Menu

నేనూ నా వింతలమారి ప్రపంచమూ…

పోయిన డిశెంబరు చివరి  వారంలో మిత్రుడు శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తి గురించి ఆయన తీసిన ఒక లఘు చిత్రాన్నీ పరిచయం చేశారు. పరిచయం చేయడమే కాకుండా ఆ లఘు చిత్రం మరియు దానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని నాకు అందచేశారు. ఆ రోజు నా పుట్టినరోజు కూడా. అప్పుడు చూడలేదు కానీ చూశాక మాత్రం ఆ వీడియో నా పుట్టినరోజున నాకు అందిన గొప్ప బహుమతిగా అనిపించింది. ఆ రోజు శ్రీనిఆస్ గారు నాకు పరిచయం చేసిన వ్యక్తి పేరు పైడి తేరేష్ బాబు. “నేను నా వింతలమారి ప్రపంచమూ…” ఆయన రూపొందించిన poetic documentary. ఈ డాక్యుమెంటరీ చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు పైడి తేరేష్ బాబు గారికి తెలియచేస్తారని కోరుకుంటున్నాము.

అంకితం

సరిగ్గా నూరేళ్ల క్రితం
’మాలవాండ్ర పాట రాసిన
ఆజ్ఞాత కవికి…

జస్ట్ ఏ మినిట్…

మీకు తెలుసు
పాశ్చాత్యం నా ప్రేయసి!
ప్రేమలో గాయపడ్డం, గేయపడ్డం కొత్తేం కాదు.
కాకపోతే 07.07.07. నాడు బాగా గాయపరిచింది.
నా ప్రేయసి ఆ వేళ ఏడు వింతల్ని పునస్సమీక్షించే
పనికి పూనుకుంది
తాజ్‍మహల్ కు ఓటేసి గెలిపింమని ఇండియా మొత్తం
ఏకటాకీగా ఒకటే గోల!
ప్రపంచ వ్యాప్తమ్గా రాళ్లెత్తిన కూలీలకు
కనీసం ఈ సారైనా పట్టంకట్టి
శ్రమజీవిని కీర్తిస్తుందేమో అనుకున్నా
అలా జరగలేదు
సింపుల్ గా ఏడువింతల లిస్టు చదివి
వాటికి వింతల హోదా ప్రకటించేసి
ఎంచక్కా చేతులు దులిపేసుకుమంది
నా మూడవ ప్రపంచపు వింతలకేసి కన్నెత్తి కూడా
చూడలేదు
కడుపుమండింది
పద్యం పుట్టింది
మంట అంతటితో చల్లారలేదు
07.07.07. నాడు 7 మెంబర్ యూనిట్ తో
ఉదయం ఏడుగంటల్నుంఇ రాత్రి ఏడు గంటలవరకు
నా మూడో ప్రపంచంలో విచ్చలవిడిగా తిరిగాను.
దొరికిన దృశ్యాన్ని దొరికినట్టు షూట్ చేశాను.
ఎడిట్ చేశాను
కొన్ని చోట్ల
పద్యానికి అనువుగా దృశ్యాన్ని,
దృశ్యానికి అనువుగా పద్యాన్ని సవరించాను.
ఫలితం-
నేను నా వింతలమారి ప్రపంచమూ

చదవండి
చూడండి
ప్రయత్నం  ఫర్వాలేదనిపిస్తే
దృశ్యమాధ్యమాలపట్ల కాస్తంత దృష్టి సారించండి
మెజారిటి జాతి జనులు అక్కడ పోగుపడి ఉన్నారు
వాళ్లలో డెబ్భైశాతం మందికి చదవడం రాయడం రాదు.
చెప్తే వింటారు. చూపిస్తే చూస్తారు. ఆలోచిస్తారు.
కదుల్తారు, కదిలిస్తారు.
మెజారిటీ జనాన్ని విస్మరించి మనం ఏం చేసినా అది అసంపూర్ణమే
కవిత్వం పేజీలకు వెలుపల ఎక్కువగా మాట్లాడ్డం
కవికి అంత సముచితం కాదు.
ఉంటా మరి….

మీ
పైడి తేరేష్ బాబు


4 Comments
  1. Prasad February 24, 2010 /
  2. N.Vijaya Raghava Reddy February 28, 2010 /
  3. vara March 22, 2010 /