Menu

మారుతున్న సినిమా కథనం

సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ మధ్యకాలంలో వచ్చిన faction సినిమాలు చాల వరకూ ఈ flashback అనే ప్రక్రియను బాగా వాడుకున్నాయి. కానీ ఇదే రకమైన కథా వృత్తాంతాన్ని మళ్ళీ మళ్ళీ వాడడంతో ఇప్పుడొచ్చే ప్రతి action సినిమాలోనూ హీరో పూర్వకథను గురించి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ప్రతి సినిమా హీరో పూర్వకథా ప్రకాశన మీదే ఆధారపడిపోతుంది. ఇలా flashback ఆధారంగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రసేనా రెడ్డి, సింహాద్రి లంటి సినిమాలు భారీ విజయం సాధించడంతో, దర్శకులు ప్రతి సినిమాలోను హీరోకు పదునైన పూర్వ కథను సృష్టించాలన్న ప్రయతనంలో ప్రేకషకులను మెప్పించలేక చివరికి సినిమాలు box-office దగ్గర చతికలు బడ్డాక కానీ అసలు విషయం తెలుసుకోలేకపోతున్నారు.నిజానికి ప్రేక్షకులు అక్కడ ఆదరించింది flashback అనే ప్రక్రియను కాదనీ, కథనంలోనూ మరియు కథలోని సంఘటనలను ప్రేక్షకులకు తెలియచేయటంలో ఎన్నుకున్న వరుస క్రమంలోని కొత్తదనాన్ని మాత్రమే ఆదరించారని తెలుసుకొనుంటే మన సినిమాల్లో కొద్దో గొప్పో మార్పు జరిగుండేది. ఉదాహరణకు “ఒక్కడు” సినిమా తీసుకుంటే ఇందులో పెద్దగా flashbackలు ఏమీ ఉండవు.కేవలం భూమిక క్యారెక్టర్ పూర్వ కథను ప్రేక్షకులకు తెలియచేయడనికి మాత్రమే flashback ప్రక్రియను ఉపయోగించారు తప్పితే ఈ ప్రక్రియ ద్వార ప్రేక్షకులలో భావోద్వేగాలలో మార్పేమీ వుండదు. అయినా కూడా ఈ సినిమా భారి విజయాన్నే సాదించింది. అలాగే “మురారి”, “అతడు” లాంటి సినిమాలు కూడా.కానీ “అతడు” సినిమాలోనూ, మరియు “అతనొక్కడే” సినిమాలోనూ ఈ flashback ప్రక్రియను ఎంతో వైవిధ్యంగా ఉపయోగించారు దర్శకులు. “అతనొక్కడే” సినిమాలో అయితే flashback ప్రక్రియనే కాకుండా flash forward అనే మరో ప్రక్రియను మొదటిసారిగా తెలుగు సినిమా తెరపై ఉపయోగించారు దర్శకుడు సురేందర్. భవిష్యత్తులో జరగబోయే సంఘటనా దృశ్యాల్ని తెరపై తళుక్కి మనిపించి ప్రేక్షకులలో మదిలో ఆపేక్ష, ఆసక్తి కలుగచేయడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. ఇదే విధంగా “అతడు” సినిమాలో ఒకే సంఘటనను వేర్వేరు కోణాల్లో దృశ్యీకరించడం ద్వారా ఒకే విషయానికి వేర్వేరు దృక్పధాలను కలిగించే ప్రయత్నం చేసారు దర్శకుడు త్రివిక్రం. కానీ ఇలా ఒకటో రెండో సినిమాలు తప్పితే మిగిలిన మన సినిమాలన్నీ మూసధోరణిలో సాగిపోతున్నాయి.మారుతున్న సమాజం, ప్రపంచ సినిమాలో వెల్లడవుతున్న నవకల్పనలు, సాహిత్యం, సంగీతాలతో పాటు మిగిలిన కళలలో ఏర్పడుతున్న మార్పులు మన సినిమాల్లో చోటు చేసుకోకపోవడమే కాకుండా అలాంటి మార్పు తేవాలన్న ఉద్దేశం కూడా లేకపోవడమే ఈ మూసధోరణికి కారణమని చెప్పొచ్చు.

అయితే హిందీ మరియు తమిళ సినీ పరిశ్రమలో ఈ మార్పు జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య హిందీలో వచ్చిన Life in a Metro, Honey Moon Travels Pvt Ltd, Salaam-E-Ishq సినిమాలు చూసిన వాళ్ళకీవిషయం అర్థమైవుండాలి.అలాగే తమిళంలో వచ్చిన 12B, వీరుమాండి, యువ సినిమాలు మార్పు మొదలయిందనడానికి ఉదాహరణలు. కథాపరంగా ఈ సినిమాలు వేటికవే అయినప్పటికీ ఈ సినిమాలన్నింటిలోను కథా గమనం మరియు వృతాంతం మాత్రం ఒకదానితో ఒకటి పోలివుంటాయి. ఈ సినిమాలు చూడడనికి కానీ, చెప్పుకోడనికి గానీ ఏ విధంగానూ గొప్ప సినిమాలు కాకపోయినప్పటికీ ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాలలో సంభవిస్తున్న మార్పులానే మన దేశంలో కూడా సినిమాలు మారుతున్నాయన్న నిజాన్ని ఈ సినిమాలు నిర్ధారిస్తున్నయని మాత్రం చెప్పక తప్పదు. ఆరునెలల నిడివిలో మూడు హిందీ సినిమాలు ఇటువంటి విభిన్న ఇతివృత్తంతో రూపొందించబడ్డాయంటే త్వరలో ఇటువంటి సినిమాలు మనల్ని ముంచెత్తుతాయనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఈ మూడు సినిమాల్లోని ప్రత్యేకతేంటి అనేది ప్రశ్న!

పైన పేర్కొన్న మూడూ సినిమాలకు, మిగిలిన సినిమాలకు తేడా ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న రెండు అంశాలే!

1)సినిమా కథను సంఘటనలు జరిగిన సమయానుక్రమంలో సరళ రీతిళో కాకుండా, విరళ రీతిలో చెప్పడం.

2)మిగిలిన సినిమాల్లో లాగా ఒకరు లేదా ఇద్దరు ముఖ్య పాత్రధారుల జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా కథను ముందుకు నడిపించకుండా, సినిమాలోని ప్రతి పాత్రధారునికీ సరైన ప్రాముఖ్యత కల్పిస్తూ, ఆ పాత్రల మధ్య అకస్మాత్తుగా లేదా యాధృచ్చికంగా జరిగే సంఘటనల ఆధారంగా కథ నడిపించడం.

మనకిలాంటి సినిమాలు కొత్తే అయినప్పటికీ చాలా రోజుల ముందు నుంచే ప్రపంచంలోని ఎన్నో దేశాల్లోని దర్శకులు ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉన్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు: Kieslowski’s Blind Chance, Akira Kurasawa’s Roshoman, Quentin Tarantino’s Pulp Fiction. ఈ సినిమాలే కాకుండా Run Lola Run, Midaq Alley, Tic Tac, 11:14, Hieghts, Crash, Yi ge zi tou de dan sheng, Hawai-Oslo, Traffic, Syriana, 21 Grams, Babel లాంటి ఎన్నో సినిమాలు ఈ కోవకే చెందుతాయి.

ఇలాంటి సినిమాలనే ఇంగ్లీషులో Non Linear Narrative కలిగిన సినిమాలుగా పిలవడం జరుగుతుంది. ఈ తరహా సినిమాల్లోనూ రెండు రకాలున్నాయి.

1)కథ పరంగా మామూలు సినిమాల్లాగే ఉన్నప్పటికీ ఒకే కథను, ఒక్కోసారి ఒక్కో points of view లో మళ్ళీ మళ్ళీ చెప్పి ఒకే కథకు వేర్వేరు అర్థాలను గోచరింపచేయడం ఈ రెండో తరహా సినిమాల ప్రత్యేకత. Run Lola Run, Roshoman, Sliding Doors లాంటి సినిమాలు ఈ రకం సినిమాలకు ఉదాహరణలు.

ఉదాహరణకు Run Lola Run సినిమాలో “లోలా” అనే అమ్మాయికి తన ప్రేమికుడైన “మన్ని” నుంచి ఫోన్ కాల్ రావడంతో కథ మొదలవుతుంది. 20 నిమిషాల్లో 100000 మార్కులు(జర్మనీ కరెన్సీ) తీసుకురాకపోతే తన ప్రాణానికే ముప్పని ఆమెతో చెప్తాడు మన్ని. తన ప్రేమికుడి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో లోలా ఏం చేసింది అనే దానికన్నా , “ఇలా జరిగితే ఏమయ్యుండేది”, “పోనీ ఇలా జరిగితే ఎమి జరిగుండేది”,అనే what-if కండిషన్ల ద్వారా ఒకే కథను మూడు సార్లు వేర్వేరు విధంగా చిత్రీకరించారు దర్శకులు. ఇందులో ఏ ప్రయత్నం నిజంగా(సినిమాటికె స్పేస్ లో) జరిగింది, ఈ ప్రయత్నాలు ఊహాజనితమైనవి అని చెప్పలేము.ఇదే విధంగా అకిరా కురసవ గారి రోషమన్ సినిమాలో ఒకే కథను వేర్వేరు points of view ద్వారా చూపించగలిగారు. అలాగే తమిళ్ లో వచ్చిన “వీరుమాండి” సినిమాకూద ఈ కోవలోకి చెందినదే.

2)యాదృచ్చికంగానూ అకస్మాతుగానూ జరిగే సంఘటనలతో మేళవించిన దృశ్యాలు, ఈ సంఘటనల పర్యవసానంగా మార్పు కొందరి జీవితాల్లో జరిగిన మార్పులు, అనుభవాలను కథారూపంలో తెరకెక్కించడం ఒక రకం.Pulp Fiction, Amerros Perros, 21 Grams, Traffic ళంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.

మొదట్లో స్పైను మరియు ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో ఇలాంటి సినిమాలు తీయడం మొదలయిందని నా ఉద్దేశం. అందుకు ఇదీ కారణం అని చెప్పడం కష్టమైనప్పటీకీ, రాను రాను పెరిగిపోతున్న నేరప్రవత్తి, డ్రగ్స్ ఉపయోగం, నానాటికీ తరుగిపోతున్న మానవ విలువలు, క్రమంగా క్షీణంచిపోతున్న మానవ సంబంధాలు, ఆయా దేశాల్లోని జీవన పరిస్థితులు, క్షణం తీరికలేని జీవితాలను సినిమాలో పొందు పరచాలంటే అంతకముందున్న సినిమాటిక్ ఉపకరణలేవీ ఉపయోగపడకపోవడంతో, కొత్త రకమైన సినిమాలతో వారి జీవితాల్లోని చైతన్యాన్ని ప్రతిబింబించేలా చేయాలన్న నేపధ్యంలో ఈ non-liner narrative సినిమా పుట్టివుండవచ్చని నా అభిప్రాయం.

ఇంకా లోతుగా చూస్తే, సంబంధం లేని ఎన్నో అంశాలు మనల్ని ఒక్కొక్కరిగా విడతీస్తున్నా ఈ విశ్వంలోని ఒక తెలియని దారమేదో మనల్నందరినీ కట్టిఉంచుతుందనీ చెప్పడంకూడా ఈ సినిమాల ఉద్దేశం అయ్యిఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలోని ఎంతో మంది ఇప్పుడూ ఈ non linear cinema పై కన్నేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన డజన్ల కొద్దీ సినిమాలు ఈ నమ్మకాన్ని నిజం చేశాయి. హలీవుడ్లో వీచిన ఈ గాలులు క్రమంగా మన బాలీవుడ్ కి చేరాయి.దాని ఫలితమే Life in a Metro, Salaam-E-Ishq, Honeymoon Travels Pvt Ltd”. బాలీవుడ్ దాక చేరిన ఈ గాలి మనవైపుకీ త్వరలో వీస్తుంది.అలాంటప్పుడు గాలి ఎటువైపు వీస్తే అటూవైపు గుడ్డిగా పయనించకుండా అసలీ non linear cinema అవసరం ఎంటి? దానివెనుక వున్న సిధ్ధాంతమేంటి అని సూక్ష్మంగా ఆలోచించి మన సమాజానికి తగ్గట్టుగా ఈ రకమైన సినిమాలను తీయగలిగితే మన సినిమాకెంతో మేలు జరగవచ్చు.

ఒక విధంగా మన జీవితలను సినిమా రూపంలో ప్రతిబింబింపజేయాలంటే ఈ రకమైన సినిమాలే అనువైనవి. అందుకు అనేక కారణాలున్నాయి. మీ జీవితమే తీసుకోండి. అంటా మీరనుకున్నట్టే జరిగిందా?మీ స్నేహితులతో మీ పరిచయాలను గుర్తుకు చేసుకోండి.ఈ జీవితమంతా ఒక పెద్ద ఏక్సిడెంట్ లా నిపించదూ? నేనెవర్ని? నేను రాసిన ఈ వ్యాసాన్ని మీరెందుకు చదవాలి? అసలీ జీవితానికి అర్థముందా? ఎక్కడ దొరుకుతాయీ ప్రశ్నలకు సమాధానాలు? అయినా మూడూగంటల్లో చూసి మర్చిపోయే సినిమాల గురించి ఇంత విశ్లేషణ అవసరమా?

ఏమో? కాలం ఒడి ఒడి గా సాగిపోతున్న ఈ రోజుల్లో కాసేపాగి మనల్ని మనం పరిశీలించుకోలేము కాబట్టే మన జీవితల్నే సినిమాగా తీస్తే rewind చేసో fast forward చేసో, pause నొక్కో అర్థం చేసుకోవచ్చేమో?

15 Comments
 1. KRISHNA RAO JALLIPALLI February 5, 2008 /
  • Uttara June 16, 2012 /
 2. రాజేంద్ర February 11, 2008 /
 3. వెంకట్ February 11, 2008 /
 4. మంజుల February 11, 2008 /
 5. Jonathan September 23, 2008 /
 6. మేడేపల్లి శేషు February 27, 2009 /
  • అభిమాని February 26, 2010 /
 7. అభిమాని February 26, 2010 /
 8. srinivas February 28, 2010 /
 9. Aditya March 3, 2010 /
 10. satya June 16, 2012 /
 11. Haritha July 2, 2013 /