Menu

మాయాబజార్ – పాండవులు లేని భారతం

మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి సరియయిన సినిమానే ఎంచుకున్నారు పెద్దలు. మాయాబజార్ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని “నరేష్ నున్న” అన్నారు. ఇది అక్షరాలా నిజం.

మాయబజార్ – పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు చూసాకయినా ఎవరికీ తట్టదేమో. నిజం, పాండవుల ప్రస్తావన లేకుండా జరిగే కథ. ఈ కథని పూర్వం శశిరేఖా పరిణయం అనే పేరుతో కర్నాటక రాష్ట్రంలో వీధి నాటకాలుగా ఆడేవారట. దానికి ఒక మహోన్నత్తమైన స్థానాన్ని కలిపించింది మాత్రం కె.వి.రెడ్డి-పింగళి ద్వయమనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆయువుపట్టులయితే, పింగళి నాగేంద్ర గారి సాహిత్య చమత్కారాలు ప్రాణం పోసాయి.

లాహిరి లాహిరి లాహిరిలో పాట నోట నానని తెలుగు ప్రేక్షకులుండరని నా ప్రగాఢ విశ్వాసం. లాహిరి అంటే మాయ అని అర్థం. ఈ ఒక్క పాట ఆధారంగా చేసుకుని కథంతా రూపకల్పన చేస్తారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, సాగెనుగా’ అని మొదలెట్టి ‘రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో’ అని ముగించడం పింగళివారికే చెల్లింది. ప్రేమ మాయలో జగమంతా ఓలలాడుతోంది అని ఆరంభించి, ఆ మాయకి కారకుడు శ్రీకృష్ణుడే అని ముగింపు పలకడం ఓ అద్భుతమైన ఆలోచన. మొత్తం కథని ఈ ఒక్క పాటలో చెప్పారనిపిస్తుంది. మాయబజార్ కథకి కీలకమైన వ్యక్తి శ్రీకృష్ణుడు, ఆయన మాయావిశేషంవల్లనే కథ అంతా నడుస్తుంది. ఈ విషయాన్ని ఒక్క పాటలోనే ఎంతో అందంగా పొదిగారు పింగళి.

“చూపులు కలిసిన శుభవేళ పాట” మరో ఆణిముత్యం. “ఆలాపనలు, సల్లాపములు కలకలకోకిలగీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనములన్నీనాట్యములే. శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే, ఉద్యానములో వీరవిహారమే, చెలికడనోహో శౌర్యములే”. ఇంత అందంగా, సంధర్భానికి అచ్చు గుద్దినట్టుగా రాయడం పింగళి వారు ఉగ్గుపాలతో నేర్చిన విద్య అనుకుంటాను. సాధారణంగా మనం ఎవరినైనా చాలరోజుల తరువాత కలిస్తే ముగిసిన కాలపు విశేషాలు ప్రస్తావించుకుంటాం. అన్నినాళ్ళలో ఏమేమి జరిగాయో చెప్పుకుంటాం. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు  విడిపోయిన శశిరేఖాభిమన్యులు యుక్తవయసులో కలుసుకోగానే వారి గతం గురించి ఒకరికొకరు ఈ ఒక్క పాటలో చెప్పుకునేలా చిత్రీకరించారు. రాకుమారి శశిరేఖ అంతఃపురంలో ఉంటూ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకుని ఉంటుంది. సాధారణంగా ఆంతఃపురంలో అమ్మాయిలు అవే చేస్తారు. మరి అభిమన్యుడు వీరవిద్యలు అభ్యసించి ఉంటాడు. ఈ విషయాలు ఒకరికొకరు చెప్పకుండానే గ్రహించినట్లు ఎంతో పొందికగా రాసారు పింగళిగారు. ఆమె ఆలాపనలు కోకిలగీతాలట, అందాలన్ని చిత్రరచనలట, నడకలే నాట్యమట. అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ నాకు కనిపిస్తున్నయిలే అని చెప్పకనే చెప్తున్నాడు అభిమన్యుడు. నీ బాణాల వేగము, శౌర్యప్రతాపాలను నేను గమనించానులే అని శశిరేఖ అన్యాపదేసంగా చెప్పినట్టు. ఎంత చక్కని ప్రయోగం.

“నీవేనా నను తలచినది”, “నీకోసమే నే జీవించునది” …ఈ రెండు పాటల్లోనూ ప్రేయసీప్రియులు వేరు వేరు ప్రదేశాలలో ఉంటారు. కానీ మొదటి పాట లో విడివిడిగా ఉన్నా కలివిడితనం, రెండవ పాటలో కలివిడిగా ఉండాలనుకున్నా విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. “విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురం కాదా”…..అంటే కలిసి ఉండడం ఒక భావన, విడిపోయి కూడా పరిమళించడం ఇంకొక భావన. ఇవన్నీ ఆలోచిస్తున్న కొలదీ గుబాళించే అనంతమైన సాహితీ సౌరభాలు.

అసలు ఏ పాట తీసుకున్న అందులో భావచాతుర్యం మిళితమై ఉంటుంది. మాయబజార్ సినిమా చూడకుండా పాటలు మాత్రమే వింటే మొత్త కథ అర్థమయిపోతుంది మనకి. అంత భావ సమామ్నాయం ఉంటుంది పింగళి వారి సాహిత్యంలో. మొదటిది “శ్రీకరులు దేవతలు” పాటలోనే ఈ సినిమాలో వచ్చే ముఖ్య పాత్రల పరిచయం జరుగుతుంది. దానితో కథ ఎవరు చుట్టూ తిరుగుతుందో మనకి తెలిసిపోతుంది. తరువాత “అల్లిబిల్లి అమ్మాయికి” పాటలో శశిరేఖాభిమన్యుల మధ్య ఉన్న సంభందాన్ని చిగురింపజేస్తూ వాళ్ళిద్దరు ఒక దగ్గరలేరనే విషయం తెలియజేస్తారు.  “నీవేనా నను పిలచినది” పాటతో వారి మధ్య ఉన్న ప్రగాఢ అనుభందాన్ని పెంపుజేస్తారు. చూపులు కలిసిన శుభవేళ పాటవల్ల వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారని తెలుస్తుంది. “లాహిరి లాహిరి పాట” సరేసరి, అంత తెలుస్తుంది అందులోనే. ‘భళి భళి భళి దేవా” పాటలో శ్రీకృష్ణుడి చక్రం కనిపిస్తుంది. ఘటోత్కచుడి పరిచయ పద్యంలో వారి పాత్ర, “శకుని ఉన్న చాలు” పద్యంలో వీరి పాత్ర ప్రస్పుటంగా గోచరిస్తుంది. “నీకోసమే” పాటలో  వారు దూరమయ్యారని తెలుస్తుంది. “అహనా పెళ్ళియంట, వివాహ భోజనంభు” పాటల్లో మాయశశిరేఖగా ఉన్న ఘటోత్కచుని చాణతనం, “సుందరి నీవంటి” లో లక్ష్మణ కుమారుడి బేలతనం కనిపిస్తుంది. “విన్నావ యశోదమ్మ”, “దయచేయండి దయచేయండి” పాటలు, మధ్యలో జరుగుతున్న కథని మనకు చెప్పకనే చెబుతాయి.

ఇక పింగళివారి మాటలహేల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసమదీయులు, తసమదీయులు అన్న పదాలు ప్రతీ ఆంధ్రుని నోటా కొలువుదీరి ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ కాదు. “పాండిత్యం కన్నా ఙ్ఞానం ముఖ్యం”, “శాస్త్రం ఎప్పుడూ ఖచ్చితంగా, నిష్కర్షగానే ఉంటుంది,మనం సారాంశం గ్రహించాలి-అంటే శాస్త్రం ఎలా ఉన్నా ఒక సమన్వయం లో ఉంటుందన్నమాట” “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి” లాంటి నగ్న సత్యాలను ఔచిత్యంగా చొప్పించారు. చినచేపను, పెదచేప, చినమాయను పెనుమాయ అది స్వాహా, ఇది స్వాహా అన్నదాన్లోనే బలహీనవర్గాల బాధలను నర్మగర్భంగా చర్చించారు. “పాండవుల ప్రతాపాల కన్నా, కౌరవుల ఐశ్వర్యాలు గొప్పవి కావు” – సామర్ధ్యాలకు, ఆస్తి అంతస్థులకు సాధారణ  సమాజంలో పొంతన లేదన్న విషయాన్ని ఉటంకించారు.  ఈ పదాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన సాహిత్య స్ఫురణ, సామాజిక స్పృహ కనిపిస్తాయి.

“ఓహోహో నీవా, నీకు తెలియదూ నేనెవరో, తెలియనివారికి చెప్పినా తెలియదు” – అంటే నాకు నువ్వెవరో తెలుసు, నీకు నేను తెలియదూ, ఎదురుగుండా ఉన్న నన్నే గ్రహించలేకపొతే, చెప్తే మాత్రం తెలుస్తుందా…ఎంత సత్యం! నేను ఎవరో నీకు తెలీదు – అన్న దాన్లో ఎంత అర్థముందంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనెవరో తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి.ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి దాన్లో ఒక కుర్చీ, మంచం, ఇలాంటివన్ని ఉంటాయి. వాటిని చూడగలగాలి, గ్రహించగలగాలి. చూడలేకపోతే, తెలుసుకోలేకపోతే ఎవరైనా చెప్పినా తెలియదు. ఎంత ఔచిత్యం పాటించారో ప్రతీ ఒక్క సంభాషణలోనూ. భావిస్తే ఎంతైనా గ్రహించవచ్చు ఆయన రాసిన మాటలలో. ఒక్క పొల్లు కూడా అనవసరంగా పడదు. ప్రతీ పదంలోను సాహిత్య సంపద, భావ చాతుర్యం గుబాళించి ఉంటుంది. పదాలు వాడడంలో ఆయన బ్రహ్మాండనాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎరుకకుండ వచ్చావు, ఎరుకలేకపోతావు- ఆధ్యాత్మికత- నేనున్నాని తెలుసుకోలేకపోతే నువ్వున్నావని తెలుసుకోలేవు అని భగవంతుడు చెబుతున్నట్టు – అద్భుతం కదూ. ఇంకా అగ్గిబుగ్గీకాకయ్యా, వీరతాడు వంటి పడికట్టు పదాలను తెలుగు ప్రజలనోళ్లలో నానేటట్టుగా చెక్కారు. “సభాపిరికి”, “అలమలం” లాంటి కొత్తపదాలు చక్కిలిగింతలు పెడతాయి. “నచ్చినా నచ్చకపోయినా పెళ్ళికూతురిని పెళ్ళి కొడుకు చూసి తీరాలి అది నా ప్రతిఙ్ఞ” అన్న ఒక్క వాక్యంలోనే లక్ష్మణ కుమారుడి బుద్ధిహీనత గోచరింపజేస్తారు.

ప్రాసలలో ఆయన ఉద్దండపండితుడు. “పేరుచెప్పించి, బిరుదు విడిపించి శరణనిపించిరా” – పేరు చెప్పిస్తే చాలదు, బిరుదు విడిపించి అంటే వాడి పై గెలిచి, దాసోహమనిపించిరావాలి, అమృతం తాగుతున్నట్లనిపించడం లేదూ !

“ఏవడో నరుడు దొరా, పొడి పొడి చేసినాడు వాడిని మసి చేసి, నుసి చేసి పిడికిలించి వస్తాం” – అంత్యప్రాసల సామ్రాట్టు పదవికి ఈయనొక్కడే అర్హుడేమో.

ఘటోత్కచుని పరిచయపద్యం ఆయన పాండిత్య సంపదకు నిదర్శనం.

అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనశుంభధ్వజముగ్రాలచూడవలదే,

గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,

ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,

హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే

యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే

యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే

పింగళి వారి రచనా సామర్ధ్యం గురించి ఇలా ఎంత చెప్పుకున్నా అనంతమైన సముద్రంలో నీటిచుక్కే అవుతుంది. భావిస్తున్న కొలదీ అర్థం, పరమార్థం బోధపడుతుంది. ఇంతటి మహానుభావులు మన ఆంధ్రులకి వరం గా దొరికారు. వారికి శతకోటి, సహస్రకోటి ప్రణామాలు.

– ఆలమూరు సౌమ్య

33 Comments
 1. Aditya February 10, 2010 /
 2. Sreenivas pappu February 11, 2010 /
 3. sowmya February 11, 2010 /
 4. సుజాత February 11, 2010 /
 5. Norton February 11, 2010 /
 6. రవి February 11, 2010 /
 7. pappu February 11, 2010 /
 8. kalyani February 11, 2010 /
 9. satya February 11, 2010 /
 10. అరిపిరాల February 11, 2010 /
  • Kanth February 11, 2010 /
 11. sowmya February 11, 2010 /
 12. sowmya February 11, 2010 /
 13. sowmya February 11, 2010 /
 14. సాధారణ ప్రేక్శకుడు February 11, 2010 /
 15. sowmya February 11, 2010 /
 16. purushotham February 11, 2010 /
 17. కొత్తపాళీ February 11, 2010 /
 18. కొత్తపాళీ February 11, 2010 /
 19. M.V.AppaRao February 11, 2010 /
 20. naresh Nunna February 13, 2010 /
 21. టి.యస్.కళాధర్ శర్మ February 15, 2010 /
 22. నండూరి శ్రీనివాస్ February 17, 2010 /
 23. sowmya February 17, 2010 /
 24. sowmya February 17, 2010 /
 25. sowmya February 17, 2010 /
 26. టి.కే.వేణుగోపాల్ February 18, 2010 /
 27. శ్ఱీకా౦త్ February 22, 2010 /
 28. టి.కే.వేణుగోపాల్ March 22, 2010 /
 29. Gopi Samudrala March 23, 2010 /
 30. sowmya April 5, 2010 /
 31. sowmya April 5, 2010 /