: వనమాలి)

        * “అంజనీపుత్రుడు” చిత్రంలో దాదాపు అన్ని పాటలు (సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, గీతరచన: జొన్నవిత్తుల, కరుణాకర్ అన్న కొత్త అబ్బాయి)
        * “18, 20 Love Story” చిత్రంలో “చిట్టి కోకిల…” (సంగీతం: శ్రీమురళి, గీతరచన: రామారావు, గాత్రం: పృథ్వీ ఆనంద్, ఐశ్వర్య). ఈ చిత్రంలోని తక్కిన పాటల్లో కూడా కొన్ని ఒక మోస్తరుగా బానే ఉంటాయి.
        * “Kavya’s Diary” చిత్రంలో “హాయిరే హాయిరే…” (సంగీతం: మను రమేశన్, గీతరచన: అనంతశ్రీరాం, గాత్రం: హేమచంద్ర). ఈ చిత్రంలోని తక్కిన పాటల్లో కూడా కొన్ని ఒక మోస్తరుగా బానే ఉంటాయి.
        * “మంజీర” చిత్రంలో “తొలితొలిసారిగా…” (సంగీతం: శేఖర్‌చంద్ర, గీతరచన: చిర్రావూరి విజయ్ కుమార్, గాత్రం: చిన్మయి)
        * “ష్… ఇది చాలా మంచి ఊరు” చిత్రంలో “ఎవరో ఎవరో… (సంగీతం: శ్రీవసంత్, గీతరచన: వేటూరి, గాత్రం: చిత్ర, కార్తీక్, గీతామాధురి)
        * “బాణం” చిత్రంలో “నాలో నేనేనా…” (సంగీతం: మణి శర్మ, గీతరచన: రామజోగయ్య శాస్త్రి, గాత్రం: హేమచంద్ర, సైంధవి), “మోగింది జేగంట…” (గీతరచన: రామజోగయ్య శాస్త్రి, గాత్రం: శ్రేయ ఘోసల్)
        * “Chapter 6″ చిత్రంలో “ఓ నెలవంకా…” (సంగీతం: ప్.సి. శివన్, మోహన సితార, గీతరచన: రామజోగయ్య శాస్త్రి, గాత్రం: విదు ప్రతాప్, జ్యోత్స్న)
        * “Comedy Express” చిత్రంలో “నువ్వుంటే నిత్య వసంతం…” (సంగీతం: సాం డిక్యాస్టో, గీతరచన: పైడిపల్లి శ్రీనివాస్, గాత్రం: ‘జై’ శ్రీనివాస్, నాగసాహితి)
        * “Joy” చిత్రంలో “ఆశ పూయు వేళ…” (సంగీతం: విద్యాసాగర్, గీతరచన: భువనచంద్ర, గాత్రం: సుజాత)
        * “తాజ్ మహల్” చిత్రంలో కొన్ని పాటలు బాగుంటాయి (సంగీతం: అభిమాన్, గీతరచయితలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ)
        * “Villageలో వినాయకుడు” చిత్రంలో కొన్ని పాటలు బాగుంటాయి (సంగీతం: మణికాంత్ కద్రి)
        * “Romeo” చిత్రంలో కొన్ని పాటలు బానే ఉంటాయి (సంగీతం: అగస్త్య, గీతరచన: వనమాలి)
        * “కథ” చిత్రంలో “ఠకఠక ఠకఠక ఎవరో…” (సంగీతం: ఎస్.కె.బాలచంద్రన్, గీతరచన: అనంతశ్రీరాం, గానం: నరేశ్ అయ్యర్)
        * “కలవరమాయె మదిలో” చిత్రంలో కొన్ని పాటలు బానే ఉంటాయి. (సంగీతం: శరత్ వాసుదేవన్, గీతరచన: వనమాలి)

        ప్రస్తుతానికి ఇంత జలనిధి చాలుగా. :-)

        • రెండు సార్లు ఎందుకు వచ్చాయో తెలియదు. క్షమించాలి.

        • మీరు చెప్పిన పాటలలో ఒకటి రెండు తప్ప మిగతావి వచ్చినట్టు కూడా తెలియదు.థాంక్స్.

          మీ లిస్టు కి ఇంకొన్ని

          కొత్త బంగారు లోకం – నేననీ నీవనీ, నిజంగా నేనేనా
          కథ – టక టక మని ఎవరో

          • :( ఇందులో ఒకటి చెప్పెసారా. ఇప్పుడే చూసా…

  • మనసున మనసై పాట “డాక్టర్ చక్రవర్తి” లోనిది

  • నిలువవే వాలుకనులదానా! (ఇల్లరికం)

  • పాత అంతా నా పుట్టుకకి ముందు జరిగినది. నేను చూసి చెప్పగలిగేది కొత్త గురించే గనుక చెప్తాను.
    ————————

    నిజానికి ‘యథా బడ్జెట్ తథా పాట’ అనే విషయాన్ని నేను ఏకీభవించను. మనం ప్రస్తుతం వింటున్న దేవీ శ్రీ ప్రసాద్, మిక్కీ జే మెయెర్స్, మణి శర్మ, రాధాకృష్ణ ఒకప్పుడు చిన్న సినిమాలకి మంచి పాటలు ఇచ్చి పైకి వచ్చిన వారే. బాణం, టెన్థ్ క్లాస్, ఆనంద్, అయితే, వెన్నెల ఇలాగ చాలనే మంచి సంగీత అభిరుచి ఉన్న దర్శకులు, సంగీత దర్శకుల నుండి వెలువడినవే. నిజానికి చిన్న చిత్రాలకే మరింత మంచి సంగీతం ఉంది, ఎక్కువ కాలం గుర్తు ఉండేలా ఉన్నాయి.

    ఇక పాత పాటలతో పోలిస్తే ‘భీభత్సం’ ఎక్కువనే ఉంటుంది. వూఫర్, డి.టి.ఎస్. లు ఆ కాలంలో ఎక్కడ ఉన్నాయి ? హాయి గా ప్రశాంతంగా పాటలు విని తెలుసుకోవాలనే భావన ఎది? ఆఖరికి పల్లేటూర్లల్లో కూడా ఎఫ్.ఎమ్ , మొబైల్ ఫొన్ పాటలు అలాగే వినయక చవితికి,దసరాకీ,పెళ్ళిల్లకీ పెద్ద పెద్ద స్పీకర్లూ. ఎప్పుడయినా అర్థరాత్రి పన్నెండుకి బుద్ధిగా చదువుకొనే ఒక స్టూడెంటుకి మూడు వస్తే పాత పాటలు వింటాడు, అందుకేనేమో ఎఫ్.ఎమ్ లో కూడా పాత పాటలకి అర్థరాత్రి సమయం కేటాయించారు.

    —-

    ‘పాట బాగుండటం’ సంగతికి వస్తే నేటి సంగీతంకి పట్టిన ఒక దౌర్భాగ్యం… పాట బాగుండాలంటే దానికి సపోర్టు ఇచ్చే బాక్ గ్రౌండ్ సంగీతం కచ్చితంగా బాగుండాలి. ఒకప్పటి పాటలు పాడుకోడానికి చాలా బాగుండేవి, ఇప్పుడు ఉత్తిగా పాడితే సరిపోదు వెనక డప్పులు,వాయిద్యాలూ ఉండి తీరాల్సిందే.

    —–

    సాహిత్యం కాలానికి అణుగుణంగానే ఉంది. బాగుంటూంది కూడా. ఇప్పుడు కొత్త కలాలు తెలుగులో మెల్లగా పుజుకోవటం వల్ల కొద్ది కాలంలో పాటలు మంచి భావంతో ఉంటాయి అనే నమ్మకం కలుగుతూంది. తెలుగు ఎంత బాగా ఉన్నది, అనే సంగతికి వస్తే, ‘యథా భాషా తథా పాటా..’. ఈ కాలం సినిమా పాటల్లో పద్య సాహిత్యం సున్నా..

    ——

    • ప్రస్తుత పాటలపై మంచి అవగాహనే ఉన్నది..

      @ఇప్పుడు కొత్త కలాలు తెలుగులో మెల్లగా పుజుకోవటం వల్ల కొద్ది కాలంలో పాటలు మంచి భావంతో ఉంటాయి అనే నమ్మకం కలుగుతూంది
      కొత్త కలాలు రావటం మంచిగా వ్రాయగలగటం మచిదే… కొత్తగా వచ్చేవారు ప్రస్తుత తరం(వేటూరి,సిరివెన్నెల,చంద్రబోస్,భువన చంద్ర,జొన్నవిత్తుల,వెన్నెలకంటి) వంటి వారిని తలదన్నేలా వ్రాసి ముందు ముందు బాగు చేస్తారు అనుకోవటం మాత్రం నిజమయ్యే సూచనలు కనపడటం లేదు నాకు :)

      @ఈ కాలం సినిమా పాటల్లో పద్య సాహిత్యం సున్నా
      నిజానికి ఇది నిజం కాదు… అక్కడక్కడా పద్యాలు వస్తున్నాయి కానీ …ఆల్మోస్ట్ సున్నా అనుకోవచ్చు
      యమదొంగ సినిమలో… శ్రీకరాకారుండ భీకరాకారుండ..(జొన్నవిత్తుల) …చత్ర పతి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ పాట అగ్ని స్కలన మరియు భక్తి రస ప్రధాన చిత్రాల్లో అక్కడక్కడా పద్యాలు వస్తూనే ఉన్నాయి.

      నిజానికి పాటల కేస్ లో జరుగుతున్న పొరపాటు వినియోగం పద్యాలలో జరగటం లేదు… లేకపోతే ఆర్య గాడు …అనినం గన్నులు జేవురింప అధరంబల్లాడ అని పద్యం పాడితే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది :D (jus kidding)

      కేవలం “సరిగమ పదని” అక్షరాలతో “మామా మామా పామా దరి దానిని గని…పద పదమని”… అంటూ సాగే క్లిష్టమైన ప్రయోగాత్మక పద్యం వ్రాసిన జొన్నవిత్తుల వంటి వారు అందుబాటులోనే ఉన్నారు…పద్య రచన అవసరమైన సందర్భాలు లేవు..

  • పాత అంతా నా పుట్టుకకి ముందు జరిగినది. నేను చూసి చెప్పగలిగేది కొత్త గురించే గనుక చెప్తాను.
    ————————-

    నిజానికి ‘యథా బడ్జెట్ తథా పాట’ అనే విషయాన్ని నేను ఏకీభవించను. మనం ప్రస్తుతం వింటున్న దేవీ శ్రీ ప్రసాద్, మిక్కీ జే మెయెర్స్, మణి శర్మ, రాధాకృష్ణ ఒకప్పుడు చిన్న సినిమాలకి మంచి పాటలు ఇచ్చి పైకి వచ్చిన వారే. బాణం, టెన్థ్ క్లాస్, ఆనంద్, అయితే, వెన్నెల ఇలాగ చాలనే మంచి సంగీత అభిరుచి ఉన్న దర్శకులు, సంగీత దర్శకుల నుండి వెలువడినవే. నిజానికి చిన్న చిత్రాలకే మరింత మంచి సంగీతం ఉంది, ఎక్కువ కాలం గుర్తు ఉండేలా ఉన్నాయి.

    ఇక పాత పాటలతో పోలిస్తే ‘భీభత్సం’ ఎక్కువనే ఉంటుంది. వూఫర్, డి.టి.ఎస్. లు ఆ కాలంలో ఎక్కడ ఉన్నాయి ? హాయి గా ప్రశాంతంగా పాటలు విని తెలుసుకోవాలనే భావన ఎది? ఆఖరికి పల్లేటూర్లల్లో కూడా ఎఫ్.ఎమ్ , మొబైల్ ఫొన్ పాటలు అలాగే వినయక చవితికి,దసరాకీ,పెళ్ళిల్లకీ పెద్ద పెద్ద స్పీకర్లూ. ఎప్పుడయినా అర్థరాత్రి పన్నెండుకి బుద్ధిగా చదువుకొనే ఒక స్టూడెంటుకి మూడు వస్తే పాత పాటలు వింటాడు, అందుకేనేమో ఎఫ్.ఎమ్ లో కూడా పాత పాటలకి అర్థరాత్రి సమయం కేటాయించారు.

    —-

    ‘పాట బాగుండటం’ సంగతికి వస్తే నేటి సంగీతంకి పట్టిన ఒక దౌర్భాగ్యం… పాట బాగుండాలంటే దానికి సపోర్టు ఇచ్చే బాక్ గ్రౌండ్ సంగీతం కచ్చితంగా బాగుండాలి. ఒకప్పటి పాటలు పాడుకోడానికి చాలా బాగుండేవి, ఇప్పుడు ఉత్తిగా పాడితే సరిపోదు వెనక డప్పులు,వాయిద్యాలూ ఉండి తీరాల్సిందే.

    —–

    సాహిత్యం కాలానికి అణుగుణంగానే ఉంది. బాగుంటూంది కూడా. ఇప్పుడు కొత్త కలాలు తెలుగులో మెల్లగా పుజుకోవటం వల్ల కొద్ది కాలంలో పాటలు మంచి భావంతో ఉంటాయి అనే నమ్మకం కలుగుతూంది. తెలుగు ఎంత బాగా ఉన్నది, అనే సంగతికి వస్తే, ‘యథా భాషా తథా పాటా..’. ఈ కాలం సినిమా పాటల్లో పద్య సాహిత్యం సున్నా..

    ——

  • సూచన: పాత పాటలంటే మక్కువ…మరియు… నా తరం/నా ముందు తరం లోని సంగీత …సాహిత్య కారులైన ప్రతి ఒక్కరిపై… అమితమైన గౌరవం ఉంది…ఏ ఒక్కరినీ నొప్పించటం నా ఉద్దేశం కాదు…

    వెంకట్ గారూ… నేను మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ ని అంగీకరిస్తున్నాను… ఐతే! ఈ వ్యాసం ఏ విషయాన్ని చెప్పదలచుకున్నదో …ఆ ఆ అంశాలను పూర్తిస్థాయిలో ఆవిష్కరిచలేదు అని నా అభిప్రాయం అంతే కాక.. మరికొంత పరిశోధన/అవగాహన చేసి ఇంకా విషయం చొప్పించి ఉంటే బాగుండేది.. వ్యాసం మొత్తం లో పాత కొత్త అన్నారు కాని దేనిని మీరు పాత అనదలుచుకున్నారు.. దేనిని కొత్త అనదలచుకున్నారో వివరించలేదు… అలానే మంచి చెడు.. :) ..
    నిజానికి చాలా సందర్భాల్లో ఉద్దేశం మంచిదే అయ్యి ఉంటుంది …కానీ ఆ ఉద్దేశానికి రూపం ఇచ్చినప్పుడు అనుకున్నది రాకపోవచ్చు… దానికి కారణాలు అనేకం(పాండిత్యం…సమయం నుంచి ఆరోగ్యం.. అహంకారం వరకు .. :డ్)
    ఐతే.. నిజంగా కొత్తపాటలను వివరించదలిస్తే మరికొంత పరిశోధన తప్పక చేసి ఉండవలసింది… కొత్త పాటలపైననే కాక… మామూలుగా తెలుగు సినిమా…పాటపై…
    ఆపాటకూ ఈ పాటకూ నింగికి నేలకు ఉన్నంత దూరం ఉంది అని మీరు వివరించినది బాగానే ఉంది…ఆ రెండు పాటలకు ఉన్న దూరం రెండు తరాలకూ ఉందని generalize చెయ్యటం కుదరదు… రెండు తరగతుల పిల్లల్లో ప్రతిభను పోల్చ దలచుకున్నప్పుడు మనకు నచ్చిన తరగతి నుండి మొదటి ర్యాంక్ విద్యార్ధిని మరొక తరగతిలోని అధముడితో పోల్చి ఏమిటి చెప్పగలిగేది.. అది ఏనాటికీ సరియైన/సహేతుక పద్దతి కాదు..

    ఇక నచకి అన్నయ్య చెప్పిన పాటల్లో చాలా మటుకు చాలా మందికి తెలియవనేది సత్యం.. అంతే కాదు.. ఈ కాలం లో వచ్చేపాటలు ముందు తరాలవరకు మనగలగవు అనుకుంటే అపోహ మాత్రమే… దశాబ్దాలు నిలవగలిగిన సంగీత సాహిత్యాలు తప్పక వస్తున్నాయి…కానీ…పరిమితంగా మాత్రమే…

    ఈకాలం పాటల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం అంటు ఉంటే అది పాట.. కధకు ఎంత అవసరమై వాడబడింది… పాట ద్వారా ఏం చెయ్యదలచుకున్నారు అనే విషయం ఒకటి… చాలా సినిమాల్లో.. ఆరు పాటల సంప్రదాయం అందులో తూనికలు కొలతల విభాగం లా… :D రకరకాల కొలతల్లొ కొట్టుమిట్టాడటమే(మాస్ …రొమాంటిక్ … హీరో ఇంట్రడక్షన్… etc)! Contd..

    • క్షంతవ్యుడను, ఈ వ్యాసం మూడు నెలల క్రితం మొదలుపెట్టాను. అనివార్యకారణాల వల్ల వాయిదా వేశాను, ఇప్పుడు హడావుడిగా పూర్తిచేశాను. దాంతో కొన్ని భావాలు మరుగున పడిపోయాయి.

  • మీ వ్యాసంలో నిజాయితీ కనపడింది కాబట్టి మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలకు సమగ్రమైన వివరణ ఇయ్యలేకపోయినా ప్రయత్నిస్తాను..
    అస్సలు పాటలు ఎందుకు బాగా ఉండట్లేదో..అంటూ మీరు లేవనెత్తిన అంశాలు కారకాలు కాదని నా అభిప్రాయం…ఎందుకంటే ట్యూన్లకు వ్రాయటం వల్ల అదిజరుగుతున్నదనుకుంటే తప్పే అవుతుందేమో… ఆ సంస్కృతి కొత్తగా మొదలు పెట్టినదేమీ కాదు.. పైడిపాల గారి తెలుగు సినిమాపాట చరిత్ర పుస్తకం ఈ అంశాలపై పూర్తి వివరాలను అందిస్తుంది.. పైగా మీరు చెప్పిన సంగీత దర్శకులలో.. ఒక్క మహదేవన్ గారు తప్పించి మిగతా వారందరూ పలు సందర్భాల్లో ట్యూన్లను అందించినవారని వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకం చదివితే తెలుస్తుంది.. ముఖ్యంగా ఇళయరాజా గారు

    ఈతరం పాటలు చిన్నచూపుకు గురి అవుతున్నాయి… నిజానికి భావుకత పరంగా! మరియు భాషా ప్రయోగాల పరంగా ఈ కాలం పాటలు ఆకాలం పాటలకు ఏమాత్రం తీసిపోవు.. భావుకత పరంగా నేనైతే ఒక మెట్టు పైనే ఉంటున్నాయి కొన్ని పాటలు అంటాను..

    [b]@ఒకోసారి మన సూపర్ హిట్ పాటలకి మాతృక లైన జపనీస్ లేక స్పానిష్ పాటలు వింటూంటే సిగ్గేస్తుంది ఇంతేనా మన వారి ప్రతిభ అని :| [/b]
    ఎవరో కాపీ చేశారని సిగ్గుపడాల్సిన అవసరం లేదు… అనుసృజనలు అనువాదాలు మొదటినుంచీ ఉన్నవే..మీ మనసు దోచాయని పైన పేర్కొన్న పాటల్లోనూ చాలా అనుకరణలు…అనుసృజనలూ ఉన్నాయి… మచ్చుక్కి కొన్ని అనుకరణలు…అనుసృజనలూ..

    ౧.బ్రతుకు తెరువు …సినిమాలో… సముద్రాల వారి రచన …. “అందమే ఆనందం…ఆనందమే జీవిత మకరందం” పల్లవికి ప్రేరణ (A thing of beauty is a joy for ever)

    ౨.దేవులపల్లి వారి రచన… “ఆకులో ఆకునై పూవులో పువ్వునై”… — ప్రేరణ Robert Frost’s “Stopping by woods on a snowy Evening”

    ౩. శ్రీ శ్రీ గారి రచన “అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే”… — ప్రేరణ ఊదుములై నారాయణ కవి అని ఆయనే చెప్పారట…
    ౪.మానూ మాకును కాను…
    రాయీరప్పను కానే కాను…
    మామూలు మనిషిని నేను…

    you are not woods
    you are not stones…but men (జూలియట్ సీజర్ నాటకం లోనివి)

    ౫.ఆరుద్ర గారి ఏస్కో కోకో కోలా…పాటకు ప్రేరణ “drinking rum and coca-cola”

    సంగీత పరమైన ప్రేరణలు…
    “మాయాబజార్” సినిమాలోని “వివాహభోజనంబు పాటకు Mexican Merry go round
    అనే పాట ఆధారం కావటం ఆంగ్ల గీతాల బాణీలు ఎప్పుడో తెలుగు పాటలను ప్రభావితం చేశాయి అనటానికి ఉదాహరణం…

    సాలూరి రాజేశ్వర రావు గారు స్వరపరచిన…”ఆరాధన” లో..
    1.నీ చెలిమి నేడే కోరితిని…
    2.ఆడదాని ఓరచూపులో జగాన ఓడిపోని ధీరుదెవ్వరో
    ఇంకా…
    1.అందమైన బావా ఆవుపాలకోవా…
    2.ఈ రేయి తియ్యనిది ఈ చిరుగలి మనసైనది
    మొదలైనవన్నీ ఆంగ్లబాణీలే అంటే ఒకింత ఆశ్చర్యం కూడా కలుగుతుంది ..

    కొమ్మకొమ్మకో సన్నాయి …. తెలుగు సినిమా పాట చరిత్ర(251 పేజీ) పుస్తకాలు చదివి ఉంటే మీరు మరింత సమాచారం అందించ గలిగే వారు అనిపించింది… may be కారణాలుగా మీరు సూచించినవాటిని చూపేవారు కాదేమో కూడా

    పాటలు దౌర్భాగ్య స్తితిలో లేవు …అన్నిపాటలు అందరికీ చేరువకాని దౌర్భాగ్యంలో ఉన్నాము… :| …కింద మన మిత్రులు చెప్పినట్టు రింగ రింగ – అర్య2 లోనే చాలా మంచి భావాలు కలిగిన “కరిగే లోగా ఈ క్షణం” అనే పాట కూడా ఉంది …

    అత్యంత చిన్న బడ్జట్ సినిమా “అటు అమెరికా ఇటు ఇండియా ” లో సిరివెన్నెల గారి సాహిత్యం …
    నువ్వెవరైనా నేనెవరైనా నీనాగుండెల సడి ఒకటే…
    ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే..
    అలలన్నిటికీ కడలొకటే…
    నదులన్నిటికీ నీరొకటే
    మనసుతడిస్తే! నీ…నా చెంపను నిమిరే వెచ్చని కన్నీరొకటే

    ఇలా ఏకరువు పెడితే కొత్త పాటల్లోని అద్భుత భావాలి… మంచి ట్యూన్లు ఒక పుస్తం అవుతాయేమో కూడా …అందుకే ఆప్రయత్నం విరమిస్తూ… only the best survives … telugu cinema songs can survive(for ex:మీరు చెప్పిన అవేకళ్ళు సినిమా లోని… మా ఊళ్ళో ఒక పడుచుంది… vs అందమైన పార్కులో అనే పాట) అని ముగిస్తున్నాను

    • తెలుగు పాటల గురించి ఇంకా ఎమైనా పుస్తకాలు ఉన్నాయా ?

      • చాలా మంది గీతరచయితల(సినారే,ఆరుద్ర,ఆత్రేయ,సముద్రాల) పాటల కలక్షన్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి… గీత రచయితలే వ్రాసినవి
        కొమ్మకొమ్మకో సన్నాయి(వేటూరి)…
        సిరివెన్నల తరంగాలు..కళ్యాణ రాగాలు.. శివదర్పణం (సిరివెన్నెల)
        కానీ పైడిపాల గారి పుస్తకం చాలా చాలా చక్కగా ఉంది …

        ఎంకి పాటలు… జానపద పాటలు..పల్లె పాటలు లాంటివి చాలా ఉన్నాయి

        తెలుగు సాహిత్యం పై కూడా ఆధునిక అంధ్ర సాహిత్యం(సినారే) మొదలైన చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ వాటిలో నామమాత్రంగానే సినిమా సాహిత్య ప్రస్తావన ఉంటుంది..
        మ్యూజికాలజిస్ట్ రాజా(హాసం) గారి ఆర్టికల్స్ కూడా బాగుంటాయి..

        ఐతే పైన చెప్పిన చాలా పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో లేవు…కొంత కాలం వేచి చూడాల్సిన పరిస్తితి ఉంది

  • ఈ వ్యాసం చదువుతుంటే ముగ్గురు రచయితలు కలిసి ఎప్పుడో రాసిన వ్యాసం “తెలుగు సినిమా పాటకు సుతీ మతీ లేవా?” గుర్తుకు వచ్చింది. నవతరంగం మిత్రుల కోసం ఆ లింకు ఇక్కడ ఇచ్చాను.

    http://www.eemaata.com/em/issues/200107/670.html

    విష్ణుభొట్ల లక్ష్మన్న

    • నమోన్నమః! బహుకాలదర్శనం! సరైన సందర్భంలో సరైన వ్యాసాన్ని సూచించారు. నెనర్లు! ఆ వ్యాసం గురించి వ్యాఖ్యానించటం సమంజసమైనా ప్రస్తావన ఇక్కడ వచ్చింది కనుక ఇక్కడ చెబుతున్నాను. చాలా లోతైన చర్చ నుంచి ముగ్గురి దృక్పథాల కలయికతో తయారైన ఆ వ్యాసం చక్కగా ఉంది. రామారావు గారికి, భాస్కర్ గారికి కూడా నెనర్లు!

    • @విష్ణుభొట్ల లక్ష్మన్న గారు: చాలా చక్కటి,చిక్కటి వ్యాసం …బాగున్నది చాలా.. ఇంత లోతైన విశ్లేషణ ఈ మధ్య చదవలేదు ..నెనెర్లు! ఇంకా ఉంటే మాకు తెలియజేయగలరు

  • check my blog for my own lyrics and pass your comments….

  • check my blog for my own telugu lyrics and pass your comments….

    http://thegreatmoviebuff.blogspot.com/

  • చాలా మ౦చి TOPIC అ౦డి.
    ఒకప్పటి పాటలు వి౦టు౦టె ఆ అనుభూతి వెరు. ఎప్పటికి మరిచిపొలెనివి. ఈ కాల౦లొ పాట వి౦టు౦టె ఎప్పుడు అయిపొతు౦దా అని చూడాలి.
    అయినా ఈ మధ్య directors హీరొ ని ము౦దు select చెసుకొని story create చెస్తున్నారు. ఇ౦కా వాల్లకి songs కి time ఎక్కడు౦ది. special effects, budget తప్ప వెరె అ౦శాలు వాల్లకి ఎ౦దుక౦డి. ?
    దానికి తొడు music directors ..ఎవొ కొన్ని tunes తొ వస్తారు. అ౦తె. !!
    మరి కొన్ని ఆణిముత్యాలు.
    నన్ను దొచుకు౦దువటె వన్నెల దొరసాని ( గుళెబకావళి కథ )
    బాబు వినర .. అన్నాదమ్ముల కథ ఒకటి. (ప౦డ౦టి కాపుర౦)
    కల కానిది.. విలువైనది (వెలుగునీడలు )
    లెచి౦ది .. నిద్ర లెచి౦ది (గు౦డమ్మ కథ )
    మౌనముగానె (గు౦డమ్మ కథ )

    ఈ మధ్య కాల౦లొ.. ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్య౦ చాలా బాగు౦టు౦ది.
    – ఆదిత్య

  • నేను ఈ బ్లాగరితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చక్కనైన సంగీతం, తియ్యనైన సాహిత్యం విని చాలా రోజులయ్యింది. ఎక్కడో సిరివెన్నెలో, వేటూరో కాస్త మనసు పెట్టి వ్రాస్తుంటే తప్పితే, వందేమాతరమో, దేవినో అప్పుడప్పుడూ డప్పు-డప్పు అనకుండా వాయిస్తుంటే కొంత ఊరట కలుగుతోంది. “నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని”, అనడంలో భావుకత సంగతి ఎలాగున్నా, “శ్రావ్యత, నిండుదనం, తీయందనం” కొదవలేనంతగా ఉన్నాయి. ఈ నవతరం సంగీతం మన కర్మాయ్!

  • ఎప్పుడూ ఇది బావోలేదు అది బావోలేదు అని నసుక్కుంటూ ఉండటమే కానీ ఉన్నంతలో ఎంకరేజ్ చేద్దామే అని అస్సలు ఉండదు కదా. రూపాయి ఖర్చు పెట్టకుండా , ఇంటర్నెట్ నుంచి ఫ్రీ గా డౌన్‍లోడ్ చేసుకుని వినే మనకోసం , వేలూ లక్షలూ పెట్టి కవులనూ , సంగీతకారులనూ , రికార్డింగ్ స్టూడియీలనూ పోషించాల్సిన అవసరం సినిమావోళ్ళకేం ఉంటుంది.
    ఏ భాషలో అయినా కొత్తదనం కొత్తదనమే. ఒకప్పటి ఎల్విస్ ప్రెస్లీతో పోల్చితే మైకేల్ జాక్సన్‍ నత్తివాడిలాగా , అతనితో పోలిస్తే రికీ మార్టిన్ గోలగానూ కనిపించడూ ???
    నచకీ భాయ్… మీకు మీరే సాటి. ఇలా బియ్యాన్ని వదిలి బెడ్డాలు ఏరే వారి మధ్య , ప్రతి మెతులకునూ రుచి చూసి అభిప్రాయం చెబుతున్నారంటే…సూపర్.
    తెలుగోళ్ళందరూ మిమ్మల్ని చూసి అయినా , పాజిటివ్‍గా ఆలోచించడం , ప్రవర్తించడం నేర్చుకుంటే … అన్నీ బాగుపడతాయి.

    • బాబ్బాబు గారు, మాకు ఎంతో అవకాశం ఉన్నా ఈ రోజు వరకు పాటలు డౌన్ లోడ్ చెయ్యడం అనేది ఎరగను. కొన్ని వందల ఆడియో సిడిలు కొన్నాను మా అవిడ తిడుతున్నా వినకుండా. చూస్తే మీరొక పాటల రచయిత లేక సంగీత దర్శకుడో అనిపిస్తోంది. బాగున్నా బాగులేకపోయినా సర్దుకు పోవాల్సిన అంత అవసరం ఉందంటారా!!! మీరు ఇచ్చే 100 రూపాయల టికెట్ లోనే కాదు మేమిచ్చే 15 డాలర్ల టికెట్ లోను మీరు చెప్పిన ఖర్చులు రాబట్టుకునే అవకాశం ఏలాను ఇస్తున్నాం గదా.

      • బాబ్బాబు గారు,ఫ్రీ గా డౌన్‍లోడ్ చేసుకుటున్నారు కాబట్టి ఇది చాలు అనటం అంత కరక్ట్ కాదండి..
        @వెంకట్ గారు…
        నిజమే adjust ఐపో! పెట్టింది తిని ప్లేట్ కడుక్కో..అని ఎవరైనా అంటే అది తప్పే!… ప్రతి వారూ తమకు సాధ్యమైనంత మంచి కళావస్తువును తయారు చెయ్యటానికి నిజాయితీగా కృషి చెయ్యాలి..
        అన్ని పాటలకూ పాతపంధాలో సంగీతం అద్దటం అంత నప్పదు కానీ.. మెలొడీ లకు పాతవాటిలో ఉండే కమ్మదనం ఉండేలా చేస్తే బాగుంటుంది…నాకు సంగీతం పై పరిజ్ణానం పరిమితం కాబట్టి ఇంకా ఎకువ చెప్పలేను…

  • NaChaKi గారు ఈ మాట ఏ విశ్వాసంతో అంటున్నారో కొరుకుడు పడటం లేదు. 1954 మొదలుకుని 1960 (కొంచెం అటుగా 1964) వరకూ వున్నా దశకం తెలుగు సినిమా చరిత్రలో, ఇంకా సంగీతంలో, స్వర్ణయుగం. ఈ దశకంలో వచ్చిన ఏ ఒక్క 3 సంవత్సరాల పాటలు లిస్టు కట్టినా చాలు. 80 దశకానికివ్వల వచ్చిన పాటలన్నిటికీ చిరస్థాయిగా దీటు. ఈ సవాలు ఎదుర్కోవడం చాలా సులువు. నచకీ గారికి నేను మరో సవాల్ విసురుతాను. 80 దశకానికివ్వలి పాటలన్నీ లిస్టు కట్టి వాటిల్లో ఎంతశాతం ఇంకా ప్రాచుర్యంలో వున్నయో కూడా గణించండి. అలాగే 54-64 దశకంలో వచ్చిన పాటల్లో ఎంతశాతం ఇంకా ఆదరణలో వున్నాయో లెక్కించండి. ఇంకా ఎన్ని పూర్వపు బాణీలు, ఎన్ని పాశ్చాత్య బాణీలు (pop, rock, blues, rap, disco వగైరా వగైరాలు) 1990 తర్వాత వచ్చిన పాటల్లో మక్కికి మక్కీ కాపీకొట్టబడి తెలుగు, హిందీ బాణీల్లోకి వచ్చిచేరుతున్నయో కూడా లెక్కకట్టండి. దేవిశ్రీప్రసాద్, కీరవాణి, రహ్మాను వగైరా ఆధునికులందరూ ఈ కాపీ రోగానికి అతీతులు కారు. ఏటొచ్చీ ఈ బాణీచౌర్యం ఉభయసంస్కృతులతోనూ మంచి పరిచయం ఉన్నవారికి తప్పతెలీని చౌర్యం.

    సంగీతం పూర్తిగా అభిరుచికి సంబంధించిన విషయం. రాగము, తాళము, లయ, భావము, గాత్రమాధుర్యమూ, భావప్రకటనా, ఇవేవీ లేకున్నా తన్మయింపజేయగల్గడం ఇవన్నీ సంగీతప్రమాణాలనుకుంటే, అవన్నీ ఉన్నంత మాత్రాన ఏదీ మంచి సంగీతమైపోదు. అంచేత మరొకరి అభిరుచితో నేను వాదించను. కానీ ప్రాచుర్యం, ప్రజాదరణా (popularity), చెరగని స్మృతీ ప్రమాణాలుగా ఎంచుకుంటే “పాత” పాటలదే గెలుపు. “పాత” అనే మాటకి విరామచిహ్నాలెందుకు పెట్టానంటే – పాతకొత్తలు గోడమీద వున్న కాలెండరు గళ్ళని బట్టి కాకుండా, వినే వారి మనస్సునెలా తాకుతున్నదనే దాన్ని బట్టీ వుంటుంది. నా వరకైతే ఘంటసాల, లీల పాతాళ భైరవిలో పాడిన “హాయిగా మనకింకా స్వేచ్చగా” పాట సాకీ వింటుంటే ప్రతీ ఒక్కసారీ మొదట సారి వింటున్నట్టే వుంటుంది. ఇది మచ్చుకి మాత్రమే ఉదహరిస్తున్న పాట. [న్యూటన్ గారు గురుత్వమున్నదని చెప్పి 400 ఏళ్ళవుతున్నా, ప్రతి వస్తువు కదలికలోనూ అది నిత్యనూతనంగా ఆవిష్కరింపబడుతున్నట్లే :-) ]

    1980 దశకానికివ్వల మంచి పాటలు రాలేదనీ, లేవనీ నేననను. కానీ మీ సంఖ్యామానంలో కొంచెం కొరవేనని నా నమ్మకం.

    - తాడేపల్లి హరికృష్ణ

  • క్షమించండి: నాలా దీర్ఘవ్యాఖ్యలు రాసేవాళ్ళకి ఈ చిన్న చిన్న Comment Boxలు సరిపోవు. అంచేత అసలు సందర్భం కొరవడింది. ఇది NaChaKi గారి సవాలుకి ప్రతివ్యాఖ్య:

    >> 1950-’80 లో వచ్చిన “మంచి” పాటలతో. నేను 1980-2010 మధ్య వచ్చిన “మంచి”
    >> పాటల చిట్టా తయారు చేస్తా. ఇంకా వ్రాయక ముందే చెబుతున్నా… మీరు వ్రాసిన పాటలకు తూగే సంక్యలోనే
    >> నేను వ్రాస్తా.

    - తాడేపల్లి హరికృష్ణ

  • @ Srinivasa Mouli garu:

    Can you please name the original song for “Nee Chelimee Nede Korithini” (Aaraadhana)?

    - Murthy

    • @రమణ మూర్తి gAru..
      mI comment ippuDE cUstunnAnu anDi.. nEnu pErkonna pATala prEraNalu.. paiDi paala gaaru vrAsina “telugu sinimA paaTa caritra” anE pustakam lOni 251 page nunci quote cEyabaDinavi.. aa pustakam prastutam naa vadda lEdu.. mIku available unTE cadavanDi. exact gaa yE song nunci prEraNO naaku gurtu lEdu.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories